సుష్మా స్వరాజ్.. ఆన్సర్ కిరాక్

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియా ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉంటారు.. ఎవరైనా ఏదైనా సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందిస్తారు.. ఆమె స్పందిస్తున్నారు కదా అని చెప్పి ఆమెని తిక్క ప్రశ్నలు, చిలిపి ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేయకూడదు.. కానీ తాజాగా ఒక నెటిజన్ అదే చేసాడు.. సుష్మాని ఓ తిక్క ప్రశ్న అడిగాడు, దానికి ఆమె ఫన్నీగా బదులివ్వడం విశేషం.     ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే 'బాలీకి వెళ్లటం సురక్షితమేనా?.. మేం ఆగస్టు 11 నుంచి 17 మధ్య పర్యటించాలని అనుకుంటున్నాం.. ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాల్ని జారీ చేసిందా?  దయచేసి మాకు సలహా ఇవ్వండి' అంటూ నెటిజన్ సుష్మాని అడిగాడు.. దీనికి బదులుగా సుష్మా  అక్కడి అగ్నిపర్వతాన్ని సంప్రదించి మీకు చెబుతానంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు.. ఆ మధ్యన కొద్ది రోజులు ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో అగుంగ్ అగ్నిపర్వతం యాక్టివ్ గా ఉంది.. దాంతో అగ్నిపర్వతం నుండి లావా బూడిద పెద్ద ఎత్తున వెలువడటంతో ఎయిర్ పోర్ట్ ను మూసేశారు.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి పెద్దగా లేకున్నా, అప్పుడప్పుడు భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.. అందుకే సుష్మా అతని ప్రశ్నకు కౌంటర్ గా ఆ ఆన్సర్ ఇచ్చారు.. అయితే సోషల్ మీడియాలో, గూగుల్ లో సెర్చ్ చేస్తే సరిపోయే దానికి మంత్రిని అడుగుతావా అంటూ అతని ప్రశ్నకు విమర్శలు, సుష్మా టైమింగ్ కు ప్రశంసలు వస్తున్నాయి.

జనసేనలోకి వైసీపీ నేత

  ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా జనసేనలో చేరికలు మొదలయ్యాయి.. సీనియర్ నేత మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్‌ తో కలిసి వైసీపీని వీడి జనసేనలో చేరారు.. టీడీపీలో మంత్రిగా, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన ముత్తా గోపాలకృష్ణకు కాకినాడలో బలమైన పట్టుంది.. అలాగే ఆయన తనయుడు శశిధర్‌ కూడా క్రియాశీల రాజకీయ నేతగా ఎదిగారు.. కాకినాడ సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేసారు.. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ముత్తా వైసీపీని వీడి, తన అనుచరులతో తాజాగా జనసేనలో చేరారు.. ముత్తా చేరికతో కాకినాడ జనసేన కేడర్‌లో నూతనోత్సాహం వచ్చింది.. మరోవైపు ముత్తా వైసీపీని వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫలించిన వ్యూహం.. బీజేపీదే విజయం.

  గత కొద్ది రోజులుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి చర్చ జరుగుతుంది.. అధికార పక్షం, విపక్షాలు గెలుపు మాది అంటే మాది అంటూ ధీమాగా చెప్పాయి.. కానీ అధికార పక్షాన్నే విజయం వరించింది.. బీజేపీ వ్యూహం ఫలించి వారు ఊహించిందే జరిగింది.. తమ పార్టీ అభ్యర్థిని నిలబెడితే తటస్థ పార్టీలు వ్యతిరేకించే ప్రమాదం ఉందని గ్రహించిన బీజేపీ.. మిత్రపక్షం నుండి అభ్యర్థిని నిలబెట్టింది.. అనుకున్నట్టే విజయం సాధించింది.. ఎన్డీయే తరుపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలోకి దిగగా, విపక్షాలు తరుపున కాంగ్రెస్ ఎంపీ కే హరిప్రసాద్ బరిలోకి దిగారు.. హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, హరివంశ్ నారాయణ్ 125 ఓట్లతో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

కరుణానిధికి తోడుగా మరో ఇద్దరు

  కరుణానిధి మరణంతో విషాదంలో ఉన్న డీఎంకే శ్రేణులను మరింత విషాదంలోకి నెట్టే సంఘటన జరిగింది.. కరుణానిధి మరణవార్త విని, ఆయన పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి తమిళనాడు నలుమూలల నుండి డీఎంకే శ్రేణులు భారీగా తరలి వచ్చారు.. ప్రజల సందర్శనార్ధం కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీ హాల్‌లో ఉంచారు.. కరుణకు నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు రావడంతో సామాన్యులకు అవకాశం రాలేదు.. దీంతో కరుణను దగ్గర నుంచి చూడాలని అభిమానులు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.. కొందరు బారికేడ్లు దాటుకుని కరుణ పార్థివదేహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకుంది.. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు.. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 33 మంది వరకు గాయపడ్డారు.. రాజాజీ హాల్‌ సమీపంలో ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు.. హాల్‌ చుట్టూ భారీగా మోహరించి, సమీపంలోకి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.  

