తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు.. మరో ఆరు రోజులు వానలే వానలు
ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వదలడం లేదు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మరో ఆరు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలు, ఉత్తర తెలంగాణలకు వర్షం ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. ఏపీలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది.
ఇలా ఉండగా ఏపీలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.