డిప్యూటీ స్పీకర్‌గా మండలి నామినేషన్

  శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మండలి అవనిగడ్డ తెలుగుదేశం శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ వేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు ఉప సభాపతి స్థానానికి నామినేషన్ వేయాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును చంద్రబాబు ఖరారు చేశారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో శాసనసభ వ్యవహారాల మీద మంచి పట్టు వున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను ఉప సభాపతి స్థానానికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 23న మండలి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తారు. డిప్యూటీ స్పీకర్‌గా నామినేషన్ వేసిన అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ మీడియాతో మాట్లడారు. ప్రస్తుతం రాష్ట్రం వున్న పరిస్థితులలో శాసనసభ సమావేశాలు అర్థవంతంగా జరగాల్సిన అవసరం వుందని, అలా జరపడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా, కృష్ణాజిల్లాకు చెందిన మండలి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక అయినందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: వైగో హెచ్చరిక

  తమిళులకు భాషాభిమానం చాలా ఎక్కువ. తమిళ భాషను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో, హిందీని అంతగా ద్వేషిస్తారు. హిందీని తమమీద రుద్దడాన్ని వారు ఎంతమాత్రం సహించరు. అయితే ఈమధ్య ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాడులో పార్టీలకి అతీతంగా అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షాత్తూ బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎండీఎంకే నాయకుడు వైగో కేంద్ర ప్రభుత్వాన్ని హిందీ విషయంలో హెచ్చరించారు. నిద్రపోతున్న సింహాన్ని కదిలించాలని ప్రయత్నించవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరించారు. హిందీని తమపై రుద్దాలన్న నిర్ణయించడాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించదని, గతంలో కూడా రక్తాన్ని ధారపోసి తాము హిందీపై పోరాడామని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టద్దని ఆయన అన్నారు.

ఆర్థరైటిస్ మందులతో అందమైన జుట్టు

  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనేది సామెత. వైద్య శాస్త్రంలో అనేక వింతలు జరుగుతూ వుంటాయి. అలాంటి వింత విషయం ఈమధ్య కొంతమంది అమెరికాకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా మిగలకుండా రాలిపోయే వ్యాధికి గురైన వారికి ఇంతవరకు వైద్య శాస్త్రంలో ట్రీట్‌మెంట్ లేదు. అలాంటి వారు ఇప్పటి వరకూ ఒంటిమీద వెంట్రుకలు లేకుండా జీవించడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయేది. అయితే అలాంటి వ్యాధిగ్రస్తులకు అమెరికా శాస్త్రవేత్తలు మందును కనుగొన్నారు. ఆ మందు మరేదో కాదు.. కీళ్ళనొప్పుల నివారణకు వాడే మందునే ఒక క్రమ పద్ధతిలో వాడటం వల్ల ఒంటిమీద మళ్ళీ జుట్టు మొలిచే అవకాశం చాలా వుందట. దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా వాళ్ళు చేశారు. ఈ వ్యాధికి సంబంధించిన రోగులను ఎంపిక చేసుకుని వారి మీద ఆర్థరైటిస్‌కి సంబంధించిన మందుల్ని ఒక క్రమపద్ధతిలో ఇచ్చారు. ఆశ్చర్యకరంగా వారందరిలో జుట్టుపెరుగుదల కనిపించింది. జీవితంలో దువ్వెన వాడే అవకాశం లేదని బాధపడుతున్న వారందరూ ఇప్పుడు తమ జేబుల్లో దువ్వెనలు మెయిటెయిన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా జుట్టు రాలిపోయే వ్యాధితోపాటు బట్టతల నివారణకు కూడా సరైన మందులు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

  మన పొరుగుదేశం నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ వుండటంతో నేపాల్ పడమర ప్రాంతంలో వున్న గుల్మి జిల్లాలో కొండచరియలు విరిగి ఓ ఇంటిమీద పడటంతో ఆ ఇంటిలో నివసిస్తు్న్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో నలుగురు చిన్నపిల్లలు కూడా వున్నారు. అలాగే నేపాల్‌లోని పైథాన్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నేపాల్‌లో ఇప్పటికే అనేకమంది గల్లంతయ్యారు. వర్షాలు తగ్గుముఖం పట్టాకే ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనాలకి దొరికే అవకాశం వుంది.

ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు థాంక్స్: స్పీకర్ కోడెల

  తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు డాక్టర్ కోడెల శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి వుందని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలోని ప్రతి సభ్యుడి మీద ఆంధ్రప్రదేశ్‌ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత వుందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు చాలా అర్థవంతంగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభాపతి అంటే మోనార్క్ కాదని ఆయన చెప్పరాు. ప్రజా సమస్యలను చర్చించే విషయంలో సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా నూతన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. గతంలో టెంట్ల కింద సమావేశాలను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

వేల కోట్ల అధిపతి.. అనుమానాస్పద మృతి!

      ఆయన పేరు దాది బల్సారా. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వ్యాపారవేత్తల్లో ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాల్లో ఆయన వ్యాపార సంస్థలు వున్నాయి. కానీ, ఆయనకి నా అనేవారు ఎవరైనా వున్నట్టు దాఖలాలు మాత్రం లేవు. ఆయన న్యూఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లోని రూమ్ నంబర్ 901లో 1983 నుంచి ఒంటరిగా వుంటున్నారు. ఆన వ్యాపార సంస్థలన్నిటికీ పర్మినెంట్ అడ్రస్‌ హోటల్లోని ఆ రూమే. వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వ్యాపార సంస్థలు వున్న గురువారం నాడు ఆయన తన రూమ్‌లో చనిపోయి వున్నారు. మంచం మీద పడుకుని వున్న ఆయన అలాగే చనిపోయి పడి వున్నాడు. గత మూడు రోజులుగా ఆయన ఆహారం సరిగా తీసుకోవడం లేదని తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన ఒక సహాయకుడిని పిలిపించుకుని తన అరికాళ్ళకు మసాజ్ చేయించుకున్నారట. తెల్లవారేసరికి డెడ్‌‌బాడీగా మిగిలాడు. తమ హోటల్‌లో గత 31 సంవత్సరాలుగా పర్మినెంట్‌ కస్టమర్‌గా వున్న బల్సారా హఠాత్తుగా చనిపోవడంతో తాజ్ మాన్‌సింగ్ హోటల్ యాజమాన్యం తమ కుటుంబంలో వ్యక్తి చనిపోయినట్టుగా బాధపడుతోంది. అయితే పోలీసులు మాత్రం బల్సారా మరణంపై తమకు తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో వున్నారు.

ఆంధ్రోళ్ళకి బస్సు పాస్‌లు ఇవ్వం!

      ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఎన్నోరకాలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకి అన్యాయం, అవమానాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో అవమానం ఎదురైట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మధిర బస్ డిపో మేనేజర్ సీమాంధ్రకు చెందిన విద్యార్థులకు కళ్ళు తిరిగిపోయే ప్రకటన ఒకటి డిపో నోటీస్ బోర్డులో పెట్టారని సమాచారం అందుతోంది. మధిర డిపోలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే బస్ పాస్‌లు ఇస్తామని, ఆంధ్రోళ్ళకి బస్సు పాస్‌లు ఇవ్వమని ఆ నోటీసులో వుందట. త్వరలో విద్యాసంస్థలు మొదలవుతున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో చదువుకుంటున్న సీమాంధ్రకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఏం చేయాలో పాలుపోకుండా వున్నారు.

రుణాల మాఫీకి మరికొంత గడువు కావాలేమో!

  తెదేపా నారా లోకేష్ నిన్న మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ చేసిన అన్ని ఎన్నికల హామీలను తప్పకుండా అమలుచేస్తామని, ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. అయితే ఆ హామీలన్నిటినీ అమలుచేయడానికి ఐదేళ్ళ సమయం ఉందని, అయితే ప్రభుత్వం అన్ని హామీలను వీలయినంత త్వరగా అమలు చేసేందుకు చాలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తన తండ్రి చంద్రబాబు అధికారం చేప్పట్టిన నాటి నుండి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రోజుకి 20గంటలు పనిచేస్తున్నారని అన్నారు. అయితే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈవిషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేసారు. కుమారుడు లోకేష్ మాటలకు కొనసాగింపులా చంద్రబాబు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన నిన్న మంత్రివర్గ సమావేశం తరువాత తన సహచర మంత్రులతో మాట్లాడుతూ వ్యవసాయ ఋణాలపై ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉందని, ప్రయత్నలోపం లేకుండా చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాని, త్వరలో ప్రధాని మోడీని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన తరువాత ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలను బట్టి చూస్తే వ్యవసాయ రుణాల మాఫీ కోసం ప్రభుత్వం వద్ద ఎటువంటి ఉపాయం లేదని, అందువల్ల రుణాల మాఫీకి మరికొంత సమయం పట్టవచ్చని భావించవచ్చును.

విజ్ఞానజ్యోతి కాలేజీకి హిమాచల్ హైకోర్టు నోటీసు

      హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఇంకా తెలుగు ప్రజల కళ్ళముందు కదులుతూనే వున్నారు. ప్రమాదం జరిగిన పదిరోజులు దాటినా ఇంతవరకూ గల్లంతయిన చాలామంది ఆచూకీ తెలియకపోవడం బాధాకరం. ఇదిలా వుండగా నదిలో గల్లంతు అయిన విద్యార్థులు నదిలోకి దిగడానికి అనుమతి ఎవరు ఇచ్చారో తెలపాలంటూ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యానికి హిమాచల్ హైకోర్టు శుక్రవారం నోటీలసు జారీ చేసింది. మరోవైపు ఈ దుర్ఘటనపై మండి డివిజన్ కమిషన్ నివేదికను హిమాచల్ హైకోర్టుకు అందజేసింది. డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ఆ ప్రమాదానికి ఘటనకు కారణమని డివిజన్ కమిషన్ ఆ నివేదికలో పేర్కొంది.

టీవీ యాంకర్‌కి ప్రియుడి జెల్ల!

      అనగనగా ఓ తెలుగు న్యూస్ టీవీ ఛానల్. ఆ ఛానల్‌లో ఒక న్యూస్ యాంకర్. చాలా అందగత్తె. వార్తలు సూపర్‌గా చదువుతుంది. చాలా తెలివైన అమ్మాయిగా అందరిలోనూ పేరుకూడా సంపాదించుకుంది. ఎంత తెలివుంటే ఏం లాభం? ఓ అబ్బాయి దగ్గర మాత్రం ఆమె తెలివితేటలేవీ పనిచేయలేదు. ఆ అబ్బాయి వేసిన ప్రేమ వలలో చిక్కకుపోయింది. లవ్ అనే ఎదుర్రాయి తగిలి బొక్కబోర్లా పడిపోయింది. ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని సదరు కుర్రాడు టీవీ సీరియళ్ళలో డైలాగ్స్ చెప్పడంతో అడ్డంగా ఫ్లాటైపోయింది. చాలాకాలంగా సహజీవనం చేస్తోంది. లేటెస్ట్.గా ఇక సహజీవనం చాలు పెళ్ళి చేసుకుందామని ప్రపోజల్ పెట్టింది. దాంతో ఆ ప్రియుడు గారు తూచ్ అనేశారు. సహజీవనం వరకు ఓకేగానీ, పెళ్ళంటేనే మండిపోద్దని చెప్పాడు. యా౦కరమ్మడికి కనిపించకుండా మాయమైపోయాడు. దాంతో సదరు యాంకరమ్మ పోలీసులను ఆశ్రయించింది. తన ప్రియుడు తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు చెప్పుకుంది.

డిప్యూటీ స్పీకర్ పదవి కూడా టీడీపీకే?