జీవీఎల్ కి కొత్త అర్ధం.. భలే ఉందే.!!

జీవీఎల్ నరసింహారావు, పీడీ ఖాతాలలోని డబ్బు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆరోపణల పట్ల జీవీఎల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు మాట్లాడుతూ జీవీఎల్ పై మండిపడ్డారు.     పీడీ ఖాతాలు, యూసీల పేరుతో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.. పీడీ ఖాతాల నుంచి డబ్బు మళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, తనను అరెస్టు కూడా చేసుకోవచ్చునని సవాల్ విసిరారు.. జీ అంటే గ్లోబల్, వీ అంటే వైరస్, ఎల్ అంటే లయ్యర్ అని కుటుంబరావు, జీవీఎల్ కు కొత్త అర్దాన్ని చెప్పారు.. గ్లోబల్ వైరస్ లయ్యర్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు.. రాష్ట్ర పరపతిని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు.. పీడీ ఖాతాలు నేషనల్ ఖాతాలేనని, వాటిని ఖజానా కార్యాలయాల్లో తెరుస్తారని, అందులో డబ్బుండదని, ఏదైనా శాఖలో ఖర్చులకు సంబంధించిన బిల్లులు వచ్చినప్పుడు కేటాయించిన నిధుల నుంచి చెల్లింపులు చేస్తారని, అలాంటి ఖాతాల్లో వేల కోట్ల నిధులే ఉంటే రాష్ట్రం అప్పులకు వెళ్లాల్సిన అవసరమేముంటుందని ప్రశ్నించారు.. ఒకే సంస్థలో రెండు ఖాతాలు ఉంటే ఒకదాని నుంచి మరో దాంట్లోకి నిధులు మళ్లించడాన్ని సెల్ఫ్ చెక్ అంటారనే విషయం తెలియకుండా జీవీఎల్ మాట్లాడారన్నారు.. ఐటీ దాడులు నిర్వహించినప్పుడు సీజ్ చేసిన సొమ్మును పీడీ ఖాతాల్లోనే పెడతారని, అంటే వారు తినేసినట్లా?.. కోర్టుల ఖాతాలన్నీ ఇవేనని అక్కడ దుర్వినియోగం చేస్తున్నారని అంటారా? అని కుటుంబరావు ప్రశ్నించారు.

దేశానికి తీరని లోటు - చంద్రబాబు

  తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా చంద్రబాబు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు.. 'కరుణానిధి కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడు.. తమిళనాడులో తిరుగులేని నేత.. దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగారు.. రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు.. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారు.. కరుణానిధితో నాకు మంచి అనుభవం ఉంది.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు.. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి అండగా నిలిచారు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటుచేసుకున్న కరుణానిధి చనిపోవడం తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటు' అని చంద్రబాబు అన్నారు.

ముగిసిన వివాదం.. మెరీనాలోనే అంత్యక్రియలు

  మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించడం కుదరదని తమిళనాడు ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.. దీనిపై డీఎంకే నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు.. అయితే మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెరీనాలో అంత్యక్రియలకు అంగీకారం తెలిపింది.. కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు కోరినట్టుగానే కరుణానిధి అంత్యక్రియలు అన్నా మెమోరియల్ పక్కనే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..  సాయంత్రం 4 గంటలకు మెరీనా తీరానికి కరుణానిధి భౌతికకాయాన్ని తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కరుణానిధి చివరి సినిమా..!!

  సినీరంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉంటారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా సినిమాలను వదలని వారు చాలా అరుదుగా ఉంటారు.. అలాంటి వారిలో ఒకరు కరుణానిధి.. సీఎం అయ్యాక కూడా ఆయన సినిమాలకు దూరం అవ్వలేదు.. సీఎంగా పనిచేసిన ఆఖరి రోజు వరకు సినిమాతో ఆయన బంధం కొనసాగింది.. 2011లో ప్రశాంత్‌ హీరోగా వచ్చిన ‘పొన్నార్‌ శంకర్‌’ చిత్రానికి కరుణానిధి కథ అందించారు.. ఇదే ఆయన చివరి సినిమా.. రాజకుమారి సినిమాతో సినీ రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చినా, ఆఖరికి సీఎం అయినా కూడా సినిమాలు వదల్లేదు.. కరుణానిధికి సినిమా అంటే ఎంత ప్రేమో దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు.

కలైంగర్ మృతిపై తలైవా ఏమన్నారంటే…

కరుణానిధి మృతి చెందిన ఈరోజును ‘బ్లాక్ డే’! ఈ  బ్లాక్ డేను నేను ఎప్పుడూ మర్చిపోలేను! కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను! ఇదీ తలైవర్ రజినీకాంత్ ట్వీట్….     తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై సూపర్ స్టార్ రజనీకాంతే కాదు చాలా మంది తమిళ ప్రముఖులు మీడియాలో, సోషల్ మీడియాలో స్పందింస్తున్నారు. కలైంగర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తు చేసుకుంటున్నారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని, ఆయన్ని మిస్సయ్యాం కానీ, ఆయన సంక్పలం మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని తెలుగు వారికి కూడా సుపరిచితురాలైన రాధిక అన్నారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారని, ఆయనకు కన్నీటి వీడ్కోలు చెబుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.   ఈతరం కోలీవుడ్ హీరోయిన్ హన్సిక కూడా మహానేత మృతిపై స్పందించింది. కరుణానిధి మరణ వార్తను జీర్ణించుకునే ధైర్యం ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, యావత్తు తమిళ ప్రజలకు ఆ దేవుడు ప్రసాదించాలని ప్రార్థించింది. కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నటి ఖుష్భూ సైతం తన బాధని వెలిబుచ్చారు. నెల క్రితమే కరుణానిధితో కలిసి ఓ ఫొటో దిగానని, గొప్ప నాయకుడైన ఆయన్ని కలవడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ‘అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం’ అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు!   

కరుణానిధి ఖననం విషయంలో పళని వర్సెస్ స్టాలిన్!

  సాయంత్రం 6.10 గంటలకు మృతి చెందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివ దేహాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి అంబులెన్స్ లో తరలిస్తున్నారు.  చెన్నైలోని కావేరి ఆసుపత్రి నుంచి బయలుదేరిన వాహనం వెంట కరుణానిధి భౌతికకాయంతో పాటూ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.     కావేరి ఆసుపత్రి వద్ద, గోపాలపురంలోని దివంగత నేత నివాసం వద్దా డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో పోగయ్యారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమ అభిమాన నేత కరుణానిధి మృతిని జీర్ణించుకోలేపోతున్నారు వేలాది అభిమానులు! వారి రోదనలతో చెన్నై కన్నీటి చెరువైపోయింది!   ద్రవిడ ఉద్యమ మహానేత అన్నాదురై సమాధి వద్దే కరుణానిధిని ఖననం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే, డీఎంకే నేతల విఙ్ఞప్తిపై తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వం సానుకూలంగా లేన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని పళనిస్వామి ప్రభుత్వం చెబుతున్నట్టు సమాచారం. డీఎంకే నేతలు, కార్యకర్తలు ఇప్పటికే సర్కార్ పై మండిపడుతున్నారు. వారు కోర్టును ఆశ్రయించాలని కూడా ఆలోచిస్తున్నారట…

కన్నుమూసిన తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి

జయలలిత రూపంలో ఒక రాజకీయ యోధురాల్ని కోల్పోయిన తమిళనాడు మరోసారి శోకసంధ్రమైంది! డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. 94 ఏళ్ల ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు డాక్టర్ల సకల ప్రయత్నాల తరువాత కూడా తుదిశ్వాస విడిచేశారు. కలైంగర్ మృతి చెందారని తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు కావేరి ఆసుపత్రి వద్ద భారీగా గుమికూడారు.     కరుణానిధి మరణంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేన్నైలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. కరుణానిధి భౌతికకాయాన్ని మొదట గోపాలపురంలోని ఆయన స్వగృహానికి తరలిస్తారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేశాక ప్రజలు చివరిసారి తమ ప్రియతమ నాయకుడ్ని చూసుకునేందుకు చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది.

పాపం.. రైల్వే వాట్సాప్ నెంబర్ కూ అవే మెసేజ్ లా..!!

వాట్సాప్ అంటే కొందరికి గుడ్ మార్నింగ్‌లు, గుడీవినింగ్‌లు లేదా ఈ మెసేజ్‌ను మరో 15 మందికి ఫార్వార్డ్ చేస్తే మంచి జరుగుతుందని చెబుతూ ఫార్వార్డ్ మెసేజ్ లు.. ఇవి తప్ప పనికొచ్చేవి ఒక్కటి ఉండవు.. పాపం ప్రస్తుతం పశ్చిమ రైల్వే వాట్సాప్ నెంబర్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.     ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వీలుగా.. పశ్చిమ, మధ్య రైల్వే వాట్సాప్ నెంబర్ల ఏర్పాటు చేసారు.. జూలై 31న వీటిని ప్రారంభించారు.. అయితే, ఫిర్యాదులకు బదులుగా గుడ్ మార్నింగ్‌లు, గుడీవినింగ్‌లు చెప్పేవారు ఎక్కువైపోయారని రైల్వే అధికారులు తెలిపారు.. దేవుళ్ల ఫొటోలు, సమాచారాన్ని ఫార్వార్డ్ చేస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారని.. కొందరైతే పద్యాలు, కవితలను కూడా ఫార్వార్డ్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.. ఇక స్నేహితుల దినోత్సవం నాడైతే ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే’ మెసేజ్‌లతో నింపేసినట్టు తెలిపారు.. సదుద్దేశంతో అందుబాటులోకి తెచ్చిన ఈ నంబర్లను దుర్వినియోగం చేయవద్దని, సమస్యల ఫిర్యాదుకు మాత్రమే ఉపయోగించుకుని, మరింత నాణ్యమైన సేవలు అందుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

కరుణానిధి పరిస్థితి విషమం.. సీఎంని కలిసిన స్టాలిన్

  డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. వృద్ధాప్యం కారణంగా ఆయన చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్టు తెలుస్తోంది.. ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు.. పోలీసులు కూడా భారీగా మొహరించారు.. మరోవైపు కరుణానిధి కుమారుడు స్టాలిన్, తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసినట్లు సమాచారం.. మెరీనా బీచ్‌లో కరుణానిధి స్మారకం కోసం స్థలం కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.. దీంతో కార్యకర్తలు మరింత ఆందోళన చెందుతున్నారు.

షాకింగ్.. ఏపీ విభజనకు కేంద్రంతో సంబంధంలేదట..!!

  ఏపీ మీద కేంద్రానికి ఎంత ప్రేమ ఉందో రోజురోజుకి బయట పడుతుంది.. ప్రత్యేకహోదా, కడప ఉక్కు, రైల్వేజోన్ కాదేది కేంద్రం ప్రేమకి అనర్హం అన్నట్టు ఇప్పటికే పలు విషయాల్లో ప్రేమని చాటుకున్న కేంద్రం.. మరోసారి తన ప్రేమను బయటబెట్టి షాక్ ఇచ్చింది.. అసలు ఆంధ్రప్రదేశ్ విభజనలో కేంద్రానికి సంబంధమే లేదట.. దీనికో లాజిక్ కూడా చెప్పారు.. అసలు మేటర్ ఏంటంటే.. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. 'ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ఎటువంటి డాక్యుమెంట్ల మీద కేంద్ర ప్రభుత్వం సంతకం చేయలేదని, కేవలం ఏపీ పునర్వ్యవస్తీకరణ బిల్లు-2014ను అనుసరించి మాత్రమే రాష్ట్ర విభజన జరిగింది' అని స్పష్టం చేసింది.. ఏంటో కేంద్రానికి ఏపీ మీద రోజురోజుకి ప్రేమ పెరిగిపోతుంది.. అన్నట్టు ప్రేమ అంటే కేంద్రం దృష్టిలో చిన్నచూపే కదా.  

కేసీఆర్ కు నితీష్ ఫోన్..!!

  బీహార్ సీఎం నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసారు.. యోగక్షేమాలు కనుక్కోవడానికి కాదులేండి.. రాజకీయ కారణంతోనే చేసారు.. ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.. అయితే రాజ్యసభలో ఏ పార్టీకీ, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేదు.. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది.. బీజేపీ అభ్యర్థిని నిలబెడితే విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రమాదం ఉందని భావించిన గ్రహించిన బీజేపీ, ఈ అవకాశాన్ని మిత్రపక్షమైన జేడీయూకి ఇవ్వాలని నిర్ణయించింది.. దీనివల్ల తటస్థంగా ఉన్న పార్టీలు కూడా మద్దతిస్తాయని బీజేపీ ఆలోచన.. దానిలో భాగంగానే నితీష్, కేసీఆర్ కు ఫోన్ చేసారు.. తమ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని కోరారు.. అయితే కేసీఆర్ మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు జగన్ ప్రయత్నం..!!

  ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా విపక్షనేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాసుల కక్కుర్తితో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిన సంగతి జగన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.. జగన్‌ ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తారో? ఆయనకు చెందిన వేల కోట్ల ఆస్తులను ఈడీ ఎందుకు జప్తు చేసిందో? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.. తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేసారు.