సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఇండోనేషియా ప్రభుత్వం!!

  సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా ప్రభుత్వం. ఇండోనేషియా సముద్ర తీరంలోని మొలక్కాస్ ప్రాంతంలో నవంబర్ 14న అర్థరాత్రి సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌ పైన భూకంప తీవ్రత 7.1గా నమోదయిందని జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండోనేషియా ‍ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు  కూడా జారీచేశారు.  ఇండోనేషియాలో సంభవించిన భూకంప తాకిడి భారత్‌లోని అండమాన్‌ నికోబార్‌ దీవులను కూడా తాకింది. అదే సమయంలో నికోబార్‌ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అండమాన్ దీవుల్లో రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనలకు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ.. ఆస్తి నష్టం కానీ..  జరగలేదని అధికారులు తెలియజేశారు.

పేదలకు జనసేన అండ.. డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు ప్రారంభించిన పవన్

  ఆకలి అన్నవారికి రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వయంగా తన చేతులతో అన్నం వండి పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. కష్టాల్లో ఉన్నవారిని.. పేదలను ఆదుకొంటూ..లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన అపర అన్నపూర్ణ ఈ సీతమ్మ. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణ అనే ప్రసిద్ధమైన పేరుతో.. ఖండాంతర ఖ్యాతి గడించారు. 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అనే మాట వింటూనే ఉంటాం..కానీ అన్నదానానికి మించిన దానంలేదని నమ్మిన అమ్మ డొక్కా సీతమ్మ. అమ్మ అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పిన మహా మానవతా మూర్తి. తన ఇంట్లో రోజుకు 24 గంటలూ పొయ్యి వెలుగుతునే ఉండేది. అంతటి మహోన్నత అన్నదాత పేరుతో అన్నదాన శిబిరాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ఇసుక కొరత కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను ప్రారంభించి ఆహారాన్ని అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. నేడు ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఆయనే స్వయంగా ప్లేట్లల్లో ఆహారాన్ని వడ్డించి కార్మికులకు అందించారు. పేదలకు అండగా ఉండే ఇటువంటి కార్యక్రమాలను చెప్పటాలని.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలని  పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.  ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. కార్మికులకు అండగా ఇప్పటికే జనసేన పలు కార్యక్రమాలను చేపట్టింది. అధికార ప్రభుత్వంపై కూడా ఘాటుగా విమర్శలు చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. ఇసుక కొరత నివారించకుండా ఇసుక వారోత్సవాలను ఎలా నిర్వహిస్తారంటూ పవన్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు జనసేనాని పవన్. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ‘డొక్కా సీతమ్మ’ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని ఎన్నికల సమయంలో పవన్ చెప్పిన విషయం తెలిసిందే.

పిన్ బాల్ విజేత.. టైం పాస్ కోసం ఆడిన ఆట జాతీయ గుర్తింపు తెచ్చింది

  ఆట అందలమెక్కించింది. రాష్ట్ర స్థాయి పతకాలను సాధించి పెట్టింది. పిన్ బాల్ క్రీడా పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిపింది. విజయవాడకు చెందిన అబ్దుల్ మజీద్ ఇలా పతకాలు సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ఇప్పుడు సాధన చేస్తున్నాడు. విజయవాడకు చెందిన అబ్దుల్ ముజీబ్ ఆటో నగర్ లో ఆటో మొబైల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. మూడు దశాబ్దాలుగా ఇదే రంగం పై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు సరదాగా పిన్ బాల్ ఆడుతూ ఉండేవాడు. అలా కాలక్షేపంగా ఆడుకున్న ఆట కొత్త మార్గమైంది. గురి తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తుండడంతో ఆటపై ఆసక్తి పెరిగింది. స్నేహితులు.. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించటంతో వివిధ స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. రాష్ట్ర స్థాయి పోటీలలో పతకాలు సాధించే ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆటపై ప్రత్యేక దృష్టి సారించాడు. ఇక అప్పటి నుండి వీలున్నప్పుడల్లా విజయవాడలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పిన్ బాల్ సెంటర్ లకు వెళ్లి సాధన చేసేవాడు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేశాడు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మూడు రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతగా నిలిచి కప్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన పోటీలలో తలపడిన రెండుసార్లు కూడా మొదటి స్థానం సాధించాడు. ఇటీవల చెన్నై లో జరిగిన నాలుగు రాష్ట్రాల పిన్ బాల్ పోటీలలో అద్భుతమైన ప్రదర్శనతో అబ్దుల్ ముజీబ్ అందరిని ఆకట్టుకున్నాడు. 20 టీమ్స్ ఈ టోర్నీలో తలపడగా సింగిల్స్ లో ప్రథమ స్థానం సాధించటంతో పాటు డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన వివేక్ సింగ్ తో ఆడి విజేతగా నిలిచాడు. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి ఛాంపియన్ గా అవతరించటమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు అబ్దుల్ ముజీబ్ చెబుతున్నారు. ఆటవిడుపు అనుకున్న ఆట జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుందని అనుకోలేదని.. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెస్తానని అన్నాడు.

టీడీపి ఖాళీ.. బై బై బాబు నినాదాన్ని సీరియస్ గా తీసుకుంటున్న టీడీపీ నేతలు

  టీడీపీలో ఒకేరోజు రెండు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వంశీ, అవినాష్ పార్టీని వీడడం ఒకటైతే.. నిన్నటి ఆయన ఇసుక దీక్షకు మెజార్టీ ఎమ్మెల్యేల డుమ్మా కొట్టడం మరో అంశం. పార్టీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలపై చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా టిడిపి ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఎంపీలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చించనున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి అసలు ఎమ్మెల్యేలు ఎవరు హాజరవుతున్నారే విషయమే సందిగ్ధంగా మారింది. ఇసుక కొరతపై నిరసనగా చంద్రబాబు దీక్ష చేశారు. ఈ సమయంలోనే కీలక నేతలు అవినాష్, వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయటం.. అదే రోజు వైసిపిలో చేరటం కూడా జరిగిపోయాయి. వంశీ కూడా వైసీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు నడిచిన సస్పెన్స్ కు ఆయన తెర దించుతూ.. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమలను టార్గెట్ చేస్తూ  ఘాటైన విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలోనే టిడిపి అధిష్టానం ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు అందరిని ఉదయం తన నివాసానికి రావాలని ఆదేశించారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు.. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు తాజా రాజకీయ పరిణామాల గురుంచి చర్చించనున్నారు.  వంశీ చేస్తున్నటువంటి విమర్శలను బట్టి చూస్తే.. ఇంకా మరికొంతమంది కీలకమైన నేతలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. టిడిపి అధిష్టానానికి ఈ ప్రచారం కొంత కలవరపాటుకి గురిచేసింది. ఎవరెవరు చర్చలు పాల్గొంటున్నారు.. ఎవరెవరు పార్టీ వీడబోతున్నారు అనే అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ నుండి బీజేపీ,వైసీపీలోకి పెద్ద సంఖ్యలో నేతలు చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

దర్శనం కోసం నమోదు చేసుకున్న 36 మంది అమ్మాయిలు.. మళ్ళీ రాజుకున్న శబరిమల చిచ్చు

  దేశాన్ని కుదిపేసిన ఘటనల్లో శబరిమల అంశం ఒకటి. గతంలో అన్ని వయస్సుల మహిళల ఎంట్రీని సమర్థిస్తూ సుప్రీం తీర్పునివ్వడంతో ఇక్కడ వివాదం మొదలైంది. తీర్పును వ్యతిరేకిస్తూ మహిళల ప్రవేశాన్ని భక్తులు అడ్డుకోగా.. కొంత మంది మహిళలు మొండిగా అయ్యప్ప దర్శనానికి ముందుకెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ అంశానికి రాజకీయ రంగు పులుముకోవటంతో అది మరింత రచ్చకు కారణమైంది. ఇప్పుడు మళ్లీ శబరిమల కేంద్రంగా వివాదం రాజుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.  తాజాగా శబరిమల పై సుప్రీం కోర్టు తీర్పు ఆందోళన కలిగిస్తుంది. గత తీర్పు పై స్టే ఇవ్వాలని న్యాయస్థానం శబరిమలై ఘటనను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రవేశానికి పలువురు మహిళలు ముందుకొస్తున్నారు. రేపు శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్. గత ఏడాది నవంబర్ లో అయ్యప్ప ఆలయంలోకి కొందరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా శబరిమలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ సమయంలోనే తృప్తి దేశాయి సైతం శబరిమలై వెళ్ళేందుకు విఫలయత్నం చేశారు.  శబరిమల ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోవడం కోసం 36 మంది మహిళలు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడటానికి కొద్ది సమయం ముందే ఈ రిజిస్ర్టేషన్ జరిగినట్లు తెలుస్తుంది. గతంలో కోర్టు తీర్పు నిచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి 2న ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. గత ఏడాది కూడా నిషేధిత వయస్సు గల 740 మంది మహిళలు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ ఆన్ లైన్ నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరించిన తరువాత వారి ఇళ్లకు వెళ్లి వారు తీర్థయాత్రకు రావడం లేదని కన్ఫమ్ చేసుకున్నారు. ఇక మండల పూజ కోసం అయ్యప్ప ఆలయం రేపు తేరుచుకోనుంది. ఈ నేపధ్యంలో శబరిమల భద్రతా బలగాల నీడలోకి వెళ్ళింది. శబరిమలలో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పది వేలకు పైగా పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. 24 మంది ఎస్పీ ర్యాంకు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.112 డీఎస్పీ లు, 264 మంది సీఐలు,1000 మంది ఎస్సైలు,8402 సివిల్ పోలీసు బలగాలు మోహరించారు. శబరిమలలో ప్రత్యేకంగా 307 మంది మహిళా అధికారులకు విధులు అప్పగించారు. భద్రత లో 30 మంది మహిళా సీఐలు, ఎస్సైలను నియమించారు. ఈ నెల ముప్పై వరకు సన్నిధానం చుట్టూ 2550 మంది పహారా కాయనున్నారు. 24 గంటలూ ఇద్దరు ఎస్పీ ర్యాంక్ అధికారులు పర్యవేక్షించనున్నారు. రెండవ విడతలో నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు 2539 మంది అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. సన్నిధానం, నీలక్కల్, పంబా పరిసరాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

ఉత్తమ్ చూపు ఢిల్లీ వైపు... జైపాల్ స్థానం భర్తీకి పావులు...

ఏఐసీసీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా, హుజూర్ నగర్ ఉపపోరులో తన భార్యను గెలిపించులేకపోవడంతో కొద్దిరోజులు స్టేట్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఇంకా నాలుగేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేకపోవడంతో ... ఈలోపు ఢిల్లీలో ఎక్కువగా ఉంటూ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారట. ఒకవైపు, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉండటం.... మరోవైపు ఎంపీగా ఉండటంతో... ఏఐసీసీ లేదా సీడబ్ల్యూసీల్లో ఏదో ఒక పదవి సాధించుకుని... ఢిల్లీ స్థాయిలో తన పరపతి, పలుకుపడిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నారట. మొన్నటివరకు జైపాల్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేవారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో పెద్దదిక్కుగాను, అండగాను ఉండేవారు. అదేసమయంలో జైపాల్ రెడ్డి మాటకు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర విలువ ఉండేది. సోనియా అండ్ రాహుల్... జైపాల్ రెడ్డికి అత్యంత గౌరవం ఇచ్చేవారు. అయితే, జైపాల్ రెడ్డి మరణం తర్వాత... తెలంగాణ తరపున హైకమాండ్ దగ్గర అంత పలుకుబడి కలిగిన నేత లేకుండా పోయారు. అందుకే, జైపాల్ రెడ్డి స్థానాన్ని తాను భర్తీ చేయాలని ఉత్తమ్ భావిస్తున్నారట. అలా, ఢిల్లీ స్థాయిలో పేరు తెచ్చుకుని, అసెంబ్లీ ఎన్నికల సమయానికి మళ్లీ స్టేట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది ఉత్తమ్ ప్లాన్ గా సన్నిహితులు చెబుతున్నారు. మరి, జైపాల్ రెడ్డి మాదిరిగా... కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉత్తమ్ తన పలుకుబడిని పెంచుకోగలుతారో లేదో చూడాలి.  

కాకినాడ కార్పొరేషన్‌లో ద్వారంపూడి పెత్తనం..! మేయర్‌ను డమ్మీగా మార్చేసి రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పుగోదావరిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే, తూర్పు ప్రజలు ఏ-పక్షాన ఉంటారో వాళ్లే అధికారంలోకి వస్తారు. అంతలా స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తారు ఇక్కడి జనం. ఇది ఒక్కసారి కాదు... అనేకసార్లు రుజువైంది. 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. 2014లో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టి అధికారం పీఠంపై కూర్చోబెట్టిన తూర్పుగోదావరి ప్రజలు... 2019 వచ్చేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలిచారు. దాంతో, జిల్లాలోని మొత్తం మూడు పార్లమెంట్ స్థానాలతోపాటు, 14 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లో 14 సీట్లను వైసీపీ ఎగరేసుకొనిపోతే, అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, రాష్ట్రంలో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు... ఇప్పటికీ టీడీపీలో చేతిలోనే ఉన్నాయి. దాంతో, ఆయా కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇప్పుడు రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు... దాదాపు అందరూ వైసీపీ వాళ్లే కావడంతో... టీడీపీ మేయర్లను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను వేధింపులకు గురిచేస్తున్నారట. ముఖ్యంగా కాకినాడ కార్పొరేషన్ లో తీవ్ర స్థాయిలో పోరు నడుస్తోందట. కాకినాడ మేయర్ ను దాదాపు డమ్మీగా మార్చేసి... కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో... తన మాటే చెల్లుబాటు అయ్యేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో, కాకినాడ మేయర్... సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య వార్ నడుస్తోందట. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అంటూ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, వైసీపీ కేవలం 10 డివిజన్లకే పరిమితంకాగా, తెలుగుదేశం కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో... పలువురు టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ పంచన చేరారు. దాంతో కాకినాడ కార్పొరేషన్లో సమీకరణలు, బలాబలాలు మారిపోయాయి. అదేసమయంలో మేయర్ పావనిని అధికార పీఠం నుంచి దించేందుకు వైసీపీ పావులు కదిలింది. అయితే, నాలుగేళ్లు వరకు మేయర్ ను దించకుండా జీవో ఉండటంతో వైసీపీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ, కార్పొరేషన్లోనే ఎక్స్ అఫీషియో పేరుతో ఒక ఛాంబర్ ను ప్రారంభించి, మరో అధికార కేంద్రానికి శ్రీకారం చుట్టారు వైసీపీ నేతలు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా, తొలిసారి కార్పొరేషన్లో ఎమ్మెల్యేలకు ఒక ఛాంబర్ ఏర్పాటు చేయడం.... ఇక్కడ్నుంచే ఎమ్మెల్యేలు... మున్సిపల్ అధికారులతో, కార్పొరేటర్లతో తరచూ సమావేశమవుతూ... మేయర్ డమ్మీగా మార్చేశారు. ఇక, అధికారులంతా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదేశాలనే పాటిస్తుంటంతో మేయర్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తానికి అటు కార్పొరేటర్లను... ఇటు అధికారులను తనవైపు తిప్పుకుని... మేయర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వైసీపీ... ముందుముందు ఇంకెన్ని అరాచకాలు చేస్తుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఉత్తమ్ మౌనవ్రతం... గాంధీభవన్లో వింత చర్చ...

హుజూర్ నగర్ లో తన భార్య పద్మావతి దారుణ ఓటమి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తన కంచుకోట హుజూర్ నగర్ లో పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఉత్తమ్ తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యారని, అందుకే, పార్టీ కార్యకలాపాల్లో అప్పటిలాగా పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. హుజూర్ నగర్ ఓటమి తర్వాత సోనియాను కలిసి తనను పీసీసీ అధ్యక్ష పదవిని తప్పించాలని స్వయంగా కోరిన ఉత్తమ్... గాంధీభవన్ మీటింగ్స్ లో కూడా పెద్దగా పాల్గొనడం లేదని చెబుతున్నారు. ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్ గా, ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో పనిచేసిన ఉత్తమ్... కాంగ్రెస్ హైకమాండ్ అండదండలతో రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. రెండుసార్లు కోదాడ నుంచి... మూడుసార్లు హుజూర్ నగర్ నుంచి... అలా, 1999 నుంచి 2018 వరకు ఐదుసార్లు వరుసగా విజయం సాధించిన ఉత్తమ్, 2014లో తన భార్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే, పార్టీ ఆదేశం మేరకు నల్గొండ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఇంతవరకూ అప్రతిహతంగా సాగిన ఉత్తమ్ రాజకీయ ప్రయాణంలో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీగా గెలవడంతో...తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఉత్తమ్.... ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతిని బరిలోకి దించి...ఘోరంగా ఓటమిని చూశారు. హుజూర్ నగర్ నుంచి హ్యాట్రిక్ కొట్టి తన కుటుంబానికి కంచుకోటగా మార్చుకున్న హుజూర్ నగర్ లో తన భార్యను గెలిపించుకోలేకపోవడంతో ఉత్తమ్ కి ఇబ్బందికరంగా మారింది. 2014లో హుజూర్ నగర్ నుంచి తాను గెలవడమే కాకుండా, తన భార్యను కోదాడ నుంచి గెలిపించుకున్న ఉత్తమ్..... 2018 ఎన్నికల్లో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నప్పటికీ... తిరిగి తన సతీమణిని గెలిపించుకోలేకపోయారు. దాంతో, తన భార్యను కూడా గెలిపించుకోలేకపోయారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక, ఇఫ్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో మరోసారి ఘోర పరాజయం ఎదురవడంతో తీవ్ర అవమానంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే, హుజూర్ నగర్ ఫలితం తర్వాత అటు గాంధీభవన్ కు... ఇటు సొంత నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఉత్తమ్ ఉంటే హైదరాబాద్ లో... లేదంటే ఢిల్లీలో... ఈ రెండూ కాకపోతే కోదాడలో ఉంటున్నారని... కానీ హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదని అంటున్నారు.

విజయనగరం వైసీపీలో వర్గపోరు... బొత్సకు వ్యతిరేకంగా ఫిర్యాదులు...

విజయనగరం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి బొత్సకు వర్గపోరు తలనొప్పిగా మారిందట. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య సమన్వయం కరువై ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారట. అలా, జిల్లాలో వర్గపోరు తారాస్థాయికి చేరి, చివరికది సీఎం జగన్ దగ్గర వరకు వెళ్లిందట. అయితే, విషయం తెలుసుకున్న బొత్స... రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు తొమ్మిది సాధించిన వైసీపీకి, విజయనగరం జిల్లా కంచుకోటగా మారింది. అయితే, మొత్తం తొమ్మిది స్థానాల్లో ఆరు సీట్లను తన కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుయాయులకు ఇప్పించుకున్న బొత్స... వారందరూ గెలుపొందేలా చూసుకున్నారు. అలాగే, టికెట్లు దక్కనివారిని బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తేవడంలోనూ బొత్స సక్సెస్ అయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ జిల్లా నేతల మధ్య విభేదాలు మొదటికొచ్చాయి. గ్రామ వాలంటీర్ల నియామకం విషయంలో మొదలైన విభేదాలు చివరికి గ్రూపు రాజకీయాలకు దారితీశాయి. వాలంటీర్ల నియామకంలో కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మాట చెల్లుబాటు కాకపోవడంతో, వాళ్లంతా మంత్రి బొత్సకు వ్యతిరేకంగా మారారట. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు... స్థానికంగా బొత్సకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు సైతం ఇచ్చారట. అంతేకాదు, బొత్స అంటే పడనివాళ్లంతా ఒక వర్గంగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొందరు కార్యకలాపాలు చేస్తున్నారని తెలుసుకున్న బొత్స జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో... వాళ్లందరితో ప్రత్యేకంగా సమావేశమవుతూ, వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడంతో... కొంతవరకు తన వ్యతిరేక వర్గాన్ని శాంతింపజేసినట్లు చెబుతున్నారు. అయితే, బొత్స అంటే గిట్టనివాళ్లు మాత్రం... నివురుగప్పిన నిప్పులా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని విజయనగరం జిల్లా వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

తెలంగాణలో స్వైన్ ఫ్లూ మొదలైంది.. ఇప్పటికే 21 మంది మృతి

  తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలవరం రేపుతోంది. రాష్ట్రంలో రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే రాష్ట్రంలో పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ప్రజలు విలవిలలాడుతూ ఉండగా.. ఇది చాలదన్నట్లు స్వైన్ ఫ్లూ వాటికి తోడైంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9974 మందిని స్వైన్ ఫ్లూ అనుమానితులుగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. వారిలో 1335 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సాధారణంగా చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ స్వైన్ ప్లూ మరింతగా విజృంభిస్తుంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు స్వైన్ ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఈ సారి భారీ వర్షాలు కురవటంతో పరిస్థితిని ముందే ఊహించి చర్యలు చేపట్టామని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాలో ఐసోలేషన్ వార్డులున్నాయి. అన్ని మందులు అందుబాటులో ఉంచి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదైన కేసుల వివరాలు సైతం తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి నవంబర్ 12 వరకు స్వైన్ ఫ్లూ కేసుల వివరాలను ప్రభుత్వం నవంబర్ 14న విడుదల చేసింది.

ఏపీ ప్రాజెక్టులకు నిధుల కొరత... జగన్ సర్కార్ కు అగ్నిపరీక్ష

  ఏపీలో సాగునీటి పథకాలకు నిధుల కొరత  కనిపిస్తుంది. ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే లక్షన్నర కోట్లకు పైగా అవసరం ఉంది. ఒక్క పోలవరానికే 32వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వేల కోట్లు బకాయి పడడంతో.. బాకీ ఉన్న బిల్లులను చెల్లించాలంటూ ఓ వైపు కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో కొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరికొన్నింటిని ప్రాధాన్య ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇవి కాకుండా నదుల అనుసంధాన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే అనుకున్నవన్ని సాకారం కావాలంటే గల్లాపెట్టె సహకరించాలి. కానీ కాసులకు కటకటలాడే పరిస్థితి ఉండటంతో..ఇన్ని ప్రాజెక్టులను ఎలా కట్టాలో తెలియని పరిస్థితులు సాగునీటి శాఖలో నెలకొన్నాయి. ప్రాజెక్టు ముందుకు కదలడం ప్రశ్నార్ధకరంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే రూ.1,64,915 కోట్లు అవసరమవుతాయని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పోలవరం సాగు నీటి ప్రాజెక్టు కోసం 32,498 కోట్లు అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు పలు సాగు నీటి ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు వేల కోట్లు ఉన్నాయి. వాటిని చెల్లిస్తేనే పనులు మొదలు పెడతామని కాంట్రాక్టు సంస్థలు తేల్చి చెప్పాయి. వాటిని తీర్చే పరిస్థితి ప్రభుత్వానికి లేకపోవటంతో ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సీఎం సూచించిన ప్రాధాన్య ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించాలంటే నిధులు కావాలి. ఖజానాల్లో నిధులు అట్టడుగుకు చేరుకున్నాయి. దీంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనలో జల వనరుల శాఖ ఉంది. కానీ సాగు నీటి పథకాలకు నిధులు ఇచ్చేందుకు వాణిజ్య బ్యాంకులు ముందుకు రావటం లేదు. వీటి నిర్మాణం వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం ఉండదని బ్యాంకులు భావిస్తున్నాయి. అందువల్ల బకాయిలు తిరిగి చెల్లించే పరిస్థితి ప్రత్యేక కార్పొరేషన్ కు సాధ్యం ఉండదనే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ధిక వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. భారీ ప్రాజెక్టులకు సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గోదావరి జలాలను బానకచర్లకు ఎత్తిపోయడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న పధకానికి డిపిఆర్ ను సిద్ధం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ కు జల వనరుల శాఖ అప్పగించింది. ఈ పథకానికి 64 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. ఇది రెట్టింపు అయ్యే పరిస్థితి ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టే ప్రాధాన్యత సాగు నీటి ప్రాజెక్టుల కోసం తక్షణమే కృష్ణా డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో 30,108 కోట్లు, అనంతపురం చీఫ్ ఇంజనీర్ పరిధిలో 21,663 కోట్లు, కర్నూలు చీఫ్ ఇంజనీర్ పరిధిలో 20,039 కోట్లు, పోలవరం ప్రాజెక్టు ఈఎన్సీకి 14,546 కోట్లు, చీఫ్ ఇంజినీర్ కడప పరిధిలో 4,276 కోట్లు అవసరం అవుతాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను విస్తరించి బానకచెర్ల రిజర్వాయర్ కాంప్లెక్స్ కు 80,000 క్యూసెక్కులను శ్రీశైలం నుంచి పంపించే పథకాన్ని 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 2021 నాటికి అవుకు టన్నెల్ లో పూర్తి చేయాలనుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టు పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పనులు చేపట్టేందుకు నిధుల జాడ కూడా కనిపించటం లేదు.

మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ.. కేసీఆర్ ఏం చేస్తారో? ఏంటో?

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా 40 రోజులు నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కానీ.. ఎవరికి వారు మాదే కరెక్ట్.. వెనక్కి తగ్గేది లేదంటూ.. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా మొండిగా వెళ్తున్నారు. ప్రభుత్వం తమని చర్చలకు పిలిచి, సమస్యలు పరిష్కరించేవరకు మా సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. చర్చల్లేవు ఏం లేవు, విలీనం మాటే లేదు, అసలు అందరూ డిస్మిస్ అంటూ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇద్దరూ వెనకడుగు వేయట్లేదు. హైకోర్టు కూడా నాలుగు చివాట్లు పెట్టి, ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించండని మొత్తుకుంటూ.. విచారణ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుంది. ఒకవైపు ప్రజల ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపేమో నెల జీతంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు కొందరు మనస్తాపంతో బలిదానాలు చేసుకుంటున్నారు. దీంతో ఇక ప్రభుత్వం దిగిరాదని అర్ధమైన ఆర్టీసీ జేఏసీ తానే ఒక మెట్టు దిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టింది. మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురువారం సాయంత్రం ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో.. ఆర్టీసీ జేఏసీ మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల ఆత్మహత్యలు జేఏసీని బాధిస్తున్నాయని తెలిపారు. కనీసం మిగతా డిమాండ్లనైనా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో తాత్కాలికంగా విలీనాన్ని పక్కనపెట్టామని, దీనికి కార్మికులు అధైర్యపడవద్దని తెలిపారు. సమ్మె 41 రోజులుగా కొనసాగుతున్నా.. ఇప్పటికే 23 మంది వరకు కార్మికులు మరణించినా.. ప్రభుత్వంలో కించిత్తు స్పందన కూడా లేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబాలను పరామర్శించలేదని అసహనం వ్యక్తం చేసారు. ఈ మరణాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలు, కోర్టుకు సమర్పిస్తున్న తప్పుడు నివేదికలతో కార్మికులు తీవ్ర మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఇప్పట్లో సాధ్యం కాదన్న ఒకే ఒక్క కారణాన్ని చూపి.. సమ్మె చేయడమే తప్పన్నట్లుగా కోర్టుని, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. విలీనమనే అంశాన్ని సాకుగా చూపి, కార్మికుల డిమాండ్లు పరిష్కార సాధ్యం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆ ఒక్క డిమాండ్‌ పరిష్కారం కాదన్న సాకుతో మిగతా డిమాండ్లన్నీ అలాంటివేనన్న దుష్ప్రచారం సీఎం చేస్తున్నారని అన్నారు. అందుకే తాత్కాలికంగా విలీనం డిమాండ్ ని పక్కనపెట్టామని, ఇకనైనా మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు . మరి జేఏసీ ఓ మెట్టు దిగింది. ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి.. చర్చలు జరిపి సమ్మెకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి.

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు :- వెల్లుల్లి కిలో రూ.250 , ఉల్లి కిలో రూ.80

  కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కిలో వెల్లుల్లి రూ.250 రుపాయలు, ఉల్లి రూ.70 రూపాయలు పలుకుతుంది. భారీ వర్షాల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పడిపోవడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలకు రెక్కలొచ్చి.. ఏకంగా రెండొందల దాటి మూడొందలకు పరుగెడుతున్నాయని చెప్పుకోవాలి. దీని కారణంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు అసలు కొనలేని పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి ధరలు చేరుకున్నాయి. పూర్తిస్థాయిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉల్లిపాయతో పాటకు పాటు వెల్లుల్లి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కేజీ ఉల్లిపాయల ధరలు రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతుండగా ఏకంగా వెల్లుల్లి ధరలైతే రెండొందల రూపాయలు దాటి మూడొందల రూపాయల కూడా చేరుకునే పరిస్థితి ఏర్పడింది.చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇదే పరిస్థితి మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఉంటుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వెల్లుల్లి రావాల్సి ఉంది. అక్కడ పంట చేతికి రాకపోవడం.. వరుసగా వర్షాల కారణంగా కూడా పంట దిగుబడి అనేది తగ్గింది. దాని కారణంగా ఏపీకి ఎగుమతి తగ్గిపోవటంతో ఒక్కసారిగా వీటి ధరలు పెరిగాయని చిన్న వ్యాపారస్తులు చెబుతున్నారు. సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి.. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి లేని పంటలు ఎక్కడా ఉండవని చెప్పవచ్చు. అదే ఆకుకూరల ధరలు కూడా తీవ్రంగా పెరిగిపోయి సామాన్యుడు కూరగాయల ధరలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మధ్య తరగతి వారు కూడా కూరగాయల కొనాలంటే భయపడుతున్న పరిస్థితి వచ్చింది.ఆకుకూరలతో పాటు కొత్తిమీర,కరివేపాకు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అనే చెప్పాలి.ధరలపై సామాన్యు లు మధ్య తరగతి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వంకాయల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి.. ఇందుకు కారణం పంట పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడమేనని వ్యాపారుల చెబుతున్నారు. రెండు నెలల క్రితం వేసిన పంట భారీ వర్షాల వల్ల పూర్తిగా చెడిపోవడంతో దిగుబడి రావడం లేదంటున్నారు. మరో మూడు నెలల పాటు ఈ పంట వచ్చే పరిస్థితి లేని కారణంగా మూడు నెలల పాటు వంకాయల ధర రూ.50 నుంచి 70 రూపాయలు పలికే అవకాశం ఉందని తెలుస్తుంది. సాధారణ ప్రజలు ఇష్టంగా ఏదైనా కొనాలన్నా ..తినాలన్నా.. కష్టాంగా ఉందని వినియోగదారులు బాధ పడుతున్నారు.

తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు.. అనంతలో నీటి గొడవలు!!

  అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలని అధిగమించాలన్నా.. అక్కడి సమస్యల్ని పరిష్కరించాలన్నా అదంత సులభం కాదని అందరికి తెలిసిన విషయమే. ఈ సంగతి వైసిపి అధిష్టానానికి చాలా కొద్దిరోజులోనే అర్థమైంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి మీద మూడు రివ్యూ లు జరిగాయి. అందులో ఒకటి జిల్లా మంత్రి శంకర నారాయణ ఆధ్వర్యంలో, మరొకటి పాత ఇంచార్జి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆధ్వర్యం లో, మూడవది ప్రస్తుత ఇన్ చార్జి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి.ఇలా ముచ్చటగా మూడు మీటింగ్ లు జరిగితే మూడు మీటింగ్లలోనూ సేమ్ సీన్. ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో కూడా అంతే జరిగింది. నీటి విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదు.  అనంతపురం జిల్లాకు ఉన్న నీటి వనరుల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన హెచ్చెల్సీ, రెండోది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పడిన హంద్రి నీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు నీరు కావాలని డిమాండ్ పెట్టడంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే కొత్త ఇన్ చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం వచ్చి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలంటే తమ నియోజకవర్గానికి కావాలంటూ మైకందుకుని అందరూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వైసిపి నేతలే ఉండటంతో నేతల మధ్య పరస్పర సమన్వయం లేదని సమాచారం.దీంతో ఇన్ చార్జి మంత్రికి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోడంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారు. మొత్తం మీద అనంతపురం ఎమ్మెల్యేల తీరు పై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.  

జనవరిలో జరగనున్న స్థానిక ఎన్నికలు... క్యాబినెట్ సమావేశంలో జగన్ ప్రకటన!!

  సీఎం జగన్ స్థానిక ఎన్నికలకు సమర భేరిని మోగించారు. బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. విపక్షాలు ఎంత విమర్శించినా ఆంగ్ల మాధ్యమంపై అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదన్నారు. అక్రమ లేఅవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం సిద్ధంగా ఉండండి అంటూ మంత్రులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు. క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో అధికారిక అజెండా అంశాలు ముగిశాక రాజకీయ అంశాల పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులతో పలు అంశాలను ప్రస్తావించారు జగన్. అమ్మవడి కార్యక్రమాన్ని వాస్తవానికి జనవరి 26వ తేదీన నిర్వహిద్దామని అనుకున్నాం కానీ అదే నెల జనవరి 9వ తేదీన చేపడతామని అనుకోలేదన్నారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేల నగదును అందింస్తామని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించి పాలనపై ప్రజాభిప్రాయం కోరనున్నట్లు తెలిపారు. జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం అని వెల్లడించారు.మంత్రులు.. ఎమ్మెల్యేలు.. స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. ఈ నెలాఖరులోగా ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలు వేయాలని మంత్రులను మరోసారి సీఎం ఆదేశించారు.గత కేబినెట్ భేటీలో ఇదే విషయాన్ని చెప్పిన సీఎం జగన్ బుధవారం నాటి మంత్రి వర్గ సమావేశంలోనూ దీని పై కర్తవ్య బోధ చేశారు. జిల్లా సమీక్షా సమావేశాలను త్వరగా పూర్తి చేయాలని ఇన్ చార్జి మంత్రులను ఆదేశించారు. ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలను వేయాలని చెప్పారు. ఇందులో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించాలని ఈ మొత్తం లోనూ యాభై శాతం మహిళలు ఉండేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.ఇన్ చార్జ్ మంత్రులు వారికి కేటాయించిన జిల్లాలో నాలుగు రోజులు ఉంటారో, అయిదురోజులూ ఉంటారో తనకు తెలియదని ఈ నెలాఖరులోగా జిల్లాలోని ఆలయ కమిటీ లను, మార్కెట్ కమిటీల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 34 శాతం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలులో ఉందని.. మిగిలిన 66 శాతం పాఠశాలల్లోనూ అమలు చెయ్యాలని తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. పోటీ ప్రపంచంలో ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల భాషను అందరూ నేర్చుకుంటున్నారని కొందరు ఎనిమిదవ తరగతి, కొందరు ఇంటర్, డిగ్రీ, మరికొందరు పీజీ ఇలా ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోకి వెళుతున్నారన్నారు. అయితే సంగ్రహణ సామర్థ్యం బాల్యం నుంచే ఎక్కువగా ఉంటుంది గనుక ఒకటో తరగతి నుంచి పెడితే పేదపిల్లలు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అని మంత్రి వివరించారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. పిల్లలు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాష తెలుగు లేక ఉర్దూ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందని మిగతా సబ్జెక్టుల మాత్రం ఆంగ్ల భాషలో బోధిస్తారని తెలిపారు.

ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ.. జగన్ మార్క్ పాలన

  ఏపీలో సర్కారు బడులకు మహర్దశ వచ్చింది, మరో బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాడు నేడుతో విద్యారంగంలో సమూల మార్పులు, తొమ్మిది రకాల కనీస వసతులతో సర్కారు బడులకు మహర్దశ, తొలి దశలో 15715 పాఠశాలల్లో అమలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలోని సర్కారు బడుల రూపురేఖలు మారిపోనున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువ చేసేందుకు జగన్ సర్కార్ మూడు విడతల్లో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మార్పు తరవాత అదే పాఠశాలల పరిస్థితిని కళ్లకు కట్టేలా ఫొటోలు తీసి మరీ ప్రజల ముందు ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం ద్వారా ఈ కార్యక్రమంపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి అనే మాట వినిపించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్, మునిసిపల్, పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జువైనల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 44512 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33797 ప్రాథమిక, 4215 ప్రాథమికోన్నత, 6510 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో రాష్ట్రంలోని 17715 పాఠశాలలను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇందులో 9795 ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్థులున్న పాఠశాలలను నాడు నేడు కార్యక్రమంలోని మొదటి దశలో ఎంపిక చేశారు. వీటితో పాటు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు అసంపూర్తిగా ఉన్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా మొదటి దశలో అవకాశం కల్పించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకు రావడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా తీర్చి దిద్దాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యతో పాటు ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లు ప్రాధాన్యతగా తీసుకోవాలని, అలాగే జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

జగన్ సర్కార్ పై కార్మికుల ఆగ్రహం

  చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక ఫండ్ ను ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా ఏ కుటుంబానికైనా ఆపద వస్తే ఆదుకోవటం ఏ రంగానికైనా ఇబ్బంది వస్తే ఆ రంగాన్ని ఆదుకోవటం, అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దురదష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు, ప్రమాదవశాత్తూ చనిపోతే అయిదు లక్షల రూపాయలు అందించటం వల్ల పేద వర్గాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఏ ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి.ఇంట్లో తల్లి లాంటి ప్రభుత్వాన్ని వదులుకొని ఏదో కొత్త పెళ్లి కూతురు కోసం కొత్త పెళ్ళాం కోసం మోజు పడినట్టుగా ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇవాళ అదే భస్మాసురహస్తంలాగా మానెత్తి మీద చేయిపెట్టాడు అని ఒక కార్మికుడు కడుపు మంటతో మాట్లాడుతున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె రాజుగారు ఒక్క భవన నిర్మాణ రంగం అంటే ఒక తాపీ మేస్త్రి, ప్లంబరో, ఒక కార్పెంటరో ఒకటైల్స్ వేసేవాళ్లో ఒక  ఎలక్ట్రిషన్ ఏ కాదు,దాదాపు అనేక వంద సంస్థలపై నా ఈ రంగం మీద ఆధారపడి వుంటాయని దాంట్లో ఒకటి పెయింటర్స్ రంగం ఇలా ఎన్నో సోషల్ యూనియన్లు  కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కష్టాల కూడ చెప్పుంటారు. వీళ్లందరూ ఈ సమస్యలు సుడిగుండంలో పడటానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి  మరియు ఒకే ఒక్క ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అని ఆరోపించారు.తాన తప్పు వల్ల ఇవ్వాల అందరూ ఒక పెయింట్ షాప్ అంటే కేవలం ఆయన ఒక్కడే కాదు బతికేది ఆయన దగ్గర ముఠావాళ్ళు కూడా బతుకుతారు, గుమస్తాలు,మేస్త్రీలు బతుకుతారు. ఎన్నో రంగాల్లో ఎంతమంది వ్యక్తులు ఆ పెయింట్ షాప్ మీద ఆధారపడి బతికే పరిస్థితులో దాదాపు ఏడు నెలల నుంచి ఇవాళ వాళ్ళు ఏ వ్యాపారం లేకుండా పోయిందంటే కనీసం భవిష్యత్తులో అయిన బావుండదంటే అది కూడా లేకుండా ఇష్టారీతిన పరిపాలన కొనసాగుతోందని పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఇసుక వెబ్ సైట్ హ్యాక్ .. ఇసుక కొరత బ్లూఫ్రాగ్ సంస్థ వల్లనేనా?

  డంపింగ్ యార్డుల్లో ఇసుక ఉంది. కానీ ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం ఇసుక లేదు. కృత్రిమ ఇసుక కొరతకు బ్లూఫ్రాగ్ సంస్థ కారణమా ? బ్లూఫ్రాగ్ సంస్థ వెనుక ఎవరైనా ఉన్నారా? వీటిని వెలికి తీసే పనిలో ఉంది సిఐడి. ఇసుక సరఫరా పారదర్శకంగా జరగాలని ఏపీ సర్కారు ప్రయత్నిస్తుంది. అక్రమ మార్గాలు అనుసరిస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇసుక కొరత వల్ల లక్షల మంది ఎదుర్కుంటున్న ఇబ్బందుల పై గురి పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఈ సమయంలో వెబ్ సైట్ హ్యాకింగ్ ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న వ్యవహారం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.  వరదల ప్రభావంతో డిమాండ్ కు సరిపడా ఇసుక సరఫరా జరగటం లేదని ప్రభుత్వం అంగీకరిస్తోంది. అదే సమయంలో యార్డుల్లో ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ ఆన్ లైన్ పోర్టల్ లోకి ఎందుకు లభ్యం కావడం లేదని డౌట్ ఆధారంగా సీఐడీ దర్యాప్తు మొదలెట్టింది. బ్లూఫ్రాగ్ పై వరుస ఫిర్యాదులు అందుకున్న సీఐడీ ఏక కాలంలో సంస్థలపై దాడులు జరిపింది. డేటా స్టోర్ చేసే విభాగాలనూ తెరిచి కీలకమైన సమాచారం సేకరించారు. అదే విధంగా బ్లూఫ్రాగ్ సంస్థ ఐదారేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న సమాచారాన్ని సీఐడీ రాబట్టింది. ఇసుక కృత్రిమ కొరత వెనుకున్న మాయాజాలం బయటపెట్టేందుకు బ్లూఫ్రాగ్ సంస్థల్లో సేకరించిన డేటాను ఐటీ సైబర్ క్రైం విభాగాలతో విశ్లేషించనున్నాయి. సంస్థ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు సీఐడీ అధికారులు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన డేటా సేకరణ క్రోడీకరణ బ్లూఫ్రాగ్ సంస్థల్లో జరుగుతోంది. కంపెనీ సర్వర్ లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సీఐడీ అధికారులు సేకరించారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టనుంది సీఐడీ. కృత్రిమ ఇసుక కొరత వెనుక బ్లూఫ్రాగ్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నప్పటికీ విచారణ తర్వాతే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.

పవన్ ని అన్న మాటలు మిమ్మల్ని అంటే తట్టుకోగలరా?: బాబు

  ఇసుక అంశంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ దగ్గర ధర్నా చౌక్ లో దీక్షకు దిగారు. ఈ దీక్ష పన్నెండు గంటల పాటు సాగనుంది. చంద్రబాబు ఆందోళనకు మద్దతు తెలియజేసిన జనసేన తమ పార్టీ తరపున ఇద్దరు ప్రతి నిధులను పంపింది. దాంట్లో జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, పార్టీ ప్రధాన కార్య దర్శి శివ శంకర్ ఉన్నారు .ఇసుక కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల చిత్రపటాల దగ్గర నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి అధినేత. ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ నాయకులు అదే పనిగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాము మీకంటే ఎక్కువ తిట్టగలమని అన్నారు ఆయన.  లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని అలాంటి విమర్శలు మీపైనా, మీ కుటుంబంపైన చేస్తే తట్టుకోగలరా అని ప్రశ్నించారు చంద్రబాబు. అధికార నేతలకే కాదు తమకు కూడా ధైర్యం ఉందని,తిట్టడం చేతకాక కాదు తిట్టాలనుకుంటే  వాళ్ళ కంటే ఎక్కువగా తిట్టగలుగుతాము, కాని సభ్యత అడ్డం వస్తుందని గుర్తుపెట్టుకోమని తాను దుర్మార్గులని హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. ఒక జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మ్యాచ్ చేస్తుంటే ఆయనపైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని అలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే  మీరు తట్టుకోగల్గుతారా మీ కుటుంబం గురించి చెప్పలేమా అని బాబు  తన ఆవేదనను వ్యక్తం చేశారు.మా నాయకులని తిట్టే పరిస్తితికి వచ్చారని.. అయినా పర్వాలేదు కానీ మమ్మల్ని తిటే సమయం మీరు ఉపయోగించుకోని ఈ పేద వాళ్లకు ఉచిత ఇసుక ఇవ్వండి, ఇసుక సరఫరా చేయండి చాతనైతే, చాతకాకపోతే మేము దద్దమ్మలమని ఒప్పుకోని రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సన అవసరం ఉందని బాబు ఘాటైన విమర్శలు చేశారు.దీని పై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.