ఎంపీ కవితపై పోటీకి 1000 మంది రైతులు సిద్ధం

 

టీఆర్ఎస్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా.. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ టీఆర్ఎస్ కంచుకోట నిజామాబాద్ లోనే టీఆర్ఎస్ కు నిరసన సెగ తగులుతోంది.

కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమెపై పోటీ చేసినా గెలిచే అవకాశం ఉండదని ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా అక్కడ పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ఎంపీ కవితకు ఈసారి ఎన్నికల్లో అంత ఈజీగా పరిస్థితులు లేవు. ఆమెపై పోటీ చేసేందుకు దాదాపు 1000 మంది నిజామాబాద్ రైతులు సిద్ధమవుతున్నారు.

పసుపు, ఎర్రజొన్న మద్దతు ధర కోసం కొంత కాలంగా నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేసినా.. తమ బాధను ఎంపీ కవిత పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్న రైతులు.. తమ నిరసనను తెలిపేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు షాక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆమెపై పోటీకి 500 నుంచి 1000 నామినేషన్లు దాఖలు చేయాలని రైతు సంఘాలు తీర్మానించాయి. మొత్తానికి ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి.