భారత్ పై ట్రంప్ కి ఇంత మంట ఎందుకంటే?
posted on Aug 6, 2025 10:01AM

బ్రిక్స్ దేశాలు ఎన్ని? ఈ దేశాలు కొత్త కరెన్సీ ఏర్పాటు చేసుకుంటున్నాయా? ఆ భయమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను భయపెడుతోందా? బ్రిక్స్ కూటమికి భారత్ సారథ్యం కారణంగానే ట్రంప్ ఇండియాపై కారాలూ, మిరియాలూ నూరుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా ఇలా మొత్తం 11 దేశాలు బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు. అయితే.. బ్రిక్స్ దేశాలు ఇప్పటి వరకూ తమ సొంత కరెన్సీని ఏర్పాటు చేయలేదు
కానీ.. ఇప్పటికే ఈ దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక కరెన్సీల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.. ఆపై తమ సొంత చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా యూరో, డాలర్ తో సమానంగా ఒక కరెన్సీ రూపొందించే దిశగా ఈ దేశాలు అడుగు వేస్తున్నాయి. ఇదే ట్రంప్ కి కంటకింపుగా మారింది. ఆయన ఆయన ప్రాతినిథ్యం వహించే నాటో యురోపియన్ దేశాలకు సొంత కరెన్సీ ఉండొచ్చు. అదే ఏషియన్ దేశాలకు ఉండొద్దన్నదే ఆయన ఉద్దేశం. అందుకు భిన్నంగా బ్రిక్స్ దేశాలు అడుగులు వేయడంతోనే ట్రంప్ ఉలికిపాటుకు, ఉక్రోషానికి గురైతున్నారు.
ఉక్రెయిన్ లో మారణ హోం జరుగుతుంటే రష్యా నుంచి చమురు ఎలా కొంటారని ప్రశ్నించే ట్రంప్.. మరి అంత రక్తపాతం జరుగుతుంటే.. ఉక్రెయిన్ లో పదేళ్ల ఖనిజ తవ్వకాలకు అమెరికా ఒప్పందం ఎందుకు, ఎలా చేసుకున్నట్లు? ఈ విషయంలో ఆయన సమాధానం ఇవ్వరు. ఎక్కడా దాన్నొక అనైతిక వ్యవహారంగా భావించరు. తన చేతులకు ఇంతటి రక్తపు మరకలు అంటించుకుని.. ఇతరుల నైతికతను ప్రశ్నిస్తారు.
ఓవరాల్ గా భారత్ రష్యా, చైనాతో సమానంగా స్వయంప్రతిపత్తిగల దేశంగా ఎదగడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎళ్లకాలమూ డిపెండెంట్ లాగానే ఉండాలి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకూడదన్నదే అమెరికా అధ్యక్షుడి ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆయా సంస్థలకు హుకుంలాంటి సూచన చేశారు. తాజాగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటనబట్టీ చూస్తే.. అమెరికాలో అమ్మే ఐ ఫోన్లలో తయారవుతున్నవే ఎక్కువని తేలింది.
దానికి తోడు భారత్ ని ఫ్రాన్స్ వంటి దేశాలు నాయకత్వం వహించమని కోరడం. గ్లోబల్ సౌత్ కి మోడీ సైతం నేతృత్వం వహించేలాంటి అడుగులు వేయడం.. వంటివి ట్రంప్ కి అస్సలు గిట్టడం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో మోడీ ఆయుధాలపై దృష్టి సారించడం. ఆపై కొన్ని బ్రిక్ దేశాలకు ఆయుధాలను చౌకగా సరఫరా చేసే సామర్ధ్యం కలిగి ఉండటంతో.. ట్రంప్ తమ ఆయుధ వ్యాపారానికి మోడీ రూపంలో భారత్ అడ్డు తగులుతుండటం కడుపుమంట కలిగిస్తోంది. అందుకే అనవసరంగా వీసాల రద్దు, స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వేధింపులు, అక్కడ నివసించే భారతీయులు తమ సొంత కుటుంబాలకు డబ్బు పంపాలన్నా సుంకాల విధింపు.. తాజాగా 25 శాతం సుంకాలు, జరిమానాగా అదనపు వడ్డింపులు.. వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
తమకు బద్ధ శతృవైన రష్యాతో భారత్ చెలిమి చేయకూడదంటారు ట్రంప్. మరి భారత్ కి ఆగర్భ శతృవైన పాకిస్థాన్ లో తమ కుటుంబ సంస్థ డబ్ల్యూఎల్ఎఫ్ చేత పెట్టుబడులు పెట్టించవచ్చు. ఆపై పాకిస్థాన్ లో పెట్రోలు నిల్వల కోసం కోట్ల డాలర్లు కుమ్మరించి పరిశోధనలు చేయించవచ్చు. ఆ దేశం భారత్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను పెంచి పోషించడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల ద్వారా ఏటా క్రమం తప్పకుండా వేల కోట్ల రుణాలు ఇప్పించవచ్చు. భారత్ కి వ్యతిరేకంగా ట్రంప్ ఇన్ని చేయొచ్చుగానీ.. భారత్ మాత్రం.. తన స్వయం సమృద్ధిని మాత్రం కాంక్షించవద్దు. ఇదెక్కడి లెక్క? అని ప్రశ్నిస్తోంది సగటు భారతీయం. అందుకే కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ భారత పరిపాలన వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ నుంచి జరగట్లేదు.. కావాలంటే వారు పాకిస్థాన్ని అక్కడి నుంచి పరిపాలించుకోవచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మరి చూడాలి ఈ సుంకాల యుద్ధం ఎక్కడి వరకూ వెళ్తుందో.