పొన్నాలకి హై బీపీ!
posted on Apr 23, 2014 5:19PM
.jpg)
పాపం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. మంత్రిగాఉన్నంతకాలం ఎంచక్కా జోకులేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, పాటలు, పద్యాలు పాడుతూ ఉత్సాహంగా గడిపిన ఆయన నెత్తిన ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బండలా మారింది. ఏ బ్యాడ్ ముహూర్తంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారోగాని అప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ టైమ్ స్టార్టయినట్టు కనిపిస్తోంది.
ఒకప్పుడు ఎంతో కూల్‌గా వుండే ఆయన ఇప్పుడు గరమ్ గరమ్‌గా కనిపిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు గతంలో ఏదైనా ప్రశ్నిస్తే చిరునవ్వుతో సమాధానం చెప్పే ఆయన ఇప్పుడు అంతెత్తున విరుచుకుపడుతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా స్ట్రెస్‌కి గురై, హైబీపీకి లోనయినట్టుగా పరిస్థితి చూస్తే అనిపిస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మీకు సీన్ సితారైపోద్దని సోనియా మేడమ్ వార్నింగ్ ఇచ్చారో ఏమోగానీ, ఆయన మీద ఏదో ఒత్తిడి బాగా వున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
మంగళవారం నాడు ఆయన బీపీ ఏ స్థాయికి చేరిందో తెలిస్తే ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ ఎక్కిన ఆయన ఒకచోట ప్రచారం పూర్తి చేసుకున్నారు. మరోచోటకి పోదామని అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదని సదరు హెలికాప్టర్ పైలెట్ చెప్పాడట. అంతే, పొన్నాల గారికి హైబీపీ పెరిగిపోయి ఆ పైలెట్‌ని నానా మాటలూ అనేసి హెలికాప్టర్ దిగేసి కారులో వెళ్ళిపోయారట. ఇలా వుంది పొన్నాల గారి బీపీ వ్యవహారం.