సిరిసిల్ల కలెక్టర్ పై కెటీఆర్ దురుసు ప్రవర్తన

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి ఏడాది కావొస్తుంది. అయినా ఆ పార్టీకి  అహంకారం ఏ మాత్రం తగ్గలేదు.  తాను ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాసి అని వ్యాఖ్యానించడం చూస్తుంటే తెలంగాణలో  బిఆర్ఎస్  అధికారంలో ఉందా అన్న అనుమానం కలుగుతోంది  బిఆర్ఎస్ నోరుపారేసుకోవడం పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. కెటీఆర్ పై కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలని సంఘం భావిస్తుంది. ఒక  ప్రజా ప్రతినిధి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కంపల్సరీ. కాబట్టి కాంగ్రెస్ సర్కారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.  గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి రెండూ కెటీఆర్ అని నిర్ధారణ అయ్యింది. గవర్నర్ ఆమోదం తీసుకుని కెటీఆర్ ను అరెస్ట్ చేయాలని స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ యాక్షన్ మాత్రం స్టార్ట్ కాలేదు. తాజాగా సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాసి అని, కాంగ్రెస్ కార్యకర్త అని బాహాటంగా విరుచుకుపడటం చూస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. పదేళ్ళు అదికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు బిఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేసారా? పచ్చకామెర్లు వచ్చిన వాడికి అందరూ పచ్చగా కనిపిస్తారు మరి.  కెటీఆర్ ఇలా బరి తెగించడానికి కారణం కాంగ్రెస్ అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. 

అవినీతి అనకొండ వల్లభనేని వంశీ.. అరెస్టుకు రంగం సిద్ధం..!

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుకు రంగం సిద్ద‌మైందా?  అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది.  గ‌న్న‌వ‌రం తెలుగుదేశంకార్యాల‌యంపై దాడి కేసుతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి అక్ర‌మాల కేసుల్లో ఇప్ప‌టికే వంశీపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి. తాజాగా మ‌రికొన్ని కేసుల విచార‌ణ స‌మ‌యంలో  వాటిలో కూడా వల్లభనేని వంశీ ప్ర‌మేయం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న్ను అరెస్టు చేసేందుకు పోలీసులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.  వైసీపీ  హ‌యాంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయన అనుచ‌రుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  వంశీ ప్రోద్భ‌లంతో తెలుగుదేశం నేత‌ల‌పై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయించి ఇబ్బందుల‌కు గురిచేశారు. దీనికితోడు చంద్ర‌బాబు, లోకేశ్‌, వారి కుటుంబంపై వంశీ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాగా  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ లెక్క తేల్చేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ, ఆయ‌న అనుచ‌రుల అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో  గత ప్రభుత్వ హయాంలో వంశీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై కూలంకషంగా దర్యాప్తు జ‌రుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం తరఫున  ఎమ్మెల్యేగా వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌యం సాధించాడు.  వైసీపీ అధికారంలోకి రావ‌డంతో కొద్దిరోజుల‌కే ఆయన వైసీపీకి అనుకూలంగా మారాడు. వైసీపీ  అండ‌తో వంశీ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దెత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విచార‌ణ జ‌ర‌ప‌గా నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నారు. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో వల్లభనేని వంశీ.. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంతగా విస్తరించి కొండలన్నీ పిండి చేశారు.  గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర   ప్రకటించారు.  రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలిసింది. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేశారు.  వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయ‌న అనుచ‌రులు పెద్దెత్తున మోసాల‌కు సైతం పాల్ప‌డ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయ‌లు జేబులో వేసుకున్న‌ట్లు, వంశీ క‌నుస‌న్న‌ల్లోనే ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుల మోసాల పర్వం కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి.   ఇప్పుడు తాజాగా  మ‌రో మోసం వెలుగులోకి వచ్చింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం అంజయ్య .. గన్నవరం సమీపంలో చంద్రికా అయోధ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం చేసిన కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు నాలుగు కోట్ల రూపాయలను గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు.   ఆస్తులను విక్రయించి.. నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లు రామ్మోహనరావు, సతీష్‌లను వంశీ ప్ర‌ధాన అనుచ‌రుడు మోసం చేశారని , కాంట్రాక్టర్లు నగదు చెల్లించినా తమకు గుర్రం అంజయ్య సొమ్ములు ఎగ్గొట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తాము తమకు రావాల్సిన సొమ్ము కోసం డిమాండ్ చేస్తే  తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో మంటున్నారని కార్మికులు   ఆవేదన వ్యక్తం చేశారు.  గన్నవరంలోని చంద్రికా అయోధ్య గృహ సముదాయం ఎదుట బుధ‌వారం భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.ఇదిలా ఉంటే.. తెలుగుదేశం నేతపై దాడి కేసులో గుర్రం అంజ‌య్య‌ ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోలీసులు ఈ ఘ‌ట‌న‌పైనా కూపీ లాగుతున్నారు. ఈ మోసంలో వంశీ ప్ర‌మేయం   ఉన్న‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  మొత్తానికి వైసీపీ హ‌యాంలో అధికార మ‌దంతో విర్ర‌వీగిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయన అనుచరులపై  చట్టపరంగా చర్యలకు రంగం సిద్ధమౌతోంది. అధికారం అండతో మంచీ చెడూ లేకుండా విర్రవీగి చేసిన అన్యాయాలు, అకృత్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి తలెత్తింది. 

లగచర్ల దాడి కేసులో  పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్  పొడగింపు

లగచర్ల దాడి కేసు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. లగచర్ల కేసు లో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను కోర్టు పొడగించింది. నిన్నటితో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ గడువు ముగిసిపోయింది. అయితే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు  గురువారం కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతని రిమాండ్ ను డిసెంబర్ 11 వరకు పొడగిస్తూ జూనియర్ సివిల్ జడ్జీ ఉత్తర్వులను జారీ చేసారు.నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు  వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై లగచర్ల రైతులు, ప్రజలు దాడి చేసారు.  ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం  ఉందని ఆరోపణలు వచ్చాయి.  పట్నం నరేందర్ రెడ్డిని ఎ 1 గా చేర్చారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. దాదాపు 14 రోజుల  పాటు రిమాండ్ లో ఉన్నారు. 

వెయ్యేళ్లనాటి అలంపూరు నందికి జాతీయ గుర్తింపు

 పురావస్తు పరిశోధకుడు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూరు పట్టణంలోని స్థానిక పురావస్తు ప్రదర్శన శాలలో గల అరుదైన నంది శిల్పం జాతీయ స్థాయి గుర్తింపుకు నోచుకొందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఢల్లీ లోని ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ భారతీయ ఇతిహాసం, చరిత్రలో నంది శిల్పం అన్న అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సులో  గురువారం నాడు ఆయన   అలంపురం మ్యూజియంలోని, ఉమామహేశ్వర శిల్ప ఫలకంతో, క్రీ.శ.11వ శతాబ్దినాటి, కందూరు చోళుల కాలానికి చెందిన, నల్ల శానపురాతిలో నగీషీగా చెక్కబడిన నంది శిల్పంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించారు. ఇలాంటి శిల్పం భారతదేశంలోని మరే ప్రాంతంలోనూ వెలుగు చూడలేదని, అరుదైన ఈ శిల్పం, కళావిమర్శకులు, చరిత్రకారుల దృష్టికి తెచ్చినందుకు కర్నాటక చిత్రకళాపరిషత్‌కు చెందిన ఆచార్య రాఘవేంద్ర కులకర్ణి ఇంకా హాజరైన చరిత్రకారులు శివనాగిరెడ్డిని అభినందించారు. సదస్సు ముగింపు సభలో నిర్వాహకులు ఆయనను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఈ అరుదైన శిల్పాన్ని చూడటానికి త్వరలో అలంపూర్‌ సందర్శించటానికి ఆసక్తి చూపుతున్నారని శివనాగిరెడ్డి చెప్పారు.

ముందస్తు బెయిల్ కోసం వర్మ హైకోర్టులో పిటిషన్ 

 వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టునాశ్రయించారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయని అరెస్ట్ నుంచి తప్పించాలని ఆయన మరో మారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. వాదనలు వినిపించడానికి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరిన మేరకు విచారణ వాయిదా పడింది. ఒకే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని వర్మ లాయర్ వాదించారు.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననకు పాల్పడినట్టు వర్మపై అభియోగాలున్నాయి. వర్మపై గత నాలుగురోజుల నుంచి పోలీసులు వెతుక్కున్నప్పటికీ వర్మ జాడలేదు. సడెన్ గా  హైకోర్టు నాశ్రయించి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.

హస్తినలో పవన్ విందు.. భలే పసందు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం, సహకారంపై వారితో చర్చించారు. అనంతరం బుధవారం రాత్రి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులకూ ఢిల్లీ తాజ్ హోటల్ లో భారీ విందు ఇచ్చారు. 108 రకాల పూర్తి శాఖాహార వంటలతో ఆయన ఇచ్చిన విందు భలే పసందుగా ఉందని విందుకు హాజరైన కేంద్ర మంత్రులు, ఎంపీలు తెలిపారు. ఇటీవలి కాలంలో హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఢిల్లీలో తాను ఇచ్చిన విందులో కూడా 108 రకాల పదార్ధాలను వండించి వడ్డించారు. మహాభారతంలోనూ, భగవద్గీతలోనూ ఉన్నవి 108 అధ్యాయాలే కావడం ఇక్కడ గమనార్హం. అలాగే కార్తీక పవిత్ర మాసం కావడంతో పవన్ కల్యాణ్ తన విందును పూర్తి శాఖాహారానికే పరిమితం చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రధాని మోడీకి మద్దతుగా ఆయన బంగ్లా3దేశ్, పాలస్తీనా యుద్ధాల ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ విందులు జాతీయ మీడియా హైలైట్ చేసింది. విందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  

మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్సా.. ఇలా అయితే కష్టమే!

రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోంది.  తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు.   బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల చేదు జ్ణాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.  ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీవైపు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.. తెలంగాణ‌లో రాబోయేది బీజేపీ పాల‌నే. ఇది ప్రజల అభిప్రాయం ఔనా కాదా అన్నది పక్కన పెడితే..   ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్న మాట మాత్రం నిజం.  ఆయన తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడానికి ముందు  బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఆయన  భేటీ అయ్యారు. అర్ధగంట పాటు జ‌రిగిన ఈ భేటీలో, తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేది మ‌న‌మే అంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్ర‌ధాని వ‌ద్ద ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. దీంతో ప్ర‌ధాని సైతం ఇంకేముంది  అంద‌రూ క‌లిసిక‌ట్టుగా పార్టీ బ‌లోపేతంకు కృషి చేస్తున్నార‌న్న నిర్ణయానికి వచ్చేశారు. తనను కలిసిన తెలంగాణ నేతలను శభాష్ అంటూ భుజం తట్టి అభినందించారు.  తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆయనలో ఓ ధీమా ఏర్పడిపోయింది. దాని ఫలితమే సోషల్ మీడియాలో ఆ పోస్టు. అయితే  వాస్త‌వంగా రాష్ట్ర బీజేపీలో మాత్రం ప‌రిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా ఎవ్రీ ధింగ్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా ఉంది. రాష్ట్ర పార్టీలోని వ‌ర్గ‌విబేధాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఎవ‌రికి వారు పార్టీ అధినేత‌లం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలుగా విజ‌యం సాధించిన వారిలో కొంద‌రు అధిష్టానం నిర్ణ‌యానికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ారు. ఆ విషయాన్ని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  కొంద‌రు ఎంపీలు కేవ‌లం మీడియాలో హైలెట్ కావ‌డానికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.   తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా, వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి ఒక అడుగు ముందుకు  రెండడుగులు  వెనక్కు అన్న చందంగానే తయారైంది. నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాల నేప‌థ్యంలో అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత అనే విషయాన్నే గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది.   గ‌త ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు బీజేపీ నేత‌ల మ‌ధ్య ఐక్య‌తారాగం క‌నిపించింది. బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని బీజేపీ నేతలు ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి మూడోస్థానానికి పడిపోయింది. కాదు కాదు దిగ‌జారిపోయింది.  అసెంబ్లీ ఎన్నిక‌లకు కొద్దిరోజుల ముందు అప్పటి వరకూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌ను తప్పించడంతో  పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో తెలుగుదేశంతో క‌లిసి పోటీచేసే విష‌యంలో  రాష్ట్ర పార్టీ నేత‌లు కొందరు వ్య‌తిరేకించారు. అయితే ఎన్నిక‌ల త‌రువాత  తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోవడం త‌ప్ప‌ని రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీజేపీ ఒకింత   మెరుగైన ఫ‌లితాలు సాధించిన‌ప్ప‌టికీ.. ఆ ఘ‌న‌త పూర్తిగా మోడీ ఖాతాలో పడింది. ఆ విజయంలో పార్టీ రాష్ట్రనాయకత్వం ఘనత ఏమీ లేదని పరిశీలకులు విశ్లేషించారు.   పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్ర‌ బీజేపీలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను కొంద‌రు బీజేపీ నేత‌లు వ్య‌తిరేకించ‌గా.. మ‌రికొంద‌రు ప్ర‌శంసించారు. దీంతో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను విమ‌ర్శించాలా.. ప్ర‌శంసించాలా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలో బీజేపీ రాష్ట్ర నేత‌లు రెండు వ‌ర్గాలు విడిపోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కొంద‌రు, అనుకూలంగా కొంద‌రు మాట్లాడుతూ వ‌చ్చారు. తాజాగా, రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు రాత్రి నిద్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మం సైతం పార్టీకి ఆశించిన మైలేజ్ ను ఇవ్వ‌లేదు. మ‌రోవైపు రైతు రుణ‌మాఫీ విష‌యంలోనూ ప్ర‌భుత్వంపై గ‌ట్టిగా పోరాడ‌టంలో బీజేపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. రైతుల ప‌క్షాన‌ నిల‌బ‌డి పోరాడుతూ ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచ‌డంపై బీజేపీ రాష్ట్రనాయకత్వం ఏమాత్రం దృష్టిసారించ‌లేద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. రైతు రుణ‌మాఫీ అమ‌లు విష‌యంలో ప్ర‌భుత్వంపై రైతుల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను స‌ద్వినియోగం చేసుకొనేందుకు బీజేపీ నేత‌లు ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌క పోవ‌టం ప‌ట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతున్నది. అయితే  డిసెంబ‌ర్ నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేందుకు బీజేపీ నేత‌లు కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అయినా స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తే కాస్త‌యిన ప్ర‌జాద‌ర‌ణ ల‌భించే అవ‌కాశం ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిని మార్పుచేసే యోచ‌న‌లో కేంద్ర పార్టీ అధిష్టానం నిమ‌గ్న‌మైంది. ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రిగానూ కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించడంపై  అధిష్టానం దృష్టిసారించింది. ఈ క్ర‌మంలో ప‌లువురు నేత‌లు అధ్య‌క్ష  స్థానం కోసం పోటీప‌డుతున్నారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో పార్టీ పెద్ద‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నా.. ఆయనకు ఆ పదవి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌ల‌తోపాటు. బీజేపీలోని కోర్ హిందూ వాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు  గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. మొద‌టి నుంచి బీజేపీలో ఉంటూ.. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ‌ల్లో ప‌నిచేసిన నేత‌కు రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీలోని మెజార్టీ నేత‌లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే  మొత్తానికి రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునే క్ర‌మంలో నేత‌లు వ‌ర్గాల వారిగా విడిపోవ‌డంతో.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తీవ్ర స్థాయికి చేరాయ‌ని పార్టీ శ్రేణులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో  ఇన్ని సమస్యలతో సతమతమౌతున్నా, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టడం మానేసి  రాబోయే కాలంలో తెలంగాణ‌లో బీజేపీ అధికారం అని బీజేపీ ప్ర‌తినిధుల‌తోపాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీసైతం పేర్కొన‌డం ఆత్మ విశ్వాసం కాదనీ, అతి విశ్వాసమనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.  వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి బీజేపీ అధికారంలోకి వ‌చ్చేంత స్థాయిలో బ‌ల‌ప‌డాలంటే ముందు పార్టీలో నెల‌కొన్న వ‌ర్గ విబేధాల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది మానేసి మాదే అధికారం అన్న అతిశయంతో, అతి విశ్వాసంతో వ్యవహరిస్తే అధికారం మాట అటుంచి, రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా కష్టమేనని చెబుతున్నారు. 

ఆంధ్రాలో పప్పులుడకట్లేదు.. జ‌గ‌న్ రాజ‌గురువు ప్యాక‌ప్..!

వైసీపీ  హయాంలోఐదేళ్లూ ఆడిందే ఆట‌.. పాడిందే పాట అన్న‌ట్లుగా ఆయ‌న‌ హ‌వా సాగింది.  కోరిందే త‌డువుగా సీఎం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నీ చ‌క‌చ‌కా చ‌క్క‌బెట్టేసేవారు. ప్ర‌భుత్వ భూముల‌ను సైతం నామమాత్రపు ధరకు క‌ట్ట‌బెట్టేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోనూ ఆయ‌న హ‌వాకు అడ్డులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అత‌గానికి ఆంధ్రప్ర‌దేశ్ న‌చ్చ‌టం లేద‌ు. ఎందుకో తెలుసా..? ఆంధ్రాలో ఇక తన పప్పులు ఉడకవు కాబట్టి.  ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రా అని ఆలోచిస్తున్నారా..?  అక్కడికే వస్తున్నా.. వైసీపీ అధినేత  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌గురువుగా, ఇంకా క్లియర్ గా  చెప్పాలంటే గుగ్గురువుగా చెప్ప‌బ‌డే విశాఖ‌ శార‌దా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర.  తెలంగాణ   కేసీఆర్, ఏపీలో జగన్ మోహ‌న్ రెడ్డి  అధికారంలో ఉన్న సమయంలో  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ ఇద్దరు మాజీ సీఎంలూ స్వామి స్వరూపానందేంద్ర పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శించే వారు  స్వామీజీ ఇద్దరితోనూ రాజ శ్యామల యాగం చేయించారు. ఇద్దరూ విశాఖలోని శారదా పీఠం సందర్శించారు. అయితే, జగన్ మోహ‌న్ రెడ్డి మాత్రం శార‌దా పీఠానికి  ద‌త్త‌పుత్రుడిగా   వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వ భూములను త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద‌గ్గ‌ర నుంచి.. స్వామిజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసేవారు. దీంతో దేశంలో హిందువుల‌కు నేనే పెద్ద‌దిక్కు అన్న‌ట్లుగా స్వామి స్వరూపానందేంద్ర ప్ర‌వ‌ర్తించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.   సాధార‌ణంగా కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ, జగన్ రాజ‌గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్‌ వాహనాలు, వై-కేటగిరీలో   భద్రతా సిబ్బంది ఉండేలా జగన్ ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చారు.  దానికి కారణం 2019లో జగన్‌ సీఎం కావాలని ఆయన రాజశ్యామల యాగం చేయడమే. దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్‌ మోహన్ రెడ్డి. స్వరూపానందేంద్రకు వై-కేటగిరీలో  భద్రత కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న రెండుగేట్ల వద్ద ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను విధుల్లో ఉండేవారు. ఎస్కార్ట్‌ వాహనంలో ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉండేవారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర  సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్‌ వాహనం కేటాయించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఎస్కార్ట్‌ వాహనాలకు ఇంధన ఖర్చునూ పోలీసు శాఖ‌ే భ‌రించేది. మొత్తంగా 20 నుంచి 25మంది వరకూ భద్రతా సిబ్బంది శారదాపీఠం, స్వరూపానందేంద్ర సువల్లో మునిగి తేలేవారు.   కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల‌కే వై-క్యాటగిరీ భద్రతను నిలిపివేసింది. వారికి వ‌న్ ప్ల‌స్ వ‌న్ పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతోంది. తాజాగా స్వ‌రూపానందేంద్ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాట‌రిగీ భ‌ద్ర‌త‌ను కూడా ఉప‌సంహ‌రించుకోవాల‌ని విశాఖ శార‌దా పీఠం మేనేజ‌ర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇక‌పై ఆయ‌న రుషికేశ్ లో త‌ప‌స్సులో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాజ‌గురువులా ఓ వెలుగు వెలిగిన స్వ‌రూపానందేంద్ర త్వ‌ర‌లో రాష్ట్రాన్ని వీడి రుషికేశ్ లోనే ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే  ఆయ‌న ఆంధ్రాను వ‌దిలి వెళ్ల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలా ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న్ను నెత్తిన పెట్టుకోలేదు. అంద‌రి స్వామిజీల‌కు ఇచ్చిన మ‌ర్యాదను ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ఇస్తున్నది. జ‌గ‌న్ హ‌యాంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌క్కువ ధ‌ర‌కే శార‌ద పీఠానికి భూముల‌ను కేటాయించారు.  వైసీపీ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే (ఎక‌రా ల‌క్ష చొప్పున) అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి.   దీంతో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా క‌ట్ట‌బెట్టిన‌ ఆ కేటాయింపులను రద్దు చేసింది. మ‌రోవైపు తిరుమ‌ల‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా శార‌దా పీఠం కార్యాల‌యం కోసం నిర్మించిన   క‌ట్ట‌డాల‌ను ఇంజ‌నీరింగ్ విభాగం కూల్చేసింది. దీంతో జ‌గ‌న్ హ‌యాంలో ఐదేళ్లు ఆడిందే ఆట పాడిందేపాట‌గా కొన‌సాగిన స్వ‌రూపానందేంద్ర స్వామిజీకి కూట‌మి ప్ర‌భుత్వంలో షాక్‌ల మీద షాక్‌లు త‌గిలిన‌ట్ల‌యింది. దీంతో ఆయన రాష్ట్రం వదిలిపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. లేకపోతే అప్పనంగా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు కొట్టేసినందుకో, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకో కేసులను ఎదుర్కొనవలసి వస్తుందన్న భయం కూడా ఆయనలో ఉండి ఉంటుంది. అందుకే రాష్ట్రం దాటేస్తే రుషీకేశ్ లో తపస్సు పేరుతో న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని స్వరూపానందేంద్ర భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కారు జోరందుకుంటుందా? సంకేతమిదేనా?

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావులు గళమెత్తుతున్నా, ఆందోళనలకు పిలుపు నిస్తున్నా ఎక్కడా పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత, లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక జీరో రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక ఆ తరువాత నుంచీ కేసీఆర్ పూర్తిగా మౌనమునిలా మారిపోయారు. పూర్తిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం కొరవడింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై కూడా బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకున్నట్లు పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అయితే కేసీఆర్ వచ్చే ఏడాది జనవరి నుంచి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మౌనం వహించారనీ, ఇక రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తుతారని కేటీఆర్ చెప్పారు. అయితే ప్రజలే కాదు, పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కేసీఆర్ తాను మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తానని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో స్వయంగా కారు నడిపారు. దీని ద్వారా ఆయన మళ్లీ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించనునన్నట్లు చాటారు. బీఆర్ఎస్ పార్టీ చిహ్నమైన కారు షెడ్డుకి వెళ్లలేదనీ, సర్వీసింగ్ చేయించుకుని జోరుగా తెలంగాణ రాజకీయాలలో పరుగులు పెట్టేందుకు రెడీ అయ్యిందన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు.  

నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయనీ, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందనీ పేర్కొంది. అయితే ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో శుక్ర, శనివారాల్లో (నవంబర్ 28, 29) పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఫెంగల్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.   ఫెంగల్ తుపాను కారణంగా  విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్ 4తో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు   డిసెంబర్ 3 వరకూ సముద్రంపై వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఫెంగల్ తుపాను దూసుకుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  సూచించింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలనీ,  ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించింది.

కాళేశ్వం ఇంజినీర్లపై మండిపడ్డ జస్టిస్ చంద్రఘోష్

కాళేశ్వరం కమిషన్  చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఎదుట బుధవారం కేంద్ర జల శక్తి సలహాదారు వెదిరె  శ్రీరామ్ హాజరయ్యారు.   ఇంజనీర్లపై చంద్రఘోష్ సీరియస్ అయ్యారు.  మూడో రోజు  విచారణలో ‘‘ నిజాలను దాచినా, నిజాలను బై పాస్ చేసినా? మేము బయటకు తీస్తాం’’  అని కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. నిజాలను దాచి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తే  నేనే స్వయంగా  చర్యలు తీసుకుంటా అని చంద్రఘోష్ మండిపడ్డారు. ఇంజినీర్లు మర్చిపోయా, తెలియదు, గుర్తు లేదు వంటి పదాలు పదే పదే చెప్పడం చూస్తే నిజాలను దాచి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందని చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లో చేర్చిన అంశాలకు పొంతన లేని సమాధానాలు వస్తున్నాయన్నారు.  ఇంజినీర్లు అంకిత భావంతో పని చేస్తే  బ్యారేజిలు  ఎందుకు కొట్టుకుపోతాయి అని చంద్రఘోష్ ప్రశ్నించారు. 

ఏక్ నాథ్ షిండే వెనక్కు తగ్గారా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ప్రతిష్ఠంభనకు తెరపడిందా అంటే తాజాగా శివసేన(షిండే) అధినేత ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలను బట్టి ఔనన్న సమాధానమే వస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ ఎన్నికలలో కూటమిలోని అన్ని పార్టీల కంటే బీజేపీకి సొంతంగా అత్యధిక స్థానాలు వచ్చాయి. అదీ ఎంతగా కంటే కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు లేకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలకు బీజేపీ స్వయంగా సాధించింది. దీంతో ఎన్నికల ముందు ఒప్పందాన్ని తోసి రాజని ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీకే దక్కాలని కమలనాథులు భీష్మించుకు కూర్చున్నారు. సహజంగానే ఇది శివసేన(షిండే) వర్గానికి నచ్చలేదు. సిట్టింగ్ ముఖ్యమంత్రిగా కూటమిని రాష్ట్రంలో విజయపథంలో నడిపించిన షిండేకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలని పట్టుబట్టింది. దీంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎట్టకేలకు ఏక్ నాథ్ షిండే ఒక అడుగు వెనక్కు వేసి బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. కొద్ది సేపటి కిందట ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ హై కమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వారికే తన పూర్తి మద్దతు ఇస్తానని చెప్పారు. తన వల్ల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సమస్యా తలెత్తదని చెప్పేయడం ద్వారా తాను సీఎం రేసునుంచి తప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేశారు. సో.. ఇహనో ఇప్పుడో ఫడ్నవీస్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.   

ఎర్రచందనం ఎగుమతులు, విక్రయాలకు సింగిల్ విండో!

ఎర్రచందనం ఎగుమతులు, విక్రయాలను సింగిల్ విండో విధానానికి మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ తో  బుధవారం (నవంబర్ 27) భేటీ అయ్యారు. ఆ సందర్భంగా  అత్యంత అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యమౌతుందనీ, అందుకని కేంద్రం నిబంధనలను సవరించి ఏపీ వెలుపల పట్టుబడిన ఎర్రచందనాన్ని సైతం సింగిల్ విండో లో భాగంగా ఏపీ రాష్ట్రానికే దక్కేలా చేయాలని కోరారు.   ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలపై పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రితో విస్తృతంగా చర్చించారు. మంత్రితో చర్చించారు. ఎర్రచందనం విషయంలో సింగిల్ విండో విధానానికి ఏపీ అటవీ శాఖ కస్టోడియన్ గా  ఉండేలా చేయాలని పవన్ కల్యాణ్ ఆ సందర్బంగా ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.  ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడినా కేంద్రం పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ద్వారానే  అమ్మకాలు, ఈ వేలం సాగే విధంగా సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రిని కోరారు. 

ఎట్టకేలకు ఆర్జీవీ అరెస్ట్ ? 

 దర్శకుడు  రాంగోపాల్ వర్మ మరికొద్ది  సేపట్లో అరెస్ట్ కానున్నారు.  బుధవారం సాయంత్రంలోపు రాంగోపాల్ వర్మ అరెస్ట్ కానున్నారని తెలుస్తోంది. వైసీపీ నాయకుల హస్తంతో రాంగోపాల్ వర్మ కూటమి నేతలను అవమానించే విధంగా సోషల్  మీడియాలో ప్రసారం చేస్తున్నారు. వరుసగా రెండు పర్యాయాలు విచారణకు హాజరుకాకపోవడంతో ఒంగోలు పోలీసులు అరెస్ట్ వారంట్ తో మూడు రోజుల క్రితం హైద్రాబాద్ చేరుకున్నారు. వర్మ కోయంబత్తూరులో ఉన్నాని కొంత సేపు శంషాబాద్ లో మరికొంత సేపు చెప్పడంతో పోలీసులకు తల నొప్పిగా మారింది. రాంగోపాల్ వర్మ కూటమి నేతల వ్యక్తిత్వ హనన చేసినట్లు   ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టిడిపి నేత చేసిన ఫిర్యాదుప్రకారం కేసు నమోదైంది. అమ్మ రాజ్యంలో రెడ్లు, లక్షీస్ ఎన్టీఆర్ ,వ్యూహం చిత్రాలకు డబ్బు సప్లయ్ చేసింది ఎవరు అని పోలీసులు  ప్రశ్నించారు.  ఒంగోలు పోలీసులు వేట మొదలు పెట్టడంతో వర్మ తప్పించుకున్నారు.  ఆరు బృందాలు గాలిస్తున్నాయి. బెయిల్ రాకపోతే ఆర్జీవీ అరెస్ట్ తప్పేట్లు లేదు. 

బూతుల నాని ఖాతాలో భారీ కుంభకోణాలు.. కూపీ లాగుతున్న విజిలెన్స్!?

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన శాఖ ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. కానీ జనం మాత్రం ఆయనను అప్పట్లో బూతుల సరఫరా శాఖ మంత్రి అనే భావించేవారు. అయినా కొడాలి నాని తన అవినీతి, అక్రమాలతో, బూతు భాషా ప్రావీణ్యంతో యమా గుర్తింపు పొందారు. అయితే ఆయన యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినా, నోటిని అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో తలియనట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ పై బూతుల ప్రవాహాన్ని తలపించేలా తన వాగ్ధాటిని ప్రదర్శించినా అదంతా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలమే. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొడాలి నాని చాలా వరకూ నోటికి తాళం వేసేసుకున్నారు. అధికారంలో ఉండగా తమ పార్టీ అధినేత జగన్ పరదాలు కట్టుకుని మరీ ప్రజల ముందుకు వెళ్లినట్లు ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత  కొడాలి నాని ప్రజలకు కనిపించకుండా ముఖం దాచేసు కుంటున్నారు. ఓ సారి తిరుపతిలో కొత్త అవతారంతో దర్శనమిచ్చారు. ఆ తరువాత కూడా ఒకటి రెండు సందర్భాలలో తన ట్రేడ్ మార్కు గడ్డం లేకుండా పబ్లిక్ లో కనిపించారు. నోట్లో గుట్కా, చెంపలు కనిపించకుండా గడ్డంతో ఉంటేనే  ఎవరైనా కొడాలి నానిని గుర్తుపట్టగలరని ఆయన భావిస్తున్నారేమో. అక్కర్లేదు బూతులు లేకుండా ఓ రెండు నిముషాలు మాట్లాడితే ఆయన నేను కొడాలి నానినే అని చెప్పినా జనం నమ్మరు. అంతలా ఆయన తన బూతు భాషా ప్రావీణ్యంతో మమేకమైపోయారు.  సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ముసలిదైపోయిన పులి మాంసాహారం మానేశానని చెప్పినట్లు ఇప్పుడు అధికారం అండ లేని నాని బూతులు మానేశాను. ఇక అవినీతి పనులకు పాల్పడను అని చెప్పినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పైపోతాయా? కర్మ అనుభవించక తప్పదు కదా? కొడాలి నాని విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.  ఇసుక మాఫియా, రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ స్కాములలో  కొడాని నాని ప్రమేయం ఇప్పుడు బయటకు వచ్చింది. వీటికి తోడు  గుడివాడ నియోజకవర్గంలో  రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు శాంక్షన్ చేయించుకున్న కొడాలి నాని వాటిలో    ఇళ్ల నిర్మాణానికి కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ నాని బినామీలే దక్కించుకున్నారనీ వెల్లడైంది.  ఈ నిర్మాణాలకు విడుదలైన 40 కోట్ల రూపాయలలో కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వగా  మిగిలిన 33 కోట్ల రూపాయలనూ నాని అండ్ గ్యాంగ్ బొక్కేశారని తేలింది. ఈ కుంభకోణంలో కొడాలి నాని అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, పాలెడుగు రామ్ ప్రసాద్, కుసికుర్తి బాబు, కొత్తి విజయ్ లను నిందితులుగా తేల్చిన విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ కుంభకోణాల వెనుక కొడాలి నాని ప్రమేయంపై కూపీ లాగుతున్నారు. రానున్న రోజులలో కొడాలి నాని సహా  ఈ కుంభకోణాలలో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

మోడీతో ముగిసిన పవన్ భేటీ.. ఏం మాట్లాడారంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు. వీరిరువురి మధ్యా దాదాపు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జల జీవన్ మిషన్ కొనసాగింపుపై మోడీతో పవన్ మాట్లాడారని అంటున్నారు.   ఇప్పుడు ఏపీలో తాగు నీటి సరఫరా శాఖ మంత్రి కూడా అయిన పవన్ తన ఎన్నికల ప్రచారంలో  ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని  హామీ ఇచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ పథకాన్ని రాష్ట్రంలో కొనసాగించాలని ప్రధాని మోడీని  పవన్ కల్యాణ్ కోరారని చెబుతున్నారు.  ఈ అంశంతో పాటు రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలపై పవన్ కల్యాణ్ మోడీకి వివరించారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ కావడం ఇదే మొదటి సారి. గతంలో కూడా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో హస్తినలో పర్యటించినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కానీ మోడీతో సమావేశమైంది లేదు. దీంతో వీరిరువురి మధ్యా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీతో భేటీ ముగిసిన తరువాత పవన్ కల్యాణ్ తో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు పవన్ కల్యాణ్ ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.