మలేసియా విమానం: 10 కిలోమీటర్ల ఎత్తున పేలిపోయింది

  ఉక్రెయిన్ ఉగ్రవాదుల మిస్సైల్ దాడి కారణంగా పేలిపోయిన మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం గురువారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని, సంక్షోభ ప్రాంతమైన దొనెస్క్‌లో ఉన్న షక్తర్క్ పట్టణ పరిసరాల్లోకి రాగానే రాడార్ సంకేతాలకు దూరమైంది. అది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఆ సమయంలో ఆ విమానం ఉక్రెయిన్ గగనతలంపై దాదాపు పది కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తుండగా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో పేల్చేశారని భావిస్తున్నారు. కాలిపోతు న్న శకలాలు, మృతదేహాలు రష్యా సరిహద్దుకు 40 కిమీల దూరంలోని గ్రబావొ గ్రామ సమీపంలో ఒక కిలోమీటర్ వ్యాప్తంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

టీసీని రైల్లోంచి తోసేశారు

  హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. టిక్కెట్ చూపించమని అడిగిన పాపానికి టికెట్ కలెక్టర్ గీతను కొందరు దుండగులు రైలులో నుండి తోసివేశారు. గీతకు తీవ్రగాయాలు అవడంతో ఆమెను వెంటనే సికింద్రాబాద్ మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టికెట్ అడిగినందుకు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో రైలు లింగంపల్లి స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలు బయలుదేరే సమయంలో కొందరు వ్యక్తులను టికెట్ అడగగా వారు ఆమెపై దాడి చేసి రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో గీతకు తీవ్ర గాయలయ్యాయి. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహాత్మాగాంధీ జాతిపిత కాదు: అరుంధతీ రాయ్

  కాంట్రవర్సరీకి కేరాఫ్ అడ్రస్ అయిన అరుంధతీరాయ్ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ఈసారి వీళ్ళనీ వాళ్ళనీ కాకుండా ఏకంగా జాతిపిత మహాత్మాగాంధీనే టార్గెట్ చేసింది. మహాత్మాగాంధీ అసలు జాతిపితే కాదని, ఆయన కులతత్వం ప్రదర్శించారని అరుంధతీరాయ్ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కులతత్వాన్ని ప్రదర్శించిన గాంధీ జాతిపిత హోదాకి అనర్హుడని, ఆ హోదాకు మరొకరిని ఎంచుకోవాలని ఆమె అన్నారు. గాంధీ పేరుతో వున్న యూనివర్సిటీలకు, సంస్థలకు పేర్లు అర్జెంటుగా మార్చేయాలని డిమాండ్ చేశారు. కేరళ యూనివర్సిటీలో ప్రసంగించడానికి వెళ్ళిన అరుంధతీరాయ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ 1936లో రచించిన 'ద ఐడియల్ భంగీ' వ్యాసంలో ఆయన మలమూత్రాదులను పారవేయకుండా, ఎరువుగా మార్చుకోవాలని పాకీ పనివారికి సూచించారని అరుంధతి అన్నారు. గాంధీకి హరిజనులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు.

మలేసియా విమాన ప్రమాదం.. మినిట్ టు మినిట్...

  ఉక్రెయిన్‌లో తీవ్రవాదులు కూల్చిన మలేసియా విమాన ప్రమాద ఘటనలో మినిట్ టు మినిట్ సంఘటనల క్రమమిది... 7:45: ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17(బోయింగ్ 777 రకం)తో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. మొత్తం 295 మందీ చనిపోయి ఉంటారని రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ వెల్లడించింది. 7.45: ఉక్రెయిన్ గగనతలంలో తమ విమానంతో సంబంధాలు కోల్పోయినట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. 7.45: విమానం 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా భూమిపై నుంచి మిసైల్‌తో కూల్చేశారని ఉక్రెయిన్ హోంమంత్రికి సలహాదారుడు ఆంటన్ గెరాషెంకో తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. 7.46: మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చాయని, సమాచారం సేకరిస్తున్నామని బోయింగ్ కంపెనీ ప్రకటించింది. 7.49: మలేసియా విమాన ప్రమాదంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రధాని ప్రకటించారు. 7.50: మలేసియా విమానం కూల్చివేతలో ఉక్రెయిన్ రక్షణ దళాల ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడిని ఉటంకిస్తూ ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ కథనం. 7.50: దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో విమాన శకలాలు పడ్డాయని, దాదాపు వంద వరకు చిధ్రమైన మృతదేహాలు కనిపిస్తున్నట్లు ఘటనా స్థలానికి వెళ్లిన ఎమర్జెన్సీ సహాయక బృందం వెల్లడి. 7.50: అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విషయం తెలిసినట్లు వైట్‌హౌజ్ ప్రకటన 7.53: తక్షణ దర్యాప్తునకు ఆదేశించిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ 7.57: ఉక్రెయిన్ ప్రభుత్వమే విమానాన్ని కూల్చివేసిందని అక్కడి వేర్పాటువాద నేత అలెగ్జాండర్ బోరోదోయ్ ఆరోపణ. ఖండించిన ప్రభుత్వ వర్గాలు. 7.57: ఘటనపై ఉక్రెయిన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపాలని సీనియర్ అమెరికన్ అధికారులను ఆదేశించిన ఒబామా 8.04: మలేసియా విమానాన్ని రెబెల్స్ కూల్చివేశారని ఉక్రెయిన్ సర్కారు ఆరోపణ 8.04: ఈ ఘటనపై ఒబామాతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడి 8.07: మృతులకు బోయింగ్ కంపెనీ సంతాపం. అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటన

నరేంద్రమోడీ విమానం దారి మళ్ళింపు!

  మలేసియా విమానాన్ని ఉక్రెయిన్‌లో ఉగ్రవాదులు కూల్చేసి 295 మంది ప్రయాణికుల మృతికి కారణమైన నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే పలు విమానాలను దారి మళ్ళించి, ఇతర మార్గాల్లోంచి నడుపుతున్నారు. అలా దారి మళ్ళించిన విమానాల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్నన ఎయిర్ ఇండియా వన్ విమానం కూడా వుంది. బ్రెజిల్‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన ఎయిర్ ఇండియా వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో ఆయన విమానాన్ని కూడా వాస్తవానికి ఉక్రెయిన్ మీదుగుండానే నడపాల్సింది. అయితే అధికారులు ప్రధాని విమానాన్ని కూడా మరో మార్గంలో నడిపించారు. గురువారం రాత్రి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నరేంద్రమోడీ ఉక్రెయిన్ విమాన విమాన ప్రమాదం పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

రెండు రైళ్ళు ఢీ: ప్రయాణికుల టైమ్ బాగుంది!

  ఫ్రాన్స్లో ఒకదానికి ఎదురుగా మరొకటి వచ్చిన రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ప్రయాణికుల అదృష్టం బాగుండి ఆ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. 20 మంది ప్రయాణికులు మాత్రమే గాయపడ్డారు. పావు బేయాన్ లైన్లో 178 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ట్రాక్పై 70 ప్రయాణికులతో ఆగి ఉన్న టీఈఆర్ ట్రైన్ను ఢీ కొట్టింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న సమయంలో రెండు రైళ్ళ వేగం చాలా తక్కువగా వున్నందువల్లే జననష్టం జరగకుండా వుందని అధికారులు చెబుతున్నారు.

గర్భిణి అని కూడా చూడకుండా గొంతు కోశాడు!

  మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామంలో వెంకన్న అనే ఒక యువకుడు భార్య, కూతుర్ని దారుణంగా హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకయ్య చేతిలో మరణించిన అతని భార్య నిండు గర్భిణి అని తెలుస్తోంది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె గొంతుకోసి చంపాడు. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక కుమార్తె వుంది. ఆమెని కూడా వెంకన్న చంపేశాడు. మరణించిన బాలిక తన కుమార్తె కాదని వెంకన్న నిరంతరం భార్యని వేధిస్తూ వుండేవాడని తెలుస్తోంది. ఇలాగే భార్య మరోసారి గర్భం దాల్చింది. ఆమె గర్భం దాల్చడానికి కూడా తాను కారణం కాదని వెంకన్న ఆమెని నిరంతరం వేధిస్తూ వుండేవాడని తెలుస్తోంది.

మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పాండా అరెస్ట్... ఒడిషాలో..

  మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పాండాను ఒడిశాలోని గంజాం జిల్లాలో బరంపురం పోలీసులు అరెస్టు చేశారు. సవ్యసాచి పైన రూ.15 లక్షల రివార్డ్ ఉంది. ఒడిశా ఎమ్మెల్యే హక్కా కిడ్నాప్, ఇరాక్ దేశీయుల కిడ్నాప్ కేసులో పాండా నిందితుడు. రెండేళ్ల క్రితం మావోయిస్టులతో విభేదించి బయటకు వచ్చిన పాండా.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్)ని నడుపుతున్నాడు. బరంపుర పట్టణ ప్రాంతంలో అతనిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. అతని నండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. సవ్యసాచి పాండాకు గంజం, కందమాల్, గజపతి, రాయగడ తదితర ప్రాంతాల్లో గట్టి పునాదులు ఉన్నాయి.

ఎంహెచ్ 17 దుర్ఘటన: పతనమైన అమెరికా మార్కెట్లు...

  రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఆంక్షలు విధించిన రోజే మలేసియా విమానాన్ని ఉక్రెయిన్‌లో కూల్చివేశారనే వార్త లు రావడంతో.. అమెరికా స్టాక్‌మార్కెట్లలో దడ పుట్టించింది. డౌజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ సూచీలన్నీ ప్రస్తుత సెషన్‌లో అతి తక్కువ స్థాయిని తాకాయి. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని మెరిడియన్ ఈక్విటీ ఎండీ జోసెఫ్ గ్రెసో మాట్లాడుతూ.. ‘మలేషియా విమానం దుర్ఘటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. గురువారం నాడేఅమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించారు. పలు హెచ్చరికలు కూడా చేశారు. విమానం ఘటన నేపథ్యంలో ఇదో వివాదమయ్యే అవకాశముంది..’ అన్నారు.

ఎంహెచ్ 17 విమానం: మృతుల్లోడచ్ పౌరులే ఎక్కువ

  మలేసియా విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో అత్యధికులు నెదర్లాండ్‌కి చెందిన వారని తెలుస్తోంది. కూలిపోయిన విమానంలో వున్న మొత్తం 298 మంది మరణించారు. వారిలో 154 మంది నెదర్లాండ్ పౌరులు. చనిపోయిన వారిలో 27 మంది ఆస్ట్రేలియా, 23 మంది మలేషియా,11 మంది ఇండోనేషియా, 6 బ్రిటన్, 4 జర్మనీ, 4 బెల్జియం, 3 ఫిలిప్పీన్స్, ఒకరు కెనడా పౌరుడు. అయితే మిగతా 47 మంది మృతులు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని ఇంకా గుర్తించాల్సి వుంది. ఈ దుర్ఘటన గురించి నెదర్లాండ్స్.లోని మలేషియా స్పందిస్తూ, విమాన ప్రమాదం వార్త విన్న వెంటనే తీవ్ర ఆందోళనకు గురయ్యానని అన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ చరిత్రలో ఇది అతి పెద్ద విపత్తు అని డచ్ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టీ వ్యాఖ్యానించారు.

రైతు రుణాలు: జగన్ గడువు గోల!

  వైసీపీ నాయకుడు జగన్‌కి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకం కారణంగానే ఆయన అధికారంలోకి వచ్చారన్న వాస్తవాన్ని గ్రహించలేని జగన్, చంద్రబాబు రైతు రుణ మాఫీ ఇవ్వడం వల్లనే అధికారంలోకి వచ్చారని, తాను రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్లనే ఓడిపోయానని భావిస్తున్నారు. రుణ మాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు ఆర్.బి.ఐ.తో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కొంత జాప్యం జరిగింది. దీనికి సంబంధించిన సానుకూల సందేశాలు కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. అయితే ఈలోపే జగన్‌ ఆగలేక దాంతో రైతు రుణ మాఫీ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తాం. అప్పటికీ పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం. రైతులతో కలసి ఉద్యమిస్తాం’’ అని హెచ్చరించారు.

ఎంహెచ్ 17 ప్రమాదం: సైనికుల విమానం అనుకునే....?

