టీడీపీకి మోదుగుల టాటా?
posted on Mar 20, 2014 3:47PM

నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన చంద్రబాబు పెట్టిన శీలపరీక్షలో నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఇటీవల ఇక్కడ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన మనసు గాయపడింది. నరసరావుపేట నుంచి మళ్లీ పోటీచేస్తానని, అక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అయోధ్యరామిరెడ్డి తన బావ అయినప్పటికీ వెనుకాడబోనని ఆయన చంద్రబాబును కలిసి స్పష్టంచేసినా, గుంటూరు పశ్చిమ లేదా బాపట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు అధినేత యోచిస్తున్నారు. దీంతో తానేం చేసేదీ రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని మోదుగుల స్పష్టం చేశారు. అవసరమైతే నరసరావుపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ఆయన అనుచరులతో చెప్పినట్లు సమాచారం.