Read more!

డిప్యూటీ స్పీకర్‌గా మండలి నామినేషన్

 

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మండలి అవనిగడ్డ తెలుగుదేశం శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ వేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు ఉప సభాపతి స్థానానికి నామినేషన్ వేయాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును చంద్రబాబు ఖరారు చేశారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో శాసనసభ వ్యవహారాల మీద మంచి పట్టు వున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను ఉప సభాపతి స్థానానికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 23న మండలి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తారు. డిప్యూటీ స్పీకర్‌గా నామినేషన్ వేసిన అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ మీడియాతో మాట్లడారు. ప్రస్తుతం రాష్ట్రం వున్న పరిస్థితులలో శాసనసభ సమావేశాలు అర్థవంతంగా జరగాల్సిన అవసరం వుందని, అలా జరపడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా, కృష్ణాజిల్లాకు చెందిన మండలి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక అయినందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.