మంగళూరులో యువతిఫై గ్యాంగ్ రేప్.. !

      ఓ యువతిఫై గ్యాంగ్ రేప్ ఘటనకు నిరసనగా ఢిల్లీ నగరం అట్టుడికే విధంగా తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలతో మాకేంటీ అనుకొన్నారు మంగళూరు లోని కొంత మంది యువకులు ! తల్లి తండ్రులు దూరమై ఒంటరిగా జీవిస్తున్న యువతి ఫై సమాజం తలదిన్చుకోనేలా దారుణంగా అత్యాచారానికి ఒడి గట్టారు.   18 సంవత్సరాల ఆ యువతి తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆమె తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. దీనితో ఆమె ఒంటరిగానే జీవన పోరాటం చేస్తోంది. ఆలాంటి దీనావస్థలో ఉన్న ఆ యువతిఫై కొంత మంది స్థానిక యువకులు కన్నేశారు. వారిలో ఓ యువకుడు ఏదో విషయంలో సహాయం చేస్తామంటూ మాయమాటలు చెప్పి ఆమెను ఓ రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను రేప్ చేసాడు.   వారి నుండి తప్పించుకొన్న ఆ యువతి చివరకు రోడ్డు మీదకు వచ్చి, ఓ ఆటోవాలా సహాయం కోరింది. అక్కడా ఆమెది అదే పరిస్థితి. అక్కడ నుండి తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్ళిన ఆ ఆటోవాలా కూడా తన స్నేహితులతో కలిసి ఆమెఫై అత్యాచారం చేసాడు. ఆ తర్వాత ఆమెను కర్ణాటక కేరళ సరిహద్దుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు.   అయితే, ఈ సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుఫై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస రేప్ లు జరిగిన అనంతరం ఫిర్యాదు చేయడానికి కుంబ్లే పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఆ యువతిని పోలీసులు వెళ్లిపొమ్మంటూ గెంటివేసినట్లు సమాచారం. కేవలం 24 గంటల వ్యవధిలో ఒకే యువతిఫై రెండు సార్లు గ్యాంగ్ రేప్ జరిగిన, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఈ నెల 23 న జరిగింది.   ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు స్థానిక మీడియా ప్రతినిధులతో కలిసి పోలీసులను నిలదీసిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆటోవాలాను పట్టుకొన్న పోలీసులు అతడిఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించేసరికి అతడు ఇచ్చిన వివరాలతో మిగిలిన ముగ్గురిని పట్టుకొన్నారు. ప్రస్తుతం ఆ యువతిఫై మొదటగా అత్యాచారం చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.   ఆ యువతి ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

లోకేష్ ఈ దూకుడేలా?

  ఇంతవరకూ తెరవెనుకే ఉండి తెలుగుదేశంపార్టీ కోసం ప్రణాళికలు సిద్దం చేస్తూ ఉండిపోయిన ఆ పార్టీ నవతరం నాయకుడు నారాలోకేష్ ఇప్పుడు క్రమంగా తెరముందుకి వస్తూ, గత కొంతకాలంగా పార్టీ కార్యకర్తలతో, నాయకులతో కలిసి మీడియా ముందు తరచూ కనబడుతున్నాడు. అంతే గాకుండా ట్వీటర్ వంటి సామాజిక నెట్ వర్క్ ల ద్వారా తన పార్టీ ప్రత్యర్దుల మీద వ్యంగాస్త్రాలు సందిస్తూ, నెట్-యువతని తమపార్టీ వైపు ఆకర్షించగలుగుతున్నాడు. మొన్న వై.యస్సార్. పార్టీని విమర్శిస్తూ, “ఆ పార్టీ వాళ్ళు ఎంత సేపు జగన్ బెయిలుపై తప్పక బయటకి వస్తాడని చెపుతున్నారు తప్ప నిర్దోషిగా విడుదలయి బయటకి వస్తాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు?” అని వ్రాసి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకొన్నాడు. అయితే, ఈ రోజు అతను తెరాస నేత హరీష్ రావును లక్ష్యం చేసుకొని వ్రాసిన మెసేజ్, అతనిలో బలాన్ని, బలహీనతనీ కూడా బయట పెట్టింది అని చెప్పవచ్చును.   ఎప్పుడో ఏడాది క్రితం హరీష్ రావు సిద్దిపేటలో మీడియావారికి ఇచ్చిన స్టేట్మెంట్ ను ఉటంకిస్తూ ఇప్పుడు సమయం, సందర్బం చూసుకొని ఆ విషయాన్ని ఆయనకి గుర్తు చేస్తూ ‘మీ ప్యూను ఉద్యోగం దరఖాస్తుకోరకు మా తెలుగుదేశంపార్టీ ఎదురుచూస్తోంది. ఎప్పుడు దరఖాస్తు చేసుకోబోతున్నారు? అని వ్యంగంగా అడిగి, తానూ తన విరోధిపార్టీల నేతలని, వారి కార్యక్రమాలని నిశితంగా గమనిస్తూనే ఉన్నానని, పార్టీ భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడే ఇతర పార్టీల ప్రతీ స్టేట్మెంటుని రికార్డు చేసుకొంటూ, వాటినే తన ఆయుధాలుగా అవసరమయినప్పుడు తీసి వాడగలనని తన తాజా మెసేజ్ ద్వారా రాజకీయ వర్గాలకి తెలియజేయగలిగేడు. మున్ముందు మరింత రాజకీయ పరిణతిని చూపించగల సత్తా ఉన్నవాడిగా లోకేష్ తనను తానూ నిరూపించుకోగలిగేడు.    ఈ ఏడాది జనవరి నెలలో సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెరాస నేత హరీష్ రావు, తెలుగుదేశం పార్టీకి సవాలు విసురుతూ ‘చంద్రబాబు గానీ హోం మంత్రికి తానూ తెలంగాణాకి అనుకూలమని తెలియజేస్తూ లేఖ వ్రాసినట్లయితే, తానూ తెలుగుదేశం పార్టీలో ఆఫీసుబోయ్ గా పనిచేసేందుకు కూడా సిద్దం అని, దమ్ముంటే చంద్రబాబు ఆవిధంగా లేఖ వ్రాయగలరా? అని సవాలు విసిరేరు హరీష్ రావు. ఈ రోజు డిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు హరీష్ రావు కోరినట్లే వ్రాసి హోంమంత్రికి లేఖ ఇచ్చేరు గనుక, హరీష్ రావు తన మాట నిలబెట్టుకోవాలని ట్వీటర్ లో మెసేజ్ పెట్టాడు లోకేష్.    అందుకు తెరాస నేత కే.తారకరామారావు కొంచెం ఘాటుగా ప్రతిస్పందించగా, హరీష్ రావు మాత్రం ‘లోకేష్ తన మాటల్లో అర్దాన్ని పట్టుకోన్నాడే తప్ప, దాని సారాoశం మాత్రం గ్రహించలేకపోయడని నిశితంగా విమర్శించారు. చంద్రబాబే గనుక ఇప్పటికయినా ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలని స్పష్టంగా ప్రకటించినట్లయితే తానూ ఇప్పటికీ తనమాటకు కట్టుబడి ఉన్నానంటూ’ జవాబిచ్చి, బంతిని లోకేష్ కోర్టులోకి నెట్టేసి ‘ఏమి చేయమంటావో నువ్వే చెప్పు?’ అని ఎదురు ప్రశ్నించాడు.   మీ తండ్రి చంద్రబాబుచేత ‘తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలని’ అందరి ముందూ స్పష్టమయిన ప్రకటన చేయించినట్లయితే తన మాటని తప్పక నిలబెట్టుకొంటానని మరోమారు తెలియజేసి హరీష్ రావు తన రాజకీయపరిణతిని ప్రదర్శించడం ద్వారా లోకేష్ ట్వీటర్ లో పెట్టిన మెసేజ్ ను ఒక చవకబారు ప్రయత్నంగా మలచగలిగేరు. రాజకీయ విశ్లేషకు సైతం హరీష్ రావునే సమర్దించడం చూసినట్లయితే, లోకేష్ ఇకముందు తమ రాజకీయ ప్రత్యర్దులను ఎదుర్కోదలిస్తే, అతను మరికొంత రాజకీయ పరిణతి కనబరచాలని అర్ధమవుతోంది. రాజకీయంగా తమ పార్టీ ప్రత్యర్దులను తన వ్యాక్యాలతో చక్కగా ఇరికించానని తానూ అనుకొంటునపటికీ, హరీష్ రావు వంటి సీనియర్ నేతలతో వ్యవహరించేటప్పుడు, మరింత అప్రమత్తంగా వ్యహరించాలని లోకేష్ గ్రహించాలి.    రాజకీయాలలో కొత్తగా అడుగుపెడుతున్నపుదు చాలా సంయమనం పాటిస్తూ ఆచితూచి మాటలు ఉపయోగించగలిగినప్పుడే ఒక మంచి నాయకుడిగా ఎదగగలుగుతాడు. సిద్దాంతపరంగా అతను ఎన్ని విమర్శలు చేసినా పరువాలేదు గానీ, వ్యక్తిగతంగా చేస్తే మాత్రం నలుగురిలొ నగుబాటు తప్పదు. అలాగ నవ్వులపాలయిన వారిలో పిసిసి అధ్యక్షుడు బోత్ససత్యనారాయణ మొదలుకొని, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీ వరకు చాలా మందే ఉన్నారు. అందువల్ల, తనలో ఎంత ఆవేశం, ఆలోచన ఉన్నపటికీ దానిని అదుపులో ఉంచుకొంటూ ప్రతిస్పందిస్తేనే హుందాగా ఉంటుంది లోకేష్ కి.

రాయలసీమ గ్యాంగ్ రేప్ అన్న బైరెడ్డి

    రాజకీయ నాయకుల చేతుల్లో రాయలసీమ ప్రాంతం గ్యాంగ్ రేప్ కు గురయిందని ప్రత్యెక రాయలసీమ రాష్ట్రం కోసం తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వచ్చిన బైరెడ్డి రాజ శేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లు రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా, నోరు మెదపడం లేదని ఆరోపించారు.   తెలంగాణా ఇప్పటికే నిర్ణయం అయిపోయిన అంశమని బైరెడ్డి అన్నారు. తమ ప్రాంత పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఎన్నిక కావడం వరకే రాయలసీమను ఉపయోగించుకొంటారని, దోచుకునేందుకు మాత్రం సమైక్యాంధ్ర కావాలని కోరుతుంటారని దుయ్యబట్టారు. రాయలసీమ భూభాగం కొంచేమేమని, ఆంధ్ర ప్రదేశ్ అయితే ఎక్కువ భూభాగం కలిగిఉంటుంది కాబట్టి దోచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తమ నేతలు భావిస్తున్నారని బైరెడ్డి అన్నారు.   ఎన్నికల్లో సీమను వాడుకొంటున్న వారు అసలు సీమ నేతలేనా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంతంఫై అభిమానం లేనందుకు సిగ్గుపడాలని ఆయన సీమ నేతలకు హితబోధ చేశారు.

సీల్డ్ కవరులో ఏముందీ? బాబు మనసులో ఏముందీ?

     అఖిలపక్షసమావేశంలో తెలంగాణా అంశంపై తమపార్టీ అభిప్రాయం కుండబద్దలుకొట్టినట్లు చెప్తామని ప్రజలని ఇంతవరకూ ఊరించి, ఊరించి చంపిన చంద్రబాబు మనసులో ఏముందో తెలుసుకోవాలంటే, ఈ రోజు తెలుగుదేశంపార్టీ తరపున వెళ్ళిన ఇద్దరు ప్రతినిధుల ద్వారా సీల్డ్ కవరులో హోంమంత్రి షిండేకి ఇచ్చిన లేఖని, అక్కడ సమావేశంలో ఆ పార్టీ ప్రతినిధులు ఏమి చెప్పారో అనే విషయాన్నీ కలిపి చూసినట్లయితే, చంద్రబాబు (తెలుగుదేశం పార్టీ) మనసులో మాట స్పష్టంగా అర్ధం అవుతుంది.     తన లేఖలో స్పష్టంగా తెలంగాణ ఇవ్వమని గానీ వద్దని గానీ వ్రాయకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్నముఖ్యమంత్రుల అసమర్ధ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్తితుల వల్ల రాష్ట్రం నష్టపోతున్న తీరు వగైరా వగైరాలనే వ్రాసుకొచ్చి, చివరాఖరిగా రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయం తెలుసుకోవాలంటే ‘రిఫెర్ అవర్ లెటర్ డేటెడ్’ అంటూ తానూ కేంద్రానికి 2008లోనే వ్రాసిన లేఖ చూసుకొని అర్ధం చేసుకోండని ముగించారు. అంతేతప్ప, నాలుగు ముక్కల్లో తెలంగాణా ఇవ్వాలా వద్దా అని మాత్రం స్పష్టంగా వ్రాయలేదు.   అయితే, తమ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటునే కోరు కొంటోందని లేఖలో అస్పష్టంగా వ్రాసినప్పటికీ, తరువాత మాట్లాడిన ఆ పార్టీ ప్రతినిధి కడియం శ్రీహరి ద్వారా తెలుగుదేశంపార్టీ అభిప్రాయాన్ని నిర్ద్వందంగా తెలియజేసారు.   అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా వెళ్ళిన ఇద్దరిలో ఎనమల రామక్రిష్ణుడు పార్టీ వ్రాసిన లేఖని హోంమంత్రికి షిండేకి అందజేసిన తరువాత, తమ పార్టీ అభిప్రాయాన్ని తమపార్టీ మరో ప్రతినిధి కడియం శ్రీహరి తెలియజేస్తారని చెప్పి కుర్చోన్నతరువాత, కడియం శ్రీహరి “తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని తమ పార్టీ కోరుకొంటున్నట్లు విస్పష్టంగా సమావేశంలో ప్రకటించడం ద్వారా, చంద్రబాబు(తెలుగుదేశం పార్టీ) మనసులో మాటని బయట పెట్టారు. అందుకు ఎనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలుపకపోవడమే అది పార్టీ యొక్క ఏకగ్రీవ అభిప్రాయమని తెలియజేస్తోంది.   అయితే, మరి కర్ర విరగకుండా పాము చావకూడదన్నట్లు చంద్రబాబు వ్రాసిన ఈ లేఖ ఎందుకంటే, అయన ఇప్పటికే తెలంగాణా ప్రాంతాలలో ప్రజలతో చెపుతున్నట్లు పార్టీ అధినేతగా రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నంగానే చూడాల్సి ఉంది.   ఏమయినప్పటికీ, చంద్రబాబు తన స్వహస్తాలతో వ్రాసి సంతకం చేసిన లేఖ నఖలు ఇదిగో: దానిని మీరే స్వయంగా చదువుకొని మీకు తోచిన లేదా నచ్చిన భాష్యం చెప్పుకోండి.  

హల్లో హరీష్, అటెండర్ పోస్టు రెడీ : లోకేష్

      ఈ ఏడాది ప్రారంభంలో తన తండ్రి, తెలుగు దేశం అధినేత నారా చంద్ర బాబు నాయుడుఫై టిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన కామెంట్ కు నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తెలంగాణా ప్రత్యెక రాష్ట్రానికి అనుకూలంగా చంద్ర బాబుతో చిదంబరానికి లేఖ రాయిస్తే, తెలుగు దేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ ఉద్యోగం చేస్తానని హరీష్ రావు తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు దేశం నేతలకు గత జనవరి 13 న సవాల్ విసిరిన విషయం తెలిసిందే.   ‘హరీష్, ఎన్టీఆర్ భవన్ లో అటెండర్ పోస్టు విషయంలో మీ నుండి అప్లికేషన్ కోసం ఎదురుచూస్తున్నాం. అలాగే, కెటిఆర్, మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారు?’ అని లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు.   తాజాగా, తెలంగాణాకు అనుకూలమని టిడిపి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కు లేఖ ఇచ్చిన నేపధ్యంలో లోకేష్ ఈ కామెంట్ చేయడం సంచలనం కలిగించింది. తెలంగాణా రాష్ట్రాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని ఈ రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో చెప్పామని లోకేష్ అన్నారు. ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్లో అటెండర్ పోస్టు హరీష్ కోసం రిజర్వ్ చేసి పెట్టామని, ఇక ఆయన అప్లికేషన్ కోసం మాత్రం వేచి చూస్తున్నామని లోకేష్ చురకలంటించారు.   అలాగే, చంద్ర బాబు ఇలా చేస్తే తాను తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని టిఆర్ఎస్ నేత కె.తారక రామారావు గత ఫిబ్రవరి 10 న ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలకు కూడా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ లోని అదే కామెంట్ లో తగిన ఘాటు సమాధానం ఇచ్చారు.   లోకేష్ తాజా వ్యాఖ్యలకు హరీష్ నుండి ఇంకా ప్రతిస్పందన రాలేదు. అయితే, లోకేష్ ఈ వ్యాఖ్యలు కాస్తంత రాజకీయ అలజడి చేసే అవకాశం ఉందని మాత్రం రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అందరి అభిప్రాయాలు విన్నాం : షిండే

      తెలంగాణా విషయాన్ని చర్చించేందుకు ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యి తమ పార్టీల వాణిని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ముందు వినిపించారు.   ఈ సమావేశం ముగిసిన అనంతరం షిండే విలేఖరులతో మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను విన్నామని, ఈ విషయంలో నెల రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. అంత వరకూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా యువత, సంయమనంతో ఉండాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకొంటామని షిండే అన్నారు.   ఆయా పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేంద్రానికి తెలియచేస్తానని షిండే అన్నారు. సమావేశమంతా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన అన్నారు. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయాన్ని చర్చించేందుకు ఇదే చివరి అఖిల పక్ష సమావేశమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణాఫై కేంద్రం నిర్ణయం ఉంటుందని అన్న షిండే సమావేశంలో వివిధ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.

ఎన్టీఆర్ కు తీరని అవమానం !

