ఆర్థిక పతనం మొదలైందా..? ఏపీలో ఎమర్జెన్సీ తప్పదా? 

ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పతనం మొదలైపోయిందా..? అంటే రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలు అవుననే సూచనలు స్పష్టం  చేస్తున్నాయి. రాష్ట్ర ఖజానాలో సొమ్మంతా ఇష్టం వచ్చినట్లు వాడేసిన వైసీపీ సర్కార్..  పలు శాఖలు, సంస్థల్లో ఉన్న సొమ్మంతా దోచుకుపోతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పరిమితికి మించి అప్పులు చేసిన సర్కార్కు మరి ఇంకెక్కడా రుణం దొరకని స్థితి దాపురించింది. ఒక పక్కన కేంద్రం, మరో పక్కన రిజర్వు బ్యాంకు కూడా ఏపీ ఆర్థిక మంత్రి దేబిరింపుల్ని పరిగణనలోకి తీసుకోవడం మానేశాయి. మరో పక్కన వివిధ సంస్థలకు జగన్ రెడ్డి సర్కార్ చెల్లించాల్సిన బకాయిల కోసం ఆయా సంస్థల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. పేరుకుపోయిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే నోటీసులు ఇచ్చేందుకు, సేవలు నిలిపేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధం అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి యుద్ధ ప్రాతిపదికపై నోటీసులు ఇవ్వాలని డిస్కంలకు ఏపీఈఆర్సీ లేఖ రాసింది. 15 వేల కోట్ల రూపాయల చిల్లర బాకీలు వసూలు చెయ్యకపోతే, రెండు వారాల తరువాత కరెంటు సరఫరా కట్ చెయ్యమని కూడా హెచ్చరించింది.

మరో పక్కన అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ ఏకంగా ఏపీ ప్రభుత్వానికి రెడ్ కార్నర్  వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల సరఫరాకు సంబంధించిన బాకీలను జగన్ రెడ్డి సర్కార్ కట్టకుండా తాత్సారం చేస్తోంది. దీంతో నూరు శాతం డబ్బులు ముందుగానే కడితే గాని ఏపీకి పరికరాలు ఇవ్వొద్దని మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ స్పష్టం చేసింది. విద్యుత్, వైద్య రంగాలు ఆర్థికంగా పతనం కావడానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి.

అటు చూస్తే  తీసుకొనే అప్పు పరిమితిని పెంచడానికి కేంద్రం కుదరదని తెగేసి చెప్పేసింది. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ సర్కార్ పెద్దమొత్తంలో చెల్లించాల్సిన తక్షణ ఆవశ్యకత నెలకొంది. ఖజానాలో నిల్వలు లేకపోవడం, డబ్బుల వచ్చే దారులన్నీ మూసుకుపోవడంతో ఏమీ పాలుపోని సంకట స్థితిలో ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. చివరి అంకంలో భాగంగా.. దింపుడుకళ్లం ఆశలతో ‘యువతను అంబానీలను చేస్తా’ అనే బడాయి గౌతంరెడ్డిని ఏదో పొడుస్తాడని హస్తిన పంపినట్లున్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి అవుట్.. వీర్రాజుకు బ్రేక్! అమిత్ షా డైరెక్షన్ లో బీజేపీ న్యూ టీమ్..

ఏపీలో పైసా ఆదాయాన్ని పెంచకుండా.. పన్నులు పెంచి పెంచి.. జనం తిరగబడే స్థితికి తెచ్చుకుంది జగన్ సర్కార్. అయినప్పటికీ తనకింకా ప్రజాభిమానం ఉందని, అధికార జులుం వాడి, ఫోర్జరీలతో నిధులు విత్ డ్రాలు చేసి, బెదిరింపులతో లొంగదీసుకొని, దొంగ ఓట్లు వేయించుకుని, రోడ్ల మీదకు వచ్చిన బాధితులపై లాఠీఛార్జీలు చేసి భయపెట్టి, నిత్యం సమీక్షా సమావేశాలు నెపంతో జగన్ సర్కార్ చేసే కాలక్షేపం కథ కంచికి చేరే పరిస్థితులు చివరి అంకానికి వచ్చాయని జనం అంటున్నారు.
ఆంధ్రా ఆర్థిక పతనం గురించి ఎకనామిక్ టైమ్స్ వార్త ద్వారా యావద్దేశానికీ తెలుసు. అయితే.. తెలియనట్లు కొందరు నటిస్తున్నారంతే. ఆర్థిక పతనం నుంచి ఏపీ సర్కార్ ఎలా బయట పడుతుందనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. 

జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా?

జగన్ సర్కార్ ఎక్కడికక్కడ ఆస్తుల్ని హోల్ సేల్గా అమ్మాలంటే ఆంధ్రా దివాళా తీసిందని కోర్టు ముందు ఒప్పుకోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎందుకు దాపురించాయి? మీరు చక్కదిద్దుతారా? లేదా ఆర్థిక ఎమెర్జెన్సీ కోసం రాష్ట్రపతికి అధికారికంగా నివేదించండి అని కేంద్రం సలహా ఇవ్వవచ్చు. ఒక వేళ ఏపీ ఇలాగే కొనసాగాలంటే విద్య, వైద్య, ఆర్టీసీ, రోడ్లు & భవనాలు, ఏపీఐఐసీ ఇలా అన్ని సంస్థల ఆస్తుల్ని వేలం వేసే ప్రక్రియ మొదలెట్టినా అగ్రిగోల్డ్ తరహాలో కొన్నేళ్లు పడుతుంది. అంతవరకు అప్పు ఇచ్చిన వారు ఎందుకు వేచి ఉంటారు? దాంతో అన్ని రత్నాలకు జగన్ సర్కార్ మంగళం పాడాల్సి ఉంటుంది. ఉద్యోగులు జీతాల నుండి కొంత తగ్గించుకోవాలని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించే ధైర్యం జగన్ రెడ్డికి లేదు.

అద్భుతాలు జరగవు. జనం వాస్తవాలు అంగీకరించక తప్పదు. తమ తప్పుడు నిర్ణయాలకు ప్రాయశ్చిత్తంగా, నవరత్నాలే కాదు, చాలా త్యాగాలు చెయ్యక తప్పదు. అనివార్యమైన ఆర్థిక పతనం స్థితికి మానసికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధం కాక తప్పకపోవచ్చు.