కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు .. త్వరలో  

కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న, అఖిల  భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పునర్వ్యవస్థీకరణ సమయం ఆసన్నమైందా అంటే అవుననే అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు. నిజానికి ఇందుకోసమే, ఈ మార్పు కోసమే కాంగ్రెస్ సీనియర్ నాయకులు (జీ23) పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎప్పుడో సంవత్సరం క్రితం ఘాటైన లేఖ రాశారు. సాధ్యమైంత త్వరగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పార్టీ పూర్తి సమయ అధ్యక్షుదిని ఎన్నుకోవాలని ఓపెన్ గా డిమాండ్ చేశారు. పార్టీలో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ, కొత్త అధ్యక్షుడు, కొత్త నాయకత్వం మీద చర్చ జరుగుతూనే ఉంది. వివిధ ప్రతిపాదనలు, పేర్లు తెర మీదకు వచ్చి పోతూనే ఉన్నాయి. అయితే, చాలా వరకు మళ్ళీ సోనియా, మళ్ళీ రాహుల్ కాదంటే ప్రియాంకా ఇలా ఈ ముగ్గురి చుట్టూనే అధ్యక్ష పీఠం చక్కర్లు కొడుతోంది. అయినా ముడి మాత్రం పడలేదు.  

అయితే, ప్రస్తుతం సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న సోనియా, రాహుల్, ప్రియాంకా త్రయం తిరిగి వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి విషయంలో అటో ఇటో తెలిపోతుందని అంటున్నారు. నిజానికి, పార్టీ అధ్యక్ష పదవిని ఫ్యామిలీ గుప్పిట్లో ఉంచుకోవడమా ..వదులుకోవదమా అనే విషయంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకే సోనియా, రాహుల్, ప్రియాంక ఫ్యామిలీ హాలిడే పేరిట సిమ్లాలో మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.  సో ...ఆ ముగ్గురు సిమ్లా నుంచి తిర్గి వచ్చిన తర్వాతగా కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు ఉంటాయని అంటున్నారు. సిమ్లా నుంచి కాంగ్రెస్ పార్టీ యాజమాన త్రయం గట్టి  నిర్ణయంతో తిరిగి వస్తారని, ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణతో పాటుగా, రాష్ట్రాలలో ఇప్పటికే మొదలైన పీసీసీల పునర్వ్యవస్థీకరణకు కూడా కాంగ్రెస్ అధిష్టానం శ్రీకారం చుడుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్, ఛత్తీస్’ఘడ్ ముఖ్యమంత్రుల్ మార్పు / పీసీసీల పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందని అంటున్నారు. 

ఇతర విషయాలు ఎలా ఉన్నా,పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే విషయంలో ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాహుల్ లేదా ప్రియాంక నాయకత్వాన్ని అంగీకరించేందుకు పార్టీ సీనియర్ నాయకులే కాదు, శరద్ పవార్ వంటి మిత్ర పక్షాల నాయలు కూడా సిద్దంగా లేరు.కొద్ది రోజుల క్రితం పవార్, కాంగ్రెస్ పార్టీ నాయక త్రయానికి సున్నితంగా చురకలంటించారు. గత వైభవాన్ని మరిచి పోయి, వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలని పవార్, పరోక్షంగానే అయినా రాహుల్ గాంధీకి వాతలు పెట్టారు.  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అయితే రాహుల్, ప్రియాంకకు  రాజకీయ అనుభవం లేనే  లేదని అన్నారు. అదెలా ఉన్నా. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారో లేదో తెలియదు. ప్రియాంకకు పగ్గాలు  అప్పగించేందుకు సోనియాజీ సిద్ధంగా  లేరని అంటారు. ఈ నేపధ్యంలో, గతంలో ప్రశాంత్ కిశోర్  ప్రతిపాదించిన విధంగా సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ  ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ‘తో ప్రస్తుతానికి ప్రస్థానం సాగించే అలోచనాకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

అయితే  అందుకు జీ 23 సీనియర్లు అంగీకరించక  పోవచ్చని అంటున్నారు. నిజానికి, ప్రస్తుత పరిస్త్తిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థ్తితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న విధంగా ఉందని, పార్టీ ఏ నిర్ణయం తేసుకున్నా, పూర్వ వైభవం మాత్రం పగటి కలగానే మిగిలిపోతుందని అంటున్నారు.