ఏపీ శంకుస్థాపన ఆహ్వానాలు.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తని జగన్
posted on Oct 17, 2015 11:40AM

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనను శంకుస్థాపనకు పిలవద్దని, పిలిచినా రానని.. మళ్లీ రాలేదని విమర్శించొద్దని చెప్పి బహిరంగంగా లేఖ రాసిన సంగతి తెలసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తను వచ్చినా రాకపోయినా పిలవడం తమ బాధ్యత అని జగన్ ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్ మాత్రం ఏపీ మంత్రులకు అందుబాటులోకి రావడం లేదట. ఏపీ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆహ్వానాలు మొదలయ్యాయి. కామినేని శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు, టిడి జనార్ధన్‌లు అన్ని పార్టీ నేతలను ఆహ్వానించే బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే వీరు ఇతర పార్టీ నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. దీనిలో భాగంగానే.. చంద్రబాబు ఆదేశాల మేరకు జగన్ ను కూడా ఆహ్వానించేందుకు మంత్రులు జగన్ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా జగన్ మాత్రం అందుబాటులోకి రావడం లేదట. అంతేకాదు ఆయన పీఏకు ఫోన్ చేసినా ఆయన నుండి కూడా ఎటువంటి స్పందన లేదట. దీంతో మంత్రులు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తప్పకుండా శంకుస్థాపనకు రావాలని.. రానని మొండి పట్టు పట్టకుండా పరిస్థితి అర్ధం చేసుకోవాలని సూచించారు. మొత్తానికి జగన్ తాను అనుకున్నట్టుగానే శంకుస్థాపనకు నిజంగానే వెళ్లనట్టు కనిపిస్తుంది.