Read more!

అమెరికా కొత్త అధ్యక్షుడెవరు?

 

అమెరికా అధ్యక్షుడిని ఎన్నికకు పోలింగ్ ఈ రోజు జరగబోతోంది. శ్వేత సౌధంలో ఎవరు పాగా వేస్తారన్న విషయం తేలిపోబోతోంది. ఒబామా, రోమ్నీ.. ఇద్దరూ పోటాపోటీగా గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. ఓటర్లని భారీ స్థాయిలో ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. యువతకి భారీగా ఉద్యోగాలిప్పిస్తానంటూ ఒబామా చేసిన ప్రామిస్.. ఆయనకు చాలా అనుకూలంగా మారింది. దీనివల్ల ఓటర్ల మద్దతు ఒబామాకి వెల్లువెత్తుతోంది.

 

బరాక్ ఒబామాకి బిల్ క్లింటన్ తోడుగా నిలిచి ప్రచారానికి మంచి ఊపు తెప్పించారు. రోమ్నీమాత్రం.. అమెరికా బాగుండాలంటే, నిజమైన మార్పు కావాలంటే నాకే ఓటేయండని అడుగుతున్నాడు. తాజా సర్వేల ప్రకారం రోమ్నీతో పోలిస్తే ఒబామాకే కాస్త మద్దతు ఎక్కువగా ఉంది కానీ.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇద్దరి మధ్యా హోరాహోరీ పోరు నడుస్తోంది.

 

శాండీ తుపాను ఓ రకంగా విలయాన్ని సృష్టించినా, మరో రకంగా ఒబామాకి మేలే చేసినట్టుకనిపిస్తోంది. తుపాను తర్వాత ఒబామా.. సహాయ చర్యల్ని చాలా సమర్ధంగా నిర్వహించారన్న మంచి పేరుకూడా వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశం కోసం ఆరుగురు భారతీయ సంతతికి చెందిన అభ్యర్ధులు పోటీపడుతున్నారు. వీళ్లలో ముగ్గురికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయ్.