నిర్మల ప్రకటనపై భగ్గుమన్న విశాఖ

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నామని లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించడంతో విశాఖ భగ్గుమంటోంది. ప్రైవేటీకరణ ఆగబోదని, నూటికి నూరుపాళ్లు జరిగే తీరుతుందన్న నిర్మల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ వాసులు. కేంద్రం ప్రకటనతో కార్మికులు ఉద్యమం ఉధృతం చేశారు.ప్రైవేటీకరణ ఆపేందుకు తక్షణ కార్యాచరణ ప్రకటించారు. రాత్రికి రాత్రే హైవే దిగ్బంధంతో విశాఖ అట్టుడుకుతోంది. కేంద్రం వెనక్కి తగ్గాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ విశాఖలో కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని మరోసారి రుజువైంది. దీంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సోమవారం రాత్రి  విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. నేషనల్ హైవే కూర్మన్నపాలెం సర్కిల్ దగ్గర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. కార్మికులు మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు. రోడ్డుమీద బైఠాయించడంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

కూర్మన్నపాలెం సెంటర్ లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం అర్థరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడించాలని ఉక్కు పోరాట సమితి పిలుపునిచ్చింది. దీంతో విశాఖ మరోసారి రణరంగంగా మారే అవకాశం ఉంది.

అనకాపల్లి నుంచి విశాఖ నగరానికి వచ్చే వాహనాలను లంకెలపాలెం వద్ద నుంచి సబ్బవరం మీదుగా నగరం లోకి మళ్లిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ఉక్కు పరిసరాల్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ప్రయాణీకులు ఆందోళనలకు దిగుతున్నారు.