శ్రీశైలం జలాశయానికి వరద పోటు

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల జలాశయం  జలకళతో  కళకళలాడుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి,  38 వేల 408 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఇక సుంకేశుల నుంచి అయితే 36 వేల 975 క్యూసెక్కుల నీరు వస్తున్నది.శ్రీశైలం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 75 వేల 383 క్యూసెక్కులు ఉండగా, ఐట్ ఫ్లో లక్షా 21 వేల 482 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.50 అడుగులు ఉంది. కుడిచ ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.  

నా పేరు పవన్.. ఆడా ఈడా ఎక్కడైనా ఉంటా!

తాను ఏ ఊరు వెడితే ఆ ఊరే తనది అంటానంటూ తనను హేళన చేస్తున్న మాజీ మంత్రి రోజా వంటి వారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీటుగా బదులిచ్చారు. తన పేరు పవన్ అని.. తాను సర్వాంతర్యామిననని..అన్ని చోట్లా తిరుగుతుంటానని చెప్పారు. పవన్ అంటే గాలి అని గాలి లేని చోటు ఎక్కడా ఉండదనీ అన్నారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదన్నారు. తన సినిమా చూడమని కానీ, తనకు ఓటు వేయమని అడగడం కానీ  రాదన్నారు.   రెండేళ్ల క్రితం విశాఖలో హోటల్ గదిలో నన్ను ప్రత్యర్ధుల అడ్డుకోవడానికి, అంతమొందించడానికి ప్రయత్నించారనీ, హోటల్ గదిలో బంధించి పోలీసులను మోహరించి తాను ఉంటున్న గది తలుపులను బూటు కాళ్లతో తన్నించారనీ గుర్తు చేశారు. ఆ సమయంలో తనకు అండగా మొత్తం విశాఖ నగరం నోవాటెల్ కు తరలి వచ్చిందన్నారు. ఆ అభిమానానికి గుర్తుగానే.. ఆ అభిమానానికి కృతజ్ణతగానే  విశాఖలో   హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశానన్నారు.  తన జీవితాన్ని విశాఖ నగరం మార్చిందనీ..  ఇంట్లో ఉన్న నన్ను ప్రయోజకుడిగా చేసేందుకు  అన్నయ్య చిరంజీవి వదిన నన్ను విశాఖ ఆ రోజు పంపించారని గుర్తు చేసుకున్నారు.   

తొలి నుంచీ తేడానే..ఈ కొలికిపూడి

  చాలా మంది ఇతడొక అమరావతి ఉద్దారకుడని, టీడీపీ అనుంగు మిత్రుడనీ ఫీలవుతుంటారుగానీ.. అందులో ఎంత మాత్రం నిజం లేదా? ఆ మాటకొస్తే ఇతడు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డిని చెప్పుతో కొట్టిందే టీడీపీకి కొమ్ముకాస్తున్నావన్న మాటకు. కానీ ఇతడ్ని తప్పుగా అర్ధం చేసుకుని.. టికెట్ ఇచ్చి ఆదరించింది టీడీపీ. ఇప్పుడు చూస్తే ఇతడు తిరువూరులో పార్టీ, కేడర్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. కొలికిపూడి గెలిచింది ఎమ్మెల్యేగా తొలిసారి. కానీ ఇతడి కేంద్రంగా వరుస వివాదాలు. ఒక పార్టీ లైన్ కి ఎలా కట్టుబడి ఉండాలి? ఆ మాటకొస్తే ఒక ఎమ్మెల్యేగా ఎలా బిహేవ్ చేయాలి? కేడర్ ఎందుకంత కీలకం? ఇవేవీ ఇతడికి తెలిసినట్టూ లేవు. తనకవి వర్తించనే వర్తించవన్న కోణంలోనూ బిహేవ్ చేస్తుంటాడు. తనకు నోరుంది, ఆపై సోషల్ మీడియా ఉందన్న చందంగా వైసీపీ ప్రోకామెంట్లు చేస్తుంటాడు. మొన్నటికి మొన్న ఒక రోడ్డు విషయంలో ఒక ఎస్టీ మహిళపై దాడి వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదే. ఆపై వైన్ షాపుల విషయంలో గతానికి ప్రస్తుతానికి తేడా చెప్పి.. పార్టీని ఇరుకున పెట్టడం. ఆపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో హంగామా. క్రమశిక్షణా కమిటీ ముందుకు రావడంలోనూ బిల్డప్పు. ఇలా ఇతడి గురించి చెబుతూ పోతే మెరిట్స్ కన్నా, డీ మెరిట్స్ ఎక్కువ. అప్పటికీ చంద్రబాబు ఇవ్వాల్సిన వార్నింగులన్నీ ఇచ్చారు. కానీ ఎంత మాత్రం మార్పు వచ్చినట్టే కనిపించదు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం ఎన్నో సూచనలు చేశారు. అయినా సరే అదే వితండ వాదన. ఆపై వర్ల రామయ్యతోనూ చెప్పించి చూశారు. ప్రయోజనం శూన్యం.  బేసిగ్గా తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీకి పట్టు ఎక్కువ. దీంతో తాను టీడీపీలో ఉండటం కన్నా వైసీపీలోకి వెళ్లడం వల్లే ఎక్కువ లాభం అని అప్పుడే పెద్ద ఆరిందా లాగా లెక్కలేసుకుని.. ఇదిగో ఇవాళ పెద్దిరెడ్డిని వెళ్లి కలిశాడు. అటు టీడీపీలో అయితే ఇతడి తాకిడి తట్టుకోలేక స్థానిక టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేలా కనిపిస్తున్నాడు. అంటే అక్కడి వైసీపీ కేడర్ కూడా అష్టకష్టాలు పడ్డానికి ముందుగానే సిద్ధపడాలన్న మాట వినిపిస్తోంది. మరద్దే.. కొలికిపూడి మార్క్ కెలుకుడంటే అని మాట్లాడుకుటున్నారు ఇరు పార్టీ నేతలు.

సీఐడీ సంజయ్‌కు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!

  అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసినప్పుడు చేసిన అవినీతి వ్యవహారంలో నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సీఐజీ చీఫ్ సంజయ్‌కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చాలా పేజీలున్న తీర్పును చూసి.. ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేస్తే.. అసుల కేసు మొత్తం విచారణ జరిపినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాలు అయిన ఇన్వాయిస్‌లు, ఒప్పంద పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది. సంజయ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు, అగ్ని-ఎన్ఓసీ (AGNI-NOC) వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి, హార్డ్‌వేర్ సరఫరా కోసం విజయవాడకు చెందిన సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కోసం టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, పోటీ ధరలు పొందకుండా, నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్ట్ ఇచ్చారని కేసు నమోదు అయింది. 2023 ఫిబ్రవరి 22న, ఒప్పందం జరిగిన ఒక వారంలోనే సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ. 59.93 లక్షలు చెల్లించారు. కానీ పనేమీ చేయలేదు. అగ్ని యాప్ అమలు కోసం ఫైర్ సర్వీసెస్ అధికారుల కోసం 8 మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8 డివైస్‌లు, 2 ఆపిల్ ఐప్యాడ్ ప్రో డివైస్‌లను కొనుగోలు చేశారు. వీటిని కూడా అధిక ధరలకు సౌత్రిక టెక్నాలజీస్ నుండి కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్ల కోసం ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించకపోవడం, పోటీ కొటేషన్లు పొందకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదికలో పేర్కొన్నారు. అలాగే సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నప్పుడు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సులు, వర్క్‌షాప్‌ల పేరుతో కృత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1.19 కోట్లు చెల్లించారు. కానీ అసలు ఈ సంస్థ ఏ సదస్సులూ నిర్వహించలేదు. ఈ ఆరోపణలపై సంజయ్‌ను 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేసింది. అయితే సంజయ్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది, కానీ ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసింది.

రప్పా.. రప్పా.. అంటే చూస్తూ కూర్చుంటామా?

  మాట్లాడితే.. రప్పా రప్పా అంటూ బెదిరిస్తున్నారు. వారి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తాము అనేక పోరాటాలు చేసి, ఉద్యమాలు నిర్మించి ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. ప్రజలు తమను బలంగా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అలాంటి తమకు ఈ బెదిరింపులు ఒక లెక్కకాదని చెప్పారు. బెదిరింపు రాజకీయాలు చేసే వారికే గత పాలకులను ప్రజలు ఎక్కడ పెట్టారో ఇప్పుడు చూస్తున్నారన్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ వైసీపీ హయాంలో లిక్కర్ కేసుపై స్పందించారు. 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో మద్యం నిషేధం చేస్తామని, విడతల వారీగా తగ్గిస్తామని చెప్పిన వారు విచ్చలవిడిగా ధరలు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. “డబ్బు పోతే పోయింది. జనాలు కూడా చచ్చిపోయారే. నాసిరకం లిక్కర్‌ను అంటగట్టి లివర్‌, కిడ్నీ సమస్యలు వచ్చేలా చేసి చంపేశారే” అని పవన్ వ్యాఖ్యానించారు. మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ తరువాత ఏం చేశారని నిలదీశారు. “మద్యం కుంభకోణంలో అంతమందిని అరెస్టు చేశారు. ఇంత మందిని అరెస్టు చేశారు అని చెబుతున్నారు. తప్పులు చేశారు కాబట్టే వారిని అరెస్టు చేశారు” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును, వారి ఆరోగ్యాన్ని కూడా దోచుకుని పీల్చి పిప్పిచేసిన వారిని ఏమి చేయాలని ప్రశ్నించారు. పైగా నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తప్పులు చేసి పైగా ఎదురు దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ పేపర్ పులులకి, తాటాకు చప్పుళ్లకి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదన్నారు. కేసు విచారణ ముమ్మరంగా సాగుతోందని పవన్ తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదని హెచ్చరించారు.

ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే వస్తా : సీఎం రేవంత్

  ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదన్నారు. గత ప్రభుత్వం పెద్దలుసొంత కుటుంబ సభ్యులపై ఫోన్ టాపింగ్ చేశారు అంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని సీఎం స్పష్టం చేశారు.  బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా....స్థానిక సంస్థల ఎన్నికలు  ఆగే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి తెలిపారు.  ఫోన్ టాపింగ్ కాలేదని అనుకుంటున్నా. నా ఫోన్ టాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదాని ఆయన పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ ఇల్లీగల్ కాదు.. కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు సొంత కుటుంబ సభ్యులకు ఫోన్ లే టాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమని ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడని  సీఎం రేవంత్ స్పష్టం చేశారు.  పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం నిబంధన దాటిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని నిబంధనలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు వస్తున్నాయా? అని ధ్వజమెత్తారు. కేంద్ర పదవుల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించారని, ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.

మోడీ షా జోడీ మ్యాజిక్ బాక్స్‌లో..ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో?

  భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (జూలై 21),నాటకీయ పరిణామాల నడుమ తమ పదవికి  రాజీనామా చేశారు. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదించారు. జగదీప్ ధన్‌ఖడ్’ ఎందుకు రాజీనామా చేశారు? ఏమిటి, అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.  ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేసినా, అందుకు కారాణాలు ఏవైనా, భారత ఉపరాష్ట్రపతి సీటు ఖాళీ అయింది. ఎన్నిక అనివార్యమైంది. మరోవంక భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సన్నాహాక చర్యలు పూర్తయ్యాక, ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.  అదలా ఉంటే, చక చకా పరిణామాలు నేపధ్యంగా, అనూహ్యంగా తరుముకొస్తున్న  ఉపరాష్టపతి ఎన్నిక పట్ల, సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానకి అభ్యర్ధుల ఎంపిక మొదలు గెలుపు ఓటముల లెక్కల వరకు. ‘ఉప’ ఎన్నిక పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ అప్పుడే మొదలైంది. అధికార ఎన్డీఎ, విపక్ష ఇండియా కూటమి తరపున బరిలో దిగే అభ్యర్ధులు ఎవరన్న విషయంలో,ముఖ్యంగా అధికార కూటమి అభ్యర్ధి ఎవరన్న విషయంగా అనేక వ్యూహగానాలు వినిపిస్తునాయి. అనేక పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్,హరివంశ నారాయణ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మొదలు కేంద్ర మాజే మంత్రి రవిశంకర్ ప్రసాద్ వరకు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ మొదలు మెగా స్టార్’చిరంజీవి, బీజేపే రాజ్యసభ సభ్యడు కే. లక్ష్మణ్’ వరకు అనేక తెలుగు పేర్లు సహా చాలా పేర్లు వినిపిస్తునాయి.  అయితే,అంతిమంగా మోదీ షా జోడీ’ మ్యాజిక్ బాక్స్ నుంచి ఎవరి పేరు పై కొస్తుందో చెప్పలేము. అలాగే ఇండియా కూటమి నుంచి ఎవరు బరిలో దిగినా పోటీ నామమాత్రంగానే ఉంటుందని,అంటున్నారు. చివరకు,ఏ కూటమిలో లేని, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేడీ, బీఎస్పీ వంటి తటస్థ పార్టీలు ఇండియా కూటమికి వైపు మొగ్గు చూపినా ఎన్డీఎ అభ్యర్ధి విజయం తధ్యమని అంటున్నారు. అయితే, బీజేపీ..ఒంటరిగా గెలిచే అవకాశం మాత్రం ఏ కొంచెం కూడా లేదు.  తెలుగుదేశం, జేడీయు సహా ఇతర ఎన్డీఎ పార్టీల మద్దతుతో మాత్రమే అధికార కూటమి అభ్యర్ధి విజయం  సాధ్యంవుతుందని ఓట్ల గణాంకాలు చెపుతున్నాయి ప్రస్తుత లెక్కల ప్రకారం,ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో (నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. అందులో అందులో 5 రాజ్యసభ, ఒక లోక్ సభ, సిటు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427 ఓట్లు,(293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87, మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి.  అలాగే, ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య  సుమారు 30 వరకు ఉంటుంది. సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైతే, ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్దతిలో జరుగుతుంది.విప్ వర్తించదు. కాబట్టి,ఎంపీలు, ఆత్మ సాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చును.అలాగే, పార్టీలకు  కూటమి కట్టుబాట్లు వర్తించవు.గత 2022 ఎన్నికల్లో, ఎన్డీఎ అభ్యర్ధి జగదీప్ ధన్‌ఖడ్’కు పోటీగా   ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మార్గరెట్ అల్వాను బరిలో దించాయి. అయితే,ఆమె అభ్యర్ధిత్వంపై అభ్యంతరం చెప్పిన తృణమూల్  కాంగ్రెస్’ ఓటింగులో పాల్గొన లేదు. ఫలితంగా ధన్‌ఖడ్’ మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్ల భారీమెజారిటీతో గెలిచారు. మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఈసారి కూడా, అభ్యర్ధి ఎంపిక తర్వాత లెక్కలు మారినా మారవచ్చును. అయితే, ఎన్డీఎలో కంటే ఇండియా కూటమిలోనే, కోతలకు ఎక్కువ అవకాశం ఉంది, కాబట్టి, ఎన్డీఎ గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు.

విశాఖ నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు : సీఎం చంద్రబాబు

  విశాఖలో 4 కంపెనీల రూ.20వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా 50వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తు పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిష్ఠాత్మక సంస్థల రాకతో విశాఖ ఇమేజ్ పెరుగుతుందని మంత్రి నారా లోకేశ్‌ అభిప్రాయపడ్డారు.  ఇక ఏపీలో రూ.16,466 కోట్లతో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో మొదటిదశలో ఆ సంస్థ రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.ఇక, విశాఖ మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ.1,500కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండాడ (విశాఖ)లో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.దీంతో మొత్తంగా విశాఖలో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి  

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పీఎ అరెస్ట్

  కుత్భుల్లాపుర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పీఎ హరిబాబును  అరెస్ట్ చేశామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. డబుల్  రూమ్​ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి రూ. లక్షలు వసూల్ చేశాడని బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.  హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.  కుత్బుల్లాపూర్​ గిరినగర్ కు చెందిన తైలం రమేశ్​డబుల్​బెడ్​ రూమ్ ఇంటి​ కోసం ఎమ్మెల్యే ఆఫీస్​కు వెళ్లాడు. పీఏ హరిబాబు అతనికి  ఇల్లు ఇప్పిస్తానని నమ్మంచి, రూ.లక్ష తీసుకున్నాడు. తర్వాత మరోసారి ఎమ్మెల్యే ఆఫీస్​కు వెళ్లగా హరిబాబు మరో 83 మంది వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేసి, ఆ డబ్బులతో భూమిరెడ్డి నగర్ లో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిసింది. డబ్బుల గురించి అడగడానికి రమేశ్ ​ప్రయత్నించినా అతను స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి, ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కుత్బుల్లాపూర్ ​నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద, ఆయన అనుచరులు చేసిన అవినీతి, అక్రమాలపై  ప్రభుత్వం ఎంక్వైరీ జరిపించాలని బీజేపీ జిల్లా స్పోక్స్ పర్సన్ నల్లా జయశంకర్​డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ భూముల కబ్జా, చెరువుల ఆక్రమణలు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారని వారు ఆరోపించారు.   

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం : సీఎం రేవంత్

    తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వందేళ్లుగా వాయిదాపడ్డ కులగణనను నెలరోజుల్లో పూర్తి చేశామన్నారు.  స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కోసం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా జాప్యం జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు.  మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేసుకోవాలని బీజేపీ వాళ్లు అంటున్నారని ఇది వితండవాదం కాక మరేంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు. హర్యానా మాజీ గవర్నర్  బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని కేంద్రానికి రేవంత్‌రెడ్డి  సూచించారు. ఆయనకు ఆ పదవి కట్టబడితే బీసీలందికీ న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని తెలిపారు. తాను ఇండియా కూటమి తరపున మాట్లాడటం లేదని.. తెలంగాణ ప్రజల తరఫున తన అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు.  బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను ఇండియా కూటమితో మాట్లాడుతా సీఎం రేవంత్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే‌తోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై.. కుల గణన, రిజర్వేషన్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం రాహుల్‌ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు  

పెద్దిరెడ్డితో చేతులు కలిపిన ఎమ్మెల్యే కొలికపూడి

  వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దిరెడ్డిని కలిసి వీరిద్దరు మంతనాలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొలికపూడి శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి వివాదాలను కేంద్ర బిందువుగా మారరని దీంతో ఆయన తీరుపై తెలుగు దేశం పార్టీ గుర్రుగా ఉంది.  టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతను కలవడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కొట్టుకోగా.. సెటిల్‌మెంట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ వర్గపు వ్యక్తిని వదిలేసి, తన అనుచరుడిపై కేసు పెట్టారని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పోలీసులే ఒక బ్యాచ్‌ను పెట్టుకొని గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. 

రాజాసింగ్‌ ఒక్క మిస్డ్‌కాల్‌ చాలు..పార్టీలో చేరినట్లే : అరవింద్

  తెలంగాణ బీజేపీలో వివాదాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజాభాయ్ ఎక్కడున్నా రెస్పెక్ట్ ఉంటుందని ఆయన గౌరవిస్తాము అని తెలిపారు. ఆయనను బీజేపీ బహిష్కరించలేదు. ఆయనకు ఏదో నచ్చక రాజీనామా చేశాడని అరవింద్ తెలిపారు. రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకొచ్చు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా భాయ్ రాజీనామా చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు.  తటస్థంగా ఉండేవాళ్ళతో కమిటీ వేసి విచారిస్తే బావుండేదని ఆయన పేర్కొన్నారు. రామచందర్ రావు.. కిషన్ రెడ్డి తదితరులు తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లుగా పరోక్షంగా అరవింద్ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారని పార్టీ అన్నాక వివాదాలు కామన్ అని అన్నారు. బీజేపీ, పాత, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో కూర్చొని మాట్లాడాలి అని సూచించారు.  తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ కోరారు 

ధ‌ర్మ‌స్థ‌ల మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్

క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్మ‌స్థ‌ల అంటే తెలియ‌ని వారుండ‌రు. కార‌ణం ఈ ప్రాంతంల‌తోని మంజునాథుడికి అంత‌టి విశేష‌మైన పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయి. ఒక‌ ర‌కంగా  చెప్పాలంటే ఇది క‌ర్ణాట‌క తిరుమ‌ల‌గా ప్రఖ్యాతి చెందింది. ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో హెగ్డేల కుటుంబం వంశ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త‌లుగా ఉంటూ వ‌స్తున్నారు. వీరి అధ్వ‌ర్యంలో ఇక్క‌డ   ధ‌ర్మం  నాలుగు పాదాలా నడుస్తుందన్న విశ్వాసం జనంలో మెండుగా ఉంది. అలాంటి ధ‌ర్మ‌స్థ‌లలో 1995 నుంచి 2014 మ‌ధ్య అనుమానాస్ప‌దంగా కొంద‌రు మ‌హిళ‌లు, యువ‌తుల‌ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌నీ,  అవి కూడా హింస‌, లైంగిక వేధింపుల‌కు సంబంధించిన‌వేననీ ఇక్క‌డ ప‌ని చేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు గ‌త జూలై 3న ఫిర్యాదు చేశాడు.  అంతే కాదు తాను గ‌తంలో పాతి  పెట్టిన ఒక మృత‌దేహం ఆన‌వాళ్లు సైతం తీసి ఆధారాలు చూపించాడు. దీంతో ఈ కేసు ఇటు ధ‌ర్మ‌స్థ‌ల పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త‌లైన హెగ్డే కుటుంబం నుంచి..  అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వ‌ర‌కూ హ‌డ‌లెత్తేలా చేస్తోంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జ‌డ్జి గోపాల గౌడ క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌ల‌సి  ఈ కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం  చేయాల‌ని కోరారు.  క‌ర్ణాట‌క మ‌హిళా క‌మిష‌న్ సైతం సీఎంకి ఈ కేసులో దోషులెవ‌రున్నా వదలకుండా శిక్షించాలని డిమాండ్  చేసింది. అంతే కాదు గ‌తంలో అంటే 2003లో క‌నిపించ‌కుండా  పోయిన అన‌న్య భ‌ట్ కేసు, 2012లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సౌజ‌న్య కేసు.. ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. అంతే కాదు తన ఇంట్లోని ఒక మైన‌ర్ బాలిక‌పై ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురు కావ‌డంతో తాను 2014 లో ఇక్క‌డి నుంచి పారిపోయాన‌నీ అంటాడీ మాజీ స‌ఫాయి కార్మికుడు.  ఆ మాట‌కొస్తే.. తన చేతుల మీదుగా ఎన్నో మృత‌దేహాల‌కు ఖ‌న‌నం, ద‌హ‌నం నిర్వ‌హించాన‌ని అంటాడీయ‌న‌. దీంతో మంగ‌ళూరు పోలీసులు జూలై 4న కేసు న‌మోదు చేశారు. అంతే ఫిర్యాదు చేసిన కార్మికులు  స్థానిక బెళ్తంగ‌డి  న్యాయ‌స్థానం ముందు హాజ‌రై వాంగ్మూలం కూడా ఇచ్చాడు.  2010లో స్కూల్ డ్రెస్సులోని బాలిక మృత‌దేహాన్ని కూడా ఇలాగే ఖ‌న‌నం చేసిన‌ట్టు చెప్పాడు. మృత‌దేహాలు వెంట‌నే కుళ్లిపోయేలా  నేత్రావ‌తి న‌ది ముందే పూడ్చిపెట్టిన‌ట్టు కూడా చెప్పాడు.  ఇత‌డిచ్చిన వివ‌రాల ఆధారంగా ఒక యూట్యూబ‌ర్ ఒక సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించాడు. ఈ వీడియోని 50 ల‌క్ష‌ల మందికి పైగా చూడడంతో ఈ ధ‌ర్మ‌స్థ‌ళ మ‌ర‌ణాల మిస్ట‌రీ మ‌రింత‌గా వెలుగులోకి వ‌చ్చింది. అంతే కాదు ఈ కథనాన్ని వెలువరించిన యూట్యూబర్ పై కేసు కూడా నమోదైంది.  అయితే ఈ మ‌ర‌ణాల వెన‌కున్న నిందితుల‌ను తామేమీ కాపాడ్డం లేద‌ని.. సాక్షి చెప్పిన వివ‌రాలు త‌మ‌ను షాక్ కి గురి చేశాయ‌ని.. ఒక వేళ ఇదే నిజ‌మైతే ఈ మిస్ట‌రీ మ‌ర‌ణాల వెన‌క ఎవ‌రున్నా స‌రే వ‌ద‌ల‌క శిక్షిస్తామ‌ని..  క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి గుండూరావు పేర్కొన్నారు.  అయితే ధ‌ర్మ‌స్థ‌లలో చీమ చిటుక్కుమ‌న్నా రాజ్య స‌భ ఎంపీ కూడా అయిన వీరేంద్ర హెగ్డేకి తెలిసే జ‌రుగుతుంది. మ‌రి ఆయ‌న ఒక ఎంపీగా ఉండి కూడా ఈ మిస్టరీ మరణాల విషయంలో  ముమ్మ‌ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని పార్ల‌మెంటులో ఎందుకు నిన‌దించ‌డం లేదన్న‌దిప్పుడు స‌స్పెన్స్ గా మారింది. మ‌రి ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది. ఎంతో మ‌హిమాన్వితుడైన ఆ మంజునాథుడు ఇప్పుడే ఈ కేసును ఎందుకు వెలికి తీశాడో కూడా తేలాల్సి ఉంది. కాగా ఈ మర్డర్ల మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది.

టాస్ గెలిచిన ఇంగ్లండ్...భారత్ జట్టులోకి కొత్త బౌలర్

  మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్- భారత్ మధ్య నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా టీమిండియా జట్టులోకి కొత్త పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేశారు.  హర్యానాకు చెందిన అన్షుల్  దేశవాళీ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు.  ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్‌కు దూరం కాగా, యువ పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు.  అదే సమయంలో వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్ స్థానంలో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ తుదిజట్టుకు ఎంపికయ్యాడు. శార్దూల్ ఠాకూర్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు.అటు ఇంగ్లండ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. గాయపడ్డ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ లియామ్ డాసన్ ను ఎంపిక చేశారు. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. భారత జట్టు శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్. ఇంగ్లండ్ జట్టు బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.  

ఐనవోలులో కనువిందు చేసిన పసుపు పచ్చ కప్పలు

దెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదురా  అన్నాడు సుమతీ శతకకారుడు. వర్షాకాలంలో కప్పల బెకబెకలు వినని వారుండరు. అయితే మనం తరచుగా చూసే కప్పలన్నీ గోధుమరంగు, ముదురు ఆకుపచ్చ, నలుపు రంగులలోనే ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా రంగులలో కప్పులు ఉన్నాయని చదువుకున్నాం. అయితే వర్షాలు కురిసినప్పుడు మాత్రమే బయటకు వచ్చి.. ఆ తరువాత భూమి లోపలే ఆవాసాలు ఏర్పరుచుకునే కప్పులు ఉన్నాయి. వాటిలో అత్యంత అరుదైనవి పసుపు పచ్చని కప్పలు. ఈ కప్పలు ఎప్పుడో కానీ కనిపించవు. అయితే ఇవి భూమిపైకి వచ్చి కనిపించాయంటే.. ఆ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని జనం విశ్వసిస్తారు. అటువంటి అత్యంత అరుదైన పసుపు పచ్చని కప్పలు ఉమ్మడి వరంగల్ జిల్లలోని ఐనవోలులో బుధవారం (జులై 23) దర్శనమిచ్చాయి. ఐనవోలులేని మల్లికార్జున స్వామి దేవాలయ సమీపంలో ఈ పసుపుపచ్చ కప్పలు సందడి చేస్తూ.. కనువిందు చేశాయి. పెద్ద సంఖ్యలో ఈ పసుపుపచ్చని కప్పలు బెకబెకలాడుతూ కప్పగంతులు వేయడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పసుపుపచ్చని కప్పలు కనిపించడం శుభసూచకమని జనం అంటున్నారు.  

నాకు మంత్రి పదవి కంటే..వాళ్లే ముఖ్యం రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

  మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తామన్నారని తెలిపారు. అయితే మంత్రి పదవి అక్కర్లేదు.. నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని రాజగోపాల్ రెడ్డి  అన్నారు. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేశానని వెల్లడించారు. 2018 ఎన్నికల్లో నల్గొండలో అందరూ ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఒక్కడినే గెలిచానన్నారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించింది బీఆర్‌ఎస్ కాదు కమ్యూనిస్టులే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  రీసెంట్‌గా సీఎం రేవంత్ నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని జటప్రోలులో మాట్లాడుతు పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ కామెంట్స్‌పై  మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.  అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇది మరువకముందే మరోసారి మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రాష్ట్ర రాజకీయల్లో హాట్ టాఫిక్‌గా మారింది

పోటెత్తుతున్న సముద్రం.. జలమయమైన మాయపట్నం!

కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో సముద్రం పోటెత్తుతోంది. రాకాసి అలలు చెలియల కట్ట దాటి ఎగసిపడుతున్నాయి.  సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో  కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంమైంది. సముద్రం చొచ్చుకుని రావడంతో మాయపట్నం గ్రామంలో 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 70 గృహాలలోకి నీరు చేరింది. సముద్రం ప్రళయభీకరంగా పొటెత్తుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఇలా ఉండగా అధికారులు సముద్రనీటిని వెనక్కు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీర ప్రాంతంలోని రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.