లోక్‌సభ మాజీ స్పీకర్‌ ఛటర్జీ కన్నుమూత

  లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ(89) కన్నుమూశారు.. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఛటర్జీ ఈనెల 7 నుంచి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా నిన్న ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది.. దీంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు.. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.. 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు.. అలాగే సీపీఎం పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు.. యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కాంగ్రెస్ గూటికి వైసీపీ మైనార్టీలు..!

విభజన అనంతరం కాంగ్రెస్ మెజారిటీ ఓటు బ్యాంక్ ని వైసీపీ కొల్లగొట్టింది.. 2014 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించనప్పటికీ, బలమైన పార్టీగా నిలబడగలిగింది అంటే, అది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పుణ్యమనే చెప్పాలి.. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మూలంగా వైసీపీ బలహీనపడే ప్రమాదం ఏర్పడింది.. గతంలో కాంగ్రెస్ కు అండగా ఉన్న ముస్లిం మైనార్టీలు, విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. మైనార్టీలు వైసీపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ తో చేతులు కలపాలని చూస్తున్నారు.. దానికి కారణం వైఎస్ జగన్, బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగటమే.     పైకి బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నా, కేసుల భయంతో వాటిని మాఫీ చేసుకునేందుకు జగన్, బీజేపీతో రహస్యంగా దోస్తీ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.. దీంతో మైనార్టీలు జగన్ తమను మోసం చేసాడని భావిస్తున్నారు.. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. తాజాగా కర్నూలులో వైసీపీ ముస్లిం కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.. వన్ టౌన్ ఏరియాకు చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.. వారిని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా మాట్లాడిన కోట్ల.. బీజేపీతో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నాడు.. బీజేపీతో కలిసి జగన్ మైనారిటీలను మోసం చేసాడు.. అందుకే మైనారిటీ లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నారు.. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. కాంగ్రెస్ పార్టీ లో ఉండి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తింపు తెచ్చుకున్నాడు, అదే ఉద్దేశంతోనే జగన్ ని ఆదరించారు.. కాని ఇప్పుడు బీజేపీతో కలిసి మైనారిటీలను మోసం చేయడాన్ని గుర్తించిన మైనారిటీలు వైసీపీకి బుద్ది చెబుతారని కోట్ల అన్నారు.. అయితే ఈ పరిస్థితి కర్నూల్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. మైనారిటీలతో పాటు, కాంగ్రెస్ కి మొదటినుండి అండగా ఉన్న దళితులు.. అదేవిధంగా బీజేపీ వ్యతిరేకించే కార్యకర్తలు ఇలా అందరూ వైసీపీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.. ఏపీలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు ఇది శుభపరిణామం అనే చెప్పాలి.

బిగ్ బాస్ ఇంట్లో మిస్పైన ఏపీ బిజేపీ నాయకులు..!!

  బిగ్ బాస్.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు.. గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.. కంటెస్టెంట్స్ ని ఒక ఇంట్లో కొన్ని రోజులపాటు ఉంచటం.. కోపాలు, ప్రేమలు.. ఆనందాలు, బాధలు.. ఆటలు, పాటలతో వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ని చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఈ షో ఉద్దేశం.. మరి ఇలాంటి షోలో రాజకీయ నాయకులు ఉంటే ఎలా ఉంటుంది?.. అసలు వారి మనసులో ఏముంది?.. వాళ్ళ నిజస్వరూపులు ఏంటి? ఇట్టే తెలిసిపోతాయి కదా.. అవును.. బిగ్ బాస్ ఇంట్లో ఏపీ నాయకులు ఉంటే ఎలా ఉంటుంది?.. వీళ్ళకి తోడు ఎవరూ ఊహించని వైల్డ్ కార్డు ఎంట్రీ క్రిటిక్ సుత్తి సురేష్.. అబ్బో వీళ్ళ రచ్చ అంతాఇంత కాదు.. ఈ వీడియో చుడండి మీకే తెలుస్తుంది.  

మేమే 20 వేల కోట్లిస్తాం.. సీఎం పదవి మాకివ్వు

కాపు రేజర్వేషన్ల గురించి ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.. తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జగన్ పై మండిపడ్డారు.. మాట తప్పను, మడం తిప్పనంటున్న జగన్‌.. కాపు రిజర్వేషన్ల విషయంలో ఒక్కో సభలో ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు.. సీఎం చంద్రబాబు రూ.5 వేల కోట్లకు పాడుకుంటే, తాను అధికారానికి వస్తే రూ.10 వేల కోట్లు కాపులకు కేటాయిస్తాననడం తమను అవమానించినట్లేనని అన్నారు.. మేమే రూ.20 వేల కోట్లు ఇస్తాం, సీఎం పదవి ఇవ్వండి అని మండిపడ్డారు.     'రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదని రాజ్యాంగం చెబుతోందని చదివానంటున్న జగన్‌.. జగ్గంపేటలో ఒకరకంగా, తునిలో మరోరకంగా మాట్లాడి చంద్రబాబులా అబద్ధం చెప్పననడం ఆయనకే చెల్లింది.. 2016లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఎన్నోసార్లు సభల్లో, అసెంబ్లీలో డిమాండ్‌ చేసి ఇప్పుడిలా మాట్లాడడం దారుణం.. బ్రిటిష్‌ కాలంలో కాపు, ఒంటరి, తెలగ, బలిజలు అనుభవించిన రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు అంటేనే వాటి అమలుకు పోరాడుతున్నాం’  అన్నారు.. అసెంబ్లీలో బిల్లు చేసి గవర్నర్‌ ఆమోదంతో కేంద్రానికి పంపి తొమ్మిది నెలలు దాటినా అమలుకు నోచుకోలేదు.. తమ జాతి ప్రయోజనాలను కాపాడే పార్టీ పల్లకీనే 2019 ఎన్నికల్లో మోస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.

మోదీ టంగ్ స్లిప్.. వెంకయ్య తొలగింపు.!!

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్ పై గెలుపొందిన సంగతి తెలిసిందే.. ఎన్నికల ఫలితం వెలువడిన తరువాత రాజ్యసభకు వచ్చిన మోదీ, డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన హరి వంశ్ నారాయణ్ ను అభినందించారు.. అభినందన వరకు ఓకే, కానీ ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరంగా ఉన్నాయి.     'ఇరువైపులా హరి అన్న పేరున్న వ్యక్తులే ఉన్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరి అమ్ముడు పోయారు కానీ గెలవలేదు.. తమ పార్టీ అభ్యర్థి హరి మాత్రం అమ్ముడుపోలేదు కానీ గెలిచాడు' అని మోదీ వ్యాఖ్యలు చేసారు.. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.. అసలే ఓటమి బాధలో ఉన్న హరిప్రసాద్ మోదీ మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ప్రధాని హోదాను, సభ గౌరవాన్ని ఆయన దిగజార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనిపై చేసిన ఫిర్యాదును పరిశీలించిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు రికార్డుల నుంచి మోదీ చేసిన వ్యాఖ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దేశ చరిత్రలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

జగన్ ని ఇరకాటంలో పెట్టిన యనమల ప్రశ్న..!!

ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు జత చేసిన విషయం తెలిసిందే.. దీని గురించి మీడియాలో కూడా వార్తలు జోరుగా వచ్చాయి.. అయితే ఈ విషయాన్ని జగన్ ఖండించారు.. 'నా భార్య పేరు చార్జిషీటులో ఉందని ఓ సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్త విని షాకయ్యాను.. ఇది చాలా బాధాకరం.. కుటుంబాలను ఇలాంటి విషయాల్లోకి లాగడం సబబు కాదు.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చూసినప్పుడు బాధేస్తుంది' అన్నారు.. అలాగే దీని వెనుక టీడీపీ హస్తముందని ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలకు మంత్రి యనమల రామకృష్ణుడు, ఓ ప్రశ్నతో సమాధానం ఇచ్చారు.. జగన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు.     తాజాగా యనమల మాట్లాడుతూ.. ఈడీ కేసు విషయంలో జగన్ వాదన విచిత్రంగా ఉందని అన్నారు.. కేసులో కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.. అవినీతి చేయలేదని చెప్పలేని జగన్, వార్తలపై మాత్రం అభ్యంతరం ఎలా చెబుతారని మండిపడ్డారు.. జగన్ వైఖరితోనే ఆయన కుటుంబసభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని, ఛార్జీషీటులో భారతి పేరు ఉండటాన్ని జగన్ ఎక్కడా ఖండించలేదని అన్నారు.. మీడియా లేనిది ఉన్నట్లుగా రాస్తే తప్పుపట్టాలి కానీ, ఉన్నది రాస్తే ఎందుకని ప్రశ్నించారు.. అలాగే ఈడీ ఛార్జీ సీటు కేసులో టీడీపీకి సంబంధం ఏముంటుందని ప్రశ్నించిన యనమల, ఈడీలోని ఇద్దరు అధికారులు సహాయం చేశారనడం సరికాదన్నారు.

డిప్యూటీ ఆన్ డ్యూటీ.. మోదీకి మొదటి షాక్..!!

ఈమధ్య హాట్ టాపిక్ అయిన విషయాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఒకటి.. ఈ పదవి కోసం అధికారపక్షం, విపక్షం నువ్వానేనా అంటూ పోటీ పడ్డాయి.. అయితే ఎట్టకేలకు అధికారపక్షం బీజేపీ బలపరచిన అభ్యర్థి హరివంశ్ సింగ్ విజయం సాధించారు.. ఇంకేముంది బీజేపీ ఫుల్ హ్యాపీ.. అయితే హ్యాపీగా ఉన్న బీజేపీకి మొదటిరోజే షాక్ ఇచ్చారు హరివంశ్.     ఇంతకీ విషయం ఏంటంటే.. ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలుగా రిజర్వేషన్ ఉన్న వారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా ఆ సౌలభ్యాన్ని అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ ఒక ప్రైవేటు తీర్మానాన్ని పెట్టారు.. అయితే, ఇది అసాధ్యమని ఒక కులాన్ని ఎస్సీ, ఎస్టీ లేదంటే ఓబీసీ అనే కేటగిరిల్లో చేర్చటానికి పెద్ద ప్రక్రియ ఉంటుందని.. అలాంటి వేళ దేశం మొత్తానికి ఒకే విధానం అసాధ్యమని సామాజిక న్యాయశాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తేల్చి చెప్పారు.. అయినా విపక్షాలు ఎందుకు ఊరుకుంటాయి.. ఈ అంశంపై ఓటింగ్ జరగాలని పట్టుపట్టాయి.. ఫస్ట్ డే డ్యూటీ మంచి కిక్ ఉండాలి అనుకున్నారేమో హరివంశ్ ఓటింగ్ కి ఓకే చెప్పేసారు.. ఇలాంటి అనుమతి ఇవ్వటం అసాధారణమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేసినా హరివంశ్ వినలేదు.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా, తాను ఒకసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు.. దీంతో విపక్షాలు హ్యాపీ, అధికారపక్షానికి బీపీ.. పాపం బీజేపీ తమ పార్టీకి చెందిన సభ్యులను సభలోకి రప్పించటానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.. అదే సమయంలో సభలో విపక్ష సభ్యులు ఎక్కువగా లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి నుంచి మోడీ సర్కారు బయటపడగలిగింది.. చివరకు సభలో 66-32 ఓట్ల తేడాతో ఓటింగ్ లో మోదీ సర్కారు విజయం సాధించింది.. పొరపాటున విపక్ష సభ్యులు ఎక్కువగా ఉండుంటే మోదీ సర్కార్ ఇరుకున పడేదే.

విజయ్ మాల్యా ఇంట్లో గోల్డెన్‌ టాయిలెట్‌..!!

విజయ్ మాల్యా.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదులేండి.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశాడుగా బాగానే గుర్తుంటాడు.. వేలల్లో రుణాలు తీసుకున్నవాళ్ళు అవి తీర్చడానికి చెమటోర్చుతుంటే, మాల్యా లాంటివాళ్ళు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విలాసవంతంగా బ్రతుకుతున్నారు.. బాగా డబ్బున్న వాళ్ళు బంగారు ప్లేట్, బంగారు స్పూన్ తో అన్నం తింటారని అప్పుడప్పుడు వింటుంటాం.. కానీ మాల్యా వాళ్ళకంటే ఓ పది మెట్లు ఎక్కువ కదా.. అందుకే ఈయన గారు ఏకంగా బంగారు టాయిలెట్ వాడుతున్నాడు.     రచయిత, ప్రొఫెసర్‌ జేమ్స్‌ క్రాబ్‌ట్రీ రీసెంట్ గా ముంబైలో ఓ సమావేశానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాల్యా గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు.. 'లండన్‌లోని మాల్యా ఉంటున్న భవంతిలో ఆయనతో నాలుగు గంటలు గడిపే అవకాశం వచ్చింది.. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నట్లు కనిపించారు.. అప్పుడు ఆయన మద్యం సేవిస్తూ ఉన్నారు.. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత మాల్యా అనుమతితో అక్కడున్న వాష్‌రూమ్‌లోకి వెళ్లాను.. అక్కడ ఉన్న గోల్డెన్‌ టాయిలెట్‌ చూసి ఆశ్చర్యపోయాను' అన్నారు.. చింతచచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఉన్న ఆయన విలాసవంతమైన జీవితానికి ఢోకా లేదు.

ఐదు రూపాయలు దొంగతనం.. ఐదేళ్ల జైలు శిక్ష..!!

ఐదు రూపాయలు దొంగతనం చేసినందుకు ఐదేళ్ల జైలు శిక్షా.!! ఊరుకోండి.. అలా అనుకుంటే చిన్నపిల్లలు తెలిసో తెలియకో పెన్ను, పెన్సిల్ దొంగతనం చేస్తారు.. అంతమాత్రాన ఐదేళ్ల జైలు శిక్ష వేస్తారా? అని అడుగుతారా.. అసలు మేటర్ తెలిస్తే అలా అడగరులెండి.. ఇంతకీ విషయం ఏంటంటే.. ఢిల్లీలో ఓ 43ఏళ్ల వ్యాపారి వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడిసరుకు తయారుచేసి, సరఫరా చేస్తుంటాడు.. అతని వద్ద ఖలీద్ అనే వ్యక్తి ముడిసరుకు కొంటుండేవాడు.. అయితే వ్యాపారి నిత్యం తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులను  బ్యాగులో పెట్టుకుని ప్రయాణించడాన్ని ఖలీద్ గమనించాడు.. ఇంకేముంది అతనిలో దొంగ మేల్కొన్నాడు.. బ్యాగ్ కొట్టు డబ్బు పట్టు అనుకున్నాడు.     ఓ నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ వేసాడు.. ఒక రోజు వ్యాపారి తన ఇంటికి స్కూటర్ పై వెళుతుండగా ఖలీద్ గ్యాంగ్ ముసుగులు ధరించి వచ్చి వ్యాపారిని అడ్డుకున్నారు.. అతడిని గన్ తో బెదిరించి,కళ్లలో కారం చల్లి బ్యాగుతో పాటు స్కూటర్ ని తీసుకుని పరారయ్యారు.. అయితే ఆ బ్యాగులోని డబ్బులను చూసి ఖలీద్ గ్యాంగ్ అవాక్కయ్యారు.. బ్యాగులో లక్షల్లో డబ్బులుంటాయని భావించి దొంగతనానికి పాల్పడితే అందులో ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి.. ఈ దొంగతనంపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా నేరం రుజువైంది.. దీంతో వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

భారత్ తడ'బ్యాటు'.. మ్యాచ్ డౌట్..!!

  భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే.. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచ్ ఈరోజు మొదలైంది.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. అయితే బ్యాటింగ్ కి దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మురళీ విజయ్, ఆండర్సన్ వేసిన అద్భుత బంతికి డకౌట్‌గా వెనుదిరిగాడు.. అదేవిధంగా ఏడో ఓవర్లో ఆండర్సన్, ఓపెనర్ రాహుల్‌(8)ను కూడా పెవిలియన్ పంపి భారత్ ను దెబ్బకొట్టాడు.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, పుజారా క్రీజ్ లో ఉన్నారు.. అయితే రెండోరోజు కూడా వర్షం మ్యాచ్ కి అడ్డంకిగా మారింది.. మ్యాచ్ నిలిపివేసే సమయానికి 6.3 ఓవర్లకు భారత్ స్కోరు 11/2.. క్రీజ్ లో ఉన్న కోహ్లీ, పుజారా ఇన్నింగ్స్ నిలబెడతారేమో చూడాలి.

పశువుల్లో ఎమ్మెల్యేల ముఖాలు కనిపిస్తున్నాయి..!!

కమెడియన్ పృధ్వీ వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా గుంటూరులో జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న ఆయన చంద్రబాబు మీద, టీడీపీ మీద తీవ్ర విమర్శలు చేసారు.. మాట్లాడితే తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.     తనని, పోసానిని, కృష్ణుడిని కుక్కలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా.. వైసీపీకి కాపలా కుక్కలాగా ఉంటాం అని ఘాటుగా స్పందించారు.. ఏపీలో ప్రత్యేక హోదా అంశం నిలబడటానికి వైసీపీనే కారణమని అన్నారు.. తనకు ఎక్కడ పశువులు కనిపించినా వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఖాలే కనిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.. అలానే వైసీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి ప్రచారం చేస్తున్నారని వచ్చిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఎమ్మెల్యే కాదు కదా కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్‌ను కూడా ఆశించడం లేదని స్పష్టం చేసారు.. నన్ను జెండా మోసే సామన్య కార్యకర్తగా మాత్రమే చూడండి.. జగన్‌ని సీఎంగా చూడాలనేది నా కోరిక అని పృధ్వీ అన్నారు.

ఎన్టీఆర్‌, ప్రభాస్‌కు తలసాని ఛాలెంజ్..!!

  ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. సెలెబ్రిటీలు మొక్కలు నాటి వేరే వారికి కూడా నాటమని ఛాలెంజ్ విసురుతున్నారు.. ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో చిరంజీవి, కేటీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రాజమౌళి లాంటి వారు పాల్గొన్నారు.. త్వరలో ఈ లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్ కూడా చేరేలా ఉన్నారు.. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎన్టీఆర్, ప్రభాస్ లకు ఛాలెంజ్ విసిరారు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన తలసాని, ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటి.. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఛాలెంజ్ విసిరారు.

చార్జిషీటులో భారతి పేరు..!!

ప్రతిశుక్రవారం కోర్ట్ కు హాజరవుతున్న జగన్, ఇకనుండి సతీసమేతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. జగన్‌ అక్రమాస్తుల కేసులో మొదటిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి.. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసింది.. అయితే భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది.. కానీ సీబీఐ ఆ పనిచేయలేదు.. సీబీఐ వదిలేసినా ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు.     మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చార్జిషీటు దాఖలు చేశారు.. ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్ట్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.. మొన్నటివరకు జగన్, మోదీతో కలిసిపోయారని ఆరోపణలు వినిపించాయి.. అసలు కేసులు మాఫీ చేసుకోవడానికే జగన్, మోదీతో చేతులు కలిపారని చాలామంది ఆరోపించారు.. కానీ ఇప్పుడేం జరిగింది? జగన్ కేసులు పోవడం ఏమో కానీ కొత్తగా భారతి పేరు కూడా చార్జిషీటులో చేరింది.. ఈడీ, సీబీఐ కేంద్రం చెప్పినట్టే నడుస్తున్నాయి.. మరి మోదీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా?.. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది.. మోదీ, జగన్ ని పూర్తిగా నమ్మట్లేదు అందుకే కేసుల్ని అడ్డం పెట్టుకొని జగన్ ని గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తున్నారని కొందరు అంటుంటే.. జగన్ ని కావాలనే బలహీనపరిచి వచ్చే ఎన్నికల్లో పవన్ తో దోస్తీ చేయాలని చూస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు.. ఇవన్నీ గ్రహించిన జగన్, బీజేపీకి అందుకే ఇప్పుడు కాస్త దూరంగా ఉంటున్నారని.. ఒకప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో అడగకుండానే బీజేపీ మద్దతిచ్చిన జగన్, ఈమధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండటానికి కారణం ఇదే అయ్యుండొచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.. అసలు బీజేపీ, జగన్ మనసుల్లో ఏముందో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఇలాంటి ఆరోపణలు, అభిప్రాయాలూ మాత్రం వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై స్పందించిన జగన్.. 'నా భార్య పేరు చార్జిషీటులో ఉందని ఓ సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్త విని షాకయ్యాను.. ఇది చాలా బాధాకరం.. కుటుంబాలను ఇలాంటి విషయాల్లోకి లాగడం సబబు కాదు.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చూసినప్పుడు బాధేస్తుంది' అన్నారు.

మోదీ దళిత వ్యతిరేకి.. రాహుల్ సింహగర్జన

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ‘సింహగర్జన’ పేరుతో నిరసన వ్యక్తం చేసారు.. ఈ నిరసనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ, మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసారు.     మోదీ దళిత వ్యతిరేక ఆలోచనా ధోరణిని కలిగి ఉన్నారని విమర్శించారు.. 'సంకల్పంతోనే అన్నీ మొదలవుతాయి.. మోదీ హృదయంలో దళితులకు స్థానం ఉంటే, విధానాల రూపకల్పన మరోలా ఉండేది.. తన ప్రసంగాలన్నింటినీ కలిపి గుజరాత్‌లో మోదీ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు.. పారిశుద్ధ్య పనుల్లో దళితులు ఆధ్యాత్మిక సంతృప్తి పొందుతారని అందులో రాశారు.. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలకు ఆ మాటలే తార్కాణాలు’ అని అన్నారు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.. విద్య, దేశాభివృద్ధిలో దళితుల భాగస్వామ్యాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ వ్యతిరేకిస్తాయని విమర్శించారు.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని తమ పార్టీయే తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని రక్షించి తీరుతామని రాహుల్‌ స్పష్టం చేసారు.

పోలవరం ప్రాజెక్ట్ చివరిది..!!

  పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా కల్పించిన విషయం తెలిసిందే.. అయితే ఇకమీదట వేరే ఏ ప్రాజెక్ట్ కు జాతీయహోదా కల్పించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.. తాజాగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో పోలవరానికి జాతీయ హోదా కల్పించారు.. అందుకే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని మేం పనిచేస్తున్నాం.. దాని తర్వాత ఇక ఏ ప్రాజెక్టునూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. కొండప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు 90% కేంద్రం, 10% రాష్ట్రం నిధులు అందిస్తాయి.. కరువుపీడిత ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూరుస్తాయి.. రాజ్యాంగం ప్రకారం సాగునీటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విధానం ఇప్పుడు లేదు.. ఒకవేళ రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు చేయాలనుకుంటే ఈ నిష్పత్తి కిందికే వస్తాయి.. ఇకమీదట జాతీయ ప్రాజెక్టులుగా దేన్నీ ప్రకటించం’’ అని అన్నారు.     మరోవైపు ఈ విషయంపై తెరాస ఎంపీ వినోద్‌కుమార్‌ గడ్కరీకి లేఖ రాసారు.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారమే తెలంగాణ ఏర్పడినందున ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. కాళేశ్వరం కానీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్నికానీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతోపాటు ఎంపీలంతా గత కొన్నేళ్లుగా నిరంతరం విజ్ఞప్తిచేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.. కేంద్రం తగిన నిధులు కేటాయించకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరిలపై  సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిందని, అందులో కనీసం ఒక్కప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు.

బీజేపీ స్కెచ్.. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.!!

కర్ణాటక ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా సీఎం పదవిపై చర్చలు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.. దానికి కారణం అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటమే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.. తరువాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీకి అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యంగా.. తక్కువ సీట్లు సాధించిన జేడీఎస్ కు మద్దతిచ్చి కుమారస్వామిని సీఎం చేసింది.     అయితే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి రంధ్రం పడిన పడవలో సముద్ర ప్రయాణంలా తయారైంది.. మంత్రిపదవులు విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తోందట.. ఇప్పటికే యడ్యూరప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొందరిని ఢిల్లీలో కలిసి రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.. దీంతో త్వరలో యడ్యూరప్ప సీఎం అవుతారంటూ చర్చలు మొదలయ్యాయి.. అయితే ఈ విషయంపై కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే మీడియాతో మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు మాట్లాడారని తమ దగ్గర సమాచారం ఉందని అన్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది, అయితే వారి ప్రయత్నాలు ఫలించవని ఈశ్వర్ ఖండ్రే ధీమా వ్యక్తం చేసారు.. చూద్దాం మరి బీజేపీ కర్ణాటకలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో.

కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయింది

  జీవీఎల్ నరసింహారావు.. ఈమధ్య ఈపేరు బాగా వినిపిస్తుంది.. టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేయడమే టార్గెట్ గా ఆయన పెట్టుకున్నట్టున్నారు.. అందుకే టీడీపీ మీద తెగ విమర్శలు చేస్తున్నారు.. అసలు ఆయన విమర్శలు చూసి జీవీఎల్ అంటే గ్రేట్ విమర్శల లీడర్ అని ఛలోక్తులు కూడా వినిపిస్తున్నాయి.. ఆ మాటని నిజం చేస్తూ జీవీఎల్ మరొకసారి టీడీపీ మీద విమర్శలు చేసారు.. రీసెంట్ గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగడం.. ఈ ఎన్నికలో టీడీపీ మద్దతిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై మాట్లాడిన జీవీఎల్.. కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకి ఇది ఘోర పరాజయం అన్నారు.. కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.. స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు.. కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్‌ అన్నారు.

గుజరాత్‌లో 4వేల కోట్ల పల్లీల స్కామ్..!!

  కాదేది స్కాముకి అనర్హం అని నేతలు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటారు.. తాజాగా గుజరాత్ లో 4 వేల కోట్ల విలువైన పల్లీల స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో వేరుశనగను ఎక్కువగా పండిస్తారు.. రైతుల వద్ద నుంచి ఈ పంటను నాఫెడ్, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేకరించి గోడౌన్లలో ఉంచుతారు.. అయితే అధికారులతో కలిసి అధికార పార్టీ బీజేపీ నేతలు కొందరు.. రైతుల నుంచి సేకరించి గోడౌన్లలో దాచిన వాటిని రహస్యంగా మిల్లర్లకు అమ్మేశారు.. వాటి స్థానంలో ఇసుక, రాళ్లు పెట్టి ప్లాన్ ప్రకారం బుగ్గి చేయడం ప్రారంభించారు.. ఆరు నెలల్లో నాలుగు అగ్నిప్రమాదాలు జరిగి గోడౌన్లలోని సరుకంతా తగలబడిపోయినట్లు రాసుకున్నారు.. వరుసగా అగ్నిప్రమాదాలు జరగడంతో అనుమానమొచ్చి ఎంక్వయిరీ చేయగా ఈ స్కామ్ బయటపడింది.. ఈ స్కామ్ లో ఇప్పటికే 27 మంది అరెస్ట్ కాగా, వారిలో సుమారు 20 మంది బీజేపీ నేతలు ఉన్నారు.. నీతికి, నిజాయితీకి మారుపేరని చెప్పుకునే బీజేపీ నేతల స్కామ్ బయటపడటంతో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.