మరో విమాన ప్రమాదం.. ఉత్తర అరిజోనాలో నలుగురి మృతి
posted on Aug 6, 2025 10:34AM

ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్‌లో మంగళవారం( ఆగస్టు 5) వైద్య రవాణా విమానం కుప్పకూలిపోయింది. విమానంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక పేషెంట్ ఉన్నారు. ఈ నలుగురూ కూడా మృత్యువాత పడ్డారు. అయితే ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు.
న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన సీఎస్ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం.. ఫీనిక్స్‌కు ఈశాన్యంగా 483 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. కాగా.. జనవరిలో ఫిలడెల్ఫియాలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయి ఎనిమిది మంది మరణించారు. ఆ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయడం లేదని తెలిపింది.