జగన్ మీటింగ్ కు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా.. గుడ్ బై చెబుతారా..?
posted on Feb 29, 2016 @ 3:30PM
ఏపీలో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. నిన్ననే మరో ఎమ్మెల్యే డేవిడ్ రాజు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా వరుస వలసలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవైపు టీడీపీతోనే పడలేకపోవడంతో మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా జగన్ కు తలనొప్పిగా తయారైనట్టు తెలుస్తోంది.
పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్న నేపధ్యంలో జగన్ కాస్త జాగ్రత్తగా ఉంటూ.. పార్టీ నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు పార్టీ నేతలే డుమ్మా కోడుతున్నారు. ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. అందరు ఎమ్మెల్యేలు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాటను పెడచెవిన పెట్టి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలు ఆసక్తికర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పదిమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారా.. అందుకే సమావేశానికి హాజరు కాలేదా అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే మరోపక్క ఈ ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యక్తిగత కారణాలవల్లే సమావేశానికి రాలేకపోతున్నామని చెబుతున్నారు. కానీ వీరిలో కొందరు మాత్రం పార్టీని వీడటం పక్కా అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.