విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్

  ఏపీకి మరో భారీ పెట్టుబడికి సిద్దమైంది. విశాఖలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఈ సెంటర్‌ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది. మూడు సముద్రపు కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ల ద్వారా వైజాగ్‌‌లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ రూపుదిద్దుకోనుంది. విశాఖలో 6 బిలియన్‌ డాలర్లతో డేటా సెంటర్‌ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్‌ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఇది గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుంది. హౌసింగ్‌ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (AI) హబ్‌ల ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది.హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖపట్నం మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో ఈ డేటా సిటీని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.   

కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చింది భూమనే : ఓ.వి.రమణ

  భూమన హైందవ ధర్మ పరిరక్షకుడు కాదు..టీటీడీని దోచేసిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు ఓ.వి.రమణ విమర్శించారు. కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చిందే భూమన అని ఆరోపించారు.బిక్షగాళ్లను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయించారని పేర్కొన్నారు. కలెక్టర్లకు టార్గెట్ లు ఇచ్చి ఎవరిని పడితే వారిని పట్టుకొచ్చి వివాహాలు చేయించారని ఆయన తెలిపారు. వైజాగ్ లో దళిత గోవిందం నిర్వహించి ఒక్క అగ్గిపెట్టెకు 12వేలు ఖర్చు చేశారు. ఆడిట్ రిపోర్టులో బయటపడిందని రమణ పేర్కొన్నారు.సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క కాటేజీ అయినా కట్టించావా భూమన అని ఆయన ప్రశ్నించారు. తిరుమల టీటీడీ ఛైర్మన్ గా రెండు సార్లు పనిచేసిన భూమన సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా..? ఆయన ప్రశ్నించారు. బుషికేష్ లో 20ఎకరాల స్థలాన్ని నొక్కేయాలని చూస్తే దాత ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వకుండా వెళ్లిపోయారని అన్నారు. వైసీపీ హయాంలో కొండపైన వ్యభిచారం జరిగిందని సాక్షాత్తు చిన్నజియ్యర్ స్వామే చెప్పారని ఆరోపించారు . దేవుడి సొమ్ములో కమిషన్ కు కక్కుర్తి పడిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని తెలిపారు.శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం కాదని భూమన చెప్పగలడా..? అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికే క్రైస్తవుడే తెలిపారు.తాడేపల్లి, లోటస్ పాండేలలోని గోడలపై బైబిల్ సూక్తులే కనిపిస్తాయిని వెల్లడించారు. తిరుమల టీటీడీని రోడ్డుపై లాగొద్దు భూమనకు రమణ సూచించారు.  

వార్డెన్ చొరవ..హాస్టల్ విద్యార్థుల సంరక్షణకు భరోసా

  హాస్టల్ కు వచ్చామా..  అటెండెన్స్ వేసామా మెనూ ఇచ్చామా ఇందులో ఏమైనా మిగులుతాయా ..ఇంటికి వెళ్ళామా అనే ధోరణితో పని చేసే వార్డెన్లు చాలా చోట్ల కనపడుతుంటారు. అయితే ఈ  వార్డెన్ అందుకు భిన్నమైన ధోరణితో విద్యార్థుల పట్ల, విధుల పట్ల అంకితభావంతో పని చేస్తూ విద్యార్థుల పరిశుభ్రతకు ,ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సొంత బిడ్డలకు ఎలా కేర్ తీసుకుంటారో అలా హాస్టల్ లో కూడా కేర్ తీసుకుంటూ సంరక్షణ చేస్తున్నారు. వైయస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో  సాంఘిక సంక్షేమ  హాస్టల్ లో ఈ వార్డెన్ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) పనిచేస్తూ విద్యార్థుల సంరక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు హాస్టల్ భవనం 45 సంవత్సరాల క్రితం నిర్మించినది అయినా కూడా అందులో వార్డెన్ గుప్తా విద్యార్థులకు చేసిన ఏర్పాట్లు శభాష్  అనేలా ఉన్నాయి.ఆ హాస్టల్లో బెడ్ సీట్లు పెట్టుకోవడానికి దాత ద్వారా చెక్కతోచేసిన బీరువా ఏర్పాటు చేయించారు.పిల్లలు తేమతో కూడిన ప్లేటు పెట్టేలో పెట్టుకుంటే క్రిములుచేరడం, దుర్వాసన రావడం జరుగుతుందని ప్లేట్లు బయటే పెట్టుకునేందుకు ఒక స్టాండ్ ను ఏర్పాటు చేశారు. పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు తగిన మందులను సూచిస్తూ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ టాబ్లెట్ అందుబాటులో ఉంచారు.అవసరమైనప్పుడు వారికి అందజేస్తారు. ఇంగ్లీష్ మందులే కాకుండా దగ్గుకు కరక్కాయ లాంటి ఆయుర్వేద గుణం కలిగిన వాటిని కూడా అందుబాటులో ఉంచారు. పిల్లలు చదువుకునేందుకు లైబ్రరీ కూడా అందులో ఉంచి పుస్తకాలు సమకూర్చి పెట్టారు. గ్లాసులు, కప్పులు విద్యార్థి ఎవరిది వారు పెట్టుకునేలా స్టాండ్లు ఏర్పాటు చేశారు. స్టోర్ రూమ్ లో వస్తువులు పురుగులు ,చీమలు చేరకుండా బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విద్యార్థులను తన చేతనైనంత వరకు సొంత బిడ్డల్లా ఆలోచించి, వసతులు ఏర్పాటు చేసిన వార్డెన్ గుప్తాను పలువురు అభినందిస్తున్నారు. అయితే అన్నీ ఆయన బాగా చేస్తున్నా పిల్లలు తాగేందుకు సురక్షిత మంచినీరు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం దురదృష్టకరంగా చెప్పవచ్చు. సురక్షిత మంచి నీటి ప్లాంట్ అనేక సంవత్సరాలనుండి పని చేయక పోయినా  అధికారులు మారమ్మత్తు చేయకకపోవడం హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది.

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు బెయిల్

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో జగన్ మోహన్‌ను రావును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించటంతో పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష, రెండు షూరిటీ సంతకాలతో సమర్పించాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలతో పాటు హెచ్ సీఏ ఎన్నికల్లో 2016లో జరిగిన శ్రీచక్రా క్లబ్ ఫోర్జరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైందని తెలిపారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది.  గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని సీఐడీ తెలిపింది. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ చెబుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ టికెట్ల వివాదంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.ఇటీవలే జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.   

ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు

  ఏపీలో ప్రతీ కుటుంబ సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు  అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామ్లీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోరు కేటాయించాలి.  ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి. దీని కోసం ఫ్యామిలీ కార్డును తీసుకురండి. ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి. ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపర్చడంతో పాటు... పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  అంతే కాకుండా... కుటుంబంలో ఎంత మంది ఉంటే.. వారందరికీ ఆ కార్డును ఇస్తే.. ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి.” అని సీఎం సూచించారు.ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉల్లి రైతులకు చంద్రబాబు తీపి కబురు

  ఘాటైన ఉల్లిపాయలు పండించే కర్షకులకు ఏపీ  సీఎం చంద్రబాబు చల్లని వార్త చెప్పారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో  ముఖ్యమంత్రి  తాజాగా  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. వెంటనే రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున .. అంటే కేజీ రూ.12కు ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు.  కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఉల్లికి రేటు వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని  చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతో పాటు ఆధునీకికరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని  సీఎం దిశానిర్దేశం చేశారు.

మత్తు కలిగించే దగ్గు మందు బాటిళ్లు పట్టివేత

    గంజాయి, డ్రగ్స్‌ లభించక పోవడంతో డ్రగ్స్‌ మత్తుకు అలవాటు పడిన  వ్యక్తులు నిషేధిత దగ్గు మందు టానిక్‌లను తాగి మత్తులో మునిగిపోతున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్‌ సీఐ బాలరాజు, ఎస్సై రవి, సిబ్బంది కలిసి పక్కా సమాచారంతో సరూర్‌నగర్‌ కొత్తపేట ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్‌ అనే వ్యక్తిని రోడ్‌ నెంబరు 6 అష్టలక్ష్మీ టెంపుల్‌ మందమల్లమ్మ చౌరస్తా నుంచి 102 కోడిన్‌ పాస్పెట్‌ దగ్గుమందు బాటిళ్లను కొనుగోలు తీసుకొని బైక్‌పై వెళ్తుండగా  పట్టుకున్నారు. రూ.190 ఎంఆర్‌పీ ధర కలిగిన ఈ దగ్గు మందు బాటిల్స్‌ను లక్ష్మాణ్‌ తన  ఇంట్లో పెట్టుకొని రూ. 350 ఒక బాటిల్‌ను అమ్మకాలు చేపడుతున్నట్లు  విచారణలో వెల్లడయ్యింది. కోడిన్‌ పాస్పెట్‌ బాటిళ్లను డ్రగ్స్‌ ఆధారిటీ గతంలో నిషేధించారు. దగ్గు మందును డాక్టర్‌ చీటితో మాత్రమే అమ్మకాలు జరపాలి. కాని కొందరు అక్రమంగా దగ్గు మందును తయారు చేస్తూ ఎవ్వరికి అనుమానం  రాకుండా అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో మత్తు కలిగించే గంజాయి ప్యాకెట్‌ ధర రూ. 500 ఉంది. ఒక గ్రాము ఎండిఎంఎ డ్రగ్‌ విలువ రూ. 5000 వేలు ఉంది.  అంత డబ్బుతో  కొనుగోలు చేయలేని వారు, మత్తుకు బానిసగా మారిన వారు ఇలా  మార్కెట్‌ అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న దగ్గు మందును  వాడి మత్తులో మునిగి పోతున్నారు.ఇలాంటి నిషేధిత మత్తు మందులను అమ్మకాలు జరుపుతున్న మెడికల్‌  హల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫొ ర్స్‌మెంట్‌ సీఐ బాలరాజు డ్రగ్స్‌ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు.ఇలాంటి నిషేదిత కోడిన్‌ పాస్పెట్‌ మందును పట్టుకున్న సిఐ, సిబ్బందిని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌. కిషన్‌, ఏఈఎస్‌ జీవన్ కిరణ్  అభినందించారు.

హైదరాబాద్‌కి బీచ్ రాబోతోంది

  హైదరాబాద్‌లో తొలి ఆర్టిఫీషియల్ బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్ గూడ సమీపంలో నిర్మించనున్నారు. బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో 225 కోట్ల ప్రాజెక్టులో వ్యయంతో దీని నిర్మాణం డిసెంబర్ 2025లో ప్రారంభమవుతుంది. బీచ్‌సైడ్ ఫీల్ రావడానికి..సహజ సిద్ధమైన సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.  ప్రాజెక్టులో అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్ళు, వేవ్ పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు & ఫుడ్ కోర్టులు ఉంటాయి. తేలియాడే విల్లాలు మరియు స్టార్-కేటగిరీ హోటళ్ళు.. బంగీతో సహా సాహస క్రీడలు ఉంటాయి. జంపింగ్, సెయిలింగ్, స్కేటింగ్ మరియు శీతాకాలపు ఆటలు.. పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలు వినోదం మరియు విశ్రాంతి సౌకర్యాలు కల్పించనున్నారు. థియేటర్లు, ఫుడ్ కోర్టులు, అలంకార ఫౌంటెన్లు మరియు ఆధునిక వేవ్ పూల్ ఉన్నాయి.  

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే

  వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి  హెలికాప్టర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియాల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. అధికారులను అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకం అని చెప్పారు.  ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావులను ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామ, అల్లుడు అతి తెలివితేటలతో ఒకరు ఆణిముత్యాం మరొకరు స్వాతిముత్యం అని అన్నారు. కాళేశ్వరం ఘోష్ నివేదికపై శాసన సభల్లో చర్చకు పెడుతామని, మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు.  మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని సీఎం రేవంత్ తెలిపారు.

వరదల్లో చావు వచ్చింది

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భారీ వర్షాలతో మెదక్‌ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో జరిగింది.  స్థానికుడైన బండి హరి అనే అంగ వికలాంగ యువకుడు గుండె పోటుతో బుధవారం మృతి చెందగా సాయంత్రం జరగాల్సిన అంత్యక్రియలు ఇబ్బందికరంగా ముగిశాయి. దహన సంస్కారాలు జరిపేందుకు వెళుతున్న వాళ్లకు భారీ వర్షాల కారణంగా ఉధృతంగా పారుతున్న గొల్ల వాగును దాటేందుకు ట్రాక్టర్, జెసిబి సహాయంతో శవాన్ని బంధువులను వాగు దాటించాల్సి వచ్చింది. చివరి చూపుకు హాజరైన బంధువులు గ్రామస్తులు సైతం వాగును దాటేందుకు తాడును ఆధారంగా తీసుకుని నానా తంటాలు పడుతూ అంతిమయాత్రను ముగించారు.   

వరదలో చిక్కుకున్న ఐదుగురిని... రక్షించిన ఆర్మీ హెలికాప్టర్లు

  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి, వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నర్సింలు,  ధ్యానబోయిన స్వామి, మరో ఇద్దరు బిసే ప్రదీప్, బిసే ఛాయా అక్కడే చిక్కుకుపోగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు.  ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితి పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఉదయమే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే దగ్గరుండి పర్యవేక్షించారు.  అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకొని క్షేమంగా చేరుకున్న వారిని పరామర్శించారు. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే అక్కడికి చేరుకున్నారు.  బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడే ఉన్నారు. లింగన్నపేట లో వాగులో చిక్కుకుపోయిన ప్రవీణ్ ను క్షేమంగా ఒడ్డుకు చేర్చే వరకు కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించి.. ఎన్డీఆర్ ఎఫ్ బృందానికి సలహాలు సూచనలు అందించారు. గురువారం ఉదయమే మళ్లీ ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్దకు కలెక్టర్, ఎస్పీ చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించారు. ప్రాజెక్టులో నీటి మట్టం, ఎగువ నుంచి ఎంత వస్తుందని ఆరా తీస్తూ.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారికి మనోధైర్యం కల్పించారు.  ఏడుగురు క్షేమంగా గమ్యం చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన విషయం తెలిసి దగ్గరుండి అందరిని క్షేమంగా తరలించడంలో విశేష కృషి చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని, వారికి అధికార యంత్రాంగాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం...69 గేట్ల ఎత్తి నీటి విడుదల

  ప్రకాశం బ్యారేజీకి వద్ద భారీగా వరద వచ్చి చేరుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి  4.3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 69 గేట్ల ద్వారా 3.93 లక్షల క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే ప్రమాదం ఉంటంతో కృష్ణ పరీహక ప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులిచింతల నుంచి వస్తున్న నీరు మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక పొలాలలోకి వెళ్లవద్దని ఇప్పటికే సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,10,546 క్యూసెక్కులు చేరుతోంది.  

గూగుల్ మ్యాప్ బోల్తా కొట్టించింది.. వరదలోకి దారి చూపింది!

గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ప్రయాణాలు సాగించడం ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నది. అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా, ప్రయాణాలు చేసేవారు ఆ మ్యాప్ ల మీదే ఆధారపడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తున్న ఓ కుటుంబంలో ఘోర విషాదం సంభవించిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని  సవాయి భోజ్‌ను  దర్శించుకుని వ్యాన్ లో తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం గూగూల్ మ్యాప్ సూచించిన విధంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ మ్యాప్ వారిని నేరుగా బనాస్ వరద నీటిలోకి గైడ్ చేసింది. దీంతో వారు ప్రయాణిస్తున్న వ్యాన్  వరద నీటిలో కొట్టుకుపోయింది. చిత్తోర్ ఘడ్ జిల్లా  రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగిన ఈ ఘోర ఘటనలో ఓ బాలిక మరణించింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు.  స్థానికుల సహకారంతో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు.  వివరాలిలా ఉన్నాయి. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం భిల్వారాలోని సవాయి భోజ్‌ను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించి వారు రష్మి పీఎస్ పరిధిలోని సోమి–ఉప్రెడా మధ్యనున్న కల్వర్ట్  మీదుగా ప్రయాణించాల్సి ఉంది. వాస్తవానికి ఆ కల్వర్ట్ గత మూడేళ్లుగా బంద్ అయి ఉంది.  దానిపై రాకపోకలను నిషేధించారు. అయితే గూగుల్ మ్యాప్ ఆ కల్వర్టు మీదుగానే ప్రయాణించాలని సూచించడంతో వారు అ లాగే ముందకు సాగారు. కానీ ఇటీవలి భారీ వర్షాలకు  బనాస్ నదికి వరద పోటెత్తి ఆకల్వర్టు మార్గాన్ని ముంచేసింది. అయితే గూగుల్ అంటూ ముందుకు సాగిన వారు, తమ వ్యాన్ ను కల్వర్ట్ పైకి తీసుకు వెళ్లారు. అయితే వరద ప్రవాహానికి ఆ వ్యాన్ కొట్టుకుపోయింది. ఈ ఘటన  జరిగిన సమయంలో వ్యాన్ లో తొమ్మండుగురు ఉణ్నారు.  స్థానికులు వెంటనే స్పందించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత పోలీసులు స్థానికుల సహకారంతో ఐదుగురిని రక్షించగలిగారు. ఒక బాలిక మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్ లను చూసి ప్రయాణాలు సాగించడం ప్రమాదకరమని ఈ ఘటనతో మరోసారి రుజువైందని పరిశీలకులు అంటున్నారు.  

భగవద్గీత పుస్తకాలతో వినాయక విగ్రహం

దేశ వ్యాప్తంగా  వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో, అత్యంత ఘనంగా గురువారం (ఆగస్టు 27)న జరుపుకున్న సంగతి తెలిసిందే. వాడవాడలా గణేస్ మంటపాలను ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకోనున్నారు. అయితే పందిళ్లలో వినాయ విగ్రహాల ఏర్పాటులో నిర్వాహకులు తమ సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నారు.   వినూత్న రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో  చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో  గణనాథుడి విగ్రహాన్ని పూర్తిగా పుస్తకాలతో రూపొందించారు. ఇందు కోసం నిర్వాహకులు ఐదు వేల భగవద్గీత పుస్తకాలను ఉపయోగించారు. వీటితో పాటుగా  1500 'వేల్ విరుత్తమ్', 1008 'మురుగన్ కావసం' వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఉపయోగించారు. ఐదు వేల బగవద్గీత పుస్తకాలతో రూపొందించిన గణనాథుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఈ మంటపానికి తరలి వస్తున్నారు. ఇక ఈ మండపం వద్ద పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా నిర్వాహకులు అన్ని చర్యలూ తీసుకున్నారు. భజనలు, సంకీర్తలలతో మండపం, పరిసర ప్రాంతాలు ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్నాయి.  

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.  మిన్నెసోటా మినియాపొలిస్‌లో ని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.  మరో 14 మంది చిన్నారులు సహా 17 మంది గాయపడ్డారు.  విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా దుండగుడు చర్చి కిటికీల గుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్ మ్యాన్ గా గుర్తించారు.  కాల్పులకు పాల్పడిన సాయుధుడు తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.  అతడి తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు స్వాధీనం చేసుకున్న తుపాకీపై న్యూక్ ఇండియా’ ,  మాషా అల్లా అని ఉంది. కాల్పుల ఘటనకు ముందు అతడుసోషల్ మీడియాలో పలు వీడిమోలు పోస్టు చేశాడు.  

తెలంగాణలో 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్

తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం (ఆగస్టు 27) కామారెడ్డిలో అతి భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరాన్ని నీరు ముంచెత్తింది. పలు కార్లు, ద్విచక్రవాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 28( కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. భారీ వర్షాల కారణంగా పది జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది. ఇక పోతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   ఇక  ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు పెరిగితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు సూచిస్తున్నారు. 

భారీ వర్షాలు.. తెలంగాణలో స్తంభించిన జనజీవనం!

తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వివిధ జిల్లాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో  రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 44 పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు అయ్యాయి. మరిన్నింటిని దారి మళ్లించారు. భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో చెరువులు కుంటలు తెగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి , మెదక్ జిల్లాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.  అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది..లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. 

యూపీలో కరెన్సీ వర్షం కురిపించిన కోతి

మర్కట చేష్టలకు అర్ధం ఉండదు. ఒక్కోసారి అవి చేసే పనులు వినోదం కలిగిస్తాయి. ఇంకోసారి విస్మయ పరుస్తాయి. అలా విస్మయం కలిగించేలా ఓ కోతి చెట్టెక్కి మరీ నోట్ల వర్షం కురిపించింది. ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని దోదాపూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.   ఓటీచర్ టీచర్.. ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం తన వెంటన 80 వేల రూపాయల నగదు కూడా తెచ్చిరు. ఆ నగదును ఓ సంచిలో ఉంచి తన బైక్ డిక్కీలో భద్రపరచుకున్నాడు. ఇక కార్యాలయం వద్ద ఆయన తన పనిలో ఉన్న సమయంలో ఓ కోతి.. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఏకంగా బైక్ డిక్కీ తెరిచి అందులో ఉన్న డబ్బు సంచినీ ఎత్తుకెళ్లి సమీపంలోని చెట్టెక్కి కూర్చుంది.   తీరిగ్గా చెట్టుపై కూర్చుని సంచీని తెరిచి చూసింది. అందులో తాను తినడానికి పనికివచ్చే పదార్ధం ఏదీ లేకపోవడంతో.. కోపగించింది. అంతే తన కోతి చేష్ట చూపింది. సంచీలోని నోట్లను తీసి గాలిలోకి విసిరేయడం ఆరంభించింది. చెట్టు పై నుంచి నోట్లు రాలడంతో జనం వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.