    ఎన్టీఆర్, ఈ పదం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయనను తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. తెలుగు ప్రజలకు ఆయన ఆరాధ్య దైవం. తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియ చెప్పిన గొప్ప వ్యక్తిగా ఆయనను తెలుగు ప్రజలు చిర కాలం గుర్తు పెట్టుకుంటారనడంలో రాష్ట్రంలో, బహుశా దేశంలో కూడా, ఎవరికీ ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు.   అలాగే, తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అన్ని పౌరాణిక పాత్రల్లో నటించి రాముడంటే ఎన్టీఆరే, కృష్ణుడంటే ఎన్టీఆరే అని గుర్తువచ్చేలా తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోయారు. అంతే కాదు, ఆయనను తెలుగు ప్రజలు మూడు సార్లు ముఖ్య మంత్రిగా ఎన్నుకొన్నారు. తెలుగు గడ్డ మీద ప్రతి పేదవాడికి ఉపయోగపడే అనేక పధకాలను ప్రవేశపెట్టి వారికి దేవుడిగా గుర్తించబడ్డ వ్యక్తి,   అవినీతి మచ్చలేని నాయకుడు. ఇలా సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి, తెలుగేతర ప్రాంతాల్లో తెలుగు వాడివేడిని చాటి చెప్పిన వ్యక్తి ఆయన. అన్నగారుగా తెలుగు ప్రజలచే కీర్తించబడే అరుదైన వ్యక్తి ఎన్టీఆర్.   రాజకీయాలకు అతీతమైన గొప్ప వ్యక్తి ఆయన. ఆ నట సార్వభౌముడికి మాత్రం ప్రపంచ మహా సభల్లో తీరని అవమానం జరిగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన తెలుగు జాతికి పెద్దగా చేసిన సేవలేమీ లేవనే విధంగా వ్యవహరించింది. నిన్న తిరుపతిలో అత్యంత అట్టహాసంగా ప్రారంభం అయిన నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించకుండానే తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి.   ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో అన్నమయ్య, పి.వి.నరసింహా రావు, నీలం సంజీవ రెడ్డి, వెంగమాంబ, పింగళి వెంకయ్య, శంకరంబాడి సుందరాచార్య, జి.ఎం.సి.బాలయోగిల పేర్లను ప్రస్తావించారు. అయితే, తాను నిర్వహిస్తున్న పదవిలో మూడు సార్లు కూర్చున్న ఎన్టీఆర్ మాత్రం ఆయనకు గుర్తుకు రాలేదు !   ఆలాంటి గొప్ప తెలుగు వ్యక్తిని, అదీ తెలుగు మహా సభల్లో స్మరించుకోవడంలో కూడా కుళ్ళు రాజకీయాలు చోటు చేసుకోవడంఫై ఎన్టీఆర్ అభిమానులతో పాటు, తెలుగు భాషాభిమానులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చివరకు, సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖుల ఫోటో ఎక్జిబిషన్ లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోను కనిపించీ కనిపించకుండా ఏర్పాటు చేసి, ఆయన ముఖం కనిపించకుండా చేశారు.

‘వైఎస్ మనుషులందరిపైనా ఏసిబి దాడి చేయాలి’

        దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి హయాంలో కీలక పదవుల్లో ఉన్నవారందరిఫైనా ఏసిబి దాడులు చేయించాలని, వారి ఆస్తులఫైన విచారణ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.   రాజ శేఖర రెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో సభ్యునిగా నియమితులైన రిపున్జయ్ రెడ్డి నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారని ఆయన ఆరోపించారు. అలాగే, వైఎస్ పాలనలో ముఖ్య పదవుల్లో ఉన్న అధికారులఫైన కూడా కన్నేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.   ప్రభుత్వ భూములను కాపాడాల్సిన హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ ప్రైవేటు వ్యక్తులకు సహకరించిన విషయంలో ప్రభుత్వానికి నివేదిక అందినప్పటికీ చర్య ఎందుకు తీసుకోలేదని విహెచ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుంటే నిలదీస్తాం: యనమల

      తెలంగాణపై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరుపున ఎవరు వెళ్ళాలన్న విషయం పై కరీంనగర్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో ఇరు ప్రాంతాల పొలిట్ బ్యూరో సభ్యులు సుదీర్ఘ౦గా చర్చించిన తరువాత ఓ నిర్ణయానికోచ్చినట్లు తెలుస్తోంది.   చర్చ అనంతరం యనమల మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేత ప్రతినిధిగా యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుండి కడియం శ్రీహరిలు అఖిల పక్ష సమావేశానికి వెళ్లనున్నట్లు చెప్పారు. తాము కొన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించామని, తామిద్దరం ఒకే అభిప్రాయాన్ని చెప్తామని, అదే సమావేశంలో కాంగ్రెసు పార్టీ వైఖరిపై తాము నిలదీస్తామన్నారు. తమ పార్టీ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ రూపంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందజేస్తామన్నారు. 2008లో రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఆ లేఖను వెనక్కి తీసుకోలేదన్నారు. అఖిల పక్ష సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెసు అభిప్రాయం చెప్పకుంటే అన్ని పార్టీలు నిలదీయాలన్నారు.

ఇంకా తేలని కాంగ్రెస్ ప్రతినిధులు !

        తెలంగాణాఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి ఇంకా సరిగ్గా ఒక్క రోజు మాత్రమే ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నుండి హాజరయ్యే ప్రతినిధుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. బిజెపి, టిఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం లు ఇప్పటికే తమ ప్రతినిధుల పేర్లను ఖరారు చేసాయి.   కాంగ్రెస్ పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, సురేష్ షెట్కార్ వెళ్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆరుగురు పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్ర నుండి మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, శాసన మండలి సభ్యుడు చెంగల్రాయుడు, పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణా ప్రాంతం నుండి మాజీ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవిల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.   తమ ప్రతినిధులుగా ఎవరిని పంపాలనే విషయాన్ని చర్చించడానికి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో మూడు ప్రాంతాలకు చెందిన నేతలతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం వర్గాలు ఈ నేతలందరికీ ఫోన్లు చేసి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.

