ఐ.ఎ.ఎస్.లు ఆగ్రహిస్తే ఏమవుతుంది?
posted on Jul 16, 2012 9:43AM
ఇప్పుడంటే ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ పెరిగి ఐటి జాబ్స్ వచ్చి లక్షల్లో సాలరీస్ ఆరునెల్లకొక సారి ఫారిన్ ట్రిప్, ఎంఎన్‌సి కంపెనీల్లో షేర్లు, కార్లు ఓప్....కానీ ఇవన్నీలేనప్పుడు చదువంటే సివిల్ సర్వీసే....పెద్ద ఉద్యోగం అంటే కలెక్టరే....వారు బుద్దిబలంలో బృహస్పతులని, పేదలపాలిటి పండువెన్నెల కురిపించే పూర్ణచంద్రులని గుర్తింపు ఉండేది. కలెక్టరు ప్రక్కనే ఎప్పుడూ తిరిగే బిళ్ళ బంట్రోతు అంటేనే ప్రజలకు గౌరవాభిమానాలు ఉండేవి. కలెక్టరు అంటే చెప్పనక్కర్లేంనంత భయం భక్తీ ఉండేవి....అలాంటి రోజుల్లో చంద్రబాబునాయుడు పరిపాలనలో జన్మభూమి కార్యక్రమం చేపట్టారు.
కలెక్టరు కూడా రోడ్లు ఊడ్చడం, మిగతా అధికారులంతా మురిగి కాల్వలు శుబ్రపరచడం మొదలైన పనులుండేవి. మేధాసంపన్నులతో లేబర్‌పనులు చేయించడం ఏంటని ప్రతిపక్షాలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. అదే సమయంలో ప్రజలవద్దకే పాలన అంటూ మంత్రివర్యులంతా ఊళ్లు తిరిగేవారు. ప్రజలెవరైనా అధికారుల మీద ఆరోపణచేస్తే చాలు ఉద్యోగాన్ని హూఫ్ అంటూ ఊదేసేవారు ఏలినవారు. నిజానిజాలేమంటూ విచారణలేముండేవి కాదు. సదరు ఉద్యోగాధికారులంతా పని చేసుకుందామని ఆఫీసుకు వచ్చి, ఉద్యోగాలు ఊడగొట్టుకొని ఇంటికెళ్లల్సిన పరిస్థితి ఏంటా అని గుండెనెప్పి వచ్చి పడిపోయిన వారు ఉన్నారు. పైకి పోయిన వారు ఉన్నారు. ఆతర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం గెలవలేదు. ఒక వేళ గెలిచి ఉంటే కలెక్టర్లతో రోడ్లు ఊడ్చించి, రోడ్లువూడ్చేవాళ్లతో కలెక్టరీగిరి చేయించేవారేమో....ప్రభుత్వం మారింది. ఇదివరకటి కష్టాలు కలెక్టర్లకు తప్పాయి. హమ్మయ్య అనుకున్నారు.
ఇంతలో మళ్లీ ప్రభుత్వం మారలేదుకాని, ప్రభుత్వంలోని వ్యక్తులు మారారు. అంతే అంతకు ముందు ముఖ్యమంత్రికి అనుకూలంగా పనిచేశారని,లంచాలు తీసుకున్నారని,అదని, ఇదని.... ఆడ, మగని కూడా చూడకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏతావాతా తేలేదేమిటంటే పనిచేసినా, చెయ్యకపోయినా అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోయేది కలెక్టర్లే అని. వాళ్లతో చాకిరీచేయించి అనుకూలంగా పనులుచేయించుకున్న మంత్రివర్గం మాత్రం సేఫ్. ఈ క్రమంలోనే జైల్లో పడవేయబడిన వారికి, జైల్లోకి త్రోసేవారికి మద్య (సివిల్ సర్వీస్‌ల్లో ) ఎవరు గొప్పా అని ఎప్పుడూ నిరువుగప్పిన నిప్పులా ఉండే ఆధిపత్యపోరుకు తెరలేచింది. అయితే కాలం కలసిరాని కలెక్టర్లకు పోలీస్‌ఆఫీసర్లే గొప్ప అని ఒప్పుకోక తప్పింది కాదు. రాజకీయనాయకుల వల్ల అధికారులని నిలదీసే శక్తి ప్రజల్లో పెరిగింది కాని, భాద్యతయుతంగా ఉండే ప్రజల్ని పొంపొందించలేకపోయారు. ప్రజల్లో అనార్కిజాన్ని పెంచారు. రాజకీయనాయకుల జోక్యం అన్నిట్లో పెరిగినట్లే కలెక్టర్ ఆఫీసుల్లో కూడా చేరింది. అలాగే జిల్లాల్లో జనాభాపెరిగింది. అవసరాలు పెరిగాయి. వాటితోపాటు సమస్యలూనూ, కలెక్టరు మాత్రమే ఎప్పటిలాగే.
ఎడిషనల్‌గా పెడదామన్న ఇప్పటికే ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా 3000 ఐఎఎస్‌ల షార్టేజీ...కాబట్టి సమస్యలతో నెట్టుకొస్తూ కలెక్టర్లూ రాత్రి పగలూ లేకుండా పనిగంటలు పెంచినా రాజకీయనాయకుల విపరీతమైన జోక్యం. పులిమీదపుట్రలా మంత్రి టిజి వెంకటేశ్ రెచ్చిపోయి కలెక్టర్లంతా వెధవలని, పనిచేయకుండా కుర్చీలకు అంటుకుపోతారని, అలాంటి వారిని నడిరోడ్డుమీద కాల్చేయాలనికూడా సెలవిచ్చారు. దాంతో శనివారం కలెక్టర్లంతా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చింది. వాళ్ల స్టయిల్లో వారు ఆగ్రహం వ్యక్తంచేశారనుకొండి. ప్రస్తుతానికి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందాఅని కలెక్టర్లు ఎదురు చూస్తున్నారు. కలెక్టర్లందర్నీ ఒకే గాటను కట్టోందని కూడ వారు హెచ్చరించారు. దీన్నిబట్టి తేలేదేంటంటే ముందు మారాల్సింది రాజకీయనాయకులని, అందులోనూ ప్రజల్ని సుపరిపాలనతో మెప్పించలేక వాళ్లను రెచ్చగొట్టే టిజి వెంకటేశ్ లాంటి నాయకులేనని.