మంగళగిరి ఆదర్శ నియోజకవర్గం.. లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగుల వేగం!

ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు. లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా లబ్ధి దారులను ఇచ్చిన పట్టాల విలువ మార్కెట్ రేట్ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పట్టాలను లోకేష్ తన స్వహస్తాలతో గ్రామాల వారీగా లబ్ధిదారులకు అందజేశారు.   అదే విధంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చివరి రోజు అయిన ఆదివారం (ఏప్రిల్ 13) లోకేష్  మంగళగిరిలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇది కూడా నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ కావడం గమనార్హం. అలాగే అదే రోజుల రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించారు.  2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఆ తరువాత ఐదేళ్లూ అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. 2024 ఎన్నికలలో 91 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. లోకేష్ కృషి కారణంగా పీపీపీ పద్ధతిలో మంగళగిరి- తెనాలి నాలుగు వరససల రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో  మహానాడు కాలనీలో కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం,  జూన్ నుంచి భూగర్భ డ్రైనేజీ, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్న లోకేష్ ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలలలోపే నియోజకవర్గ రూపురేకలు మారిపోయేలా పనులకు, పథకాలకు శ్రీకారం చుట్టారు.  

మరో సారి ముద్రగడ.. జగన్ భజన

స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయనను కాపు సామాజికవర్గం తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఇది నిస్సందేహంగా ఆయన స్వయంకృతాపరాథమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.    వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ గొంతెత్తడానికి కారణం చంద్రబాబు సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా ముద్రగడ  2104-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ నినాదాన్ని ఎత్తుకున్నారంటారు.   అయితే అప్పట్లో చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినా ముద్రగడ దానిని స్వాగతించలేదు. కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ఆ నిర్ణయాన్ని ముద్రగడ వ్యతిరేకించడానికి కారణం చంద్రబాబు పట్ల అయిష్టతేననీ, అహంకారం వినా ముద్రగడకు కాపు సామాజిక వర్గంపై అభిమానం లేదనీ, వారి ప్రయోజనాలు పట్టవనీ, అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.  అయితే ముద్రగడకు వైసీపీలో ఎలాంటి గౌరవం లభించలేదు. అసలు ఈ మధ్య కాలంలో ముద్రగడకు జగన్ దర్శన భాగ్యమే దొరకలేదని చెప్పొచ్చు. అయినా ముద్రగడ నోటి వెంట జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట రాలేదు.  అటువంటి ముద్రగడ ఇప్పుడు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కారణమేంటంటే.. వైసీపీ అధినేత జగన్ తాజాగా 33 మంది సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. ఆ 33 మందిలో ముద్రగడ పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేమిటి?  అంటే.. రాష్ట్ర రాజకీయపరిస్థితులపై చర్చించి.. జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వడం. ఈ కమిటీకి సజ్జల కన్వీనర్ గా ఉన్నారు.  ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకే ముద్రగడ తన జన్మధన్యమైపోయిందన్నంతగా ఆనందపడిపోతున్నారు.  వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగన్ ఆయన కోటరీ మాత్రమే తీసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. అందుకే వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నామ్ కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే  చెబుతున్నాయి. అటువంటి నామ్ కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే  బ్రహ్మానందపడిపోతున్నారు. తనకు పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.   జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, జగన్ సీఎం కావడానికి తన శక్తి మేరకు తాను పోరాడతాననీ ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన ధ్యేయమన్నారు. కానీ జరిగిందేమిటి? 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే జిల్లాలో ముద్రగడకు ఉన్న పలుకుబడి ఏమిటి? ఎంత అన్నది తేలిపోయిందని, కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.  పిఠాపురంను పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి 52 వేల 675 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. అంత దాకా ఎందుకు 1999 నుంచి ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరి సారిగా  2014 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘోరంగా కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పోరాడుతానంటూ గంభీర ప్రకటనలు చేయడం ద్వారా తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకోవడమే కాకుండా నవ్వుల పాలౌతున్నారు. 

అలిపిరి వద్ద బేస్ క్యాంప్!

తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, వారు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమలేశుని దర్శనం జాప్యం లేకుండా వేగంగా జరిగేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవడానికి రెడీ అయ్యింది.  ఇందు కోసం ప్రతి భక్తుడికీ ఒక పర్మనెంట్ ఐటీ ఇచ్చేందుకు సమాయత్తమౌతోంది. అలాగే తిరుమల విజన్ 2047 కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.   అందులో భాగంగానే అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయించింది.  15 హెక్టార్ల విస్తీర్ణంలో  ఏర్పాటు చేయనున్న ఈ బేస్ క్యాంప్ వద్ద నుంచి ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నిరోధించి భక్తులకు బస్సుల్లో అవీ ఎలక్ట్రికల్ బస్సుల్లో కొండపైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. అలాగే అలిపిరి వద్దే వసతి, దర్శనం సహా అన్ని కౌంటర్లనూ ఏర్పాటు చేయనుంది.  ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించింది.  తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీ తగ్గించడం, తద్వారా కాలుష్యాన్ని అరికట్టడం లక్ష్యంగా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.    

తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజెనోవో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కుమాడుకు కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నఅన్నా లెజనోవో.. మార్క్ శంకర్ కోలుకోవడంతో అన్నా లెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఆమె తిరుమల పర్యటన సందర్భంగా విదేశీయులు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో వాటిని   ఖ‌చ్చితంగా పాటించారు. తిరుమలలోనే ఆమె తిరుమల స్వామివారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇచ్చారు.    తొలుత గాయ‌త్రి నిల‌యం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్ర‌కారం.. అధికారులు స్వాగ‌తం ప‌లికారు. 

బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఘటన స్థలానికి వెళ్లి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.   మృతులను... కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)... భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి వెళ్లి స్థానికులు, అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.    ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని అనిత చెప్పారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారనీ, ఏడుగురు గాయపడ్డారనీ తెలిపారు.  ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ అక్రమాలను బయటకు తీస్తానని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు  ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులు, అధికారం కోసం కాకుండా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో  జరిగిన అక్రమాలు, అన్యాయాలు ప్రజల ముందుంచుతానన్నారు.   మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.  జగన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో  జగన్ చేయాలనుకున్నది చేస్తే.. తాను చేయాల్సిన పోరాటం చేశానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇక ఆ అధ్యాయం ముగిసిందనీ, ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు.  జగన్ అరాచకాలు  బయటకు తెస్తానన్నారు. సండూర్ పవర్‌తో ఆరంభమైన జగన్ అక్రమ సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు.  అదంతా ప్రజల డబ్బే. దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  కోడికత్తి శ్రీను లాంటి బాధితులు జగన్ హయాంలో వేలల్లో ఉన్నారన్నారు. జగన్ బాధితులందరికీ తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితులు  తనకు సమాచారం అందించాలని కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.  అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో కోడి కత్తి శ్రీనుతోపాటు అతడి కుటుంబ సభ్యులను  పరామర్శించారు. 

నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశం

తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన ఖాతాలోకి ఓ మునిసిపాలిటీ చేరింది. రాష్ట్రంలో జనసేన ఖాతాలో చేరిన తొలి మునిసిపాలిటీగా నిడదవోలు మునిసిపాలిటీ నిలిచింది. ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే వైసీపీకి చెందిన   14 మంది కౌన్సిలర్లు జనసేన గూటికి చేరడంతో  తెలుగుదేశం కౌన్సిలర్ ను కూడా కలుపుకుంటే జనసేన కౌన్సిలర్ల బలం 15కు చేరింది. దీంతో నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశమైంది.  వాస్తవానికి జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం.  జీరో సభ్యుల నుంచి మున్సిపాలిటీ జనసేన పరం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చాణక్యం చేశారు.  కాగా  కూటమి ప్రభుత్వం పాలన నచ్చి వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారని   మంత్రి కందుల దుర్గేష్  చెబుతున్నారు.  

పోటీలోఆ రెండు పార్టీలే.. అందుకే ఆసక్తి!

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ( ఎమ్మెల్సీ  ఎన్నికల, పోలింగ్ కు ఇంకా వారం రోజులకు పైగానే సమయం వుంది. ఏప్రిల్ 23 న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయినా ఇంకా పోలింగే జరగక పోయినా,ఫలితం అయితే వచ్చేసింది.గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలిసి పోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం(ఎల్ఎసీ)ఎలెక్టోరల్ కాలేజీ లో పార్టీలకు ఉన్న బలా బలాను బట్టి చూస్తే,ఎంఐఎం గెలుపుకు ఢోకా లేదు. అయితే, ఫలితం ముందుగానే తెలిపోయినా, ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది?  అంటే,  అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు.   హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు.ఈ లెక్కన, ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. సో, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్   గెలుపుకు ముందు గానే ఖారరై పోయింది అందుకే, కావచ్చును,ఎలెక్టోరల్ కాలేజీలో 24  ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రస్ పార్టీ పోటీకి దిగలేదు.కానీ, పాతిక ఓట్లు మాత్రమే ఉన్న  బీజేపీ మాత్రం, బరిలో దిగింది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారుగోముల గౌతం రావును బీజేపీ బరిలో దింపింది. మరో వంక  అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలవి కాని చోట అధికులం అనరాదు అనుకున్నారో, లేక ఇంకా ఏదైనా ‘రహస్యం’ వుందో ఏమో కానీ, ముందుగానే ఓటమిని అంగీకరించి, చేతులెత్తేశాయి. తమ అభ్యర్ధులను బరిలో దింప లేదు.  దీంతో హైదరాబాద్ ఎల్ఎసీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే, ఏదో అద్భుతం జరిగితే తప్పించి, ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి గెలుపును ఆపడం, మోదీ, షా దిగి వచ్చినా అయ్యేపనికాదని అంటున్నారు. అయితే  ఈ వాస్తవం బీజేపీకి తెలియదా  అంటే తెలుసు. అయితే  ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డు కునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే, కేవలం ఎంఐఎం ఏకాగ్రీవాన్ని నిరోధించడం మాతమే కాదు,   గెలిచేందుకు కూడా పోటీ చేస్తున్నామని బీజీపే నాయకులు, మరోమాట అంటున్నారు. అంతే కాదు, మా గెలుపు లెక్కలు మాకున్నాయని కొంచెం ధీమాగానే చెపుతున్నారు.  కాషాయ పార్టీ  క్రాస్ వోటింగ్  పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. మరో వంక ఓటింగ్ లో పాల్గొంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేక పోలేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవంక ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీల స్టాండ్ ఏమిటి అన్నది ఇంకా స్పష్టం కాలేదు.   మాకు బలం లేదు, అందుకే పోటీచేయడం లేదు అంటున్నారే, కానీ, తమ మద్దతు ఎవరికో చెప్పడం లేదు. అంతేకాదు, మద్దతు గురించి చెప్పక పోవడమే కాదు, అసలు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. మరో వంక  మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందనీ, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని  ఆరోపిస్తున్నారు.  మరో వంక, బీజేపీ హిందూ కార్డును తెర పైకి తెచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, అటో ఇటో తేల్చుకోవాలని కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. హనుమత్  జయంతిని పురస్కరించుకుని, శనివారం (ఏప్రిల్ 12) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆహ్వానం మేరకు, ఆకాశపురి, హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన సమయంలో  బండి సంజయ ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురికావద్దని  పరోక్షంగా హెచ్చరించారు. అంతే కాకుండా  ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మల్యే రాజా సింగ్ అద్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా  లక్ష మందికి పైగా హిందువులు ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు  కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం ఓడించేందుకు , బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపు  ఇచ్చారు.    అయితే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు లేదా ఇతరత్రా కారణాల కారణంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్  కార్పొరేటర్లు  క్రాస్ ఓటింగ్ చేస్తారా? అనేది, ఎలా ఉన్నా  ఆసలు అ రెండు పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా? లేదా? అనేది అన్నిటినీ మించిన బిగ్ క్వశ్చన్  అంటున్నారు.  అదలా ఉంటే  ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా వుంది. అంతే కాకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ, సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నఆరోపణలకు, ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర పోటీ సమాధానం అవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే  బీజేపే కూడా  రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరిధించే సత్తా, సంకల్పం ఒక్ బీజేపీకి  మాత్రమే ఉన్నాయని నిరూపించుకునేందుకు, తద్వారా హిందూ ఓటు బ్యాంకును పతిష్ట పరచుకునేందుకు, ఇదొక అవకాశంగా బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే, ఫలితం ముందుగానే తేలి పోయినా  హైదరాబాద్  ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నిక, మరో కోణంలో ఆసక్తిని రేకేతిస్తోందని  అంటున్నారు.

జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీ

వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్   తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. 74 వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ  వైసీపీ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు. తిప్పలనాగిరెడ్డి  తొలి దశ నుంచి వార్డు అభివృద్ధిపై తమకు నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపు విషయమై  వంశీ కౌన్సిల్లో పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.  తాజాగా జీవీఎంసీ లో మేయర్ పీఠాన్ని మార్చే క్రమంలో కూటమి నాయకులు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న  చర్చ జరగనుంది.  ఈ దశలో  వంశీ  వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడం నిస్సందేహంగా జగన్ పార్టీకి బిగ్ షాక్.  నిజానికి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 74 మంది సభ్యుల అవసరం ఇప్పటికే కూటమికి 70 మంది సభ్యులు సహకారం ఉంది వీరితో పాటు మరో ఐదు వైసీపీ సభ్యులు  తమతో టచ్ లో ఉన్నారని   పలు సందర్భాల్లో కూటమి నేతలు చెబుతున్నారు.  దీనికి తగ్గట్టుగానే వంశీ పార్టీ మారడంతో వైసీపీ వర్గాల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది.  ఇప్పటికే కార్పొరేటర్లు జారిపోకుండా శ్రీలంకలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  అయినప్పటికీ ఈ రకంగా పార్టీ కార్పొరేటర్లు జారిపోడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.  తాజాగా తిప్పల వంశీ మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు.  వార్డు అభివృద్ధి విషయంలో వివక్ష  కారణంగా వంశీ పార్టీ మారినట్లు ఆయన అనుచరులకు చెబుతున్నారు.

పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు .. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్ష్ వేటు

తిరుమలలో శనివారం (ఏప్రిల్ 12) జరిగిన అపచారానికి సంబంధించి బాధ్యులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చారు.  మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం ప్రస్షుటమైంది. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్‌లు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. శ్రీవాణి టికెట్‌పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 నుండి వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చిన సంగతిని అక్కడి సిబ్బంది గుర్తించి వారిని ఆపారు.   అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది.  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.   ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంి, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.  అలాగే   నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదనలు పంపించింది.  

పుంగనూరులో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు..ముగ్గురికి గాయాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ మరోసారి రెచ్చిపోయింది.  పుంగనూరు మండలం కృష్ణాపురంలో టిడిపి కార్యకర్త రామకృష్ణ ఇటీవల వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే వైసీపీ మూకలు మరో సారి రెచ్చిపోయాయి. తెలుగుదేశం సానుభూతి పరులపై కత్తులు, వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డాయి. ఈ దాడికి  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణ స్వామి నేతృత్వం వహించారు. ఈ దాడిలో తెలుగుదేశం కు చెందిన హరినాథ్, హరినాథ్ భార్య కన్యాకుమారి, వెంకటేష్ లు గాయపడ్డారు. క్షతగాత్రులను పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   ఇప్పుడు వైసీపీ మూకల దాడిలో గాయపడిన వారు ఇటీవల హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ బంధువులే కావడం గమనార్హం. గత కొంత కాలంగా తమపై దాడి చేసేందుకు పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని హరినాథ్ ఆరోపించారు. గతంలో హత్యకు గురైన రామకృష్ణ కూడా తనకు పెద్దిరెడ్డి మనుషుల నుంచి ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, అప్పడూ వారు పట్టించుకోలేదనీ ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   

పిఠాపురం వర్మకు చంద్రబాబు షేక్ హ్యాండ్.. గ్యాప్ ప్రచారానికి ఎండ్ కార్ట్!

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక విజయవాడలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కర్యక్రమానికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమా కుమారుడి నిశ్చితార్థ వేడుకకు పిఠాపురం వర్మ కూడా వచ్చారు. పిఠాపురం వర్మను చూడగానే చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  వాస్తవానికి గత కొన్ని నెలలుగా పిఠాపురం వ్యవహారాలు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేసిన వర్మకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాడర్ లో బలంగా ఉంది.  2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లూ చేసుకుని కూడా   జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా ఆ సీటును జనసేనకు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించి, పొత్తు నేపథ్యంలో మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని చెప్పగానే క్షణం ఆలోచించకుండా తన  సీటును పవన్ కోసం త్యాగం చేసి చంద్రబాబు మాటకు ఏమాత్రం ఎదురు చెప్పని ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం  శ్రమించారు.   అక్కడి వరకూ అంతా బానే ఉన్నా.. ఆ ఎన్నికల సందర్భంగా   ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన  హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు.   రెండు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వర్మకు   ఛాన్స్ దక్కలేదు. అలాగే నియోజకవర్గంలో వర్మ ప్రాధాన్యతను తగ్గించే విధంగా జనసేన పావులు కదపుతూ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే..ఇటీవల ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గ పర్యనటలో వర్మకు ఆహ్వానమే లేకుండా పోయింది. అంతకు ముందు కూడా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాగ బాబు పిఠాపురం పర్యటన ఆద్యంతం అడుగడుగునా తెలుగుదేశం నిరసనలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వర్మ కాకినాడలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లోకేష్ కు పగ్గాలు, అలాగే 2047 విజన్ డాక్యుమెంట్ లా పార్టీ కోసం కూడా ప్రణాళిక రూపొందించాల్సి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిఠాపురం వర్మను ఆప్యాయంగా పలకరించడం, షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చటించడంతో వర్మలో అసంతృప్తి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వర్మతో చంద్రబాబు ఆత్మీయంగా మాట్లాడటం తెలుగుదేశం శ్రేణుల్లో కూడా జోష్ ను నింపింది. 

రోడ్ సేఫ్టీ కోసం దణ్ణం పెట్టిన ఢిల్లీ సీఎం

సింప్లిసిటీకి  నిదర్శనంగా నిలుస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖాగుప్తా. తాను చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 14) ఆమె వెళ్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఆహారం విసిరేయడాన్ని చూశారు. దీంతో వెంటనే కాన్వాయ్‌ ఆపి స్వయంగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రినని పరిచయం చేసుకున్న రేఖాగుప్తా  మరో సారి అలా చేయొద్దని చేతులు జోడించి రిక్వెస్ట్‌ చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవాలతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  ఢిల్లీ వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో నుంచి ఆవుకు రొట్టె ముక్క విసరడం ఆమె చూశారు. వెంటనే కారు ఆపి ఆయన వద్దకు వెళ్లి,   రోడ్లపైకి ఆహారాన్ని విసిరేయడం వల్ల వాటిని తినేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడకు వస్తాయని, అప్పుడు మూగజీవాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనదారులూ, రోడ్లపై నడిచే వారికీ ప్రమాదమేనని, అంతేకాదు.. ఆహారాన్ని ఇలా అగౌరవ పరచకూడదని సూచించారు. జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే, గోశాలల వంటి ప్రాంతాలకు వెళ్లాలని,  రోడ్లపై ఆహారాన్ని విసరొద్దని, మూగజీవులను ప్రేమించాలనీ చెప్పారు.  మన సంస్కృతిని గౌరవించండి రహదారి భద్రతను పాటించండని  సీఎం రేఖా గుప్తా తన ట్వీట్లో ఢిల్లీ వాసులందర్నీ కోరారు. ఢిల్లీలోని హైదర్‌పుర్‌ ఫ్లైఓవర్‌పై శనివారం ఈ ఘటన జరిగింది.

సన్ రైజర్స్ పరుగుల సునామీ..పంజాబ్ పై అద్భుత విజయం

అభిషేక్ వర్మ మెరుపు సెంచరీ.. 245 పరుగుల లక్ష్యం 18.3 ఓవర్లలోనే ఛేదన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఆ వర్షంలో క్రికెట్ అభిమానులు తడిసి ముద్దైపోయారు. క్రికెట్ మజా ఏమిటో  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో శనివారం రాత్రి హైదరాబాద్ సన్ రైజర్, పంజాబ్ కింగ్స జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే అర్ధమౌతుంది. ఐపీఎల్ లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఎవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు దాదాపు అసాద్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలతో నీరసించి ఉన్న సన్ రైజర్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమేనని అంతా భావించారు. అయితే సన్ రైజర్స్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కొండంత లక్ష్యాన్ని అలవోకగా కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసి అద్భుతం సృష్టించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వారి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్స్ కూడా ప్రేక్షుకులుగా మారిపోయారు.  భారీ స్కోరు ఛేదనలో సన్ రైజర్స్ కు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లిద్దరూ చెలరేగి ఆడారు.   అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు.. 10 సిక్సర్లతో) 141, ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 9 పోర్లు, 3 సిక్సర్లతో ) 66 చెలరేగి ఆడటంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. వీరిరువురూ కలిసి తొలి వికెట్ కు 12.2 ఓవర్లలోనే 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత హెడ్ ఔటైనా అభిషేక్ తన పరుగుల వరద కొనసాగించాడు. ఆ తరువాత అభిషేక్ వర్మ ఔటైనా అప్పటికే సన్ రైజర్స్ విజయం ఖరారైంది.  చివర్లో క్లాసన్(21), కిషాన్ (9) మ్యాచ్ ను ముగించేశారు.   

భార్య, కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ ను తీసుకుని సింగపూర్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్  సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్నపవన్ విషయం తెలియగానే విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ కోలుకుని డిశ్చార్జ్ కాగానే పవన్ కల్యాణ్ తన కుమారు, భార్యతో కలిసి శనివారం రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.    సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం పవన్ భార్య లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్   సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా…సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే  పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడమే కాకుండా    అగ్ని ప్రమాదం సందర్భంగా అలుముకున్న దట్టమైన పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో  శ్వాస సంబంధిత సమస్యతో  ఇబ్బంది పడ్డాడు, దీంతో   సింగపూర్ ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స తీసుకున్నాడు. అనంతరం గురువారం  సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. ఆ తర్వాత  శనివారం పవన్ కల్యాణ్ తన భార్య కుమారుడితో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చారు.  

ప్రెసిడెంట్‌కి టైం బాండ్.. సుప్రీం సంచలన తీర్పు

రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు  సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి ఉంచడంపై నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెల రోజులు మాత్రమేనని తీర్పు ఇచ్చింది. 415 పేజీలతో కూడిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 11) 10.54 గంటలకు సుప్రీంకోర్టు వెస్‌సైట్‌లో ఉంచారు.  కాగా గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని, నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి నుంచి స్పందన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు సుచించింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం మంత్రి మండలి సలహా సూచనల మేరకు గవర్నర్లు తప్పనిసరిగా వ్యవహరించాల్సి ఉంటుందని, రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసే అధికారం గవర్నర్లకు లేదని మార్చి 8న ఇచ్చిన తీర్పులో సుప్రీం ధర్మాసనం తెలిపింది. నిర్దిష గడువులోగా గవర్నర్ చర్య తీసుకోకుంటే గవర్నర్ చర్య జ్యుడిషియల్ స్కృటినీని ఎదుర్కోవలిసి వస్తుందని హెచ్చరించింది.  కాగా, గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యంగ చరిత్రలో ఇదే మొదటి సారి. శాసన సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతించకపోవడం, పునఃపరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గవర్నర్ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్ ఇచ్చింది.

ఆంధ్రా ‘అంకుశం’ ఏబివి రాజకీయ అరంగేట్రం

అమలాపురం వేదికగా ఆదివారం ప్రకటన నీతి నిజాయితీలకు మారు పేరు, డిపార్ట్‌మెంట్‌లో అంకుశం అనిపించుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 13) అమలాపురం వేదికగా ఆయన తన రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయబోతున్నారన్న విషయం ఇటు రాజకీయవర్గాల్లో, అటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  పోలీసు డిపార్టుమెంట్లో ఏబీవీ ఎదుర్కొన్నన్ని కక్ష సాధింపు చర్యలు ఎవరూ ఎదుర్కోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ సీఎం పీఠం ఎక్కగానే ఏబీవీని టార్గెట్ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏవీబీ అభియోగాలు, సస్పెన్షన్లతో ఇబ్బందిపడ్డారు. వెంకటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. మళ్లీ 2022 జూన్‌ 28 నుంచి 2024 మే 30 వరకు నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్నారు.  తర్వాత ఆ కాలాన్ని కూటమి ప్రభుత్వం సర్వీస్ పీరియడ్‌గా క్రమబద్ధీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులకు సంబంధించి బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.  2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌‌గా పని చేశారు. 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీని పోస్టింగ్‌ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని కోర్టుకు వివరించారు. 2022లో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించగా.. ఆయన్ను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించారు. మళ్లీ 2022 జూన్‌ 28న రెండోసారి కూడా సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ వెంటనే ఆయన తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించగా.. అక్కడ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్‌ ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. కొన్ని గంటలోనే ఆయన రిటైర్ అయ్యారు.  గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేల్చింది. ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా.. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత పరికరాల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని గుర్తించారు. ఆ మేరకు ఆయనపై అభియోగాలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తర్వాత ఆయన సస్పెన్షన్‌ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో ఏపీ సర్కారు అధికారంలోకి రాగానే రిటైర్ట్ ఐపీస్ ఏబీవీని ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. అయితే గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రగిలిపోతున్న ఏవీబీ ఇంతవరకు ఆ బాధ్యతలు స్వీకరించలేదు. వైసీపీ అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్ విభాగాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఆయన అభిమానులుభావించారు. రిటైర్ అయ్యాక ఆయన జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్ కరోనాని ‘కమ్మ’రోనా అంటూ అన్నిటికీ కులాలను ఆపాదించారని ఆరోపణలు గుప్పించారు. సీఎం కూర్చీ కోడుకి కూడా సరితూగని  తుచ్ఛుడు ఆ సీటులో కూర్చున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ ప్రభుత్వ హాయాంలో సర్వీసు పరంగా విపరీతమైన వేధింపులు, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ఏబీవీ తన రాజకీయ ప్రస్థానంలో జగన్ భాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. అమలాపురం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ఆయన అక్కడ జగన్ కారణంగా తీవ్ర వేధింపులకు గురై దీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. క‌ృష్ణాజిల్లా నూజివీడుకి చెందిన ఈ కమ్మ సామాజిక వర్గం సీనియర్ కులం కారణంగానే జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన పొలిటీషియన్ అవతారమెత్తితే తన సీనియార్టీతో ఇక జగన్‌కు చుక్కలు చూపించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.