సమైఖ్యాంధ్ర కోసం ఆత్మహత్యలు వద్దు : కావూరి

        సమైఖ్యాంధ్ర కోసం తెలంగాణా విద్యార్దుల్లాగా ఆత్మహత్యలు వద్దని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆంధ్ర ప్రాంత విద్యార్దులకు సూచించారు. తెలంగాణా వాదంతో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.   కెసిఆర్ ఉద్యోగులు, విద్యార్దుల ఆత్మహత్యలను పెట్టుబడిగా పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారని సమైఖ్యాంధ్ర ఉద్యమంలో ఈ మధ్య చురుగ్గా పాల్గొంటున్న కావూరి అన్నారు. ఈ రెండు తరహాల వ్యక్తులు లేకపోతే అసలు తెలంగాణా ఉద్యమం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న నెల్లూరులో జరిగిన సమైఖ్యాంధ్ర విద్యార్ది జెఎసి సమావేశంలో మాట్లాడుతూ కావూరి ఈ వ్యాఖ్యలు చేశారు.   పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై కూడా విమర్శలు చేశారు. కేంద్రంలో సమర్ధవంతమైన ప్రభుత్వం లేక పోవడంవల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కావూరి అన్నారు. రేపు జరిగే అఖిల పక్ష సమావేశం కేవలం కాలయాపన కోసమేనని, ఈ సమావేశం ఆధారంగా ఎలాంటి నిర్ణయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.   తెలంగాణా కు అనుకూలంగా కేంద్రం ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని, అందువల్ల విద్యార్దులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన వారికి సూచించారు. ఒకవేళ తెలంగాణా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిస్తే, సమైఖ్యాంధ్ర నేతలు ప్రాణ త్యాగాలకు కూడా సిద్దంగా ఉన్నారని, విద్యార్దులు మాత్రం సంయమనం పాటించాలని కావూరి వారితో అన్నారు.

ఇంకెన్నాళ్ళీ జైలు బ్రతుకు?

  అంతవరకూ భోగభాగ్యాలనే తప్ప జైలు జీవితం కలలోకూడా ఊహించుకొని వై.యస్.జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో మొట్టమొదటిసారి అడుగుపెడుతున్నపుడు, అతని లాయర్లూ, శ్రేయోభిలాషులూ కూడా ‘మాహా అయితే ఒకట్రొండు నెలలలో మీరు బయటకి వచ్చేస్తారంటూ’ దైర్యం చెప్పి ఆయనని లోపలి సాగనంపక తప్పలేదు. జగన్ కూడా అలాగే అనుకొన్నపటికీ ఆరునెలలు గడిచిపోయినా, ఇంతవరకూ బెయిలు రాలేదు. పైగా వరుసపెట్టి పంపిస్తున్న తన బెయిలు దరఖాస్తులన్నిటినీ క్రింద నుండి పై వరకూ అన్నికోర్టులూ కూడా ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాయి. తాజాగా హైకోర్టు ఆయన బెయిలు వినతిని వచ్చేనెల నాలుగో తేదీకి వాయిదా వేసింది.   ఇది సరిపోనట్లు, మరో వైపు ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ జగన్ పై దూసేందుకు తమ కత్తులు పదును పెట్టుకొంటున్నట్లు సమాచారం. ఒకవేళ సి.బి.ఐ. కేసుల్లోంచి జగన్ ఎప్పటికయినా బయటపడగలిగినా, ఆ తరువాత తమ విచారణ కార్యక్రమం మొదలుపెట్టే ఆలోచనతో ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ ఉన్నట్లు సమాచారం. అంటే, జగన్కి ఇప్పట్లో జైలు జీవితం నుండి విముక్తికి అవకాశం లేనట్లే కనిపిస్తోంది. జగన్కి తన పరిస్తితి దాదాపు అర్దమయినందున, నిరాశా నిస్పృహలలో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది. అది అసహనంగామారి, తనను కలువవస్తున్న తన ఆత్మీయులపైన, పార్టీ నేతలపైన ఆ కోపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, గత కొంత కాలంగా అతని కుటుంబ సభ్యులు తప్ప, అతని పార్టీ నేతలెవరూ జైలుకి రావడానికి భయపడుతున్నారని తెలుస్తోంది.   ఈ నేపద్యంలో జగన్ తమ లాయర్లను మార్చితే ఏమయినా ప్రయోజనం ఉంటుందా అని అడిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా, కేంద్రాన్ని ఒప్పించేందుకు ఏమయినా అవకాశాలు ఉన్నాయా అని కూడా అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడగకపోయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ది ప్రణబ్ ముఖర్జీగారికే ఓటువేసి కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఏమి ఫలితాన్ని ఈయలేకపోయాయి. పైగా, చాలా స్ట్రిక్టు ఆఫీసరు అని పేరుమోసిన కృష్ణం రాజుని జైళ్ళశాఖ ఐ.జి.గా నియమించి, జైల్లోపల అన్ని చోట్లా సిసి కెమెరాలు పెట్టిన్చినట్లు సమాచారం. తద్వారా, జగన్ని కలవడానికి ఎవరెవరు, ఎన్నిసార్లు వస్తున్నారు, వారేమి మాట్లాడుకొంటున్నారు వంటి ప్రతి చిన్న విషయం కూడా సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘావర్గాలకి తెలుస్తుండటంతో, ఆ భయంతో పార్టీ వారు జగన్ని కలిసేందుకు వెనకడుగు వేస్తున్నారని ‘ములఖాత్’ రిజిస్టర్ర్ లో నానాటికీ తగ్గుతున్న ఎంట్రీల ద్వారా తెలుస్తోంది.   ఇక, నయాన్న విననప్పుడు భయాన్నైన లొంగదీసే ప్రయత్నంలోకొన్ని నెలలక్రితం తన సాక్షి మీడియా ద్వారా సిబి.ఐ. జే.డి. లక్ష్మి నారాయణ యొక్క ఫోన్ కాల్స్ లిస్టు ప్రచురించి లొంగ దీయాలని చూస్తె, అది కాస్తా వికటించి, అయనను మరింత రెచ్చగొట్టినట్లయ్యి, తమ ఉచ్చును తామే బిగించుకొన్నట్లయింది. కోర్టులు కూడా సి.బి.ఐ. అన్ని కేసుల విచారణ ముగించేవరకూ బెయిలుకోసం రాకుండా ఉంటె మంచిది అన్నట్లు సలహా కూడా ఇవ్వడంతో జగన్ ఇప్పడు మరో మూడు, నాలుగు నెలలు చంచల్ గూడా జైల్లో గడిపేందుకు మానసికంగా సిద్దమయినట్లు తెలుస్తోంది.

తెలంగాణా నేతల చెవుల్లో బొత్స పూలు పెడుతున్నడా?

  పిసిసి అధ్యక్షులవారు బొత్ససత్యనారాయణగారు ఈమద్యన ఎందుకో మాటిమాటికీ నాలిక్కరుచుకోవలసివస్తోంది. మొన్న “అలాగా ఆడోల్లు అర్దారాతిరి, అపరాతిరీ అని సూడకుండా రోడ్డేకేస్తే అలా కాక మరేటవుద్దీ?” అని మహిళలకు హితబోదచేయబోతే, వాళ్లతోబాటు ప్రజలందరూ కూడా కోర్రుగాల్చి వాతపెట్టినంత పనిచేసాక “నా ఉద్దేశ్యం అది కాదూ...” అంటూ మళ్ళీ ఏదో సంజాయిషీ చెప్పుకోక తప్పలేదు వాళ్ళందరికీ.   ఆయన నిన్నమొన్నటి వరకు కూడా “హిందీ మాట్లాడే వాళ్ళకి పదిరాష్ట్రాలుంటే తప్పు లేనిది మనకి రెండుంటే తప్పేలా అవుతుంది?” అని అడిగినవారిని, అడగనివారినీ కూడా ప్రశ్నిస్తూ ‘ఓల్ సీమంధ్ర’ మొత్తానికి తానొక్కడే తెలంగాణా మద్దతుదారునని డప్పేసుకొని మరీచాటించుకొంటూ, తెల్లరిలేస్తే కాంగ్రెస్ ని బండబూతులు తిట్టే కేసిర్ వంటి శత్రువుల చేతకూడా సాహ్బాష్! అనిపించుకొంటూ పిసిసి అద్యక్షపదవిలో నల్లేరు మీద నావలా ఎవరివల్లా ఇబ్బంది పడకుండా ఇంతకాలం హాయిగా కాలక్షేపం చేసేసారు.   అయితే, మరో రెండు రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఉండగా ఆకస్మాతుగా జ్ఞానోదయం అయినట్లుగా, “అసలు రాష్ట్రం విడిపోవడం కన్నా కలిసి ఉండటమే మంచిదని నా అభిప్రాయం,” అని పత్రికలవారికి పిలిచి మరీ శలవిచ్చేరు. అది తెలిసిన తోటి తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తదితరులు ఆయన మీద కలిసికట్టుగా దండెత్తేసరికి మళ్ళీ మాటమారుస్తూ “అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప మరోటి కాదు. మా అమ్మ సోనియమ్మా ఎలాచెపితే అలానే నడుచుకొంటాము. నాకేమీ అభ్యoతరాలు ఉండవు.”అని అన్నారు.   అది సరే, నిన్నమొన్నటి వరకు తెలంగాణా ఇస్తే తప్పేమిటీ? అన్న మనిషి ఇప్పుడు ‘కలిసి ఉంటె కలదు సుఖమూ’ అని కొత్తపల్లవి ఎందుకు అందుకొన్నట్లో? అంటే, ఇంతకాలం తానూ పిసిసి అద్యక్షపదవిలో ఉండగా తన తెలంగాణానేతల వల్ల ఏఇబ్బందీ రాకూడదనే దురాలోచనతో అలా వాళ్ళ చెవుల్లో పూలు పెట్టుకొంటూ పోయారా? లేక అధిష్టానం మనసులో మాటని తన నోటితో పలుకుతున్నారా? ఆయనే చెప్పాలి మరి.

మిస్టరీ విప్పిన పోస్ట్ మార్టం రిపోర్ట్

  మొన్న సోమవారంనాడు డిల్లీలో ఇండియాగేట్ వద్ద జరిగిన అల్లర్లలో పోలీసు కానిస్టేబుల్ సుబాస్ చoద్ తోమార్ (47) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో జేర్చబడి మృతి చెందిన విషయం తెలిసినదే. అతను అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్మ్ఆద్మీపార్టీ కార్యకర్తల దాడిలోనే మరణించాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడమే కాకుండా ఆ పార్టీ తన కార్యకర్తలని డిల్లీలో అరాచక పరిస్తితులు సృష్టించేందుకు ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. డిల్లీ పోలీసులు ఎనిమిది మంది యువకులను తమ అదుపులోకి తీసుకొని విచారణ కూడా ప్రారంబించారు. అందులో ఒకరు ఆమ్మ్ఆద్మీపార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పేర్కొంటోంది. అతనిని విడిపించేందుకు ఆ పార్టీ నేతలు డిల్లీ పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి కూడా తెస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలన్నిటినీ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ఖండించారు.   ఇదిలాఉండగా, అల్లర్లలో అశువులు భాసిన అమరవీరుడిగా డిల్లీ పోలీసుశాఖ అతనికి అదికార లాంచనాలతో అత్యక్రియలు నిర్వహించడమే గాకుండా, అతని కుటుంబములో ఒకరికి పోలీసు శాఖలో ఉద్యోగం, అతని కుటుంబానికి భారీనష్ట పరిహారం కూడా ప్రకటించింది.   అయితే, కొద్ది గంటలక్రితం వెలువడిన పోస్ట్ మార్టంలో అతని శరీరంపై తీవ్రగాయాలున్న గుర్తులున్నపటికీ, వాటివల్ల మాత్రం అతను మరణించలేదని పోస్ట్ మార్టం నివేదిక బయటపెట్టింది. అతనికి ఆసుపత్రిలో ఉండగా, గుండె పోటు వచ్చినందువల్లనే మరణించాడని డాక్టర్లు తమ రిపోర్టులో తెలిపారు.

జూ.యన్టీర్, లోకేష్ లకి క్లాసు పీకిన రామోజీ?

