మీ మనసును మర్చివేసే కథ

కొన్ని కథలు మనుషుల జీవితాలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ, ద్వేషం, కోపం వీటితోపాటు.. ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తామో అదే మనలో నుండి వ్యక్తమవుతుంది కూడా..  మనిషి మనసుకు సంబంధించి ఓ కథ ఉంది..

ఇది ఒక చైనా దేశం కథ. వివాహానంతరం ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. మొదటి ఆరు నెలలు అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. గోరంతలు కొండంతలై చివరకు కోడలు పుట్టింటికి పరుగెడుతుంది. అక్కడ ఆమె తండ్రిగారి స్నేహితుడైన ఒక డాక్టర్తో తన బాధల్ని వెళ్ళబోసుకుంటూ 'ఎలాగైనా మా అత్త మరణిస్తే గాని నాకు సుఖశాంతులుండవు అని చెప్పింది.

ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దుమాటలతో చిలిపి చేష్టలతో ఆనందింపజేసిన ఆ చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ డాక్టర్.

తర్వాత ఇలా అన్నాడు. ' అమ్మా! నీ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాను. ఒక మందు నీకిస్తాను. దానిని మీ అత్తగారికివ్వాలి. అది తీసుకున్న సంవత్సరం తరువాత ఆమె మరణిస్తుంది. వెంటనే చనిపోతే, అందరికీ అనుమానం రావొచ్చు. అప్పుడు మన పన్నాగం బయట పడుతుంది.  అందుకే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చంపే మందు ఇస్తున్నాను. ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి. అత్త ఎలాగూ చనిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఈ సంవత్సర కాలం పాటు ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తానని నాకు హామీ ఇవ్వు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.  అమ్మాయి సరేనని అంగీకరించింది. మందు తీసుకుని అత్తగారింటికి వెళ్లింది. 

అత్తకు తినిపించి ప్రేమతో సపర్యలు చేయడం ప్రారంభించింది. అత్తకు అమితానందం. తన కోడలు చేసే సేవకు స్పందించింది. ఆమె చూపిన ప్రేమకు దాసోహం అయ్యింది. తనకు ఓపికలేక పోయినప్పటికీ కోడలికి చిన్నచిన్న పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టింది. కోడలిని తన సొంత కూతురిలా భావించింది. అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.

ఆరు నెలలు గడిచాయి. కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ని కలిసింది. ఆమె ముఖంలో విషాదం. గద్గద స్వరంతో ఇలా అంది. 'డాక్టర్! నేను ఓ పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి మా అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను. నా చేతులతో ఆమెకు విషం తినిపించాను. ఆరు నెలల్లో నన్ను ప్రేమించే నాదేవత నాకుండదు. ఆమెను ఎలాగైనా నేను రక్షించుకోవాలి'. ఈ మాటలు విన్న డాక్టర్ నవ్వి 'అమ్మా నేనిచ్చిన మందు, విషం కాదు. మీ అత్తగారికి ఏ అపాయంలేదు. అప్పుడు నీ మనసులో ఉన్నది విషం. ఇప్పుడది లేదు. మీ అత్తాకోడళ్ళ మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమానురాగాల ప్రవాహంలో ఆ ''విషం' కొట్టుకు పోయింది. మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు' అన్నాడు. ఇది మనసు కథ, ప్రతి మనిషి కథ.    

                                  ◆నిశ్శబ్ద.