ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా 202 మృతదేహాల గుర్తింపు

 

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర  విమాన ప్రమాదంలో మరణించిన వారిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకూ 157 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.  జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే లండన్ వెళుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా మరణించారు.  మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయా అన్న సందేహం మొదట్లో వ్యక్తమైంది. అయితే యుద్ధ ప్రతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా వరకూ పూర్తి చేశారు. 

మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వంటి ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన కుమారుడు రుషభ్ రూపానీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.