లోకేశ్ జోరు

ఇన్నాళ్లూ తెరవెనక టీడీపీ పటిష్టత కోసం పనిచేసిన యువనేత లోకేశ్ ఇప్పుడు మరింత జోరు పెంచారు. ఎన్నికల్లో నిలబడకపోయినా... ప్రచారంలో లోకేశ్ కష్టపడిన తీరు ఆపార్టీ నేతలు దగ్గరుండి చూశారు. చంద్రబాబు కొడుకుగా కంటే సొంతంగా ఎదిగేందుకే లోకేశ్ ప్రయత్నిస్తున్నారన్నది విస్పష్టం. ముఖ్యంగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ వ్యవహరించిన తీరులా కాకుండా.. తన దారి వేరే అని చాటుకుంటున్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని ఎదిగే వాడిని కాదని నిరూపించుకుంటున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి పుత్రుడి హోదాలో ఎక్కడా వివాదాల్లో సైతం తలదూర్చరని లోకేశ్ కు మంచిపేరుంది. అంతేకాదు తనదగ్గరకు సెటిల్ మెంట్ వ్యవహారాలు వస్తే మొహం మీద కాదని చెప్పేస్తారట. ఇంత చిన్న వయస్సులో ఇంత రాజకీయ పరిణతి ఏంటని ఆ పార్టీ నేతలే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

 

ఎన్నికలకు ముందు లోకేశ్ పై అన్ని అంచనాలు లేవు.  కానీ అంచనాలన్నీ ఎన్నికల్లో తలకిందులయ్యాయి. లోకేశ్ స్పెషల్ గా శ్రద్ధ పెట్టిన చోట మంచి ఫలితాలొచ్చాయి. ఇవన్నీ బయటికి తెలియకపోయినా పార్టీ ఎమ్మెల్యేలకు బాగా తెలుసు. అందుకే వారంతా లోకేశ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని బాబుపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇరు రాష్ట్రాల నేతలతో నిరంతర టచ్ లో ఉంటూ తన రూటే సపరేటని చాటుకుంటున్నారు.

ఇక ఇన్నాళ్లూ సౌమ్యుడిగా పేరున్న లోకేశ్ ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కు సైతం స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.  చంద్రబాబుపై నోరుపారేసుకున్న కేసీఆర్ కు అర్థవంతమైన ప్రశ్నలేశారు.  అందుకే లోకేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి నుంచి కేసీఆర్ కు లోకేశ్ తోనే కౌంటర్ ఇప్పించాలని పార్టీ నేతలు చంద్రబాబును కోరుతున్నారట. ఏదేమైనా లోకేశ్ ప్రతిష్ట ఇప్పుడు రోజురోజుకు మరింత పెరుగుతోంది.  తిరుగులేని పాజిటివ్ ఇమేజ్ తో లోకేశ్ దూసుకుపోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu