ధర్మానను కాపాడబోయి డిఫెన్సులో పడ్డ సిఎం?

రాష్ట్రరెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావును కాపాడబోయి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డిఫెన్సులో పడేలా రాజకీయవాతావరణం మారిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ విచారణ పేరిట సిబిఐ వరుసగా అరెస్ట్‌ చేస్తే ప్రభుత్వమనుగడే ప్రశ్నార్థకమవుతుందని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపుడుతున్నారు.

 


తన అభిప్రాయాన్ని గవర్నర్‌ నరసింహన్‌తో పంచుకున్న సిఎం చివరాఖరికి గవర్నర్‌కు పంపించే లేఖలో కిరణ్‌ ఇదే విషయాన్ని నొక్కి చెప్పనున్నారు. ఒకవేళ మంత్రి ధర్మాన అరెస్టు కనుక ప్రభుత్వం అడ్డుకుంటే వాన్‌పిక్‌ కేసు నుంచి చంచల్‌గూడ జైలులో ఉన్న వైకాపా అధినేత జగన్‌ను కూడా కిరణ్‌ తప్పించడానికి దారి ఇచ్చినట్లు అవుతుందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. తన మంత్రులపై అభిమానంతో కిరణ్‌ సిబిఐ దర్యాప్తు చేస్తున్న జగన్‌ అక్రమాస్తుల కేసును నీరుకారుస్తున్నారని, నిందితులందరికీ ప్రభుత్వమే దారి చూపుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ధర్మానను వెనుకేసుకు వస్తున్న ప్రభుత్వంపై  ప్రతిపక్షాలు  ఇప్పటికే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అవసరమైతే సిఎంను నిలదీసేందుకు సైతం ప్రతిపక్షనేతలు సిద్ధపడుతున్నారు.




ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లోని సీనియర్లు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో సిఎం జోక్యం చేసుకోవటాన్ని సహించటం లేదు. పార్టీపై ఇప్పటికే అవినీతి బురద పడినందున వచ్చిన ప్రతీ అవకాశాన్ని సిఎం నిజాయితీ చాటేలా ఉపయోగించుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. తమ మాట వినకుండా మంత్రుల కోసం పీకమీదకత్తి పెట్టుకుంటే సిఎంకు వ్యతిరేకంగా కేంద్రానికి సిఫార్సు చేసేందుకైనా వెనుకాడబోమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu