ఏపీ మంత్రి సొంత ఊళ్ళో పేకాట క్లబ్ పై పోలీసుల దాడి.. మంత్రి సోదరుడి పై కేసు

అది ఓ ఏపీ మంత్రి స్వగ్రామం. దాని పేరు గుమ్మనూరు. ఇది కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియాజకవర్గంలో ఉంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది సాక్షాత్తు మంత్రి గుమ్మనూరు జయరాం. ఇక్కడ గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట క్లబ్ నడుస్తోంది. అయితే తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు ఏఎస్పీ గౌతమి ఆధ్వర్యంలో ఆ పేకాట క్లబ్ గుట్టు రట్టు చేశారు. మూడు ఆటోల్లో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు జరిపిన ఈ దాడిలో.. డజన్లకొద్దీ కార్లు, టూవీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పేకాట క్లబ్ పై దాడి చేసిన పోలీసులపై గూండాలు ఎదురు దాడి చేసి వారు ఎక్కి వచ్చిన ఆటోలను ధ్వంసం చేశారు.

 

అయితే పోలీసుల పై గుండాలు దాడి చేసిన సమాచారంతో అక్కడికి మరి కొన్ని పొలిసు బలగాలు చేరుకుని లాఠీ ఛార్జ్ చేయడంతో గుండాలు పరారయ్యారు. అయితే పేకాట నిర్వహిస్తున్న షెడ్ దగ్గరలో పేకాటరాయుళ్లు మధ్యలో వదిలేసిన రూ.5.34 లక్షలు న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ పేకాట షెడ్ లో ఏపీలో నిషేధించిన ఖరీదైన లిక్కర్ బ్రాండ్లన్నీ దొరికాయి. ఈ లిక్కర్ ను ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక లోని బళ్లారి నుండి లారీలలో తెస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న మంత్రి జయరాం కు సోదరుడు నారాయణ పై.. అలాగే మంత్రి అనుచరులు శ్రీధర్, జగన్ లపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దాడికి పాల్పడ్డ ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారని ఏఎస్పీ గౌతమి తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu