12 మంది అవుట్.. చివరి నిమిషంలో స్మృతి సేఫ్!
posted on Jul 7, 2021 5:41PM
కేంద్ర మంత్రివర్గం రూపురేఖలు మారిపోయాయి. కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించినా.. పూర్తి స్థాయిలో ప్రక్షాళనే జరిగింది. ప్రధాని మోడీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. జంబో కేబినెట్ ఏర్పాటైంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తగా 43 మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని మోడీ. అనేక శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నవారిలో ఏకంగా 12 మందిని తప్పించారు. ఇందులో కొందరిని పని తీరు సరిగా లేదంటూ ఉద్వాసన పలకగా.. వయసు, ఆరోగ్య సమస్యలతో మరికొందరిని తప్పించారని చెబుతున్నారు.
కేబినెట్ నుంచి కొందరిని తప్పిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా.. ఎవరూ ఊహించని మంత్రులను తొలగించడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్ పై వేటు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. కొవిడ్ నియంత్రణ చర్యల్లో ఆరోగ్యశాఖ పని తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ శాఖ మారుస్తారని అంతా భావించారు. కాని మోడీ మాత్రం అతన్ని ఏకంగా తొలగించేశారు. రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానందగౌడ, రతన్‌లాల్ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్ ధోత్రే, రావు సాహెబ్ ధన్వే పాటిల్, అశ్వినీ చౌబే, బాబుల్ సుప్రియోలను కేబినెట్ నుంచి తప్పించారు.అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు రమేశ్ పోఖ్రియాల్ స్పష్టంచేశారు.
ఇక కేంద్ర కేబినెట్ నుంచి స్మృతి ఇరానీని తప్పిస్తారనే ప్రచారం జరిగింది.ఆమె రాజీనామా చేయబోతున్నారని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని స్మృతి ఇరానీని కేబినెట్ లోనే కొనసాగిస్తున్నారు ప్రధాని మోడీ. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన స్మృతి గత లోక్ సభ ఎన్నికల్లో అమెథీలో రాహుల్ గాంధీపై సంచలన విజయం సాధించారు. కేంద్ర కేబినెట్ లో కీలక శాఖను దక్కించుకున్నారు. రాహుల్ ను ఓడించిన ఘనతే ఈసారి కూడా ఆమెను కాపాడిందని తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్మృతిని తొలగించడం సరికాదని బీజేపీ పెద్దలు చివరి నిమిషంలో నిర్ణయించారని సమాచారం.
మరోవైపు స్మృతి ఇరాని విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. తనను తొలగిస్తున్నారన్న ప్రచారం రావడంతో స్మృతి ఇరానీ.. బుధవారం ఉదయమే ప్రధాని మోడీ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. ప్రధానితో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన స్మృతి.. తనను కేబినెట్ లో కొనసాగించాలని కోరారని చెబుతున్నారు. యూపీలో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని కూడా స్మృతి ఇరానీ చెప్పారట. అన్ని అంశాలు పరిశీలించాకే ఆమెను కేబినెట్ లో ఉంచాలని మోడీ టీమ్ నిర్ణయించిందని బీజేపీ వర్గాల సమాచారం.