టీఎస్ అసెంబ్లీకి జనసేనని తీసుకుపోటానికి… ‘కార్’ రెడీనా?
posted on Mar 30, 2017 @ 3:15PM
సినిమాల్లో… హీరో విలన్ని ఎన్ని సమస్యలు ఎదురైనా ఖచ్చితంగా ఓడిస్తాడు! ఓడించకుంటే అసలు హీరోనే కాడు! కాని, పాలిట్రిక్స్ లో అలా కుదరదు. ఇక్కడ ఒక్కో చోట, ఒక్కోసారి ఒకరు హీరో అయితే… మరోకరు విలన్! ఆ విలనే హీరో అయినప్పుడు … హీరో కాస్తా విలనైపోతాడు! అందుకే, పాలిటిక్స్ లో ఎవ్వరూ ఎవ్వరితోనూ శాశ్వతంగా కొట్టుకోరు. తిట్టుకోరు. అలాగని, దాడి చేసుకోకుండా కూడా వుండరు!
కాటమరాయుడు సినిమా చూసి సూపర్ అన్నాడు … టీఆర్ఎస్ పార్టీ చినరాయుడు! అవును… కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ నెంబర్ టూ నేత… కేటీఆర్ పవన్ సినిమాని మెచ్చుకున్నాడు. అంతే కాదు, పంచెలు కట్టి పంచ్ లు విసిరిన పవన్ కళ్యాణ్ నేతన్నలకు కూడా మంచి చేశాడని కితాబునిచ్చాడు కేటీఆర్! ఇంత వరకూ పాలిటిక్స్ ఏం లేదు కానీ… అసలు మ్యాటర్ తెరపైన కాటమరాయుడు చూడటంలో లేదనీ… తెర వెనుక జరుగుతోన్న తతంగంలో వుందనీ అంటున్నారు విశ్లేషకులు!
టీఆర్ఎస్ కి , వపన్ కళ్యాణ్ కి పెద్దగా పడదని ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఘాటుగానే విమర్శించారు పవర్ స్టార్ ని. అయితే, గత కొంత కాలంగా టీఆర్ఎస్ పవన్ ని టార్గెట్ చేయటం మానేసింది. అలాగే, పవన్ కూడా ఏపీ మీద దృష్టి పెట్టి తెలంగాణను ప్రస్తావించటం లేదు. ఇక టీఆర్ఎస్ నైతే పల్లెత్తు మాటని చాలా రోజులే అయిపోయింది. ఇలాంటి గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ ఫార్ములా ఎందుకు అమలవుతోంది? తాజాగా కేటీఆర్ , పవన్ ల సెల్ఫీ ఫ్రెండ్ షిప్ చూస్తే ఆల్రెడీ అనుమానిస్తోన్న వారి డౌట్స్ మరింత బలపడతాయి! వచ్చే ఎన్నికల్లో జనసేన జెండాలు టీఆర్ఎస్ కారుపై రెపరెపలాడనున్నాయా? అలాంటి అవకాశాలు పుష్కలంగా వున్నాయని కొందరంటున్నారు!
కాటమరాయుడు సినిమా చూసిన కేటీఆర్… సినిమా టికెట్ల గురించే కాకుండా పొలిటికల్ టికెట్స్ గురించి కూడా మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమతో కలిసి పోటీ చేస్తే జనసేనకు తగినన్ని సీట్లు కేటాయిస్తామని ఆయన అన్నారట. తెలంగాణలో పవన్ పార్టీకి భారీగా సీట్లు గెలిచే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ క్యాడర్, బలం జనసేనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, పవన్ గ్లామర్, ఫాలోయింగ్ గులాబీ పార్టీకి అదనపు ఆకర్షణ అవుతుంది!
2019 ఎన్నికలకి ఇంకా రెండేళ్లు మిగిలి వున్నాయి కాబట్టి ఇటు పవన్ , అటు టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడప్పుడే బయటపడే అవకాశం లేదు. పైగా అప్పటిలోగా ఇంకా బోలెడు మార్పులు రావచ్చు కూడా. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే జనసేనతో పొత్తు టీఆర్ఎస్ కి మరింత ఈజీ అవుతుంది. కాబట్టి అంత వరకూ వెయిట్ అండ్ వాచ్ ఫార్ములానే ఇరు పార్టీలు వాడతాయి! అవసరమైతే వెయిట్ అండ్ వాచ్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటూ… కేటీఆర్ లాంటి నేతలు మళ్లీ మళ్లీ థియేటర్స్ కి కూడా రావచ్చు! ట్వీట్స్ కూడా చేయొచ్చు!