నెహ్రుకు కోపం తెప్పించిన ఓ.. సందర్భం!

మనకు తెలిసిన వారిలోనో… స్నేహితుల లోనో… లేక చుట్టాలలోనో.. కొందరుంటారు. వారిలో ఎవరైనా మనకు ఏదైనా అదృష్టం కలిసివస్తే అప్పు రూపంలోనో పప్పురూపంలోనో తనింత పంచుకుంటాడు, కష్టం చెప్పుకుంటే “నాకేమి సంబంధం?” అని లేచిపోతాడు. ఇహ అలాంటప్పుడు “ఎలావున్నావ్?” అని అడిగినపుడు ఏమీ సమాధాన మివ్వకుండా నవ్వేసి ఊరుకోవడమే మంచిది.

మనుషుల మధ్య ప్రవర్తిల్లే సంబంధాన్ని బాగా కనిపెట్టినందువల్లనే ఇంగ్లీషువాడు "హౌ డూయుడూ?" అని మనల్ని ఎవరైనా పలకరిస్తే, సమాధానంగా మనం అతన్ని "హౌ డూయూడూ?” అని “యు” అక్షరాన్ని దీర్ఘంచేసి పలకడమే “మానర్స్" అని తేల్చాడు. అంతేకాని వీరి బాగోగులు వారికీ, వారి బాగోగులు వీరికీ వివరించుకుంటూ కూర్చోవలసిన ఆగత్యం లేదు. సోదిగా చెప్పుకుపోయినా వినే ఓపిక ఎవరికుంటుంది?

మనం ప్రభుత్వం వారివద్దనుండి ఏదైనా పొందాలనుకున్నప్పుడు సుదీర్ఘమైన ప్రశ్నావళి నొకదాన్ని మనకందిస్తారు? అది "ఫిలప్" చేసి వారికి తిరిగి ఇవ్వవలసి వుంటుంది. ఇందులో కనిపించే ప్రశ్నలన్నీ చూస్తే, ప్రభుత్వం నుండి మనమాశించే దానికీ ఇక్కడ మనం సమాధానం చెప్పవలసిన ప్రశ్నలకు అసలు సంబంధమేమైనా వుందా, ఈ సమాధానాలన్నీ ఓపిగ్గా ఎవరైనా చదువుతారా అనే అనుమానం వస్తుంది. కానీ ప్రశ్నలన్నిటికీ విధాయకంగా సమాధానాలిచ్చి తీరవలసిందే. విసుక్కుంటూనే అన్నీ రాసి దరఖాస్తు దాఖలు చేసుకుంటాం.

పండిట్ నెహ్రూ బ్రతికుండే రోజుల్లో అతడి పాశ్చాత్య స్నేహితుడు ఒకాయన అసలీ భారతీయాధికారులు ఈ “ఫిలప్" చేసిన ఫారాలన్నీ నిజంగా పరికిస్తారా. లేక ఏదో ఆనవాయితీని బట్టి ఆ ఫారాలన్నీ మనచేత ఊరికే నింపిస్తున్నారా అని పరీక్షిద్దామని అనుకున్నాడు. నెహ్రూ మిత్రుడైన కింగ్ స్లీ మార్టిన్ "న్యూ స్టేట్స్మన్ అండ్ నేషనల్” అనే ప్రఖ్యాత బ్రిటిష్ వారపత్రికకు ఎడిటర్. బ్రతికున్న రోజుల్లో, భారతదేశం టూరిస్టు శాఖ ఆహ్వానంపై అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు. ఇండియాకు వచ్చినప్పుడల్లా “యల్లో ఫీవర్" జ్వరం కార్డులో యాత్రికుడు ఒకరోజు క్రితం ఎక్కడున్నదీ, రెండు రోజుల క్రితం ఎక్కడున్నదీ, అదే విధంగా మూడు, నాలుగు, వరుసక్రమంలో తొమ్మిదిరోజుల క్రితం ఎక్కడున్నదీ వ్రాయమని నిర్ధేశించి వుండేది. విజిటర్ ఏదైనా "యల్లో ఫీవర్" ప్రబలే ప్రాంతంలో నివసించి వచ్చాడా అని తెలుసుకోవడానికి ఉద్దేశించింది ఈ కార్డు.

కింగ్ మార్టినికి కాస్త పదునైన హాస్యధోరణి వుండేది. అందుచేత “ఒక రోజు క్రితం" అనే పదాల ఎదురుగా "మేరీ” అనీ, “రెండు రోజుల క్రితం” కాలమ్లో “సూసాన్” అనీ, మూడురోజుల క్రితం “జేన్" అని వరసగా తొమ్మిది రోజులకు తొమ్మిది స్త్రీల పేర్లను ఉదహరించాడు.

"ఈ నింపిన ఫారాలు ఎవరూ చదవరని నేను మొదట్నించే అనుమానిస్తూనే వుండేవాణ్ణి. ఇట్లా ఎట్లా రాశావు అని నన్ను అడిగినవాళ్లు లేరు” అని తన పత్రికలో రాశాడు.

ఇది చూచిన నెహ్రు "ఏమిటిది?" అని ఆ శాఖలోని ఒక ఉద్యోగినిని పిలిపించి అడిగాడు. " నేను వాళ్ళకి చెప్తూనే వచ్చానండీ, ఆ కాలమ్స్ మార్చి “గత తొమ్మిది దినాల్లో మీరు ఏయేదేశాల్లో వుండి వచ్చారో పేర్కొనండి” అని వ్రాయించండని. కానీ నా మాట ఎవరూ పట్టించుకోలేదు" అన్నాడు. నెహ్రూ ఆగ్రహించి ఆ తర్వాత ఆ ఫారమ్ మార్పించాడు. ఇలా ఉంటుంది కొందరి తీరు. ప్రభుత్వాల విషయం ఇందుకు మినహాయింపు కాదు..

                                      ◆నిశ్శబ్ద.