  తెలుగుదేశంపార్టీలో రెండువర్గాలుగా చీలిన హరికృష్ణ, బాలకృష్ణలకు వారి శ్రేయోభిలాషి అయిన రామోజీరావు ఇటీవలే తన రామోజీఫిల్మ్ సిటీలో రాజీకుదిర్చినట్లు వార్తలొచ్చాయి. వారికేగాకుండా తెలుగుదేశంపార్టీ తరువాతతరం ప్రతినిదులయిన జూ.యన్టీర్, లోకేష్ లనికూడా కూర్చోబెట్టుకొని రామోజీరావు వాళ్ళకి పార్టీపరిస్థితిని సవివరంగా అర్ధమయ్యేలచెప్పి వారిమద్యన కూడా రాజీ కుదిర్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.   నందమూరి వంశానికి చెందిన తమ కుటుంబానికి తెలుగుదేశంపార్టీలో ఏ ఒక్కరికీ చంద్రబాబు పదవి ఈయకపోవడంపై హరికృష్ణ అతని కుమారుడు జూ.యన్టీర్, రామోజీరావు ముందు అసంతృప్తి వెలువరించినప్పుడు, ఆయన వారికి చంద్రబాబు తరపున కొన్ని హామీలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పార్టీకోసం అందరు కలిసి కట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా గెలిపించుకొంటే, ఆ తరువాత పార్టీకోసం పనిచేసిన వారికి తప్పక సముచిత గౌరవం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చేరు. అందువల్ల, బాలకృష్ణ హరికృష్ణలు ఒకవైపు, జూ.యన్టీర్, లోకేష్ మరో వైపు చేతులు కలిపి పార్టీకోసం పనిచేయాలని రామోజీరావు వారని ఒప్పించినట్లు సమాచారం.   ముఖ్యంగా జూ.యన్టీర్, లోకేష్ లకు ఉత్తరప్రదేశ్ లో సైకిల్ పై రాష్ట్రమంతా పర్యటించి ముఖ్యమంత్రి అయిన సమాజ్ వాది పార్టీ యువనాయకుడు అఖిలేష్ సింగ్ యాదవ్ విజయగాధని ఆడియో, వీడియో క్లిప్పింగులతో సహా రామోజీరావు జూ.యన్టీర్, లోకేష్ లకు చూపించి వారికి పార్టీ విజయం కోసం ఏవిదంగా కష్టపడాల్సి ఉంటుందో వివరించినట్లు సమాచారం. అందువల్లే, వారిరువురూ లేదా లోకేష్ ఒక్కడే గానీ నూతన సంవత్సరంలో సైకిల్ యాత్ర మొదలు పెట్టవచ్చును అని తెలిసింది. అయితే సినిమా షూటింగ్ లతో నిత్యం తీరికుండని జూ.యన్టీర్ మాత్రం వెంటనే సైకిల్ యాత్ర మొదలు పెట్టకపోయినా, ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియగానే, తన సినిమాలను, షూటింగులను కొన్నిరోజులు పక్కన పెట్టయినసరే వచ్చి తెలుగుదేశంపార్టీ ప్రచారంలో పాల్గొనవచ్చును అని తెలిసింది. ఈ లోపున లోకేష్ మాత్రం తన పార్టీకి అచ్చొచిన శ్రీకాకుళం జిల్లానుండి త్వరలో సైకిల్ యాత్ర మొదలు పెట్టవచ్చునని సమాచారం.   నూతన సంవత్సరం, సంక్రాంతి (అమావాస్య) హడావుడి ముగియగానే, బాలకృష్ణ, హరికృష్ణలు కూడా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనవచ్చునని తెలుస్తోంది. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనే లోకేష్ కోసం యన్టీర్ భవనంలో ఒక గదినికూడా సిద్దం చేయబోతున్నారని నేడు వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని ఎలాగయినా గెలిపించాలని నిజంగా నందమూరివారు, నారవారు కలిసి నడుం బిగిస్తే ఫలితాలు అనుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, అది వారు ఎంత ఐక్యతగా ఉండగలరనేదానిపైనే ఆధార పడిఉంటుంది.

డిల్లీ కేసును కమ్ముకొంటున్న (నీచ) రాజకీయాలు

  మన రాజకీయ నేతలు ఎటువంటి సున్నితమయిన అంశానయినా తమ రాజకీయకోణం నుంచే చూస్తారు తప్ప వేరేగా చూడలేరు. తమ రాజకీయలబ్దికి ప్రతీ అంశం ఏవిదంగా ఉపయోగపడుతుందా అని చూస్తారు తప్ప, డిల్లీ అత్యాచార సంఘటనలపట్ల స్పందించవలసిన విదంగా స్పందించరు. ఒక సమస్య ఏర్పడినప్పుడు దాని పరిష్కారానికి ప్రయత్నించకపోగా, దానిని ఉపయోగించుకొని తమ విరోధి పార్టీలను ఏవిదంగా అభాసుపాలు చేవచ్చునో అని మాత్రమే ఆలోచిస్తారు.   డిల్లీ సంఘటనపై క్రమంగా వేడి చల్లారుతున్న సమయంలో డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, డిల్లీ పోలీసులపై ఆరోపణలు మొదలుపెట్టేరు. భాదితురాలి మొదటి వాంగ్మూలము తీసుకోనేందుకు వెళ్ళిన డిల్లీ సబ్ డివిసినల్ మాజిస్ట్రేట్ ఉషచతుర్వేదిని కొందరు డిల్లీపోలీసు అధికారులు ఆమె బాధితురాలిని ఏమి ప్రశ్నించాలో తెలియజేస్తూ వారే ఆమెచేతికి ఒక ప్రశ్నాపత్రం ఇచ్చినందువల్ల, ఆమె బాదితురాలి వాంగ్మూలము తీసుకోకుండానే వెనుదిరిగిందని, ఇటువంటి సున్నిత విషయాలలో పోలీసుల ‘అతి’ని అదుపు చేయవలసిన పోలీసు కమీషనరు బాధ్యతా రహితంగా వ్యహరించాడని, కనుక, వెంటనే ఈ విషయం పై హోంశాఖ విచారణ జరపాలని కోరుతూ షీలాదిక్షిత్ హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకు ఒక లేఖ వ్రాసారు. ఆమె తన లేఖలో హోంశాఖ అదీనంలో ఉన్న డిల్లీ పోలీసులను డిల్లీ ప్రభుత్వానికి అప్పజెప్పాలని కూడా కోరారు. ఆమె డిల్లీ పోలీసులు హోంశాఖ అదీనంలో ఉనందుకు బాధపడుతున్నారా లేక వారు మాజిస్ట్రేట్ ని వాంగ్మూలము తీసుకోకుండా అడ్డుపడినందుకు ఆమె ఈ రకమయిన ఆరోపణలు మొదలు పెట్టారానేది ఆలోచించవలసిన విషయం.   డిల్లీ పోలీసులు మాత్రం, బాదితురాలి తల్లితండ్రులు అభ్యర్దన మేరకే తాము ఆవిధంగా చేయవలసి వచ్చిందని చెపుతూ, మళ్ళీ మరోసారి బాదితురాలి వాంగ్మూలము నమోదు చేసారు. అయితే, షీలా దీక్షిత్ హోంమంత్రికి వ్రాసినలేఖ ఎలా బహిర్గతం అయిందో కనిపెట్టేందుకు ఒక విచారణ కమిటీని హోంశాఖ నియమించాలని వారు కోరారు.   మరో వైపు ఈ డిల్లీ సంఘటనను చర్చిందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని భారతీయ జనత పార్టీ రాష్ట్రపతిని కోరింది.   కాంగ్రెస్ పార్టీ మొన్న డిల్లీలో ఇండియా గెట్ వద్ద జరిగిన అల్లర్లలో అరవింద్ కేజ్రివాల్ కొత్తగా పెట్టిన ‘ఆమ్మ్ ఆద్మీ పార్టీ’ కార్యకర్తల దాడిలో ఒక పోలీసు చనిపోయాడని , తమ కార్యకర్తలని రక్షించునేందుకు ఆ పార్టీ పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.   కాంగ్రెస్ ఆరోపణలకు ప్రతిస్పందించిన అరవింద్ కేజ్రివాల్ ఇండియా గెట్ వద్ద జరిఇన అల్లర్లలో తమ పార్టీ వారెవరూ లేరని, ఒకవేళ ఉన్నట్లయితే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చునని ప్రకటన విడుదల చేసారు.   ఇంతవరకు, ఈ దుర్ఘటనపై స్పందిచని రాజకీయపార్టీలు కూడా, మరికొద్దిరోజుల్లో తమ పాత్ర పోషించేందుకు ముందుకువచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.

