Read more!

వాస్తు వల్లే జగన్ కి జైలు కష్టాలు..?

 

 

 

లోటస్ పాండ్ లోని జగన్ మోహన్ రెడ్డి అత్యంత ఆధునికంగా నిర్మించుకున్న ఇంటివల్లే ఆయనకీ, ఆయన కుటుంబానికి అన్ని కష్టాలు వస్తున్నాయని వైసీపీలోని కొందరు నేతలు గతంలోనే జగన్ దృష్టికి తెచ్చారు. వాటిపై అంత నమ్మకం లేని జగన్ వాటన్నింటిని కొట్టి పడేస్తూ లోటస్ పాండ్ ఇంట్లోనే నివసిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా వాస్తు విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అప్పట్లో బంజారాహిల్స్ లోని వైఎస్ సొంత ఇంట్లో ఉన్నంతకాలం ఆయనకీ ఎలాంటి అధికారం అందలేదు. ఈ విషయంలో అప్పట్లో ఆయన ఆప్తుడు కేవీపీ పోరాడి తీవ్రంగా విభేదించడంతో ఇష్టం లేకపోయినా వైఎస్ తన మకాన్ని తన ఇంటి వెనుక వున్న కుమార్తె నివాసానికి మార్చారు. వాస్తు రీత్యా ఆ భవనంలో నివాసం ఉండటం మొదలుపెట్టిన తరువాతే వైఎస్ కు అధికారం దక్కింది.


వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్ కూడా కొంత కాలం అదే భవనంలో నివాసం ఉన్నారు. అక్కడ ఉన్నంత కాలం ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బ్రహ్మరథం పట్టారు. ఒక దశలో ముఖ్యమంత్రి పదవిని జగన్ మోహన్ రెడ్డికి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. సిఎం పదవి దక్కకపోయినా జగన్ కాంగ్రెస్ లో ఒక బలమైన నాయకుడిగా ఉండేవారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు సైతం అప్పటి సిఎం రోశయ్యకంటే బంజారాహిల్స్ లో నివాసముండే జగన్ ఇంటికే ఎక్కువగా వచ్చిపోయేవారు ఇది గతం.



ఇక ప్రస్తుతానికి వస్తే ఏ క్షణం అయితే జగన్ లోటస్ పాండ్ లోని తాను ముచ్చటపడి కట్టుకున్న నివాసానికి మకాం మార్చారో అప్పటి నుంచి ఆయనకు అన్నీ కష్టాలే మొదలయ్యాయి. ముఖ్యంగా లోటస్ పాండ్ ఇంటికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. వివిధ దినపత్రికలు, టీవీ చానళ్ళు పతాక శీర్షికల్లో ఆ ఇంటి గురించిన వైభోగాన్ని వివరించాయి. 60 గదులు ఉన్నాయంటూ కొన్ని పత్రికలూ, 10 లిఫ్టులు ఉన్నాయంటూ కొన్ని చానళ్ళు ఆ ఇంటిని ఒక పెద్ద బూచిలా చూపెడుతూ రాద్దాంతం చేయడంతో దేశం మొత్తం జగన్ ఇంటిపైనే దృష్టి పెట్టింది. సిబీఐ కూడా జగన్ ఇంట్లోని అణువు అణువు పరిశోధించింది. కొన్ని వందల కోట్ల రూపాయలను లోటస్ పాండ్ ఇంటికి విలువ కట్టింది. ఆ ఇంట్లో జగన్ పట్టుమని పదిరోజులు కూడా నివసించింది లేదు. ఓదార్పు యాత్ర ద్వారా తరచు జనంలోనే ఉంటున్న జగన్ ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో కుటుంబసభ్యులతో గడిపిన సందర్భాలు వేళ్ళతో లెక్కించవచ్చు. ఎంతో వివాదానికి గురైన జగన్ లోటస్ పాండ్ నివాసం ఆయనకీ కలిసిరాలేదని పరిశీలకులు అంటున్నారు.



జగన్ జైలుకు వెళ్ళడం, షర్మిల జనాల్లోకి వెళ్ళడం గాయాల పాలు కావడం, ఒక పక్క సిబీఐ దాడులు, మరోపక్క ఈడీ ఆస్తుల జప్తులకై చేస్తున్న ప్రయత్నాలతో పాటు తరచు కోర్టులలో బెయిల్ లభించకపోవడం లాంటి సంఘటనలు అన్నింటికీ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి వాస్తు దోషమని కారణం ని ఎంత చెప్పిన జగన్ కానీ ఆయన తల్లి విజయమ్మ కానీ వినకపోవడంతో వైవీ సుబ్బారెడ్డితో కొందరు వైఎస్సార్ సిపి నేతలు వాస్తు మార్పులు చేయాల్సిందిగా సూచిస్తూ వాస్తుదోషాన్ని తొలగించినంత కాలం జగన్ కు ఆయన కుటుంబానికి వైకాపాకు కూడా కష్టాలు తప్పవని పలువురు వాస్తు విద్వాంసులు చెబుతున్నారు. స్వతహాగా వీటన్నింటికి విరుద్దమైన జగన్ ఏదో విధంగా మనసు మార్చుకొని వాస్తుదోషాలపై కూడా ఒక కన్ను వేస్తే బహుశా ఆయన కష్టాలు తీరవచ్చు. చంద్రబాబు కూడా ఒత్తిడులకు తలొగ్గి టిడిపి కార్యాలయాన్ని ప్రస్తుతం కొన్ని బాగాలను కూలగొట్టి తిరిగి వాస్తు విద్వాంసులు సూచించిన మేరకు మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రస్తుతం టిడిపి ప్రధాన కార్యాలయంలో వాస్తు ప్రకారం మార్పులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే బహుశా టిడిపి తన పునఃవైభవాన్ని పొందగలుగుతుంది అని ధీమాగా వాస్తు పండితులు చెబుతున్నారు. జగన్ కూడా లోటస్ పాండ్ ఇంటిని వాస్తు మార్పులు చేయగలిగితే ఆయన కష్టాలన్నీ తొలగిపోవచ్చని వాస్తు విద్వాంసులు పేర్కొంటున్నారు.