ఎన్నికల సంఘం: ఓటేస్తే బహుమతులిచ్చే ఖర్మేంటి?
posted on Apr 23, 2014 2:53PM

ఓటర్లని రాజకీయ నాయకులు ఎప్పుడో బిచ్చగాళ్ళని చేసేశారు. మా పార్టీకి ఓటేస్తే ఫలానా ఫలానా విధంగా మీకు లాభం కలిగిస్తానని రాజకీయ నాయకుడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వుంటారు. చాలామంది ఓటర్లు ఆ ఆఫర్లు నిజమేననుకుని పొంగిపోతూ వుంటారు. ఇక ఎలక్షన్లు వచ్చాయంటే ఓటర్లకి డబ్బులు పంచడం కామన్. ఓటు ఒక శక్తి.. ఓటు ఒక ఆయుధం అని స్టేట్ మెంట్లు కొంతమంది అభ్యుదయవాదులు ఇస్తూ వుంటారుగానీ, ఇప్పుడు దేశంలో జనం డబ్బు తీసుకుని ఓట్లు వేయడానికి ఎంతమాత్రం సిగ్గుపడటం లేదు.
అసలు డబ్బు ఇచ్చే నాయకులని అని లాభం లేదు. చేతులు జాస్తున్న ఓటర్లనే అనాలి. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో ఒకరికి ఓటు వేసే ప్రబుద్ధులు, అందరి దగ్గరా చేతులు చాచి అసలు ఎవరికీ ఓటు వేయని మహానుభావులు కూడా ఓటర్లలో వున్నారు. వాళ్ళు ఇస్తునందుకు వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకుంటున్నందుకు వాళ్ళు ఇస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిదో వెతకడం దేవుడనేవాడుంటే ఆయనగారి వల్ల కూడా కాదు. కోడి ముందా గుడ్డు ముందా.. చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న ఎంత కఠినమైనదో ఇదీ అంతే.
సరే ఈ గోల ఇలా వుంటే, రాజకీయ నాయకులకు తోడుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లని ముష్టోళ్ళని చేయడానికి తనవంతు కృషి చేస్తోంది. ఈసారి 90 శాతానికి మించి పోలింగ్ జరపాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారట. దానికోసం ఓటర్లని ఓటు వేయించేలా మోటివేట్ చేయడానికి స్కీములు ప్రకటించారు. ఓటు వేసిన ఓటర్ల నుంచి డ్రా తీసి, సదరు డ్రాలో పేర్లు వచ్చిన ఓటర్లకు కార్లు, ఇంకా ఏవేవో వస్తువులు ముష్టిగా పడేస్తారట. అసలు మీపని ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ పని. ఎంత శాతం ఓట్లు పడితే మీకెందుకంటా? ఓటర్ల శాతం పెంచడానికి లక్కీ డ్రాలు.. బంపర్ బహుమతులు.. ఈ దరిద్రం అంతా ఎందుకంటా? ఈ తతంగమంతా నిర్వహించే ఖర్మ మీకెందుకంటా? రాజకీయ నాయకులతో కలసి తిరిగీ తిరిగీ ఈ ప్రభుత్వ అధికారులకి కూడా ఓటర్లు ముష్టోళ్ళలాగా కనిపిస్తున్నట్టున్నారు.