పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగన్ కంప్లైట్..

వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరుతున్నారు. భూమా నాగిరెడ్డి తో ప్రారంభమైన ఈ వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీ పార్టీలోకి చేరగా.. ఇప్పుడు మరో వైసీపీ నేత.. పాతపట్నం ఎమ్మెల్యే వెంకట రమణ టీడీపీలోకి చేరబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ వరుస పార్టీ ఫిరాయింపులపై జగన్ సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తన పార్టీ నుంచి టిడిపిలో చేరిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఫిర్యాదు చేయనున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పెద్దలు.

జగన్ ఆస్తి 6 లక్షల కోట్లు.. చిట్టా విప్పుతా..

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సి.ఆదినారాయణ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఎన్నో నెలల నుండి పార్టీని వీడి టీడీపీలోకి చేరదామనుకున్న ఈయనకు రామసుబ్బారెడ్డి అడ్డుకోవడంతో లేట్ అయింది. ఎట్టకేలకు చంద్రబాబు రామసుబ్బారెడ్డిని బుజ్జగించడం.. ఆది నారాయణ రెడ్డి టీడీపీ లోకి రావడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన వైసీపీ అధినేత అయిన జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. జగన్ కు సంబంధించి అక్రమాస్తుల గురించి చిట్టా విప్పుతా అని అంటున్నారు. ఆదినారాయణ నియోజక వర్గం జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ అక్రమాస్తులు విలువ రూ.6 లక్షల కోట్లని..  జగన్ లక్ష కోట్లు సంపాదించాడని, రూపాయి వడ్డీ వేసినా నేడు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల చిట్టాను ఆయన ఇలాకా పులివెందులలోని అంగళ్ళ ముందే విప్పుతానని వ్యాఖ్యానించారు. జగన్‌ కుళ్లు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకే తాను చంద్రబాబు చెంతకు చేరినట్టు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు తనకు టీడీపీలో ఎవరితో బేధాలు లేవని.. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.

ఇకనుండి ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని వాడటంలో ఎప్పుడూ ముందుంటారు. ఇది చాలా విషయాల్లో రుజువైంది కూడా. తాజాగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈరోజు విజయవాడలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పద్దతి ద్వారా సులభంగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని.. ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండా.. గంటల తరబడి క్యూలో నిలబడకుండా సలభమైన పద్దతిలో వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు ఈ పద్దతి ద్వారా..  రిజిస్టేషన్ వ్యవహారంలో దళారుల జోక్యం ఉండదని.. అందరూ ఆన్‌లైన్‌లో వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా ఇది దేశంలోనే మొదటిసారి కావడం విశేషం..

మావోయిస్ట్ ల ఎన్‌కౌంటర్‌.. ముఖ్య నేతలు హతం..

  ఛత్తీస్‌గడ్‌లో భారీ  ఎన్‌కౌంటర్‌ జరిగింది. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం రాత్రి మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం అందుకున్న పోలీసు భాలగాలు కూంబింగ్‌ నిర్వహించారు. రాత్రి నుంచి ఉదయం వరకు మూడు సార్లు మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు.. మావోయిస్టు ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి లచ్చన్న ఉన్నారు. తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్‌ కూడా మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు వీరి దగ్గర నుండి ఏకే-47, మూడు ఎస్ఎల్ఆర్, మూడు రైఫిల్ స్వాదీనం చేసుకున్నారు.

గొల్లపూడి మారుతీరావు గారికి "జీవన సాఫల్య పురస్కారం"

 ప్రఖ్యాత సినీ నటులు, రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని "జీవన సాఫల్య పురస్కారం" తో  డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ మార్చి 12 వ తేది సాయంత్రం 6 గం. లకు పాలకొల్లు లో జరిగే జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి, కార్యదర్శి శ్రీ మానాపురం సత్యన్నారాయణ లు తెలిపారు.   ఈ సభకు ముఖ్య అతిధి గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , విశిష్ట అతిధులుగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి  శ్రీ బొజ్జల  గోపాలకృష్ణా రెడ్డి, ఎస్. సి కార్పోరేషన్  చైర్మన్ శ్రీ జూపూడి ప్రభాకరరావు, డా. గజల్ శ్రీనివాస్,  కేంద్ర మాజీ మంత్రివర్యులు  శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు,  ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. ముర్రు  ముత్యాల నాయుడు, శాసన మండలి సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్,  శాసన మండలి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,   చలనచిత్ర ప్రముఖులు శ్రీ కోడి రామకృష్ణ,  శ్రీ ఆర్. పి . పట్నాయక్, హీరో శ్రీ  నిఖిల్ , శ్రీ భాస్కర భట్ల, శ్రీమతి అనితా చౌదరి లు పాల్గొంటారని తెలిపారు.   మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షులు

లైసెన్స్ లేకపోతే.. 2వేలు, హెల్మెట్ లేకపోతే రూ. 100..

తెలంగాణ రవాణా, పోలీసు శాఖలు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు శాఖలు కలిపి రూల్స్ ను అతిక్రమించే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని..నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఎందుకంటే హెల్మెట్, లైసెన్స్ లేకండా బయటకు వస్తే జరిమానా విధించనున్నారు.  లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు హెల్మెట్ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే. ఇక లెసెన్స్ లేనివారు.. ఉండి సస్పెండ్ అయినవారు వాహనాలను నడిపినా శిక్ష అనుభవించాల్సిందే. అంతేకాదు డ్రంకన్ డ్రైవ్‌లో మూడు సార్లకు మించి పట్టుబడిన వారు మళ్లీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్, లైసెన్స్‌తో పాటు ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ జంపింగ్, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహారిస్తామన్నారు. మార్చి 1 నుంచి ఈ చర్యలు అమలుకానున్నాయి. మరి ఇక మీద వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే..

మోడీ జీ.. వాట్ అబౌట్ అమరావతి జీ..

ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగేదేం కనిపించడంలేదు. మొన్నటికి మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిరాశే మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు మొండిచేయి చూపించింది.  అసులు విభజన హామీలో ఉన్న విశాఖ రైల్వే జోన్ గురించి ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు చూస్తుంటే కూడా అలానే కనిపిస్తుంది.   ఒక పక్క ఏపీ సీఎం చంద్రాబబు.. అసలే ఆర్దిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అలాంటి అమరావతికి ఎలాంటి నిధులు కేటాయించలేదు సరికదా.. దాని గురించిన ఊసు కూడా ఎక్కడా ఎత్తలేదు జైట్లీ. ఏపీ అభివృద్దికి పాటుపడుతా.. ఏపీ అభివృద్దికి ఆర్ధికంగా సహాయపడతా అన్న మోడీ ప్రజలకు ఊరించి ఆఖరికి ఏం చేయకుండానే ఈ ఏడాది బడ్జెట్ ను ముగించారు. ఇక ఏదో ఏపీలోని ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా నిధులు ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు ..విజయవాడకు 100 కోట్లు కేటాయించింది.   మరి అసలు ప్రధాని మోడీకి ఏపీ అనే ఒక రాష్ట్రం ఉంది.. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రజలకు రాజధానికి ఏర్పాటు కావాలి.. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి అన్న విషయం అసలు గుర్తుందా అని అనుకుంటున్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ కనీసం ఒక్క వరం కూడా ప్రజలకు ఇవ్వలేదు.. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కూడా అమరావతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఇక ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం జరిగేదెప్పుడూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరాతి విశ్వనగరంగా మారేదెప్పుడూ..తెలుగు ప్రజల కల తీరేదెప్పుడూ..

జగన్ మీటింగ్ కు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా.. గుడ్ బై చెబుతారా..?

ఏపీలో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. నిన్ననే మరో ఎమ్మెల్యే డేవిడ్ రాజు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా వరుస వలసలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవైపు టీడీపీతోనే పడలేకపోవడంతో మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా జగన్ కు తలనొప్పిగా తయారైనట్టు తెలుస్తోంది.   పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్న నేపధ్యంలో జగన్ కాస్త జాగ్రత్తగా ఉంటూ.. పార్టీ నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు పార్టీ నేతలే డుమ్మా కోడుతున్నారు. ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. అందరు ఎమ్మెల్యేలు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాటను పెడచెవిన పెట్టి సమావేశానికి  గైర్హాజరయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలు ఆసక్తికర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పదిమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారా.. అందుకే సమావేశానికి హాజరు కాలేదా అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   అయితే మరోపక్క ఈ ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యక్తిగత కారణాలవల్లే సమావేశానికి రాలేకపోతున్నామని చెబుతున్నారు. కానీ వీరిలో కొందరు మాత్రం పార్టీని వీడటం పక్కా అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

రంగు, రుచి, వాసన లేని బడ్జెట్.. జైట్లీ బడ్జెట్ పై పలువురి స్పందనలు

అందరూ ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు జైట్లీ. అయితే ఇప్పుడు ఆయన వేసిన బడ్జెట్ అకౌంట్స్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్..   అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గ్రామీణ, రైతుల, పేదల బడ్జెట్ గా రాధామోహన్ సింగ్ అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా పేదలు, రైతులు, గ్రామీణులకు పెద్ద పీట వేసిన బడ్జెట్ ఇదని ఆయన అన్నారు. కమల్ నాథ్ దేశ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక సుస్థిరతకు ఏది ఉండాలో అదే బడ్జెట్ లో లోపించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. అరుణ్ జైట్లీ దశ, దిశ లేని బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరీక్ష పాసయ్యారని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా అన్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లబ్ధి ఒనగూరిందని ఆయన అన్నారు. శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏమాత్రం రంగు, రుచి, వాసన లేని అతి సాధారణ బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. యుపిఎ హయాంలోని పలు పథకాలనే మ‌ళ్లీ జైట్లీ పేర్కొన్నారని శశిథరూర్‌ అన్నారు.