ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అరెస్ట్
posted on Nov 6, 2014 11:34AM

విశాఖపట్టణంలో గల ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అప్పారావుని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన వారికి ప్రేలుడు పదార్ధాలను సరఫరా చేస్తునట్లు కూడా తమకు అనుమానాలున్నాయని, అందుకే విచారణ నిమిత్తం ఆయనను అరెస్ట్ చేసామని యస్.పి. ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఆయనను కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు అనుమతి తీసుకొని విచారణ అనంతరం ఆయనను మీడియా ముందు ప్రవేశ పెట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎంతో మంచి పేరున్న ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు మార్గదర్శనం చేస్తున్న ఒక ప్రొఫెసర్ ఇటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలలో పాల్గొనడం, అందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం విద్యార్దులకు, విశ్వవిద్యాలయ అధికారులను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయన అరెస్టుకు నిసనగా విద్యార్ధులు ఆందోళనకు దిగారు. వారు ప్రస్తుతం యస్.పీ. కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. కేవలం అనుమానంతో అప్పారావును అన్యాయం అరెస్ట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నారు. ఏమయినప్పటికీ నిజానిజాలు పోలీసు విచారణలో తేలుతాయి. కానీ బలమయిన ఆధారాలు లేకుండా పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తే దాని వలన వారికే సమస్యలు వస్తాయి కనుక వారి వద్ద అందుకు తగిన ఆధారాలే ఉండి ఉండవచ్చని జనాభిప్రాయం.