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి మీద వైకాపా చాలా ఆశలు పెట్టుకుంది. స్పీకర్‌ పదవికి తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి సహకరించినందుకు డిప్యూటీ స్పీకర్ పదవి తమ పార్టీకి దక్కుతుందని వైసీపీ ఎక్కువగా ఆశపడింది. నిన్న మొన్నటి వరకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం న్యాయం అంటూ న్యాయసూత్రాలు కూడా చెప్పింది. అయితే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి వదిలిపెట్టడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది. డిప్యూటీ స్పీకర్ పోస్టు కోసం శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23న ఎన్నిక వుంటుంది. ఇక గొల్లపల్లి సూర్యారావు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం లాంఛనమే. దీంతో వైసీపీ డిప్యూటీ స్పీకర్ కల కల్ల అయిపోయినట్టు భావించవచ్చు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్‌గా కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌లుగా బోండా ఉమ, కోన రవి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

కొత్త పెళ్ళికూతురు జంప్ జిలానీ!

      అమ్మాయిలని పెళ్ళి చేసుకుని, కొంతకాలం ఎంజాయ్ చేసి అబ్బాయిలు జంప్ జిలానీలు అయిపోవడం కామన్‌గా జరుగుతూ వుంటుంది. అప్పడప్పుడు అమ్మాయిలు కూడా ఇలా అబ్బాయిలకి జలక్ ఇస్తూ వుంటారు. అదే వెరైటీ అవుతుంది. ఇలాంటి సంఘటన లేటెస్ట్ గా తమిళనాడులో జరిగింది. అనాథగా నటించి ఒక బకరా కుర్రాడిని పెళ్ళి చేసుకున్న ఓ జాదూ లేడీ పెళ్ళయిన నెల తర్వాత ఇంట్లో నగలు, డబ్బు అంతా మూటగట్టుకుని ఎంజక్కా జంపైపోయింది. సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు ప్రాంతంలో జరిగింది. కవి అనే యువతి తనను తాను అనాథగా చెప్పుకుని ఒక మహిళతో పరిచయం పెంచుకుంది. ఆ మహిళ కవికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. కవి బోలెడంత మంచితనం యాక్ట్ చేసేసరికి ఆమెకి ఆశ్రయం ఇచ్చిన మహిళ ఫ్లాటైపోయింది. తన దగ్గరి బంధువైన ఒక యువకుడికి కవిని ఇచ్చి పెళ్ళి చేసింది. ఒక అనాథ యువతికి జీవితం ఇచ్చానని ఆమె చాలా హ్యాపీగా ఫీలైపోయింది. కవిని పెళ్ళి చేసుకున్న యువకుడు కూడా తాను రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తల కోవలోకి వస్తానని గర్వంగా ఫీలయ్యాడు. ఒక నెలపాటు ఉత్తమ ఇల్లాలిలా కటింగ్ ఇచ్చిన కవి ఓ ఫైన్ నైట్ ఇంట్లో వున్న బంగారం, డబ్బు మొత్తాన్నీ ఊడ్చుకుని జంప్ అయిపోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఎంక్వయిరీ చేసి అసలు విషయం తెలుసుకున్న అందరూ నోళ్ళు తెరిచారు. కవి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంక ఆమె ఎక్కడ దొరుకుతుంది? ఈపాటికి ఎక్కడో మరో బకరాని వెతుక్కునే పనిలో వుండి వుంటుంది.

భీమవరం టీడీపీ ఎమ్మెల్యేకి అస్వస్థత

      పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ ఆవరణలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. ఛాతీలో నొప్పిగా వుందని ఆయన చెప్పడంతో ఆయన్ని హుటాహుటిన బంజారాహిల్స్.లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. పులవర్తి రామాంజనేయులు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు. గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత, ఆంజనేయులు కుమారుడు వెంకట్‌రామ్ ప్రశాంత్‌ల వివాహం గత ఏడాది డిసెంబర్‌‌లో జరిగింది. ప్రస్తుతం పులవర్తి రామాంజనేయులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్టు తెలుస్తోంది.

ఎ.పి. అసెంబ్లీలో వసతులు లేవు: ఎమ్మెల్యే

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు అసెంబ్లీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన సమవేశమందిరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సమావేశమందిరం కేటాయించలేదని ఆయన అన్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సరైన వసతులు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో మంచి అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకుంటామని ఆయన చెప్పారు.

ఆంధ్ర, తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలు

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని  ప్రముఖ మాజీ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ‌ తెలిపారు. అమెరికాలోని డాలస్ లో  జరిగిన నాట్స్ నిర్వహించిన బిజినెస్ సెమీనార్ కు ముఖ్య అతిధిగా విచ్చేశారు.  నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ విజయ్ వెలమూరి  ఈ సెమీనార్ ను ప్రారంభించారు.. గోపాలకృష్ణ‌  నిర్వహించిన పదవులు.. సాధించిన విజయాలను విజయ్ వెలమూరి గుర్తు చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశాలపై గోపాలకృష్ణ‌ సెమీనార్ కు విచ్చేసిన వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు.  ఒక్కో రాష్ట్రంలో ఏయే ప్రత్యేకతలు ఉన్నాయి..? ఏ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలకు ఢోకా ఉండదనే విషయాలను గోపాలకృష్ణ‌  వివరించారు.   తెలంగాణలో పుష్కలమైన అవకాశాలు పది జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయిన గోపాలకృష్ణ‌ వివరించారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. తెలంగాణ జిల్లాల్లో ఖనిజసంపద పుష్కలంగా ఉందని..ఖనిజాధారిత పరిశ్రమలు పెట్టుకుంటే కూడా మంచి లాభాలు వస్తాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గోపాలకృష్ణ‌  చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రయివేట్ విద్యుత్ కంపెనీలను  ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని.. వీటిలో ధర్మల్, సోలార్, విండ్ పవర్ లో  పెట్టుబడులు పెట్టవచ్చని గోపాలకృష్ణ‌  సూచించారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని.. కొత్త ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసే అవకాశముందని తెలిపారు. కాబట్టి  మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చని గోపాలకృష్ణ‌ చెప్పారు..   ఆంధ్రప్రదేశ్ లో అరుదైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుడులు పెట్టేందుకు ఇదే అరుదైన అవకాశమని గోపాలకృష్ణ‌ చెప్పుకొచ్చారు..ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి పన్నుల రాయితీ వస్తుందని..ఇది కొత్త కంపెనీలకు వరంలాంటిదన్నారు. కేంద్రం పన్నుల్లో ముఖ్యంగా ఎక్సైజ్ డ్యూటీ 16 శాతం మినహాయింపు వల్ల.. ఆ మేరకు కంపెనీలు లాభపడినట్టేనని గోపాలకృష్ణ‌ చెప్పుకొచ్చారు.ఇక కొత్త కంపెనీలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా ఉండే అవకాశముందని ఇది కూడా అరుదైన అవకాశంలాంటిదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహముంటుందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి ప్రత్యేక రాయితీలు ఇస్తుందన్నారు. ఏపీలో కూడా విద్యుత్ ప్రాజెక్ట్ల్ ల్లో పెట్టుబడులు పెరిగే అవకాశముంది. ఈ దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆలోచించవచ్చన్నారు. ఇక ఐటీతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయని తెలిపారు..గుజరాత్ తరహాలో ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్లపైగా ఉన్న కోస్తా తీరాన్ని ఉపయోగించుకుని..  పోర్టుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీని వల్ల ఏపీలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పరిశ్రమల్లో పెట్టుబుడులు పెట్టవచ్చన్నారు.

ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి

  నల్లమల అడవుల్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొక మావోయిస్టు గాయాలతో పారిపోయాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్లకు సమీపంలోని అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో జానా బాబూరావుతోపాటు మరో ఇద్దరు మహిళలు విమల, భారతి మరణించారు. విక్రమ్ అనే మావోయిస్టు గాయాలతో తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల క్యాట్‌పార్టీ, ఏఎన్‌ఎస్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. అరగంట సేపు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో మావోయిస్టు సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలంలో నాలుగుకిట్లుతోపాటు ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక ఏకే 47, విప్లవ సాహిత్యం దొరికాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన జానా బాబూరావు ప్రస్తుత కేంద్రకమిటీ అగ్రజుడైన ఆర్కేకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.