ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఎవరెవరికి ఎన్ని స్థానాలు..

 

ఐదు రాష్టాల్లోని ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు నుండి జయలలిత, పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీ ఇద్దరూ మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక కేరళలో కూడా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 91 స్థానాలు ఎల్డీఎఫ్ సొంతం చేసుకోగా.. యూడీఎఫ్ 47, బీజేపీ ఒక స్థానం.. ఇతరులు మరోస్థానంలో గెలిచాయి. ఇక సీఎం పీఠానికి సీపీఎం నేతలు విఎస్‌ అచ్యుతానందన్‌, పిన్రాయ్‌ విజయన్‌లు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

 

ఇక పుదుచ్చేరిలో కూడా ఓట్ల లెక్కింపు ముగిసింది. 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. ఏఐఎన్ఆస్సీ 8 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 4 చోట్ల విజయం సాధించగా, ఇతరులకు ఒక్క స్థానం దక్కింది.

 

అంతేకాదు పశ్చిమ బెంగాల్ లో ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. తృణమూల్ కాంగ్రెస్ 212 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో విజయం సాధించగా, వామపక్ష పార్టీలు 31 స్థానాల్లో విజయ బావుటాను ఎగురవేశాయి. బీజేపీ 3 సీట్లకు పరిమితం కాగా, మరో నాలుగు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.

 

తమిళనాడులో కూడా ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 232 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఎఐఎడిఎంకే 126 స్థానాలలో విజయం సాధించగా డీఎంకే కూటమి 106 స్థానాలలో విజయం సాధించింది.

 

అసోంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 87 సీట్లు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 25, ఏఐయూడీఎఫ్ 13, ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధించాయి.