ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభం.. ఈసీ ప్రకటన

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా దేశవ్యాప్తంగా సృష్టించిన రాజకీయం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం  కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.  భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని బుధవారం (జులై 23)   కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తుచేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు సీఈసీ అధికారులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను  ప్రెసిడెన్షియల్ అండ్ వైస్-ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ యాక్ట్, 1952  ప్రకారం రూపొందించిన  ప్రెసిడెన్షియల్ అండ్ వైస్-ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ రూల్స్, 1974  ద్వారా నిర్వహిస్తామని గుర్తుచేశారు సీఈసీ అధికారులు. ఈ ప్రక్రియను అనుసరిస్తూ.. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని తెలిపారు. ఈ సన్నాహాక చర్యలు పూర్తయ్యాక, ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతానికి ప్రారంభించిన ప్రధాన సన్నాహాక చర్యలను ప్రకటనలో పేర్కొన్నారు సీఈసీ అధికారులు. ఓటర్ల జాబితా తయారీ,  ఇందులో లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎన్నికైన సభ్యులతో పాటు నామినేట్ అయిన సభ్యులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌లను ఖరారు చేస్తామని... ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను ప్రకటిస్తామని సీఈసీ అధికారులు పేర్కొన్నారు.

కంచ గచ్చిబౌలి భూములపై.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు

  కంచ గచ్చిబౌలి భూములపై  సుఫ్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కి తేదీకి వాయిదా పడింది. ఆ భూముల్లో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నాట్లు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరగా, న్యాయస్థానం వాయిదా వేసింది. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని అధికారులకు సూచించింది. లేదంటే అధికారులను జైలుకు పంపిస్తామని మరోమారు హెచ్చరించింది. ఈ మేరకు హెచ్ సీయూ సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ఈ భూమిలో పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ సర్కార్ మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్ ను ధర్మాసనం పరిశీలించింది.  గత విచారణలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేసి పర్యావరణ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించడానికి సమయం కావాలని అమికస్ క్యూరీ కోరడంతో సుప్రీం ధర్మాసనం విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.  

ఢిల్లీ చేరిన రిజర్వేషన్ పంచాయతీ!

తెలంగాణలో రాష్ట్ర హైకోర్టు  ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరవలసిన అనివార్యత నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ హామీని   ఎలా నిలుపుకోవాలన్న విషయంలో తర్జన భర్జన పడుతోంది. నిజానికి.. ఆర్డినెన్సు రూట్లో కానీ  మరో మార్గంలో కానీ  ఇప్పటికిప్పుడు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం అయ్యేపని కాదని అందరికీ తెలిసినట్లే..  హస్తం పార్టీ పెద్దలకు కూడా తెలుసు. అయినా.. రాజకీయ ప్రయోజనాల కోసం,మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల గండం గట్టేక్కేందుకు  కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.   నిజానికి..  స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో  నిర్వహించవలసి ఉన్నా.. రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ  వచ్చింది. అయితే.. రాష్ట్ర హై కోర్టు  మూడు నెలల లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని గడవు విధించడంతో.. తప్పని సరి పరిస్థితుల్లో  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైంది.  అయితే.. అసెంబ్లీఎన్నికల సందర్భంగా  స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలకు పోతే   ఏమి జరుగుతుందో అన్న సందేహంతో  కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు దారులు వెతుకుతోంది.  అందులో భాగంగా.. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లును, పార్లమెంట్ ఆమోదం కోసం  కేంద్రానికి పంపింది. అయితే..  కేంద్రం నుంచి స్పందన లేక పోవడంతో, ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఆర్డినెన్సును గవర్నర్  కు పంపింది. అయితే..  అటు నుంచి కూడా స్పందన లేక పోవడంతో   ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ శాసన సభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్  బిల్లుకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే..  ఈ విషయాన్ని అధిష్టానం చెవిన వేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రు లు, ఇతర నేతలతో కూడిన రాష్ట్ర బృందం ఢిల్లీకి వెళ్లనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి అన్ని పార్టీల మద్దతు కూ డగట్టేందుకు  ఈ బృందం హస్తినకు వెడుతోందని చెప్పారు.  తమ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా తమతో కలిసి వస్తారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను కలిసి వచ్చే పార్టీల అధ్యక్షులకు వివరించి, ఆ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు కూడగడతామని చెప్పారు.  అయితే.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన బిల్లు ముందస్తు న్యాయ సమీక్ష లేకుండా, రాజ్యాంగంలోని 9 షెడ్యూలులో చేర్చడం ఎట్టి పరిస్థితిలో  సాధ్యం కాదని  బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు మరో మారు స్పష్టం చేశారు. కేశవ భారతి కేసులో సుప్రీం కోర్టు 1973 లోనే..  రాజ్యాంగంలో 9 షెడ్యూలలో చేర్చిన ఏ అంశం అయినా  న్యాయసమీక్షకు లోబడే ఉంటుదని స్పష్టం చేసిన విషయాన్ని రామచంద్ర రావు గుర్తు చేశారు.  అలాగే.. 2007లో ఐఆర్ కోయెల్లో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు  కేసులో సుప్రీం కోర్టు అదే విషయన్ని మరోమారు స్పష్టం చేసిందనీ, అందుకే తమిళనాడు రిజర్వేషన్  అంశం ఇప్పటికి కోర్టులో ఉందనీ,  ఈ విషయం తెలిసీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను మోసం చేస్తోందని  రామచంద్ర రావు స్పష్టం చేశారు. దీంతో   రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్ అంశం ముగింపు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికంగా మారింది.

ఏపీలో పెట్టుబడులు పెట్టండి..పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు

  సంక్షోభాలను అవకాశాలుగా  మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఆర్ధిక సంస్కరణలు 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మరిందన్నారు. వికసిత్ భారత్‌తో 2047 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ఆయన అన్నారు. ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. దుబాయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.  ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని చంద్రబాబు కొనియాడారు. అలాగే తాను గత 30 ఏళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దుబాయ్‌ని చూస్తున్నానని.. దుబాయ్‌ను చూస్తే తనకు అసూయ కలుగుతోందని అన్నారు. భారత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతమైన నేత అని.. భారత్‌కు యూఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయనన్నారు. దేశానికి సరైన సమయంలో ప్రధానిగా మోడీ ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.  అలాగే తమ ఆంధ్రప్రదేశ్‌లో  పెట్టుబడులకు కంపెనీలు రావాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ సదస్సు యూఏఈ ఆధ్వర్యంలోని ఇన్వెస్టోపియా గ్లోబల్ టాక్స్ సిరీస్‌లో భాగంగా నిర్వహించబడుతుంది. ఇది గతంలో న్యూయార్క్, జెనీవా, న్యూఢిల్లీ, ముంబై, కైరో, రబాట్, హవానా, మిలన్ వంటి నగరాలలో జరిగిన ఈవెంట్‌ల సమాహారంలో ఒకటి. ఈ సమ్మిట్‌లో ఆర్థిక, సాంకేతిక, టూరిజం, ఫ్యామిలీ బిజినెస్, ఇ-కామర్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గోన్నారు

లోకేష్ పోస్టుతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీఖుషీ

ఏపీ రాజకీయాల్లో జనసేన, టీడీపీల పొత్తు ఖాయమైనప్పటి నుంచి జనసేనాని పవన్‌ని అన్నయ్య అని సంభోదిస్తూ, అదే స్థాయిలో గౌరవిస్తున్నారు నారా లోకేష్. తాజాగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా గురువారం (జులై 24)  విడుదల కానున్న సందర్భంగా ఏపీ విద్య, ఐ.టి. శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'వినాలి... వీర మల్లు చెప్పింది వినాలి' అనే పాటకు సంబంధించిన 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను షేర్ చేశారు. దానితో పాటే 'మా పవనన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. లోకేష్ తాజాగా మరోసారి మా పవనన్న అని పెట్టిన పోస్టులో ఇటు తెలుగుతమ్ముళ్లు, అటు మెగా ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట.

ధన్‌ఖడ్ రాజీనామా.. వీడని మిస్టరీ!

