రాష్ట్రానికి రూ.2,25,486 కోట్లు ఇవ్వండి: బాబు డిమాండ్

 

ప్రధాని నరేంద్ర మోడీతో మొన్న సమావేశమయిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేప్పట్టేందుకు వీలుగా రాష్ట్రానికి మొత్తం రూ. 2,25,486 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. తానేమీ కొత్తగా నిధులు కోరడం లేదని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులను కోరుతున్నానని ఆయన స్పష్టం చేసారు. బీహార్ రాష్ట్రానికి ఇటీవల మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని చూసి తను ఈ డిమాండ్లు ప్రధాని ముందు పెట్టడం లేదని, వీటి గురించి చాలా కాలంగా కేంద్రప్రభుత్వాన్ని తను అడుగుతున్నానని తెలిపారు. కనుక తను సమర్పిస్తున్న ఈ నివేదిక ఆధారంగానే నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్రానికి అందించవలసిన ఆర్ధిక ప్యాకేజిపై రోడ్డు మ్యాప్ తయారు చేయాలని ఆయన కోరారు.

 

చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించిన నివేదికలో శాఖల వారిగా కోరిన నిధుల వివరాలు: సాగునీరు, వ్యవసాయాభివృద్ధికి: రూ. 24, 627 కోట్లు, గ్రామీణ త్రాగునీటి సరఫరా: రూ. 13,714 కోట్లు, విద్యుత్: రూ. 3,190 కోట్లు, అటవీ శాఖ: రూ.1,950 కోట్లు, రహదారులు, మౌలిక వసతులు: రూ. 27,985 కోట్లు, రైల్వేలు: రూ. 21,420 కోట్లు, పోర్టుల అభివృద్ధి: రూ. 4,800 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి: రూ. 3,100 కోట్లు, పర్యాటక శాఖ: రూ. 4,750 కోట్లు, పట్టణాభివృద్ధి రూ. 14,106 కోట్లు, మొత్తం: రూ. 2,25,486 కోట్లు.