క‌రోనా కంటే జ‌గ‌న్ స‌ర్కారే డేంజ‌ర్‌.. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని వార్నింగ్‌

పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైందేమీ కాదని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రభుత్వానికి మాట, మనసు మార్చుకునే జబ్బు వచ్చిందని.. కరోనా కంటే దాని తీవ్రత ఎక్కువని మండిప‌డ్డారు. విజయవాడ రెవెన్యూ భవన్ ద‌గ్గ‌ర కొత్త‌ పీఆర్సీ ప్రకారం ఇచ్చిన పే స్లిప్‌లను ఉద్యోగ సంఘాల నేతలు తగులబెట్టారు. వేతన స్లిప్‌లతో పాటు పీఆర్సీ జీవోలను.. సాధన సమితి నేతలు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. 

రివైజ్డ్‌ పే స్కేల్‌ వేసే తొందరలో మనుషులు చేసే పనిని ప్రభుత్వం మిషన్లతో చేసి తప్పుల మీద తప్పులు చేస్తోందని బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ‘‘మాట మీద లేని ప్రభుత్వం అంతా రివర్స్‌ చేస్తోంది. తాజాగా ఇచ్చిన వేతనాలు, పెన్షన్లను ఎవరూ హర్షించడం లేదని గుర్తించాలి. ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. ముందు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. అందర్నీ అరెస్ట్‌ చేసినా కనీసం పది మందితో అయినా ఉద్యమాన్ని నిర్వహించి తీరుతాం’’ అని హెచ్చ‌రించారు. 

‘చలో విజయవాడ’కు వస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు అన్నారు. మొద‌ట‌ అనుమతి ఇచ్చి ఇప్పుడు నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. నిర్బంధాల పేరుతో తమ ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. ‘చలో విజయవాడ’కు లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు. 

కొత్త వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పినా.. ప్రభుత్వం హడావిడిగా జీతాలను బ్యాంకు ఖాతాల్లో వేసిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ హడావిడిలో చనిపోయిన ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించేశారని చెప్పారు. పీఆర్సీ అశాస్త్రీయంగా ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితిలో లేదన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu