భయమన్నదే లేని యోధుడి కుమార్తె!.. టాక్ ఆఫ్ ది స్టేట్ గా కవిత నివాసం ముందు ఫ్లెక్సీలు

ఎవరు ఔనన్నా కాదన్నా.. ఎవరు ఒప్పకున్నా.. ఒప్పుకోకున్నా.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కుమార్తెగా కాకుండా.. ఆమె పార్టీకి భిన్నంగా సొంత శైలిలో ముందుకు కదులుతున్న తీరు చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం పరిభ్రమిస్తోంది. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం.. కవితకు ఇంతటి ప్రాధాన్యత ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నారంటే అతిశయోక్తి లేదు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీకైన క్షణం నుంచీ  మీడియా మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోందనడంలో  ఆశ్చర్యంలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయంలో కూడా కవితకు అత్యంత ప్రాధాన్యత లభిస్తున్నది. తాజాగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసం ఎదుట వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పడుు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. యోధుడి కుమార్తెకు భయమన్నదే లేదు అన్న క్యాప్షన్ తో  ఉన్న ఫ్లెక్సీ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫ్లెక్సీ చుట్టూ గులాబి జెండాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు.  ఇక ఆ ఫ్లెక్సీలలో కవిత  తెలంగాణ  బొగ్గుగని కార్మికుల కమిటీ కండువా ధరించి ఉన్న ఫొటో ఉంది. ఇప్పుడీ ఫ్లెక్సీల చుట్టూనే చర్చ నడుస్తోంది. కవిత రాజకీయ అడుగులు ఎటు అన్న చర్చ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు వంటి అంశాలను కూడా మరుగున పరిచేసిందని పరిశీలకులు అంటున్నారు.  

అప్పుడు ఓడి గెలిచింది.. ఇప్పుడు గెలిచి ఓడింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తయ్యాయి. పుష్కర సంవత్సరంలోకి అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం స్వతస్సిద్దంగా ఏర్పడిన రాష్ట్రం  కాదు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అందుకే తెలంగాణ గడ్డ  పోరాటాల పురిటి గడ్డ అంటారు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర సాధన..  తెలంగాణ రాష్ట్ర సమితి సారధ్యంలో 2001 నుంచి 2014 వరకు సాగిన మలి దశ ఉద్యమం ద్వారానే సాధ్యమైనా..  తెలంగాణ ఉద్యమం  ఆరు పదులకు పైగా సాగిన ఒక దీర్ఘకాలిక, రాజకీయ ప్రజా ఉద్యమం.  నిజానికి..  1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పురుడు పోసుకుంది. ఇక అక్కడినుంచి 60 ఏళ్ల పాటు  ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే వుంది.  ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎందరో నాయకుల సారధ్యంలో పార్టీలు పుట్టుకొచ్చాయి. కారణాలు ఏవైనా..  మధ్యలోనే లక్ష్యం పక్కదారి పట్టి పోయింది. అయితే నాయకుల స్వార్ధంతో ఉద్యమం పక్కదారి పట్టినా..  ఉద్యమ స్పూర్తి మాత్రం సజీంగానే నిలిచింది.  అందుకే.. జాతీయ, రాష్ట్ర నాయకులు మోసాలు చేసినా..  పడిలేచిన కెరటంలా  తెలంగాణ ఉద్యమం అంతిమ గమ్యాన్ని చేరుకుంది. 1969లో విద్యార్ధుల సారథ్యంలో మహోదృతంగా ఎగసి పడిన జై తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగ ప్రవేశంతో పది నెలలకే చల్లబడింది. సర్కార్ తూటాలకు వందల మంది విద్యార్ధుల నేలకొరిగారు. అయినా..  విద్యార్ధుల బలిదాన స్పూర్తి నిలిచింది. 2001లో మలిదశ ఉద్యమం పురుడు పోసుకునే వరకు  ప్రత్యేక తెలంగాణ స్పూర్తి సజీవంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం  సబ్బండ వర్గాల ప్రజలే నడుం బిగించారు.  ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్య స్పూర్తిని  కొనసాగించారు.  ఇక ఆ తర్వాత ఏమి జరిగిందీ అన్నది మన ముందున్న నడుస్తున్న చరిత్ర.  ఇప్పడు 2001లో కల్వకుట్ల చంద్రశేఖర రావు  సారథ్యంలో గులాబీ జెండా నీడలో..  2001లో మలిదశ ఉద్యమం మొదలైంది. తొలితరం ఉద్యమ నేత  కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీస్సులతో 2001 ఏప్రిల్, 27న జలదృశ్యంలో మలిదశ ఉద్యమం తొలి అడుగు వేసింది. అయితే..  గమ్యం చేరుతుందని.. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యంవుతుందన్న  ఆశ అప్పటికి అంతగా లేక పోయినా.. 2014  జూన్ 2 న ఆరు పదుల కల నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  అయితే..  అంతవరకు ఏమి జరిగింది, ఆ తర్వాత ఏమి జరిగింది, ఇప్పడు ఏమి జరుగుతోంది..  అనే విషయంలోకి వస్తే, ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సకల జనుల సమ్మె(2008) వంటి మహోన్నత ఆందోళనలు,1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల బలిదానంతో సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఆకాంక్ష అయితే నెరవేరింది  కానీ.. కొండాలక్ష్మణ్ బాపూజీ ,  కాళోజీ నారాయణ రావు,  ప్రొఫెసర్ జయశంకర్ సార్,  కేశవ రావు జాదవ్ వంటి  తెలంగాణ సిద్దాంత కర్తలు, స్పూర్తి ప్రదాతలు, ప్రాతః స్మరణీయుల కన్న కలలు ఫలించాయా..  ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఆకాంక్షను ఉపిరిగా జీవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా.. అందుకోసమే ఉపిరి వదిలిన వందల మంది అమర వీరుల ఆకాంక్షలు నేరవేరాయా? అంటే మాత్రం తెలంగాణ ప్రజనీకం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడింది  కానీ, ఆకాంక్షలు మాత్రం అలాగే ఉన్నాయి. అన్నదే  తెలంగాణ ప్రజలు ఇచ్చే సమాధానం అవుతుందని  అంటున్నారు.  నిజానికి..  ఈరోజున్న వాస్తవ పరిస్థితులను, రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వికృత విన్యాసాలను  గమనిస్తే..  ముఖ్యంగా.. తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకుని   బీఆర్ఎస్ గా  పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లో, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రి, ప్రస్తు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  1969 నాటి, తెలంగాణ తొలిదశ ఉద్యమం ఓడి గెలిస్తే.. 2001 మొదలైన మలి దశ ఉద్యమం గెలిచి ఓడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవంక  రాష్ట్ర గీతం.. రాష్ట్ర మాత(తెలంగాణ తల్లి) విగ్రహం కూడా రాజకీయ రంగులు పులుముకున్న పరిస్థితిలో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే మూగ బాధ జనంలో వ్యక్తమవుతోంది. చివరకు, మరో ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నతెలంగాణ నడుస్తున్న చరిత్రను గమనిస్తే.. ‘తన చరిత్రను తనే పఠించి ఫక్కున  నవ్వింది ధరిత్రి’  అన్న కవి వాక్కును  తెలంగాణ రాజకీయ నాయకత్వం నిజం చేస్తోందని, అంటున్నారు.   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక వ్యాసం 

కూతురి హంగామాపై నోరు మెదపని కేసీఆర్ .. బీఆర్ఎస్‌లో గుబులు

కవిత ఎపిసోడ్‌పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంత రియాక్ట్ కాకపోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. తన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించినా, ఆ వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడటం లేదు. దాంతో కూతురు  విషయంలో  డాడీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కొత్తగా ప్రకటించిన సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె, సొంత యాక్షన్ ప్లాన్‌తో నిర్ణయాలు ప్రకటిస్తూ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నారంట.  బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా..  ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్‌గానే ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడినా కేసీఆర్ ఎప్పటిలాగే ఫాంహౌస్‌లో గడిపేస్తున్నారు. దాంతో ఆయన వైఖరిపై గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ..  కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా.. హరీష్‌రావుని పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్‌‌లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె, పాత ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్​ మౌనం.. పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడుపడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా, దూతలతో రాయబారం నడుపుతుండటంపై ఆమె అసహనంతో ఉన్నారంట. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి కూడా తన తండ్రి ఇష్టపడటం లేదా?.. అని కవిత తన సన్నిహితుల వద్ద అంటున్నారంట. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. కానీ కేసీఆర్​ నుంచి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఆ  క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్​ విలీనానికి కుట్ర జరుగుతున్నదని కవిత మరోసారి ఆరోపించారు. మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె.. మార్గమధ్యలో పెద్దపల్లి వద్ద ఆగారు. అక్కడికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్‌ను కవిత కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొన్నాళ్లు సొంతంగానే కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తున్నది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సింగరేణి జాగృతి ఏర్పాటు సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులను కాకుండా యూనియన్‌‌‌‌‌‌‌‌లో యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న యువ కార్మికులను పిలిపించుకోవడం ఇందుకు ఊతమిస్తున్నది. అదే సమయంలో కలిసి వచ్చే బీసీ సంఘాలు, నేతలతో ముందుకు వెళ్లాలన్న యోచనలో కవిత ఉన్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ సీనియర్ లీడర్లకు అసలేం జరుగుతోందో అంతుపట్టడం లేదంట. కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వాళ్లను కాదని ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్లు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే, అది మళ్లీ నెగెటివ్​ అయ్యి తమకే తగులుతుందని ఆందోళన చెందుతున్నారంట. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ పెట్టిన పార్టీ సీనియర్​ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై మీడియా ప్రశ్నించగా.. ఆ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆమె బదులిచ్చారు. ఇలాగే చాలామంది సీనియర్ లీడర్లు అధిష్టానం స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ కూడా అందుబాటులో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం లండన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేటీఆర్.. తర్వాత అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే ముందు కవిత లేఖపై స్పందించిన ఆయన అది అసలు పెద్ద విషయమే కాదని కొట్టిపారేశారు. దాంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.  ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు.  ఇక కేసీఆర్‌‌తో హరీష్‌రావు ఫామ్‌హౌస్‌లో భేటీ అయి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ​విచారణ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెబుతున్నప్పటికీ, కవిత ఎపిసోడ్‌పైనా చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కవిత అసలు  ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా? లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. అదలా ఉంటే కవిత చేస్తున్న కార్యక్రమాలు, పర్యటనల్లో తెలంగాణ జాగృతి బ్యానర్‌లు కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌తో సంబంధం లేకుండానే జాగృతి ఆధ్వర్యంలోనే కవిత సమావేశాలు, పర్యటనలు కానిచ్చేస్తున్నారు . కవిత లేఖ వివాదంపై బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా స్పందించవద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి కవిత పర్యటనల్లో బీఆర్ఎస్ నాయకులు, జెండాలు లేకపోవడం, ఆమె లేఖ లీక్, నాయకుల నిశ్శబ్దంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గత మయ్యాయంటున్నారు. అయితే కవిత మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. హైదరాబాద్‌లో సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె, కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకంగా జూన్ 4 ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తానంటున్నారు. కమిషన్ నోటీసులపై పార్టీ నేతలెవరూ స్పందించని పరిస్థితుల్లో కవిత రియాక్ట్ అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో జాగృతి అధ్యక్షురాలి ఆంతర్యం అంటుపట్టక గులాబీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.

బిగుసుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. సిట్ ముందుకు ప్రభాకరరావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు... ఈనెల 5న సిట్ విచారణకు హాజరుకాబోతుండటంతో  ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. గత 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకరరావు,  సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇండియాకు తిరిగి వస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి హామీ పత్రం కూడా ఇచ్చారు.  వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్ట్‌ జారీ అయిన వెంటనే ఆయన ఇండియా బయల్దేరుతారు. పాస్‌పోర్ట్‌ అందిన మూడు రోజుల్లో దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 5న సిట్ విచారణకు హాజరవుతున్నట్టు దర్యాప్తు బృందానికి సమాచారం ప్రభాకర్‌రావు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో  ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు గత ఏడాది మార్చి 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే.  ఈ కేసు విచారణకు ముదే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకరరావు. అక్కడే ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవేమీ కుదరకపోవడంతో యాంటిసిపేటరీ బెయిలు ఇస్తేనా భారత్ కు తిరిగి వస్తానంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు.  సుప్రీం కోర్టు ఆయనకు స్వల్ప ఊరటనిస్తూ విచారణకు సూర్తిగా సహకరించాలన్న షరతుతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు ఆయన భారత్ కు వచ్చి సీటి్ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఆయనను విచారించడానికి సిట్ అధికారులు రెడీగా ఉన్నారు.   ఏ ప్రశ్నలు అడగాలి..  ఎలాంటి సమాచారం సేకరించాలనే అంశంపై దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్‌రావు మధ్య లింక్ ఎలా కుదిరింది?  ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు? అన్న ప్రశ్నలను సిట్ ప్రభాకరణావుకు సంధించే అవకాశా లున్నాయంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ నిబంధనలను పాటించారా..? హార్డ్‌డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాలతో వాటిని నాశనం చేశారు?  వంటి ప్రశ్నలతో ప్రభాకరరావును సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టైన వారి నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకరరావును విచారించనున్నారు. మొత్తం మీద ఈ కేసులో విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు ఉచ్చు గట్టిగానే బిగిసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ సీఎం కావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తునకు ఆటంకాలు కలిగించే విధంగా హార్డ్ డిస్క్ లు మాయం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారాన్ని  సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇక ఇప్పుడు సిట్ విచారణలో ప్రభాకరరావు నోరు విప్పితే.. బీఆర్ఎస్ పెద్దలు చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సిట్‌ విచారణలో ప్రభాకర్‌రావు నోరు విప్పుతారా...? ప్రీప్లాన్‌గా వ్యవహరిస్తారా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆయన నిజాలు చెప్తే... గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు వారంరిలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఈనెల 5 బిగ్‌ డేగా మారనుంది. ఆ రోజు ప్రభాకర్‌రావు సిట్‌ విచారణకు హాజరవుతున్నారు. అదే రోజు మాజీ సీఎం కేసీఆర్‌ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఒకే రోజు రెండు బిగ్ ఇష్యూస్... దీంతో... ఏం జరగబోతుంది అన్నది రాజకీయంగా ఉత్కంఠగా రేపుతోంది.

సోమశిల చేప విల విల

  సోమశిల చేప విలవిలలాడుతోంది. చేపల వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపల వేట యథేచ్ఛగా కొనసాగుతుండటంతో నిజమైన మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. సైజు రాకుండానే చేపలను అక్రమ వేటగాళ్లు ఊడ్చేస్తుండటంతో మత్య సంపద ఖాళీ అవుతోంది.  అలివి  గాని చేపలవేటతో ఎదుగుదల లేకుండానే చేప పిల్ల బయటపడి ఎండిపోతోంది. నిషేధిత వలతో సోమశిల లో సైజుకు రాని చిన్న పిల్ల చేపలను సైతం ఊడ్చి వేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల నుండి ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాల పరిధిలోని సోమశిల బ్యాక్ వాటర్ లో యథేచ్ఛగా చేపల వేట సాగుతున్నా.. వాహనాల్లో చేపలను తరలిస్తున్నా అటు మత్స్యశాఖ అధికారులు కానీ ఇటు అటవీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చేపల మాఫియాకు అడ్డు అదుపు లేకుండా  సాగుతోంది.  చేపల వ్యాపారులు కొందరు మాఫియాను తలపిస్తూ రోజుకు లక్షలాది రూపాయల మత్స్య సంపదను తోడేస్తున్నారు. 30 నుంచి 40 మందికి లైసెన్సులు ఉన్నట్టు తెలుస్తున్నా సోమశిల వెనక జలాల్లో వందల సంఖ్యలో వేటగాళ్లు జాతరను తలపించేలా చేపలవేట సాగిస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ లో కి వెళ్లేందుకు అనుమతులు లేకున్నా  వాహనాలు వెళుతూనే ఉన్నాయి.  కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన వేటగాళ్లు చేపలు వేటాడితే ఆ చేపలను  వ్యాపారుల వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు. సోమశిల బ్యాక్ వాటర్స్ లో  చేపల  మాఫియా పిల్ల,పెద్ద చేపలన్న తేడా లేకుండా  వూడ్చేస్తోంది  చేపల వేటలో ఆరితేరి, అనుభవం కలిగిన కోస్తా జిల్లాలోని కాకినాడ,తుని తదితర ప్రాంతాల వేటగాళ్ళను  తీసుకొచ్చి మరీ మాఫియా చేపలవేట సాగిస్తోంది.  అలివి వల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ,  వీటితోనే  వేటాడుతుండడంతో   సైజుకు రాని చిన్న చేపలు, ఎదుగుదల లో ఉండే చేపలు సైతం బయట పడుతున్నాయయి. ఈ కారణంగా చేపలు పెద్దవి కాకుండా మత్స్య సంపదకు గండి కొడుతున్నారు . నలుసు లాంటి చేపలు అయితే  కుప్పలు కుప్పలుగా  పడేయడం, చిన్న చేపలను ఎండవేసి టన్నుల కొద్దీ  అమ్ముకోవడం జరుగుతుంది.   చేపలు పట్టే వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇచ్చే లైసెన్స్ లు జిల్లాలో 30 నుంచి 40 మందికి మాత్రమే ఉండగా వాటిని అడ్డుగా పెట్టుకుని వందల మందితో చేపల వేట కొనసాగిస్తున్నారు.  మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం 20 వేల రూపాయలు కోస్తా ప్రాంతంలో మత్స్య కారులు తీసుకుంటూ  ఇక్కడికి వచ్చి చేపలు పట్టడం జరుగుతుంది.  జిల్లాలో ఉండే   లైసెన్స్ లు  కూడా చాలా మటుకు ఫోటోలు ఒకరివి  ఉంటే మరొకరి పేరు తో లైసెన్స్ ఉంటుందని సమాచారం.ఈ రకంగానూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఒక అధికారి వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడంతో తో కొందరు మళ్ళీ లైసెన్స్ లు  కోర్టు ద్వారా తీసుకున్నట్లు సమాచారం చేపల మాఫియా దాటికి అసలైన మత్స్యకారులు  నానా కష్టాలు పడుతున్నారు. సోమశిల లో చేపలు ఎదిగితే  అవి వర్షాకాలంలో సగిలేరు. పెన్నా నదులు ప్రవహించేటప్పుడు నీటికి ఎదురెక్కి వస్తాయి. దీంతో వీటి  ప్రాంతాల పరివాహ ప్రాంత అడుగుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళి జీవనం సాగిస్తుంటారు.ప్రస్తుతం ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో చివరకు కూలీ పనులకు వెళుతున్నారు.  సోమశిల బ్యాక్ వాటర్ లోని గోపవరం ,అట్లూరు , ఒంటిమిట్ట ,నందలూరు మండలాల్లో పెద్ద ఎత్తున చేపల వేట సాగుతోంది, గోపవరం మండలం లోని గట్టుపల్లి ,బ్రాహ్మణ ,ప్రాంతాలు అట్లూరు మండలంలోని బ్యాక్ వాటర్ ప్రాంతంలో చేపల మాఫియా కూలీలను తిష్ట వేయించి వేటాడిస్తోంది. ఒంటిమిట్ట మండలంలోని వెనుక జలాల్లో కూడా ఈ వేట ఎదేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండు వారాల క్రితం గోపవరం మండలంలో  చేపలతో వెళుతున్న ఒక  వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని   ఫిషరీస్ శాఖకు అప్పజెప్పారు. అంతేకాదు నెల్లూరు రోడ్డు లో రెండు చోట్ల చెక్ పోస్టులు ఉన్నా కూడా ఈ చేపల వాహనాలు తిరుగుతూ ఉండడం గమనార్హం.  చేపల మాఫియా రోజూ  టన్ను పెద్ద సైజు చేపలు వేటాడితే చిన్న చేపలు మరో టన్ను వరకు వేటాడుతున్నారు. ఇవి రెండు లక్షల రూపాయలు మేరకు విలువ చేస్తాయని చెప్పుకొస్తున్నారు .పెద్ద చేపలను కడప, కేరళకు, కలకత్తా లకు తరలిస్తుండగా ఎండు చేపలను అక్కడే ఎండబెట్టి విజయవాడకు తరలిస్తున్నారు. ఒక కేజీ ఎండు చేపలు రూ.130 ప్రకారం పచ్చి చేపలు అయితే 70 నుంచి 80 రూపాయలు వరకు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు   తెలుస్తోంది. ఇలా అడ్డూఅదుపు లేకుండా వేట సాగిస్తుండడంతో   సోమశిల మత్స్య సంపద మటుమాయం అయ్యే పరిస్థితి నెలకొంది.  రిజర్వ్ ఫారెస్ట్ లోకి అనుమతి కుండా ఎవరూ ప్రవేశించకూడదు .అంతే కాదు రెవెన్యూ ఫారెస్ట్ లోకి కూడా అనుమతి లేకుండా  వాహనాలకు ప్రవేసించ కూడదు. అయితే రిజర్వుపారెస్ట్ నుంచే చేపల వాహనాలు తిరుగుతున్నా వాటిని అదుపు చేయడంలో ఫారెస్ట్ అధికారులు  విఫలమౌతున్నారు. గతంలో చేపల వేట మాటున  ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి.  చేపల రవాణా పేరుతో ఇప్పుడు కూడా వాహనాలు, వేటగాళ్లు తిరుగుతూ ఉండడంతో ఎర్రచందనం రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది.  

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. భక్తుల ఆందోళన, ఆగ్రహం

ఎన్ని సార్లు అభ్యంతరం తెలిపినా విమానయాన శాఖ ఖాతరు చేయడం లేదు. ఆగమశాస్త్ర విరుద్ధంగా తిరుమల గిరులపై నుంచి, అందులోనూ శ్రీవారి ఆలయంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానాలు వెడుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 1) ఉదయం ఒక విమానం శ్రీవారి ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణించింది.  ఇందుకు సంబంధించి తిరుమలలో భక్తులు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తిరుమల భద్రతపై భక్తులలో ఆందోళన వ్యక్తమౌతోంది. పదేపదే విజ్ణప్తి చేసినా ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా విమానాలు తిరుమలేశుని ఆలయం మీదుగా వెళ్లడాన్ని విమానయాన సంస్థ నిషేధించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నిమార్లు విజ్ణప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.   గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.  తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి ఆగమశాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వెంటనే ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం మీదుగా ప్రయాణించిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు గానీ, హెలికాప్టర్లు గానీ ప్రయాణించడం పూర్తిగా నిషిద్ధం. ఇలాంటి ప్రయాణాలను అపచారంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుమలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని టీటీడీ చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే  కేంద్రం మాత్రం ఇది  ఆచరణ సాధ్యం కాదని తెలుపుతూ వస్తోంది. దీంతో ఈ విషయంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని  తిరుమలను ' నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. 

