టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.

తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్న ఈ తప్పులు పిల్లలను దూరం చేస్తాయ్..!

  పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన,  కష్టమైన పని. తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును  మెరుగ్గా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి, కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తిమీద సాము వంటిదనే చెప్పవచ్చు.  ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు  ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని  తల్లిదండ్రులు  పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు.    విద్య, మంచి బట్టలు,  ఖరీదైన వస్తువులు ఇస్తారు.  అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రుల 3 తప్పులు ఉన్నాయి.  అవేంటంటే..   రిజెక్ట్ చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతుంటారు.   ఈ కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు,  పిల్లల మధ్య సరైన వాతావరణం  లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం, రిజెక్ట్ చేయడం చేస్తారు.దీని కారణంగా  పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు.ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి. సమయం.. నేటికాలం  తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని  డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు.  దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతుంది.   పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీలవుతారు.  తల్లిదండ్రులు  పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం. పోలిక..  తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతారు. చదువు అయినా, ఆటలు అయినా, ప్రతి చిన్న విషయానికి  పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి, వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. తమ తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తారు.                                     *రూపశ్రీ.

బద్దకం వీడండి

చింతిస్తూ కూర్చోకుండా చింత కలిగించే విషయాలను చీపురుతో చితక్కొడదాం. అయితే ఆ చింతింప జేసే విషయాలు ఏంటో చూద్దాం.  మొదటిది 1.బద్ధకం, సోమరితనం, అలసత్వం... పేర్లు వేరైనా భావం ఒక్కటే. ఇదే నన్ను, నిన్ను, సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగం. ఇదే ఎక్కువ బాధ పెడుతున్న విషయం. జపాన్ చాలా చిన్న దేశం అయినా మనకన్నా ఏంతో ఎత్తులో ఉంది. భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీలు ప్రతినిత్యం పలకరిస్తున్నా అగని పోరాటం వాళ్ళది. మనం మాత్రం పనికి రాని బిగ్ బాస్ లు, కుల్లిజోకుల జబర్దస్త్ లు చూసుకుంటూ గడిపెద్ధాం.   రెండవది 2. ప్రశ్నించే దైర్యం లేక పోవడం. పక్కవాడికి అన్యాయం జరిగితే నాకేంటి నేను నా కుటుంబం బాగుంది కదా అనే భావం మన నరనరాల్లో కూరుకు పోయింది.  మూడవది 3. ఐక్యత లేక పోవడం. ముసల్మానుల కాలం నుండి తెల్లదొరల కాలం వరకు మనలోని లోపం అదే.  నాలుగవది. 4. శుభ్రత లేకపోవడం. నదులు శుభ్రంగా ఉంచలేం(జపాన్ లోని మురికి కాలువ మన యమునా నది కన్నా 10రెట్లు స్వచ్చంగా ఉంటుంది) పరిసరాలు శుభ్రంగా ఉంచలేము. మనకెందుకు ghmc వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారుగా అంటారా? పోని వాళ్ళకి ఫిర్యాదు చేశారా?? రోడ్ల మీద ఉమ్మి , చెత్త, యూరిన్ వెయ్యకుండా ఎంతమంది ఉన్నారు? ఇక వ్యవస్థను శుభ్రంగా కూడా ఉంచలెం. ఏ నాయకుడు నిజం నవాబులా వ్యవహరిస్తున్నాడో అతనికే మళ్లీ పట్టం కడతాం. ఎవడైతే కోట్ల రూపాయల అవినీతి చేస్తాడో అతన్ని నాయకుడిని చేస్తాం. విద్య, వైద్య, వివాహ... ఇలా ఎన్నో వ్యవస్థలను భ్రష్టు పట్టించాం  5. కుల మత వర్గ వర్ణ వివక్ష... ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు, వర్ణాలు ఉండవు. మనం అంతా మనుషులమే అని మరిచి మనలో మనం కొట్టుకుచస్తా ఉంటాం. అరే వాడు మన కులపొడురా వాడికే మన ఓటు అంటాం గాని, మన బతుకులు బాగు చేసే వాడురా వాడికి ఓటు వేద్దాం అని చాలా మంది ఆలోచించం.  వీటన్నింటిలో ముఖ్యంగా ఆలోచించాల్సింది సోమరితనం గురించి. సోమరితనం రాచపుండు అని గాంధీజీ అన్నట్టు, సోమరి పోతు దేశానికే భారం.  మన భారత దేశంలో మనమే మన జాతీయ సంపద. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన రెండవ అతిపెద్ద దేశం. అయినా ఇంకా వెనుక బడిన దేశం. ఉద్యోగాలు లేవు లేవు అని గగ్గోలు పెడతాం, కానీ ఆలోచిస్తే ఎన్ని ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టీ , టీవీలు కంప్యూటర్లు సినిమాలు చూస్తూ మన విలువైన జీవితాన్ని ఏం సాధించకుండా సమాధి కట్టెద్ధాం. ఏముందీ..పుట్టాం..పెరిగాం...చదివాం...ఏదో బొడి ఉద్యోగం తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాం, వాళ్ళ బాగోగులు చూసాం, వాళ్ళ పెళ్లి చేశాం..ముసలి అయ్యం..ఇంకేం ఉంది...కృష్ణా రామా అనుకుంటూ గడిపెద్ధాం...ఇంతేనా చరిత్రలో మనకో పేజీ ఉందొడ్డూ??  KFC owner 60 ఏళ్ల వయసులో KFC స్థాపించారు. అది చదవడం వరకే అలాంటివి చెయ్యడానికి మనం పునుకోము . ఒక లక్ష్యం నిర్దేశించుకుని ముందడుగు వెయ్యము. అంతేగా ఈ జీవితం ◆వెంకటేష్ పువ్వాడ

అమ్మాయిలు తప్పనిసరిగా చెయ్యాల్సిన పని!

  ఈ కాలంలో అమ్మాయిలు ఎంచక్కా చదువుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఒక నిర్ణీత వయసు రాగానే పెళ్లి అనేది సాధారణ విషయం. అయితే పెళ్లికి ముందు పుట్టింట్లో నాన్న దగ్గర గారాలు పోయి, అమ్మ దగ్గర బుజ్జగింపులు చేసి, అవ్వతాతల దగ్గర డిమాండ్ చేసి ఇలా అందరి దగ్గరా హాయిగా డబ్బు తీసుకుని అవసరాలు తీర్చేసుకుంటారు. కానీ పెళ్లి అయ్యాక అసలు సీన్ అన్నట్టు ఎంత కట్టుకున్నవాడు అయినా భర్త దగ్గర చెయ్యి చాపలేరు కొంతమంది అమ్మాయిలు. ఒకవేళ స్వేచ్ఛగా అడిగి తీసుకున్నా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మొగుళ్ల దగ్గర, అత్త మామల  దగ్గర ఏదో ఒక సంఘటనలు జరుగుతుంటాయి. ఫలితంగా ఒకానొక గిల్టీ ఫీలింగ్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఎంతో మంది అమ్మాయిల జీవితాలలో ఉంటాయి. అయితే అలా కాకుండా అమ్మాయిలు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అంటే దానికి పరిష్కారం అమ్మాయిలు తమకు తాము ఆర్థిక భరోసా ఇచ్చుకోవాలి. విద్యార్హత, ఉద్యోగం! ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ లు, బ్యాంకింగ్, పీజీ లు పిహెచ్డి లు ఇవి ఇవే పెద్ద ఉద్యోగాలని, వీటి ద్వారా ఆర్థిక భరోసా సాధ్యమని అనుకునేవాళ్ళు నిజంగా అమాయకులు అనుకోవాలి.  పదవ తరగతి నుండి డిగ్రీ వరకు కనీస స్థాయి విద్య చదివిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ సమాజంలో. అయితే వాళ్ళందరూ ఈ పోటీ ప్రపంచంలో ఈ విద్యార్హత పెద్దది కాదులే అనుకోవడమే పెద్ద వైఫల్యం. పడవ తరగతి మొదలు డిగ్రీ వరకు ఎన్నో అవకాశాలు ఉంటూనే ఉంటాయి. చెయ్యాల్సిందల్లా ప్రయత్నమే.  ప్రతి మనిషిలోనూ ఏదో ఒక విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని ఫాలో అవుతూ దాన్ని పదును పెట్టుకుంటూ అందులో నైపుణ్యం సంపాదిస్తే అందులోనే పైసలు సంపాదించొచ్చు. ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పడం నుండి దగ్గరలోనే ఉన్న షాప్స్, ఆఫీస్ లు, షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూమ్స్ వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి చోట్ల పని చేసేవాళ్ళు సరైన వ్యక్తిత్వం కలిగి ఉండరు, తప్పు దారిలో వెళ్తారు లాంటి పిచ్చి ఆలోచనల వల్ల అమ్మాయిలు ధైర్యం చేయడం లేదు. సరైన వాక్చాతుర్యం, ఉన్నంతలో శుభ్రంగా ఉండటం, కాసింత ఓపిక ఉంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమీ చేయకుండా ఉండటం కంటే ఏదో ఒకటి అయినా చేయడం ఉత్తమం కదా!! ఈ ఉద్యోగాలలో వచ్చే సంపాదనలో కనీసం 40-50% డబ్బును అమ్మాయిలు జాగ్రత్త చేసుకోగలిగితే గొప్ప ఆర్థిక భరోసా ఉంటుంది. జీవితంలో ధైర్యం దానికదే వస్తుంది. విభిన్న మార్గాలు! చదువుతో సంబంధం లేని మార్గాలు కూడా బోలెడు ఉన్నాయి. మొబైల్, కెమెరా గురించి కాస్త అవగాహన పెంచుకుంటే వంటిట్లో వండర్స్ చేసే మహిళలు యూట్యూబ్ లో అదరగొట్టేస్తారు. కిచెన్ చానల్స్ ను స్టార్ట్ చేసి దిగ్విజయంగా నడుపుతూ లక్షలు సంపాదిస్తున్న మహిళలే నిదర్శనం మరి. వాళ్లలో ఉన్నది మనలో లేనిది ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటే మనలో లేనిది అవగాహన మాత్రమే అనే విషయం ఒప్పుకుని తీరాలి. కొందరు కారణాలు వెతికి చూపిస్తారు. కానీ నిజానికి ఉన్నదాంట్లో విభిన్నంగా చూపించడంలో సహజమైన ప్రతిభ ఉంటుంది.  పొదుపు భరోసా! సంపాదించుకునే దాంట్లో 40-50% పొదుపు సాధ్యమా అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఆలోచిస్తే నిజమే సాధ్యమే అనే విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఊరికే బలాదూర్ గా ఏమి ఉండరు. వారి సంపాదన వాళ్లకు వుంటుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి కాని అమ్మాయిలలో సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లో ఇవ్వమని ఫోర్స్ చేసేవాళ్ళు చాలా తక్కువే. చాలా దిగువ తరగతి కుటుంబాలలో కూడా ఈ పరిణామాలు తక్కువే ఉంటాయి. కాబట్టి కనీసం 20% అయినా పొదుపు వైపు మళ్లించడం మంచిది. ఒకవేళ అలా అవ్వదు అనే అనుమానం వస్తే సింపుల్ గా వచ్చే సాలరీ ని తగ్గించి చెబితే సరోపోతుంది. ఇది మోసం అని అనుకునే కంటే భవిష్యత్తు గురించి జాగ్రత్త అనుకోవడం మంచిది. పొదుపు చేస్తున్నట్టు చెప్పినా ఎప్పుడూ ఆ పొదుపు గురించి డిస్కస్ చేయడం చాలా మంది అలవాటు కాబట్టి ఆ పొదుపును కూడా కాసింత రహాస్యంగానే చేసుకోండి తప్పు లేదు.  ప్రస్తుత కాలంలో కొందరు మగవాళ్ళు నాకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయి బాగా చదువుకున్నా ఉద్యోగం చెయ్యక్కర్లేదు ఇంట్లోనే ఉంటే బెస్టు, ఇంటిని, పిల్లల్ని చూసుకుంటేనే నాకు ఇష్టం అంటూ ఉంటారు. నిజానికి పెళ్లి అయిన తరువాత కూడా పిల్లలు పుట్టిన తరువాతే చాలా ఆర్థిక భారాలు పెరుగుతాయి.  అన్నిటినీ భర్త, అత్త మామలు ఇచ్చే డబ్బుతోనే మైంటైన్ చెయ్యలేరు హౌస్ వైఫ్స్. కాబట్టి పెళ్లికి ముందు ఆర్థిక భరోసా, పెళ్లి తరువాత విభిన్న మార్గాల సంపాదన ఎంతో ముఖ్యం.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

విజయానికి సరిహద్దు

అతనో సాధారణ మధ్యతరగతి మనిషి. కానీ జీవితంలో ఎలాగైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కసి ఉన్నవాడు. అందుకనే నిరంతరం ఒళ్లు వంచి పనిచేసేవాడు. యజమాని ఏ పని చెప్పినా కిమ్మనకుండా పూర్తిచేసి, తనేమిటో నిరూపించుకునేవాడు. కానీ ఆ పని ఒత్తిడిలో పడి తన కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయేవాడు. ఒక్క ఆదివారం మాత్రమే ఇంటిల్లపాదీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అవకాశం దక్కేది. తన కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానన్న బాధ అతని మనసులో మెదులుతూనే ఉండేది. భార్యాపిల్లలు కూడా అతను తమకోసం మరింత సమయం గడిపితే బాగుండు అని తెగ ఆశపడేవారు. ఇదిలా ఉండగా, ఆ మధ్యతరగతి మనిషి తన ఉద్యోగంలో ఎలాగైనా పదోన్నతి సాధించాలనుకున్నాడు. అందుకోసం మరిన్ని చదువులు చదివితే బాగుండు అనిపించింది. దాంతో ఓ ఏడాదిపాటు అతని ఆదివారాలన్నీ చదువుకే అంకితమైపోయాయి. రోజూ రాత్రివేళ మాత్రమే అతను తన కుటుంబంతో కాసేపు గడపగలిగేవాడు. అతను ఇంట్లో ఎక్కువసేపు గడపడం లేదంటూ భార్యపిల్లలు బాధపడితే... ‘మీకోసమే కదా కష్టపడుతోంది’ అంటూ వారి నోరు మూయించేవాడు. ఆ మాటలో నిజం ఉందని తోచడంతో భార్యాపిల్లలు ఇక మారు మాట్లాడేవారు కాదు. ఓ ఏడాది గడిచిపోయింది. మధ్యతరగతి మనిషి చదువు పూర్తయిపోయింది. ఊహించినట్లుగానే పదోన్నతి కూడా లభించింది. ఆయన చదువు పూర్తయి కోరుకున్న పదోన్నది లభించింది కాబట్టి, ఇకనుంచి తమతో మరింతసేపు గడుపుతాడని ఆశించారు భార్యాపిల్లలు. కానీ పదోన్నది లభిస్తే సరిపోతుందా! దాని సరిపడా పని కూడా ఉంటుంది కదా. పైగా ఆ మనిషి తన పనిలో వెనక్కి తగ్గే రకం కాదయ్యే! దాంతో అహర్నిశలూ కార్యాలయంలోనే గడిపేవాడు. ఏ అర్ధరాత్రికో పిల్లలు పడుకున్నాక కానీ ఇల్లు చేరుకునేవాడు కాదు. ఉదయం అతను లేచేసరికి పిల్లలంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. దాంతో అతను పిల్లలతో మాట్లాడే సందర్భాలే తగ్గిపోయాయి. తను కుటుంబానికి ఏమాత్రం సమయం వెచ్చించలేకపోతున్నానని అతనికి తెలుసు. కానీ ఇదంతా వారి భవిష్యత్తు కోసమే చేస్తున్నానని తల్చుకుని ఓర్చుకునేవాడు. ఉద్యోగంలో మరో మెట్టు పైకి ఎక్కితే ఇంత ఒత్తిడి ఉండదు కదా అని ఎదురుచూసేవాడు. అనుకున్నట్లుగానే ఇంకో ఏడాది గడిచేసరికి అతను డిపార్టుమెంట్ అధిపతిగా మారిపోయాడు. ఇది వరకు అతను పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు అలాకాదయ్యే! బాధ్యత కూడా తోడయ్యింది. ప్రతి ఫలితానికీ జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి. తనేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దాంతో అతను ఆ సవాలుని స్వీకరించాడు. ఒకోరోజు ఆఫీసులోనే నిద్రపోయేవాడు. ఇప్పుడు భార్యని చూడటం కూడా తగ్గిపోయింది. దాంతో ఓ రోజు భార్యాపిల్లలు కలిసి అతని ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘సంపాదించిన స్థాయి చాలు. ఇక కుటుంబం గురించి కూడా ఆలోచించమని’ వేడుకున్నారు. ‘మరొక్క ఏడాది ఓపిక పట్టండి. ఇంకో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చాక ఇంక కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తాను,’ అంటూ మాట ఇచ్చాడు. మాట ఇచ్చినమేరకు ఏడాది గడిచిపోయింది. ఊహించినట్లుగానే మరో ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడతను మధ్యతరగతి మనిషి కానేకాదు. తన పనిచేస్తున్న కంపెనీకే వైస్ ప్రెసిడెంట్. ‘రేపటి నుంచి మీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. మీ బాగోగులను గమనించుకుంటాను,’ అంటూ ఆ రాత్రి భార్యాపిల్లలకి సంతోషంగా చెప్పాడు. కానీ మర్నాడు ఉదయం లేవనేలేదు!!! తను చిన్నవయసులోనే చాలా సాధించాడంటూ ఓదార్చడానికి వచ్చినవారంతా తెగ పొగిడారు. కానీ అతను ఏం కోల్పోయాడో అతని భార్యాపిల్లలకే తెలుసు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.    

ఆశయానికి, అత్యాశకి తేడా గుర్తించడమెలా?

జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.  "ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం" ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి. ఆశయం!! ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.  ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి.  ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.  ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది.  ఇదీ ఆశయంలో ఉన్న సారం. అత్యాశ!! కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.  కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.  ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు. ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.  లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.  ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.  ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.                                      ◆నిశ్శబ్ద.

మనిషికి తృప్తి కావాలంటే ఇలా జీవించాలి..

ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.

మంచి జీవితానికి ఈ మూడు విషయాలు అవసరం!

ఆశనిరాశల్ని..... విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే... నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది.  గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి... సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి. అస్పష్టం... అనాలోచితం ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ 'once we accept our limits, we go beyond them' అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం... కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం.  కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి.  ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు.. సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి.... అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా.   ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి  ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. 'simple living high thinking'  ను  జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు. ఆహారాలు... ఆహార్యాలు... భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి.  మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు.... అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.                                              *నిశ్శబ్ద.

పిల్లలకు 5 ఏళ్ల లోపే ఈ 5 విషయాలు నేర్పిస్తే వారి భవిత బంగారం..!

పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి. ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.  తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి. తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.                                                      *రూపశ్రీ.

భార్యాభర్తలు మెసేజ్ లలో ఈ పనులు చేస్తే వారి రిలేషన్ నాశనమే..!

  రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు. బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే.. రెస్పాండ్ కావడం.. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి. కోపం.. కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి. పదే పదే.. భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది. గొడవలు వద్దు.. మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.                                                              *రూపశ్రీ.

ఇష్టంతో పనిచేస్తే కష్టమంతా మరచిపోవచ్చు!

  ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.

భార్యాభర్తల గొడవలకు కారణాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలంటే..!

  తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.  అందుకే వారితో ఏదైనా గొడవ జరిగితే అది కొన్ని గంటలు లేదా రోజులలో క్లియర్ అవుతుందిి. కానీ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చాలా వరకు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంటాయి.  అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణాలు ఏంటో తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సాధారణంగా వివాహిత జీవితంలో వస్తుంటాయి. ఇవి చిన్నపాటి అభిప్రాయ భేదాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు ఉండవచ్చు. గొడవలకు ప్రధానమైన  కారణాలు ఇవే:  ఆర్థిక సమస్యలు డబ్బు ఖర్చులు, ఆదాయం, పొదుపు పై అగ్రిమెంట్ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీస్తుంది.  భర్త తనదే ఆధిపత్యం అని, భార్య తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటాడని ఇలా.. ఇద్దరూ ఆర్థిక విషయాలలో అబిప్రాయ బేధాలతో గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకరి ఖర్చు పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోవడం కూడా ఆర్థిక గొడవలకు కారణం అవుతుంది. ఆత్మీయత లోపం లేదా శారీరక సంబంధాల్లో తేడా.. శారీరక సంబంధాలపై అబద్ధపు అంచనాలు,  ప్రేమ లేదా స్పర్శలో లోపం భార్యాభర్తల మద్య పెద్ద గొడవలకు కారణాలు అవుతాయి. సాధారణంగా వివాహం అనేది ప్రేమ, నమ్మకం,  శారీరకంగా ఒకరిని ఒకరు కోరుకోవడంలోనే ఆధారపడి ఉంటుంది. కానీ వివాహం తరువాత ఇవి లోపిస్తే ఇద్దరి మధ్య అసంతృప్తి ఏర్పడి అది కాస్తా గొడవలుగా మారుతుంది. అభిప్రాయ భేదాలు.. కుటుంబపరమైన నిర్ణయాలు, పిల్లల పెంపకం, జీవిత పద్ధతులపై విభిన్న అభిప్రాయాలు ఉంటాయి.  భార్యాభర్తలు ఇద్దరూ కలసి చర్చించి ఈ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భర్త తను, తన తల్లిందండ్రులు చెప్పినట్టే జరగాలని, భార్య తన మాట నెగ్గాలని పంతానికి పోతే ఇద్దరి మధ్య అబిప్రాయ బేధాలు ఏర్పడి గొడవలు అవుతాయి. ఆత్మగౌరవ సమస్యలు / ఈగో సమస్యలు.. ఒకరి మాటకి మరొకరు విలువ ఇవ్వకపోవడం. చిన్న విషయాల్లోనూ తానెక్కడా తగ్గకూడదన్న భావన భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది.  భార్యాభర్తలు తామరిద్దరూ సమానమే అనే విషయాన్ని తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటే.. ఒకరి మాటకు మరొకరు ప్రాధాన్యత ఇవ్వగలరు. అభిమానాలు / అనుమానాలు.. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, చిర్రెత్తించే ప్రవర్తనలపై అనుమానాలు పెరగడం వల్ల బంధం విచ్చిన్నమవుతుంది. బంధంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుంది. అనుసంధానం లోపం (Communication Gap).. సరిగ్గా మాట్లాడుకోకపోవడం, భావాలను పంచుకోకపోవడం వల్ల గొడవలు వస్తాయి. పెళ్లంటే కేవలం ఆర్థికంగా,  ఇంటి పనులలో ఒకరి అవసరం మరొకరికి ఉండటం కాదు.  ఇద్దరి మధ్య మానసిక అనుబంధం కూడా ఉండాలి.  స్నేహితుల్లా మాట్లాడుకోవాలి. బంధువుల జోక్యం.. భార్యాభర్తల తల్లిదండ్రుల  జోక్యం,  తోబుట్టువులు,  స్నేహితులు, బంధువుల జోక్యం వల్ల, వారిచ్చే సలహాల కారణంగా  ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగి గొడవలు వస్తాయి. వ్యక్తిత్వ తేడాలు.. ఒకరు చురుకుగా ఉండగా, ఇంకొకరు అంతగా కాకపోవడం,  జీవితంలో గమ్యం లేదా అభిరుచుల్లో తేడా ఉండటం. వీటి వల్ల  ఇద్దరి మధ్య జీవితానికి సంబంధించిన లక్ష్యాలు,  భవిష్యత్ ప్రణాళికలు వంటివి చేరుకోలేక పోతారు. సమస్యలు తగ్గించడానికి మార్గాలు: ఓపికగా వినాలి, సానుభూతితో స్పందించడం చాలా ముఖ్యం. స్పష్టమైన సంభాషణ  ఉండాలి. దీని వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు రావు. పరస్పర గౌరవం ఉండాలి.  గౌరవం లేని బంధం ఎక్కువ కాలం నిలబడదు. చిన్న విషయాల్లో క్షమించటం నేర్చుకోవాలి.  అన్ని విషయాలకు పంతానికి పోతూ ఉంటే తనను గౌరవించట్లేదని భాగస్వామి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇది భార్యాభర్తలు చేస్తున్న తప్పులు తెలియజేసి ఒకరితో ఒకరు ఎలా ఉండాలో తెలుసుకునేలా చేస్తుంది.                                                          *రూపశ్రీ.

చాణక్యుడి ఈ ఒక్క మాట మీకు కన్నీళ్లు తెప్పిస్తుంది!

ఒక వ్యక్తి పెద్దయ్యాక, తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను మరచిపోతాడు. దూషించే మాటలతో వారి హృదయాలను గాయపరుస్తుంటాడు. ఇలాంటి పాపం చేయోద్దని చెబుతున్నారు చాణక్యుడు. ఎందుకో ఈ కథనం చదువుతే మీకే అర్థం అవుతుంది. ఆచార్య చాణక్యుడు మంచి జీవితం కోసం అనేక సూత్రాలను అందించాడు. వీటిని అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో విజయం యొక్క నిచ్చెనను సులభంగా అధిరోహించగలడు. మన జీవితంలో ఎంతమంది శత్రువులు ఉంటారో అంతమంది స్నేహితులుంటారు.  మన సంతోషాన్ని, దుఃఖాన్ని తమదిగా భావిస్తూ కష్టసుఖాల్లో మనతో ఉంటారు.  కొన్నిసార్లు మనల్ని నీడలా అనుసరించే మన స్నేహితులను తెలిసో తెలియకో బాధపెడతాం. దీని గురించి చాణక్యుడు చాణక్య నీతిలో కూడా చెప్పాడు. చాణక్యుడి విధానంలో ఆయనతో మనం ఎప్పుడూ గొడవ పడకూడదని, కోపం తెచ్చుకోకూడదని చెప్పాడు. వారితో పోట్లాడుకుంటే జీవితాంతం పశ్చాత్తాపంతో గడిపేస్తాం. ఎవరిని అనరాని మాటలతో తిట్టకూడదు..? ఎవరికి కోపం రాకూడదు..? 1.  తల్లిదండ్రుల తప్పుగా గురించి మాట్లాడకండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మాటలు సంబంధాలను నాశనం చేస్తాయి. మన తల్లిదండ్రులను ఎప్పుడూ దూషించే పదాలు ఉపయోగించకూడదని చాణక్యుడు చెప్పాడు. మనల్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రులు, మంచి మాటలు మాట్లాడాలని అరిచిన వారు, మంచి నడవడిక నేర్పిన వారు.. మన భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టే తల్లిదండ్రులను దూషించే మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులను బాధపెడితే పాపులం అవుతాం. మనం చేసిన ఈ తప్పుకి క్షమాపణ అనేదే లేదు. 2.  సలహా ఇవ్వకండి: మన జీవిత పురోగతిలో తల్లిదండ్రుల స్థానం ఎక్కువగా ఉంటుంది, తల్లిదండ్రులతో ఏదైనా మాట్లాడే ముందు మన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి తప్పుగా  మాట్లాడిన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా సార్లు కోపంగా ఉన్న వ్యక్తి తన యవ్వన శక్తిని తల్లిదండ్రుల వైపు చూపిస్తాడు.  తన యవ్వనానికి కారణమైన వారిపై తన శక్తిని ప్రదర్శిస్తున్నట్లు మనిషి మరచిపోతాడు. అలాంటప్పుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదు. చాణక్యుడి కథ: గొప్ప మేధావి చాణక్యుడు తన తల్లిదండ్రులు తమ జీవితమంతా మన కోసం, మన ఆనందం కోసం అంకితం చేస్తారు . క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, కోపంతో మనం మాట్లాడే ఒక మాట వారి హృదయాలను పగిలేలా చేస్తాయి. మన పరుషమైన మాటలు వారి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తాయి. కాబట్టి, తల్లిదండ్రులను దూషించే పదాలను ఉపయోగించే ముందు, జాగ్రత్తగా ఆలోచించి, మన నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిది.

వృద్ధాప్యం జీవితం ఆనందంగా ఉండాలంటే... ఈ విషయాలు ఆచరణలో పెట్టుకోవాల్సిందే!

జీవితం జాంగ్రీ ఏమి కాదు, ఎప్పుడూ జ్యుసీ గా ఉండటానికి. యూత్ గా ఉన్నపుడు తరువాత బాగా సంపాదిస్తున్నపుడు ఉన్నట్టు వయసు పెరిగిపోయాక ఉండలేరు. కారణాలు బోలెడు ఉండచ్చు ఆ కారణాలు అన్ని కూడా జీవితాన్ని అయిదు పదుల తరువాత కాస్త భయంలోకి నెడుతున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో కోకొల్లలుగా చూస్తున్నాం. అయితే అయిదు పదుల తరువాత, వృద్ధాప్యం జతకట్టాక జీవితం ఆనందంగా ఉండాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా ఆనందమానందమాయే అనుకుంటూ గడిపేయచ్చు.  చాలామంది ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే సొంత ఊరిలో ఉన్న భూములు, ఇల్లు లాంటివి కొన్ని అవసరాల దృష్ట్యా లేక అక్కడెందుకు అనే కారణాలతో అమ్మేస్తుంటారు. ఆ పనిని అసలు చేయకండి. విశ్రాంత జీవితం సొంత ఊర్లో స్వేచ్ఛగా, గౌరవంగా  ఉండేలా చేస్తుంది.  ఇన్సూరెన్స్ లు డిపాజిట్ లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాంటివన్నీ పిల్లల పేరుతో వేయచ్చు కానీ మొత్తం కాదు సుమా!! ప్రేమను డబ్బు ద్వారా ఇలాంటి డిపాజిట్ ల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ కాసింత ఆర్థిక భరోసా కల్పించుకోవాలి మీరే ఆధారపడటం చాలా పెద్ద తప్పు. పిల్లలు ఉద్దరిస్తారు అనే ఆశ అసలు పెట్టుకోకండి. కాలం ఎలాగైతే వేగంగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందో, మనుషులు కూడా అలాగే వేగంగా మారిపోతూ ఉంటారు. కాబట్టి డిపెండింగ్ ఈజ్ ఏ బిగ్ మిస్టేక్. మానసిక విషయాల్లో వెన్నుదన్నుగా నిలబడి, జీవితంలో మంచి సలహాలు ఇస్తూ వస్తున్న వారిని చిన్న చిన్న గొడవలు కారణంగా వధులుకోకండి. చుట్టాలు, పిల్లలు కూడా చూపించలేని ఆప్యాయత నిజమైన స్నేహితుల దగ్గర మాత్రమే దొరుకుతుంది. కంపెర్ చేసుకోవడం చాలా పెద్ద మూర్ఖత్వపు చర్య. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చేస్తున్న పనులు బాగున్నాయి, వాళ్ళలా మేము లేము. లాంటి విషయాలను మొదట దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఫలితంగా నా జీవితం బాగుంది అనే తృప్తి సొంతమవుతుంది.   జెనెరషన్స్ మారే కొద్దీ జీవితాల్లో మార్పులు సహజం. ఒకప్పటిలా ఇప్పటి తరం లేదు, ఇప్పటిలా రేపటి తరం ఉండదు. దీన్ని ఒప్పుకోగలగాలి. పిల్లల జీవితాల విషయంలో జోక్యం చేసుకోకూడదు. వారికి నచ్చినట్టు వారిని ఉండనివ్వాలి. అటెన్షన్ కోరుకోకూడదు. బాల్యం, యవ్వనం, మధ్య వయసు ఎలాంటిదో వృద్ధాప్యం కూడా అలాంటిదే. వృద్ధాప్యమనే కారణం చూపెట్టి కొడుకులు, కొడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో పనులు చేయించుకోవాలనే ఆలోచన వదిలిపెట్టేయాలి. సాధ్యమైనంతవరకు మీ పనులను మీరు చేసుకోవడం ఉత్తమం. సాధ్యం కాని పక్షంలో పరిస్థితిని మెల్లగా వివరించి చెప్పాలి కానీ పెద్దవయసు అనే అజమాయిషీ ఉండకూడదు. పిల్లల పట్ల ప్రేమతో ప్రతీది తమ పొరపాటుగా ఒప్పేసుకోకండి. ఏదైనా సరే చెప్పే విధానంలో ఉంటుంది. తప్పేక్కడుంది అనే విషయాన్ని సున్నితంగా చెప్పి అంతే సున్నితంగా దాన్ని వదిలేయండి. దేన్నీ ఎక్కువగా లాగకూడదు. వయసయ్యే కొద్ది ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈకాలంలో బిపి, షుగర్ లేని వాళ్లు కేవలం 1% మంది ఉండచ్చేమో. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తగినంత తేలికపాటి వ్యాయామాలు, కనీస నడక. యోగ, ప్రాణాయామం వంటివి చేయాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎదో ఒకటి తినేయకూడదు. కాస్త తక్కువ ధరల్లోనే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకుని తీసుకోవాలి.  ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత చాలా అవసరం సుమా!! సంతోషం కావాలంటే పెద్ద ఖర్చులు అవుతాయని అనుకోవడం భ్రమ. ఉన్నంతలో చిన్న టూర్ ప్లాన్ చేసుకుని జీవిత భాగస్వామితో కలసి వెళ్ళండి. వృద్ధాప్య దశలోనే ఒకరికొకరు అనే భరోసా, ఆప్యాయత ఎక్కువ ఉండాలి.  జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి. చిన్న చిన్న వాటికి బాధపడకుండా ఒత్తిడిని వీలైనంగా దూరం ఉంచండి.  మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది  అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పై విషయాలు కేవలం చదవడం మాత్రమే కాకుండా ఆచరణలో పెడితే వంద శాతం వృద్ధాప్యాన్ని లాహిరి లాహిరి లాహిలో….. అని పాడేసుకుంటూ ఆనందంగా గడిపేయచ్చు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  

కొన్ని మొహమాటాలు లేకుంటే జీవితం ఎంతో బాగుంటుంది!

జీవితం చాలా విలువైనది. ముఖ్యంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మరీ ముఖ్యమైనవి. జీవితాన్ని అవి ప్రభావితం చేస్తాయి. జీవితం ప్రభావితమైనపుడు అనుకూలతలు చోటు చేసుకుంటే  ఒకే. కానీ ప్రతికూలతలు ఎదురైతే మాత్రం జీవితం కుదుపులకు లోనవుతుంది. ఆ కుదుపులు అన్నీ మనిషి మానసిక పరిస్థితులను అతలాకుతలం చేస్తాయి. మరి ఇన్ని అనర్థాలకు ఒకే ఒక విషయం కారణం అవుతుందంటే అది నిజంగా చిన్న విషయం అని ఎలా అనుకోవాలి? మొహమాటం! కాదని, లేదని లేక ఇష్టం లేకపోయినా ఒప్పుకునే ప్రవర్తన స్వభావం మొహమాటం. ఇది ఎంతో సున్నితమైన అంశం కూడా.  *మా అమ్మాయికి మొహమాటం ఎక్కువ పెద్దగా మాట్లాడదు. (పర్లేదు మనుషులు అలవాటు కానిది ఈ కాలంలో మునిగిపోయి మాట్లాడేవాళ్ళు తక్కువే. అలవాటైతే మాట్లాడతారు) * మా అబ్బాయికి మొహమాటం ఎక్కువ ఎవరితో ఎక్కువగా కలవడు(బహుశా ఇంట్రోవేర్ట్ కావచ్చు. అంతర్ముఖులుగా ఉండేవారు అనవసర గోడవల్లోకి వెళ్లరు కాబట్టి సమస్య ఏమీలేదు) * మా ఆయనకు మోహమాటం ఎక్కువండి ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెప్పలేరు.(ఇదీ పాయింట్. మోహమాటంతో ఏమీ కాదని చెప్పలేక ఇబ్బందుల్లో ఇరుక్కుపోరూ) *అయ్యో మీరు మరీ మొహమాట పడకండి. మీకేం కావాలన్నా అడగండి. నేను సహాయం చేస్తాను కదా( ఈ బాపతు మనుషులు దారిన పోయే దాన్ని నెత్తికి ఎక్కించుకునేరకం) *సరేనని చెప్పకపోతే వాళ్ళు నొచ్చుకుంటారేమో (ఇలా భావించి ఎన్నో విషయాలలో దిగబడిపోయేవాళ్ళు ఎక్కువ) పై విధంగా  చెప్పుకుంటే ఎంతో మంది ఇలా మొహమాటంతో తమని తాము ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంటారు. తరువాత తీరిగ్గా అలా చెయ్యకుండా ఉంది ఉంటే బాగుండెమో, ఏమి చేస్తాం పరిస్థితి అలా మారిపోయింది అనుకుంటారు. ఇంతకూ ఏ పరిస్థితి ఎలా మతింది. మొహమాటం అనేది  ఎలాంటి విషయాలలో వదిలేస్తే జీవితం బాగుంటుంది?? ఆర్థిక విషయాలు! డబ్బులు ఎవరికీ చెట్లకు కాయవు. కొందరు సహాయం అడుగుతుంటారు. అవతలి వాళ్లకు సహాయం చేయడం మానవత్వమే. కానీ ఈ ఆర్థిక విషయాలలో అనవసరమైన తలనొప్పుల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. అప్పులు ఇవ్వడం, ఇప్పించడం, ష్యురిటీలు ఇవ్వడం వంటివి మీరు ఆర్థికపరంగా కాసింత మంచి స్థాయిలో ఉంటేనే చెయ్యండి. ఒకవేళ సమస్య మీకు ఎదురైనా భరించగలను అనే నమ్మకం ఉంటేనే చెయ్యండి. వ్యక్తిగత నిర్ణయాలు! సాధారణంగా వ్యక్తిగత నిర్ణయాలలో చదువు, పెళ్లి ముఖ్యమైనవి. అది వద్దు ఇది చదువు అని కొందరు చెబుతారు, అక్కడొద్దు ఇక్కడే ఉండు అని కొందరు చెబుతారు. మోహమాటానికో వాళ్లకు అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నారు అనో ఆసక్తి లేని రంగంలోనూ, ఆసక్తి లేని కోర్సులలోనూ చేరద్దు.  అలాగే మరొక విషయం పెళ్లి. అబ్బాయి బాగున్నాడు, ఆర్థికంగా మంచి స్థాయి. మంచి ఉద్యోగం, సాలరీ బాగుంది. ఒకమ్మాయికి కావాల్సింది నిజంగా ఇంతేనా?? ఎంత కేర్ గా చూసుకుంటారు, ఎంత అర్థం చేసుకుంటారు అనేది కదా ముఖ్యమైన విషయం. ఇంకా కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య మాత్రమే జరిగే విషయాల మాటేమిటి?? చుట్టాలు, తెలిసినవాళ్ళు చెప్పే పై విషయాలు విని పెళ్లి లాంటి వాటికి ఒప్పేసుకుంటే తరువాత జీవితకాల బాధలు అనుభవించాలి. అందుకే కాబోయే జీవిత భాగస్వామితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది కదా. ఇక్కడ మిస్సయిన ఇంకొక విషయం సహోద్యోగుల దగ్గర మొహమాటం. వాళ్ళు అడిగారని వాళ్ళ పనులు కూడా చేసిపెడుతూ ఉండటం. వ్యక్తిగత సమయాలను త్యాగం చేసేయ్యడం. ఇది మొదట్లో పెద్ద సమస్య కాదు కానీ మెల్లిగా వాటి ఫలితాలు తెలుస్తాయి. అలాగే ఇరుగు పొరుగు మనుషుల దగ్గర కూడా ఇదే అవుతుంది. అందుకే మొహమాటం లేకుండా ఇబ్బందికరం అనిపించే విషయాలను కాదని చెప్పడం కుదరదని చెప్పడం మంచిది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

సెకండ్ బేబి కోసం స్కెచ్ ఇలా..!

పెళ్ళైన ప్రతి జంట పిల్లల్ని కనడం అనేది కామన్. అయితే మొదటి బిడ్డను కనడం కంటే రెండవ బిడ్డను కనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొదటిసారి తల్లిదండ్రులు అయ్యేటప్పుడు పేరెంట్స్ నుండి మంచి అటెన్షన్ ఉంటుంది. పైగా ఆర్థిక స్థితి కూడా మరీ అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. కానీ రెండవసారి పిల్లల్ని కనేటప్పుడు ఆర్థిక స్థితి గురించి, పరిస్థితుల గురించి మాత్రమే కాకుండా మానసిక స్థితుల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. మానసిక స్థితి గురించి ఆలోచించడం ఏంటి అనే అనుమానం వస్తే అన్నిటికీ సమాధానమే ఇప్పుడు తెలుసుకోబోయేది. కమర్షియల్ స్టేటస్! కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చేముందు అది కేవలం కొన్నిరోజుల సంబరం కాదు. అది జీవితకాల బాధ్యత అని విషయాన్ని ఆలోచించాలి. చాలామంది పిల్లల్ని కనేసి ఆ తరువాత ఖర్చులను చూసి చిరాకు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ళు ఈ విషయంలో చాలా ఆలోచన చెయ్యాలి. పిల్లలుగా ఉన్నప్పుడు అయ్యే ఖర్చులే కాకుండా పెరిగే కొద్దీ పిల్లల అవసరాలు, చదువులు మొదలైన వాటి గురించి కూడా ఆలోచించాలి.  మెంటల్ స్టేటస్! సాధారణంగా చాలామంది మెంటల్ స్టేట్స్ గురించి ప్రస్తావిస్తే బిడ్డను మోసే మహిళ మానసికంగా సన్నద్ధంగా ఉందా లేదా అనే విషయం చూసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అప్పటికే ఒకసారి బిడ్డను మోసి ఉంటారు కాబట్టి మళ్ళీ బిడ్డను కనడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, మొదటి ప్రసవంలో ఎలాంటి చేదుఅనుభవాలు లేకపోతే తప్ప రెండవసారి బిడ్డను కనడానికి అయిష్టత చూపించరు. అయితే ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం కూడా ఉంటుంది. అదే కుటుంబంలో అప్పటికే ఉన్న చిన్న మనసు మానసిక పరిస్థితి.  ప్రాధాన్యత మారిపోవడం! మొదటిసారి బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ ఆ బిడ్డ చాలా అపురూపం అయిపోతుంది. ప్రతిదీ బిడ్డకోసమే అన్నట్టు అన్ని చేసుకుపోతారు. కానీ ఒక్కసారిగా మరొక బుల్లి బుజ్జాయి ఇంట్లోకి రాగానే అందరి అటెన్షన్ ఆ చిన్న ప్రాణం దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పటివరకు తనకే అటెన్షన్ ఇచ్చిన వాళ్ళు వేరే దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టేసరికి తెలియకుండానే అయిష్టత, తనకు ఇంపోర్టెన్స్ తగ్గించారనే కోపం, అందరూ అక్కడే ఉంటున్నారని జెలసి ఫీలవడం మొదలైనవి జరుగుతాయి. అది మాత్రమే కాకుండా అప్పటి వరకు ఏది అడిగినా కాదనకుండా అమర్చిపెట్టిన వాళ్ళు కాస్తా అందులో భాగం చేసి చెల్లికో, తమ్ముడికో పెట్టడం లేదా నువ్వు ఇప్పుడు పెద్ద కాబట్టి తమ్ముడి కోసం, చెల్లి కోసం ఇవ్వాలి అని చెప్పడం పిల్లల్లో చెప్పలేనంత మానసిక సమస్యలను సృష్టిస్తుంది. మరేం చెయ్యాలి? ఆర్థిక స్థితి గురించి ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఇంట్లో ఉన్న పిల్లల మానసిక స్థితి గురించి కూడా ఆలోచన చెయ్యాలి. తమ్ముడు లేదా చెల్లి వస్తారు నీకోసం అనే మాటలు పిల్లలతో చెబుతూ ఉండాలి. దాని వల్ల పిల్లాడిలో నా తమ్ముడు, చెల్లి అనే ఫీలింగ్ ఇంకా బాధ్యత ఏర్పడతాయి.  ప్రసవం తరువాత కూడా పెద్ద పిల్లలను పట్టించుకోకుండా ఎప్పుడూ చిన్న పిల్లల దగ్గర గడపకూడదు. పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఎక్కువ ఉన్నా దాన్ని పెద్ద పిల్లలతో కలసి తల్లిదండ్రులు పంచుకోవాలి. ఆ చిన్న పిల్లాడికి లేదా పాపకు పెద్దలు మాత్రమే కాదు నువ్వు కూడా అవసరమే అనే విషయాన్ని తెలియజేయాలి. ఇలాచేస్తే రెండవసారి ప్రసవంలో ఇంటికి వచ్చే కొత్త అతిథిని తల్లిదండ్రుల కంటే ఆ తోడబుట్టిన మనసే ఎక్కువ ప్రేమిస్తుంది.                                    ◆వెంకటేష్ పువ్వాడ.

మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి!

మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.  ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు. ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి. విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి. ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి.                                      ◆నిశ్శబ్ద.

మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

మనం ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నప్పుడు కలిగే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే ఎవరైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వారి భాగస్వామిని వారు నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటారు. వారి భావాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి డేటింగ్ భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పింది వినడం: మీ పార్టనర్ మీ మాటలను జాగ్రత్తగా వింటుంటే మీ మాటలను సీరియస్ గా తీసుకుంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అది నిజమైన ప్రేమకు సంకేతం వంటిది. ఎల్లప్పుడూ అండగా ఉండటం: కష్టమైనా, సుఖమైనా ఆ సందర్భంలో మీకు అండగా నిలిచేవారు నిజమైన భాగస్వామి. మీ సంతోషంలో, దుఖంలో మీ భాగస్వామి మీకు సపోర్టుగా ఉండాలి. మీ దుఖంలో పాలుపంచుకోవడం, మీకు ధైర్యాన్ని ఇవ్వడం..ఇది నిజమైన ప్రేమకు అర్థం. ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం: మీరు అనారోగ్యంగా ఉన్న సమయంలో మీ భాగస్వామి ప్రేమను సులభంగా అర్థంచేసుకోవచ్చు. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మీ భాగస్వామి మిమ్మల్ని చిన్నపిల్లల్లా చూసుకుంటారు. సకాలంలో మందులు, ఆహారం అందిస్తారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కోపంగా ఉన్నప్పుడు భరోసానివ్వడం: మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే మిమ్మల్ని శాంతిపజేస్తారు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించనట్లయితే..మీ బాధ వారికి ఎలాంటి తేడా కలిగించదు. కాబట్టి మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భాగస్వా మి బాధపడి, మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తే అలాంటి వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి.  

కలలో ఏమి కనిపిస్తే దేనికి సంకేతం?

కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ... దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం. శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా  నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక. చెంపలు: ఇవి  పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని  వ్యక్తం చేస్తాయి.  కన్ను:  దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.  పెళ్లి కూతురు:  స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.  దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.  శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.  పోలీసు:  అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి. రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట. స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.  సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం. శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం. గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.  వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.  హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి. ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.  ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు. ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత  పరిశీలన ద్వారా  రూపొందించినవి.                                          ◆నిశ్శబ్ద.