విష్ణువర్ధన్ రెడ్డి అవుట్.. వీర్రాజుకు బ్రేక్! అమిత్ షా డైరెక్షన్ లో బీజేపీ న్యూ టీమ్..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందా? సోము వీర్రాజు కోటరీతో పార్టీకి నష్టం కల్గుతుందని గుర్తించిందా? ఏపీ బీజేపీలో ప్రక్షాళన ప్రారంభమైందా? అంటే పార్టీ అధిష్టానం తీసుకుంటున్నతాజా నిర్ణయాలతో అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ బీజేపీకి కొత్త కోర్ కమిటీని ప్రకటించింది హైకమాండ్. తాజా కమిటీతో సోము వీర్రాజుకు బ్రేకులు వేయడంతో పాటు ఆయన టీమ్ కు చెక్ పడినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీలో జగన్ టీమ్ గా ముద్ర పడిన నేతలను హైకమాండ్ పూర్తిగా దూరం పెట్టిందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ కోర్ కమిటీలో పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చగా మారింది. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు తర్వాత అంతా తానే అన్నట్లుగా వ్యవహరించే విష్ణును ఎంపిక చేయకపోవడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. 

పార్టీ చీఫ్ గా నియామకమయ్యాకా మొదట సోము వీర్రాజు దూకుడుగా వెళ్లారు. సస్పెషన్లు.., టీవీచానళ్ల బహిష్కరణల నిర్ణయాన్ని అలవోకగా  తీసుకున్నారు.  ఆయనకు ఇప్పుడు పదవి మిగిలింది కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేసింది హైకమాండ్. కొత్తగా కోర్ కమిటీని బీజేపీ హైకమాండ్ నియమించింది. అందులో  టీడీపీ సానుభూతిపరులుగా పేరు తెచ్చుకున్న వారికీ ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.  జేపీ నడ్డా తాజాగా ప్రకటించిన కోర్ కమిటీలో సోము వీర్రాజుతో  పాటు కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి, సత్యకుమార్‌ , సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, మధుకర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ వంటి వారు ఉన్నారు. 

మీ వల్లే వరదలు.. మీ పరిహారం మాకొద్దు.. సజ్జలకు షాకిచ్చిన వరద బాధితులు 

ఇంతకు ముందు కూడా ఏపీ బీజేపీకి ఓ కోర్ కమిటీ ఉంది. కానీ దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నిర్ణయాలను సోము వీర్రాజు తనకు నచ్చిన వారితో సమావేశమై తీసుకునేవారు. టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలను అసలు పిలిచేవారు కాదు. పట్టించుకునేవారు కాదు. టీడీపీ నుంచి నేతలను టీడీపీ సానుభూతి పరులని.. ఓ సామాజికవర్గం వారని చెప్పి దూరంగా ఉంచుతూ వచ్చారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వారంతా వైసీపీ సానుభూతిపరులుగా గుర్తింపు పొందారు. వీళ్లు అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి టీడీపీని విమర్శిస్తూ ఉంటారు. ఈ పరిణామాలపై అమిత్ షాకు పూర్తి నివేదిక అందిందట.ఇటీవల తిరుపతిలో అమిత్ షా నిర్వహించిన సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలను దూరం పెట్టడంపై సోము వీర్రాజుపై  అమిత్ షా అక్షింతలు వేసినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో కొత్త, పాత ఉండదని, అందరిని కలుపుకునిపోవాలని ఆదేశించారట. అంతేకాదు ఏపీ బీజేపీ పరిణామాలపై నడ్డాకు సూచనలు చేశారట అమిత్ షా. 

అమిత్ షా ఆదేశాలతో ఏపీ కొత్త కోర్ కమిటిని నియమించారు జేపీ నడ్డా. ఈ కమిటీలో దూకుడు రాజకీయాలు చేసే విష్ణువర్ధన్ రెడ్డి లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి విష్ణుపై వైసీపీ సానుభూతి పరుడనే టాక్ ఉంది. ప్రతి విషయంలోనూ అధికార పార్టీని టార్గెట్ చేయకుండా ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేస్తారని విష్ణుపై ఆరోపణలు ఉన్నాయి. సీఎం జగన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియా డిస్కషన్లలో మాట్లాడుతారనే ఆరోపణలు ఉన్నాయి. విష్ణు తీరుపై అమిత్ షాకు కొందరు నేతలుఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అందుకే ఆయన్ను కోర్ కమిటిలో తీసుకోలేదని తెలుస్తోంది. 

విష్ణును పక్కన పెట్టడం ద్వారా.. జగన్ కు, వైసీపీకి అనుకూలంగా ఉంటున్న నేతలకు పార్టీ హైకమాండ్ వార్నింగ్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ సాగుతోంది. అంతేకాదు ఇకపై వైసీపీపై దూకుడుగా వెళ్లాలనే సంకేతం ఏపీ నేతలకు ఇచ్చిందని అంటున్నారు. మొత్తంగా కొత్త కోర్ కమిటీతో ఇప్పటి వరకూ వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించిన ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఇక ముందు కాస్తంత మార్పు వచ్చే అవకాశం మాత్రం ఉందని అంటున్నారు.