తెదేపా అడుగుజాడలలో నడుస్తున్న వై.యస్సార్.సి.

  యుద్దరంగంలోకి ప్రవేశించిన తరువాత తమను ముందుకు నడిపించే నాయకుడు కనబడకపోతే సైనికుల పరిస్తితి ఏవిదంగా ఉంటుందో, ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కూడా అలాగనే ఉందని చెప్పవచ్చును. ఒక వైపు తనపై శతృవులు చేస్తున్న దాడిని ఎదుర్కొంటూనే, మరోవైపు అదే శత్రువ్యుహాలని అమలుచేస్తూ ఎలాగో నెట్టుకొస్తోంది వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.   చంద్రబాబు వెనుకే పాదయాత్రలు మొదలుపెట్టిన షర్మిల ఈమద్యనే మోకాలిగాయం వల్ల తన పాద యాత్రను విరమించుకోక తప్పలేదు. గానీ, చంద్రబాబు మాత్రం ఇంకా తన పాదయాత్రని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, షర్మిల మద్యలో ఆపిన పాదయాత్రని కొనసాగించే నాయకుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి కరువవడం చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చును. పార్టీ అధినేత జగన్ జైలులో ఉండిపోవలసి రావడం, విజయమ్మ ఆరోగ్యం మరియు ఆమె వయసు రీత్యా పాద యాత్రలను చేయలేని పరిస్తితి.    వీరికి సముజ్జీగా నిలిచే మరోనేత పార్టీలో లేకపోవడం అన్నీ కలగలిసి, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీని తన శత్రుపార్టీలముందు బలహీనంగా మిగిల్చింది. అయితే, ఆ పార్టీ అందుకు తరుణోపాయంగా తన శత్రువయిన తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్న రాజకీయ కార్యక్రమాలను తాత్కాలికంగానయినా అనుసరించడమే ఉత్తమం అని నిర్ణయించుకొనట్లు కనిపిస్తోంది. అందుకే, చంద్రబాబు నిన్న పత్తి రైతులకు మద్దతుగా తాను ఎనుమురులో ధర్నా చేయబోతునట్లు ప్రకటించగానే, వెంటనే వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ కూడా తానుకూడా మహబూబ్ నగర్ లో పత్తి రైతులకి మద్దతుగా ధర్నా చేయబోతునట్లు ప్రకటించింది. బహుశః, మరే ఇతర రాజకీయపార్టీ ఇంత ధైన్యస్తితిని చూసి ఉండకపోవచ్చును.   ఇప్పటికయినా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ వెంటనే మేల్కొని తన రాజకీయ కార్యక్రమాలను ముందుండి నడిపించగల సమర్డుడయిన నాయకుడిని తప్పనిసరిగా కనుక్కోవలసిన అవసరం ఉంది. నాయకుడు లేని పార్టీ గుర్రాలులేని రధం వంటిది.   కేవలం, పార్టీలో ఉన్న ఉపనాయకులతో పార్టీని నడిపించాలని చూస్తే, అటువంటి వారు నిరుడు ప్రజారాజ్యం పార్టీకి పట్టించిన గతే వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి పట్టించి తమదారి తాము చూసుకొనే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి సానుభూతి చూపుతున్న వై.యస్.వివేకానంద రెడ్డి గానీ, అందరూ ఊహిస్తునట్లుగా జగన్ అర్దాంగి శ్రీమతి భారతిగారు గానీ త్వరలో పార్టీ పగ్గాలు చెప్పట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ఏది ఏమయినపటికీ వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మాత్రం వెంటనే మేలుకొని తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

అఖిల పక్ష సమావేశానికి ప్రతినిధుల ఖరారు

      ఈ నెల 28 న తెలంగాణా ఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి వెళ్ళే నేతల జాబితాను టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బిజెపి లు ప్రకటించాయి.   తెలంగాణా రాష్ట్ర సమితి నుండి ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు, నాయని నరసింహా రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ పార్టీ నుండి మైసూరా రెడ్డి, మహేందర్ రెడ్డి లు హాజరవనున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కంబంపాటి హరిబాబు లు ఈ సమావేశానికి హాజరవుతారు.   ఎంఐఎం నుండి ఒవైసీ సోదరులు హాజరవుతారు. సిపిఎం నుండి రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎంఎల్ఏ జూలకంటి రంగా రెడ్డి లు ఆ పార్టీ ప్రతినిధులుగా హాజరవుతారు. ఇక సిపిఐ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, ఎంఎల్ఏ గుండా మల్లేష్ లు హాజరవుతారు.   ఈ సమావేశంలో బిజెపి, సిపిఐ పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి. ఇక సిపిఎం, ఎంఐఎంలు మాత్రం తెలంగాణా వ్యతిరేక వైఖరి అవలంభించనున్నాయి.