8 మంది భార్యలు.. ఒక్కో గదిలో ఇద్దరేసి.. మజారే మజా...
posted on Feb 2, 2022 1:10PM
మామూలుగా అయితే ఒక్క పెళ్లికే లబోదిబో అంటుంటారు జనాలు. ఒక్కగానొక్క వైఫ్‌ను మెయిన్‌టెన్ చేసేందుకే కిందామీదా పడుతుంటారు. ఇక పెళ్లి కాని ప్రసాదులకైతే లెక్కేలేదు. లక్షకు పైగా శాలరీ ఉన్నా.. ఆస్తిపాస్తులు ఉన్నా.. పిల్ల దొరక్క.. పెళ్లి కాక.. ముదురు బెండకాయ టైమ్ బ్యాచ్‌లర్స్ వాడవాడలా కనిపిస్తుంటారు. అలాంటిది.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8 పెళ్లిల్లు చేసుకోవడమంటే మాటలా? ఎనిమిది మంది పెళ్లాళ్లతో ఒకే ఇంట్లో కాపురం చేయడం సాధ్యమా? కానీ, ఆ అసాధ్యాన్ని చేసి చూపించాడు ఓ ఘనుడు. 8 మంది భార్యల ముద్దలు మొగుడు.
అలాగని అతడేమీ బాగా సంపన్నుడు కాదు.. మహేశ్‌బాబులా అందగాడూ కాదు.. ప్రభాస్‌లా ఆరుడుగులేమీ ఉండడు.. బన్నీలా స్టైలిస్‌గా కనిపించడు.. రామ్‌చరణ్‌లా డ్యాన్సులు.. ఎన్టీఆర్‌లా డైలాగులు.. పవన్‌లా క్రేజ్.. విజయ్‌లా మ్యాన్లీనెస్.. ఇలా సినిమాటిక్ లక్షణాలేవీ లేవు. కేవలం ఓ ఆర్డినరీ పర్సన్. చూట్టానికీ సింపుల్‌గానే ఉంటాడు. కానీ, అతనికి ఇంకేం టాలెంట్ ఉందోగానీ.. అతనికి అంతమంది ఎలా అట్రాక్ట్ అయ్యారో కానీ.. ఏకంగా ఎనిమిది మంది అతగాడిని మనువాడేశారు. అదికూడా ఏ బలవంతపు వివాహమో.. సీక్రెట్ మ్యారేజో కాదు.. అన్నీ లవ్ మ్యారేజీలే. అంతకు ముందు చేసుకున్న భార్యలను ఒప్పించి మరీ వరుస పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారందర్నీ ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేస్తున్నాడు థాయ్‌లాండ్‌కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్.
థాయ్‌లాండ్‌లో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు ఓంగ్ డామ్. ఇతను వివిధ సందర్భాల్లో 8 మంది అమ్మాయిలను చూసి మనసు పారేసుకుని వారిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో చూసి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్యను మార్కెట్‌లో, మూడో భార్యను హాస్పిటల్‌లో చూసి మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత నాలుగు, ఐదు, ఆరో భార్యలను సోషల్ మీడియాలో చూసి ప్రేమలో పడ్డాడు. ఏడో భార్యను ఓ గుడిలో చూసి పెళ్లి చేసుకున్నాడు.
ఒకసారి తన నలుగురు భార్యలతో కలిసి విహార యాత్రకు వెళ్లినపుడు అక్కడ ఓ అమ్మాయి నచ్చడంతో ఆమెను ఎనిమిదో భార్యగా చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నా అంతకు ముందు ఉన్న భార్యలను ఒప్పించే పెళ్లి చేసుకున్నాడు. భార్యలు అందరినీ ఒకే ఇంట్లో ఉంచాడు. ఆ ఇంట్లో మొత్తం నాలుగు బెడ్రూమ్‌లు ఉన్నాయి. ఒక్కో గదిలో ఇద్దరు భార్యలను ఉంచి కాపురం చేస్తున్నాడు. తమది ఎంతో అన్యోన్య దాంపత్యమని, భార్యలందరూ తనపై ఎంతో ప్రేమానురాగాలు కనబరుస్తారని ఓంగ్ చెబుతున్నాడు.
ఈ న్యూస్ తెగ వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. బాబ్బాబు.. భార్యలను బుట్టలో వేసుకోవడం ఎలాగో మాక్కూడా చెప్పమంటూ కొందరు.. అంతమందిని ఎలా మెయిన్‌టెన్ చేస్తున్నావని ఇంకొందరు.. అసలు నిన్ను చూసి ఎలా పెళ్లి చేసుకున్నారు వారంతా అంటూ మరికొందరు.. 'A' టైప్ జోక్స్ కూడా బాగానే పడుతున్నాయి.. ఇలా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాడు ఓంగ్ డామ్ సోరోట్. ట్రోల్స్, మీమ్స్ కూడా తక్కువేమీ కాదు.