తిరుమల శ్రీవారి సేవలో సోనూసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ సోమవారం (జూన్ 2) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మంటపంటో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో  మాట్లాడిన సోనూ సూద్..  సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాతికేళ్లు అయ్యిందని తెలిపారు. కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.  అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.  

స్కాట్లాండ్ తెలుగుదేశం ఎన్నారై విభాగం ప్రారంభం

తెలుగుదేశం పార్టీ స్కాట్లాండ్ ఎన్నారై విభాగం ప్రారంభమైంది. మినీ మహానాడు 2025 తో ఘనంగా ఈ విభాగాన్ని ప్రారంభించారు.  ఎడిన్ బర్గ్ నగరంలోని అప్ హాల్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.    తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.  కార్యక్రమం ప్రారంభం లో తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ జూమ్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు.   ఎన్టీఆర్ పాటించిన క్రమశిక్షణను అందరూ  పాటిస్తే అత్యున్నత విజయాలను అందుకోవచ్చన్నారు.  ఎన్టీఆర్ విలువలను ఎన్నారైలు వారి భావి తరాలకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమం లో పాల్గొన్న ఎన్నారైలు  తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత, పార్టీ విధానాల వల్ల తాము ఏవిధం గా లబ్ది పొంది మంచి జీవితాలను గడుపుతున్నామో వివరించారు. అందుకు కృతజ్ఞతగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ కి తమవంతు సహకారాన్ని అందించి, తద్వారా పార్టీ ని బలోపేతం చేసి భావితరాలకు పార్టీ విధానాల ద్వారా లబ్ది చేకూర్చాలని సంకల్పించారు. అ నంతరం కుర్రా అనిల్ కుమార్ , కార్తీక్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.  కార్యక్రమం లో పొట్లూరి కృష్ణప్రసాద్, డాక్టర్ లావు శ్రీకాంత్ , డాక్టర్ దాసరి శ్రీనివాసరావు, షేక్ ఫర్జానా, మండవ మంజూష మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

తిరుపతిలో అత్యాధునిక బస్టాండ్

హెలిప్యాడ్, హోటళ్లు, డార్మెటరీలు సహా అన్ని వసతులు  తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్నీ సౌకర్యాలు ఒకేచోట లభించేలా తిరుపతిలో  అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం జరగనుంది.  ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడరన్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. భక్తులకు అన్ని వసతులు ఒకే చోట అందేలా ఇది ఉంటుంది.   రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బస్టాండ్ లో  హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  ఈ కొత్త బస్టాండ్ నిర్మాణానికి స్థలం ఇవ్వనుంది.  కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌,  ప్రైవేటు సంస్థ లు సంయుక్తంగా ఈ బస్టాండ్ నిర్మించనున్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా ఈ బస్టాండ్ డిజైన్ ఉండబోతున్నది.  .ప్రస్తుతం ఉన్న తిరుపతి బస్టాండ్ 13.18 ఎకరాల్లో ఉంది. కొత్త టెర్మినల్‌ను 12.19 ఎకరాల్లో నిర్మిస్తారు. ప్రస్తుత బస్టాండ్‌కు మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. కొత్త టెర్మినల్‌కు మాత్రం నాలుగు వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. ఈ కొత్త బస్టాండ్‌లో రెండు అంతస్తుల సెల్లార్ ఉంటుంది. ఈ సెల్లార్‌ను బైక్‌లు, కార్ల  పార్కింగ్ కు ఉపయోగిస్తారు.   గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్టాండ్‌కు కేటాయిస్తారు. ఆ బస్టాండ్ లో 98 ప్లాట్ ఫారంలు,   50 బస్సులు పార్కింగ్ చేయడానికి, ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం కూడా ఏర్పాట్లు ఉంటాయి.మొదటి, రెండో అంతస్తుల్లో కొంత భాగాన్ని ఆర్టీసీ కార్యాలయాలకు ఇస్తారు.   మిగిలిన స్థలాన్ని  ఫుడ్‌కోర్టులు, దుకాణాలకు కేటాయిస్తారు.  మూడో అంతస్తును సర్వీసుల కోసం వదిలేస్తారు. అంటే భవనానికి సంబంధించిన విద్యుత్ పనులు, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ వంటివి ఇక్కడ ఉంటాయి. నాలుగు నుంచి ఏడో అంతస్తులను హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తారు. ఎనిమిది, తొమ్మిది, పదో అంతస్తుల్లో బ్యాంకులు, ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు కేటాయిస్తారు. ఇక పదో అంతస్తు పైన  హెలిప్యాడ్   నిర్మిస్తారు. మొత్తం మీద 1.54 లక్షల చదరపు అడుగుల మేర బిల్డింగ్ ఉంటుంది.ఈ ప్రాజెక్టులో ఆర్టీసీ విలువైన స్థలాన్ని ఇస్తున్నందన పెట్టుబడి పెట్టడం లేదు. నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొంత, కాంట్రాక్ట్ సంస్థ కొంత పెట్టుబడి పెడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, బ్యాంకులు, కార్యాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ, నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కాంట్రాక్టర్ సంస్థలు పంచుకుంటాయి. ఎ 

కన్నుల పండువగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం (జూన్ 1) సాయంత్రం   శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు.  ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది.  ఇక శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన   సోమవారం (జూన్ 2) ఉదయం  మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు.  బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అలాగే  బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

మహానాడు సక్సెస్‌‌ను వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది : సోమిరెడ్డి

  మంత్రి  లోకేష్ ఆరు సూత్రాలంటే..వైసీసీ క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరిస్తోందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు సైకిల్‌తో కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. కడప వేదికగా జరిగిన మహానాడు సూపర్ సక్సెస్‌ను వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో రాజీలేని పోరాటం, అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి కోసం మా యువ నాయకుడు పడుతున్న తపన చూసి జగన్ రెడ్డి ఆయన మాజీ మంత్రులు కడుపుమంటతో రగలిపోతున్నారు.  మహానాడులో రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేశ్ బాబు ఆరు సూత్రాలను ప్రతిపాదిస్తే.. వైసీపీ మాత్రం తమ డీఎన్ఏలోని క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరించిందన్నారు. వైసీపీ ఆవిష్కరించిన ఆ నాలుగు అంశాలేంటో ఏపీ ప్రజలను తెలియాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యవస్థా బాగుండకూడదని జగన్ ఆశపడుతున్నారు. ప్రజలు అన్యాయానికి గురైపోవాలని, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, వైసీపీ అధికారంలోకి రావాలనే లక్ష్యాలతో బ్లూ మీడియా పత్రికలో వార్తలుంటున్నాయి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వస్తుండటం చాలా దురదృష్టకరమని సోమరెడ్డి అన్నారు.  

శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది : భాను ప్రకాష్

  పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన క్యూలైన్లలో అది కూడా ఆలయం లోపల కొందరు వైసీపీ నేతలు కావాలనే భక్తులను రెచ్చగొడుతూతురని ఆయన అన్నారు. గోవులు చనిపోతున్నాయని ఓ అసత్య ప్రచారం చేశారుని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఆవరణంలో ముస్లిం వ్యక్తి వద్ద నమాజ్ చేయించి వారే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయించారని ఆయన అన్నారు. వైసీపీ చేస్తున్న కుట్రలు బహిర్గతం చేసేలా విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీకి లేఖ రాశామని భానుప్రకాశ్ తెలిపారు.రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదిర్కోలేకే…. శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత.. రాజకీయ పునరావాస కేంద్రంగా వైసీపీ నేతలకు తిరుమల మారిందని అన్నారు. ఆలయ పవిత్రతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వారు వ్యవహిస్తున్నారని మండిపడ్డారు.  మొన్న గోశాల నుంచి మొదలుకొని.. నిన్న గోవిందుడి వరకు వారు వరుసగా అరాచకాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ ఘటనలు పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చా శనివారం జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తో పాటు ఇంటెలిజెన్స్ డీజీకి లేఖ రాశానని తెలిపారు. తాజాగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో ఉన్న కాకినాడకు చెందిన ఓ భక్తుడు.. టీటీడీ చైర్మన్, ఈవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై టీటీడీ విచారణ జరిపింది. అందులోభాగంగా సదరు భక్తుడుని విచారించింది. ఈ సందర్భంగా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా..టీటీడీని సదరు భక్తుడు క్షమాపణలు కోరాడు.

హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం.. తెలుగు సంప్రదాయం నచ్చింది : మిస్ వరల్డ్‌

  హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్-2025 పోటీల్లో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్  సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. సుచాత మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ లో సుచాత జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తానెట్ డోంక్‌మనెర్డ్, సుపత్రా చువాంగ్ శ్రీ. చువాంగ్ శ్రీ కుటుంబానికి థాలాంగ్‌లో బిజినెస్ ఉంది. ప్రాథమిక విద్యాభ్యాసం ఫుకెట్ లోనే పూర్తిచేసిన సుచాత.. బ్యాంకాక్ లో ఉన్నత విద్య పూర్తిచేశారు. ప్రస్తుతం బ్యాంకాక్ లోని థమ్మసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారు. ఈ మేరకు రూ.8.5 కోట్ల నగదుతో పాటు 1,770 వజ్రాలు పొదిగిన కిరీటం సుచాత సొంతమైంది.  అదేవిధంగా ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు కూడా ఆమె అర్హురాలైంది. ఈ సందర్భంగా ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ మీడియాతో మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. తెలంగాణలో తన ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి మళ్లీ తెలంగాణకు వస్తానని తెలిపారు. 16 ఏళ్లకే రొమ్ము కేన్సర్‌కు గురయ్యాను. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో వ్యాధి నుంచి తప్పించుకున్నాని మిస్  వరల్డ్ పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో నా శారీరక, మానసిక అవస్థ వర్ణనాతీతం. మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని గుర్తించానఃన్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమన్న విషయం ప్రతి మహిళకు చేరేలా ప్రచారం చేస్తున్నాను. ఇది సత్ఫలితాన్నిస్తోంది. నాకు మా అమ్మే స్ఫూర్తి.  తెలంగాణలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఇక్కడి సంస్కృత, మనుషులు, పర్యాటక ప్రదేశాలు అద్బుతం అని పేర్కొన్నారు. బహుబలి సినిమా గురించి తాను విన్నానని ఆ సినిమా చూసి రివ్యూ ఇస్తానని తెలిపారు. ఓపల్ సుచాతా గత నాలుగేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్నారు. ఆమె తన అందాల పోటీల ప్రస్థానాన్ని 2021లో మిస్ రత్తనకోసిన్ పోటీలతో ప్రారంభించారు. 2022లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో రన్నరప్ తప్పుకోవడంతో ఆమె రెండో స్థానానికి ప్రమోట్ అయ్యారు. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. అందుకోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపారు. తల్లితండ్రులు తనకు ఎంతగానో సహకారం అందించారని గుర్తు చేశారు

ఎంపీతో క్రికెటర్‌ పెళ్లి...డేట్ ఫిక్స్?

    సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.  లఖ్‌నవూలోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఉండనున్నట్లు తెలుస్తోంది. రింకు, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. మ్యారేజ్‌కి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. యూపీలోని మచిలీషహర్‌ లోక్ సభ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 25 ఏళ్ల ప్రియ గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. టీమ్‌ఇండియాలో యువ క్రికెటర్‌గా రింకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పట్టువీడలేదు... పదవి దక్కేనా!

    ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పార్టీ ఏర్పాటు చేసి తరువాత అన్నింటినీ పక్కన పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ నుంచి ఓ పెద్ద పదవి వరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా మృతి చెందారు. అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 1978 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారం ఇచ్చారు. ఆయన మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి తల్లి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే.. ఆ తరువాత ఓటమి చవి చూసారు.  అనంతరం 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చీఫ్ విప్ గా, స్పీకర్ గా కూడా పదవులు అధిరోహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ , అజహరుద్దీన్ తో కలసి వివిధ స్థాయిల్లో క్రికెట్ ఆడారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అనివార్యంగా ప్రవేశించారు. నిజాం కాలేజీలో నందమూరి బాలకృష్ణ.. కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చదువుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి గా పని చేశారు.ఆయన సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన తరువాత గత ఎన్నికల వరకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు.2024 ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరుపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వాక్చాతుర్యం తో రాజంపేట పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దిరెడ్డి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ పై స్పందించే రీతిలో ప్రసంగించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తో జిల్లా రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటూ పైచేయి సాధించారు.  గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన.. తన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని పీలేరు ఎమ్మెల్యే గా గెలిపించారు. పావు నరసింహారావు ఆశీస్సులతో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కిరణ్ కుమార్ రెడ్డి తండ్రికి ఉన్నా అది నెరవేరలేదు... తండ్రిఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నెరవేర్చారు.  తన ఇంట్లో అధికారం ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. నేటికి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. తమ ఇంటి గడప వద్దకు వచ్చి ఏమి కావాలనే అడిగితే అది జరుగుతుంది అన్నది నియోజకవర్గ ప్రజల మాట. కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం దృష్ట్యా బీజేపీ పార్టీ ఆయనకు అత్యున్నత స్థాయి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభం.. సరకులు పంపిణీ చేసిన మంత్రులు

  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ  రేషన్ షాపులు తెరుచుకున్నాయి. 29,796 రేషన్‌ దుకాణాల్లో సరకులు పంపిణీ చేస్తున్నారు.  కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చౌకధరల దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ రేషన్‌ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరకులు అందజేశారు.  కర్నూలులో మంత్రి టీజీ భరత్‌, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.   ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తామ సివిల్ సప్లై అధికారులు తెలిపారు. 1 కోటి 46 లక్షల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేశారు.  

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కారు పార్కింగ్‌, బస్టాండ్‌ ప్రదేశాల్లో సందడి నెలకొంది. ఆలయ పరిసరాల్లో ఈవో వెంకట్రావు తిరుగుతూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో ఆలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు.