రంగు, రుచి, వాసన లేని బడ్జెట్.. జైట్లీ బడ్జెట్ పై పలువురి స్పందనలు
posted on Feb 29, 2016 @ 1:02PM
అందరూ ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు జైట్లీ. అయితే ఇప్పుడు ఆయన వేసిన బడ్జెట్ అకౌంట్స్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్..
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గ్రామీణ, రైతుల, పేదల బడ్జెట్ గా రాధామోహన్ సింగ్ అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా పేదలు, రైతులు, గ్రామీణులకు పెద్ద పీట వేసిన బడ్జెట్ ఇదని ఆయన అన్నారు.
కమల్ నాథ్
దేశ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక సుస్థిరతకు ఏది ఉండాలో అదే బడ్జెట్ లో లోపించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. అరుణ్ జైట్లీ దశ, దిశ లేని బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు.
ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరీక్ష పాసయ్యారని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లబ్ధి ఒనగూరిందని ఆయన అన్నారు.
శశిథరూర్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం రంగు, రుచి, వాసన లేని అతి సాధారణ బడ్జెట్ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. యుపిఎ హయాంలోని పలు పథకాలనే మళ్లీ జైట్లీ పేర్కొన్నారని శశిథరూర్ అన్నారు.