జగన్ బెయిల్ కి అనర్హుడు: సిబిఐ

 

 jagan bail, jagan cbi, jagan assets case, jagan cbi case

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచింది. జగన్ బెయిల్‌కు అనర్హుడని, విచారణ కీలక దశలో ఉన్న సమయంలో జగన్ బయటకు వస్తే విచారణ సవ్యంగా జరగదని, ఇతర దేశాల నుంచి వచ్చిన పెట్టుబడులపై విచారణ చేయాల్సి ఉందని సీబీఐ తరఫు న్యాయవాది అశోక్‌భాన్ తెలిపారు. జగన్ బెయిల్‌ను ఆర్థిక నేరంగా పరిగణించాలని, బెయిల్ ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని అశోక్‌భాన్ కోర్టులో వాదించారు. విచారణ ఇంకా 4, 5 నెలల్లో పూర్తి అవుతుందని న్యాయవాది పేర్కొన్నారు.


హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. ఏడు అంశాల్లో జగన్‌ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. దర్యాఫ్తు పూర్తయినందున జగన్ కుబెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే వాదించారు. జగన్ ఎక్కడకు పారిపోరని, ఎన్నికలు వస్తున్నందున పార్టీని సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.