మళ్ళీ విశాఖలో సుబ్బరామిరెడ్డి మకాం,పురందరేశ్వరికి టెన్షన్
posted on Jul 16, 2012 9:28AM
విశాఖ నగరంలో రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు వెంకట సుబ్బరామిరెడ్డి తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇటీవల నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తనకు విశాఖలో ఉన్న సంబంధాలను మళ్ళీ కొనసాగిస్తున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యురాలు, కేంద్రమంత్రి అయిన పురందరేశ్వరికి టెన్షన్ పుట్టిస్తున్నారు. అంతేకాకుండా విశాఖలో పేరుకుపోయిన కొన్ని సమస్యలపై తనదైన శైలిలో ఆయన స్పందిస్తున్నారు. ప్రత్యేకించి విలేకరులను పిలిచి నగరంలో కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను, తన వంతుగా చేసిన పనిని విశదీకరిస్తున్నారు. కెజిహెచ్ అభివృద్థి కోసం ప్రభుత్వరంగ సంస్థలు సుమారు రూ.50కోట్లు వెచ్చిస్తున్నాయి.
అయితే సుబ్బరామిరెడ్డి తన వంతు కృషిగా పారిశ్రామికవేత్తల సహాయంతో రూ.30కోట్లను అదనంగా సేకరించి అభివృద్థి శాశ్వతప్రాతిపదికన ఉండేలా చూస్తున్నారు. విశాఖ విమానాశ్రయం సేవలు 24గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలన్న పారిశ్రామికవేత్తల డిమాండుపై ఆయన స్పందించారు. తాను కేంద్రంలోని నేతలతో చర్చలు జరిపానని రెండు నెలల్లో పూర్తిస్థాయి సేవలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. నగరవాసుల కోరికలు సాకారమవుతాయని, ప్రైవేటీకరిస్తారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీల్‌ప్లాంటు విషయంలో కూడా తాము ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీలుప్లాంటును ప్రైవేటుపరం కానీయనని ఆయన హామీ ఇచ్చారు.