అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
posted on Aug 28, 2020 12:57PM
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు శుక్రవారం మంజూరు చేసింది.
ఈఎస్ఐ అవకతవకల కేసులో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోజుల వ్యవధిలో రెండుసార్లు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇటీవల ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. ప్రస్తుతం ఆయన మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని దరఖాస్తు చేయగా గతంలో న్యాయస్థానం తిరస్కరించింది. మరోసారి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మూడు రోజుల క్రితమే వాదనలు జరగగా.. తీర్పు ఇవాళ ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కొద్ది సేపటి క్రితమే అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ. 2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.