  మలేసియా విమానాన్ని పేల్చేసింది తిరుగుబాటుదారులే అయివుంటారని, అయితే పొరపాటుగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుని ఉంటుందని ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల కమాండర్ ఇగోర్ స్ట్రెల్కోవ్ ప్రకటించారు. ఇటీవలే ఉక్రెయిన్ సైనికులు వెళుతున్న ఓ చిన్న విమానాన్ని కూల్చేశాం. అసలు మా భూభాగం మీదుగా మీ విమానాలు తిరగకుండా జాగ్రత్త వహించండి అంటూ వారికి ఇప్పటికే సూచించాం. అయినా మా భూభాగం మీదుగా వచ్చినందుకే ఆ దాడి చేశాం. తాజాగా భారీ సంఖ్యలో సైనికులను తీసుకెళుతున్నట్లు భావించిన వేర్పాటువాదులు, మలేసియా విమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల కమాండర్ ఇగోర్ స్ట్రెల్కోవ్ ఊటంకిస్తూ సోషల్ మీడియా వెబ్ సైట్ ఒకటి పేర్కొంది.

తల్లికాదు.. మృత్యుదేవత!

  కన్న పిల్లలను కడుపులో పెట్టుకుని దాచుకుని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే మృత్యుదేవతలా మారింది. తన కూతుర్ని, కొడుకుని దారుణంగా గాయపరిచి వారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి తెచ్చింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలోని బళ్లారి జిల్లా సిరిగేరి ప్రాంతంలోని కరూరు గ్రామానికి చెందిన మహేష్, లక్ష్మి దంపతులకు సంసారంలో కలతలు వున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరికీ నిరంతరం గొడవలు జరుగుతూనే వుంటాయి. బుధవారం రాత్రి వీరిద్దరూ పెద్దపెద్దగా అరుచుకుని గొడవపడ్డారు. ఆ తర్వాత మహేష్ బయటకి వెళ్లిపోగానే ఆ తల్లి తన కొడుకు, కూతుర్ని కూరగాయలు కోసే కత్తితో దారుణంగా గాయపరిచింది. పిల్లలు చనిపోయారని అనుకున్న తర్వాత తాను కూడా ఉరి వేసుకుని చనిపోయింది. అయితే భర్త, స్థానికులు ముగ్గుర్నీ హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అయితే లక్ష్మి చనిపోయింది. పిల్లలిద్దరూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

భార్య, కూతుర్ని చంపి.. తాను కూడా...!

  మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. వెంకన్న అనే ఒక వ్యక్తి తన భార్యపై వివాహేతర సంబంధం అనుమానంతో కోపం పెంచుకున్నాడు. చివరికి తన భార్యని, కన్న కూతుర్ని దారుణంగా చంపేశాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురిని వెంకన్న అనే వ్యక్తి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు సంబంధించి స్థానికులను ప్రశ్నిస్తున్నారు. ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

హైటెక్ హైఫై సిటీగా హైదరాబాద్

  హైదరాబాద్ నగరంలో 4జీ ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఐటీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 దశల్లో రూ.4,100 కోట్లతో 4జీ సేవలను అందించాలని నిర్ణయించారు. నగరం చుట్టు పక్కల వైఫై సేవలతో హైఫై నగరంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. మొత్తం 6 కార్పొరేషన్లలో 4జీ సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. 4జీ సేవలను విస్తరించి సెప్టెంబర్ నెలఖారులోగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. 37 మున్సిపాలిటీలు, 220 మండల కేంద్రాల్లో 4జీ సేవలు ఇవ్వాలని అన్నారు. నగరంలో వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబర్ నెలాఖరునాటికి హైదరాబాద్‌ను 4జీ వైఫై నగరంగా మార్చాలని తెలిపారు.

విమాన ప్రమాదం: ఉక్రెయిన్ దర్యాప్తు

  మలేసియాకు చెందిన బోయింగ్ విమానం ఎంహెచ్ 17 ఉక్రెయిన్‌లో కూలిపోయిన సంఘటనపై ఉక్రెయిన్ ప్రభుత్వ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిది. ఈ విమానం క్షిపణి ప్రయోగం కారణంగానే కూలిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం వుంది. ఈ విమానంలో మొత్తం 295 మంది ఉన్నారు. వీరిలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉండగా అందరూ చనిపోయారు. బోయింగ్ 777 విమానం ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఘటనాస్థలిలో శవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూపరులను కలిచి వేసింది. కాగా, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు కీలకస్థావరమైన దోనెత్స్క్ ప్రాంతంలోని షాక్తార్స్క్ పట్టణం వద్దకు రాగానే విమానంతో రాడార్ సంబంధాలు తెగిపోయాయి.

అంబరీష్ రజనీకాంత్‌ని ఇష్యూలోకి ఎందుకు లాగినట్టో?

  కన్నడ నటుడు, కర్ణాటక మంత్రి అంబరీష్ అనారోగ్యం కర్నాటకలో రాజకీయ దుమారం రేగటానికి కారణమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ సింగపూర్‌కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి కాబట్టి ఆ బిల్లును ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వం ఆ బిల్లు మొత్తాన్నీ అణా పైసలతో సహా చెల్లించేసింది. అయితే అంబరీష్ చేసిన బిల్లు ఎంతయ్యా అంటే, అక్షరాలా కోటి పదహారు లక్షలు. అయితే నిబంధనల ప్రకారం ఒక మంత్రి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఏడు లక్షలు మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. మరి అంబరీష్ ఏకంగా కోటి 16 లక్షలు ఖర్చు చేశారని ప్రతిపక్షాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీద విరుచుకుపడుతున్నాయి. ఇదిలా వుంటే ప్రముఖ నటుడు రజనీకాంత్ చెప్పడం వల్లే తాను సింగపూర్ వెళ్ళి వైద్యం చేయించుకోగలిగానని అబరీష్ అమాయకుడిలా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంబరీష్ లాంటి ప్రముఖ నటుడికి, కర్ణాటకలో బోలెడంతమంది అభిమానులు వున్న వ్యక్తికి తన వ్యాధికి ఎక్కడ చికిత్స చేయించుకోవాలో కూడా తెలియదా అనుకుంటున్నారు.

ఉక్రెయిన్‌లో విమాన ప్రమాదం: 295 మంది దుర్మరణం

  మలేషియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 777 విమానం విమానం ఉక్రెయిన్లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం ఉక్రెయిన్లో కుప్పకూలింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా మరణించినట్లు మలేషియా హోం శాఖ తెలిపింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయినట్లు తెలిసిందని, అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ తెలిపింది. రష్యా ప్రయోగించిన క్షిపణి వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని మిసైల్తో కూల్చేసిందన్నారు. గత రెండు వారాల్లో తమ దేశ యుద్ధ విమానాలను కూడా రష్యా కూల్చేసిందని ఆయన వివరించారు. బోయింగ్ 777 గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని అందరికంటే ముందుగా రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాతే మలేషియన్ ఎయిర్ లైన్స్ కూడా నిర్ధారించింది.

రష్యా సరిహద్దు వద్ద కూలిన మలేషియా విమానం

  ఈరోజు సాయంత్రం మలేషియా విమానమొకటి ఉక్రెయిన్-రష్యా సరిహద్దు వద్ద కూలిపోయింది. అందులో 280 మంది ప్రయాణికులు, 15మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. నెదర్ల్యాండ్స్ లో అమెస్టర్ డాంనుండి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరిన ఈ విమానం, రేపు ఉదయం ఆరు గంటలకు మలేషియాలో కౌలాలంపూరు విమానాశ్రయంలో దిగవలసి ఉంది. కానీ రష్యా సరిహద్దులో గల దొంతెస్క్ అనే ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు ఉక్రేన్ దేశ హోంశాఖ అధికారి అంటన్ గెరషేంకో తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు విమానాన్ని 10కిలోమీటర్ల ఎత్తులో ఉండగా బంకర్ నుండి మిసైల్ తో పేల్చివేసినట్లు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు. విమానం కూలిన చోటుకు చేరుకొన్న రాయిటర్స్ విలేఖరి మండుతున్న విమాన శకలాలు, మృత దేహాలు అంతటా చెల్లా చెదురుగా పడిఉన్నాయని తెలియజేసారు. ఈ ప్రమాదంలో ఎవరూ బ్రతికే అవకాశం కనబడటం లేదని ప్రాధమిక సమాచారం.