భారత ఉపరాష్ట్రపతికి నుంచి జగ్ దీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడం  దేశంలో హాట్ డిబేట్ కు తెరలేపింది. ఆరోగ్య కారణాలు అని ఆయన చెప్పినప్పటికీ అదంతా వట్టిదే అని చాలా మంది అంటున్న మాట. ఆయన రాజీనామా వెనుక  ఏదో బలమైన కారణం లేకుండా ఇలా మాన్సూన్ సెషన్ తొలిరోజే రిజైన్ చేయడం అంటే మాటలు కాదు అనుకుంటున్నారు. దాల్ మే కుచ్ కాలాహై అన్న చర్చ ఢిల్లీలో నడుస్తోంది. అసలు ధన్ ఖడ్ రిజైన్ తో మొదట షాక్ తిన్నది విపక్షాలే. ఎందుకంటే తాము ఓ స్ట్రాటజీతో వస్తే ధన్ ఖడ్ వారికే షాక్ ఇచ్చారు. ఎవరి తీరుతోనైనా హర్ట్ అయ్యారా? ఎవరి మాటలైనా బాధించాయా? పదవికి ఎసరు వస్తుందని గ్రహించారా? ముందే తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? తన లైన్ కు పార్టీ లైన్ కు తేడా ఉందనుకున్నారా? కచ్చితమైన రాజకీయ కారణాలు ఏమున్నాయన్న చర్చలతో రకరకాల రీజన్స్ తెరపైకి వస్తున్నాయ్.  హర్ట్ అయితే రాజీనామా చేసే మనస్తత్వం జగ్ దీప్ ధన్ ఖడ్ ది కాదు. ఎందుకంటే ఆయన ఈ పదవిలోకి రాకముందు బెంగాల్ గవర్నర్ గా పని చేశారు. 2019 జులై 30 నుంచి 2022 జులై 18 వరకు బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పనితీరు చూసి ఉపరాష్ట్రపతి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. వస్తూనే ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా తనదైన ముద్ర వేశారు. వయసు 74 ఏళ్లు అయినా ఉత్సాహంగా ఉండే వారు. రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బిజీ షెడ్యూల్ ఖరారు చేసుకునే వారు. తన అనుభవాలు చెప్పే వారు. ముఖ్యంగా విద్యార్థులను ఉత్సాహపరిచే వారు. అయితే రాజకీయాల్లో ఏదీ అనుకున్నట్లుగా జరగదు. అనుకున్నట్లుగా ఉండదు కదా. జగ్ దీప్ విషయంలోనూ ఇదే జరిగింది.  బీఏసీ సమావేశం పెడితే రాజ్యసభ లీడర్ రావాలి. ఆ పదవిలో నడ్డా ఉన్నారు. బీఏసీ పెట్టేది రాజ్యసభ ఛైర్మన్. సీన్ కట్ చేస్తే ఉదయం జరిగిన బీఏసీకి వచ్చారు. రెండో బీఏసీ మీటింగ్ కు నడ్డా, రిజిజు ఇద్దరూ రాలేదు. ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నారని, రాజ్యసభ ఛైర్మన్ కు ముందుగానే తెలియజేశామని నడ్డా చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిని అవమానించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిజంగా ఏం తప్పు జరిగిందో చెప్పాలంటున్నారు. జులై 21న బీఏసీ నుండి కేంద్రమంత్రులు నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడానికీ, అలాగే 21న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య చాలా తీవ్రమైన విషయంలో ఏదో జరిగే ఉంటుందని జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగ్ దీప్ తీరుపై సొంత పార్టీ, ప్రభుత్వమే అసంతృప్తిగా ఉందా అన్న చర్చ జరిగింది.  ధన్ ఖఢ్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. ముక్కుసూటిగా ఉంటారు. చమత్కరిస్తారు. చలాకీగా ఉంటారు. సీనియర్ మోస్ట్ లాయర్ కూడా. ముఖ్యంగా న్యాయవ్యవస్థపై ఆయన చేసిన పదునైన వ్యాఖ్యలకు సంబంధించి, ప్రభుత్వంలోని కొంతమందికి కోపం తెప్పించి ఉండొచ్చు అంటున్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టు తీరుపైనా  దన్ ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్టైంది. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కారణాలు ఆయన చెప్పిన ఆరోగ్య సమస్యల కంటే చాలా లోతైనవి అని వ్యాఖ్యానించింది.   ఆరోగ్య కారణాలను గౌరవించాలి. కానీ ఆయన రాజీనామాకు చాలా లోతైన కారణాలు ఉన్నాయన్నది కూడా వాస్తవం అని విపక్షాలు అంటున్నాయి. అంతే కాదు ధన్ ఖడ్ తన మనసు మార్చుకునేలా ఒప్పించాలని కాంగ్రెస్ నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కూడా. ధన్ ఖడ్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం వెనుక కారణాలను మోడీ, అమిత్ షా మాత్రమే వివరించగలరని సీపీఐ అన్నది.  కచ్చితంగా చెప్పాలంటే ఆయన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని, సభను నడపడంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించి ఎలా రిజైన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు.  జస్టిస్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభలలో ప్రవేశపెట్టాలనుకున్నదని, అయితే ధన్ ఖడ్ ఊహించని విధంగా బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటలకు దానిని చర్చకు తీసుకుంటానని ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం ఎన్డీఏ వంతైందంటున్నారు. అంతే కాదు.. ధన్ ఖడ్ కొంతకాలంగా పార్టీ పరంగా అబ్జర్వేషన్ లో ఉన్నారన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు తగదన్న హెచ్చరికలు ఇంటర్నల్ గా వచ్చాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎందుకని ముందస్తుగానే రిజైన్ చేశారంటున్నారు. సో కారణాలు ఏవైనా ధన్ ఖడ్  రాజీనామా ఒక్కసారిగా దేశ రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు ఆ పదవిని జేడీయూకి ఇవ్వడం ద్వారా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడమా..  లేదంటే వేరే నాయకుడికి పగ్గాలు అప్పగించడమా  ఏం జరుగుతుందన్నది చూడాలి.

బీహార్ రాజకీయాల్లో ధన్‌ఖడ్ దుమారం!

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా దేశ వ్యాప్తంగా సృష్టించిన రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొనసాగడం కాదు, మరింతగా ఉధృతం అవుతున్నాయి. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి.  ఓ వంక రాజకీయ విశ్లేషకులు వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తుంటే, మరో వంక రాజకీయ విమర్శల దుమారం రేపుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఒక్క జై రామ్ రమేష్ మినహా మరో ముఖ్య నాయకుడు ఎవరూ, ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా అంశం పై స్పందించలేదు. జై రామ్ రమేష్ కూడా.. ధన్‌ఖడ్ రాజీనామాకు ఆరోగ్య సమస్యలు అసలు కారణం కాకపోవచ్చనీ, రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చన్న అనుమానం మాత్రమే వ్యక్త పరిచారు.  అయితే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో ధన్‌ఖడ్ రాజీనామా రాజకీయ దుమారం రేపుతున్నది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర ఉందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సంచలన ఆరోపణ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ ను మార్చేందుకే ఇలా చేసినట్టు  ఆర్జేడీ చీఫ్ విప్ అఖ్తరుల్ ఇస్లామ్ షహీన్ అన్నారు.చాలాకాలంగా నితీష్‌ కుమార్‌కు ఉద్వాసన చెప్పేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారనీ,ఒక దశలో నితీష్‌ను ఉప ప్రధానిని చేయాలని కేంద్ర మాజీ మంత్రి అశ్వినీకుమార్ చౌబే సూచించారని గుర్తు చేశారు. ఈ దశలో జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యత లేని పదవిని ఇచ్చి నితీష్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని బీజేపీ భావిస్తోందన్నారు. అయితే..  ఆర్జేడీ నేత   ఆరోపణలను జేడీయూ సీనియర్ నాయకుడు శరవణ్ కుమార్ తోసిపుచ్చారు. నితీష్ కుమార్ బిహార్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన ఇక్కడే ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి సారథ్యం వహిస్తారని, రాష్ట్ర ప్రజలకు మరో ఐదేళ్లు సేవలందిస్తారని చెప్పారు.  అయితే.. ఆర్జేడీ నేత చేసిన ఆరోపణలో నిజం లేక పోలేదు.  పాతికేళ్లకు పైగా  బీజేపీ బీహార్ ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెట్టుకుంది. అప్పటి నుంచి తమ ఆశలకు అవరోధంగా నిలిచిన నితీష్ కుమార్  అడ్డు  తొలిగించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే వుంది. అంతే కాకుండా, గత  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ కూటమి విజయం సాధించింది. అయితే..  బీజేపీ కంటే ఐదు ఎక్కువుగా 115 స్థానాల్లో పోటీ చేసిన ఎన్డీఎ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీయూ కేవలం 43 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మరోవంక 110 స్థానాలకు పోటీచేసిన బీజేపీ 74 సీట్లు  గెలుచుకుంది.అయినా, ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం, బీజేపీ జేడీయూ నేత నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే.. ఈసారి ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్ పేరును ప్రటించేందుకు ముందు నుంచి బీజేపీ అభ్యతరం వ్యక్తం చేస్తోంది. అయితే..  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్ పేరు ప్రకటించినా,   ప్రకటించక పోయినా, ఎన్నికల ఫలితాలు ఎన్డీఎకు అనుకూలంగా వస్తే  ముఖ్యమంత్రి కుర్చీని ఎట్టి పరిస్థితిలో వదులుకోరాదని, బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే చర్చ ధన్‌ఖడ్ రాజీనామా ఎపిసోడ్ కంటే ముందు నుంచి సాగుతోంది.  ఈ నేపధ్యంలో..  ధన్‌ఖడ్ రాజీనామా బీజేపీ బీహార్ వ్యూహంలో భాగం అయినా కాకపోయినా వెదుకుతున్న తీగ కాలికి తగిలింది అన్నట్లుగా  కలిసొచ్చిన అవకాశాన్ని కమల దళం వినియోగించుకునే అవకాశం లేక పోలేదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే..  ధన్‌ఖడ్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, బీజేపీ ఎమ్మెల్యే హరిభుషణ్ ఠాకూర్.. నితీష్ కుమార్   ఉపరాష్ట్రపతి అయితే.. దేశానికీ, రాష్ట్రానికి కూడా మంచిదని అన్నారు. అలాగే  ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా  ఉప రాష్ట్రపతి రేసులో నితీష్ ను తెచ్చి నిలబెట్టారు.    అయితే..  ప్రస్తుతానికి అయితే నితీష్ కుమార్ రాజకీయ అస్త్ర సన్యాసం చేసేందుకు సిద్దంగా లేరు. అలాగే..  జేడీయు కూడా సీట్లు ఓట్లతో సంబంధం లేకుండా  నితీష్ కుమార్  ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న ప్రచారం ప్రారంభించింది.  మరో వంక నితీష్ కుమార్  ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని చెప్పకనే చెపుతున్నారు.  నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో కోటి ఉద్యగాలు సహా .. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు కురిపిస్తునారు. ఈ నేపధ్యంలో..  ఎన్నికలకు ముందు నితీష్ కుమార్  బీహార్ వదిలి పోక పోవచ్చని,అంటున్నారు. అంటే బీహార్ ఎన్నికల క్రతువు ముగిసే వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయగలిగితే ఏమో కానీ.. లేదంటే, బీజేపీ ఆశలు మరోమారు ఆవిరి అయినట్లే అంటున్నారు.

లిక్కర్ స్కాం.. విజయసాయి బాటలో మాజీ మంత్రి నారాయణస్వామి?

జగన్ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం విషయంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అప్రూవర్ గా మారనున్నారా?  అంటే ఆయన మాటలను బట్టి ఔననే అనుకోవలసి వస్తున్నది. జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి.. తాజాగా సిట్ విచారణను ఎదుర్కొన్నారు. సిట్ నోటీసుల మేరకు విచారణకు హాజరు కావడానికి ఆరోగ్యం బాలేదని చెప్పినప్పటికీ.. సిట్ ఆయన నివాసానికే వెళ్లి విచారించింది. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మద్యం కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదనీ, ఈ విషయంలో తనను ఇరికించడానికి ఇద్దరు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపించారు. అంతే కాదు.. మద్యం విధాన రూపకల్పలోనూ, అమలు విషయంలోనూ తానకు ఇసుమంతైనా ప్రమేయం లేదని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా.. మద్యం విక్రయాలలో ఆన్ లైన్ పేమెంట్ కు అవకాశం లేకుండా చేసిన సంగతి వాస్తవమేనన్నారు. ఈ మాటలన్నీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జిషీట్ దాఖలై అందులో పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించిన తరువాత అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి నోరు విప్పారు. మద్యం కుంభకోణం జరిగిం దనీ, అందులో పలువురు సొమ్ములు ఆర్జించారన్న మాట నిజమేనంటూనే.. తనకు మాత్రం ఇసుమంతైనా సంబంధం లేదన్నారు. అలాగే ఆన్ లైన్ పేమెంట్లకు నో అన్న విషయం కూడా వాస్తవమేనన్నారు. సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తాననీ, తనకు తెలిసిన సమాచారం మొత్తం చెబుతాననీ పేర్కొన్నారు. నారాయణ స్వామి మాటలను బట్టి ఆయన అప్రూవర్ గా మారేందుకు సిద్ధ పడ్డారని అవగతమౌతోంది. ఈ కేసులో ఇప్పటికే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసేశారు. అవసరమైతే అన్నివిషయాలూ సిట్ కు వెల్లడి స్తానని కూడా ప్రకటించారు. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి కర్త, కర్మ, క్రియ అంటూ చెప్పినది కూడా విజయసాయే అన్న విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డి రాజ్ కేసిరెడ్డి పేరు చెప్పిన తరువాతనే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుంది. రాజ్ కేసిరెడ్డి సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. ఇక ఇప్పుడు నారాయణ స్వామి కూడా విజయసాయి రెడ్డి బాటలోనే పయనిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి పేర్లు ప్రస్తావించకుండా ఇద్దరు వైసీపీ నేతలు అన్న నారాయణ స్వామి సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాననడం ద్వారా అప్రూవర్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మాజీ మంత్రి అనిల్ కుమార్.. అడ్డంగా బుక్కయ్యారుగా?

ఐదేళ్ల వైసీపీ హయాంలో  ఓళ్లూపై తెలియకుండా మాట్లాడిన వాళ్లు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్లు ఒక్కొక్కరుగా ఇప్పుడు చట్టం ముందు నిందితులు నిలబడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో చెలరేగి ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరికీ ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.  తాజాగా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అక్రమ మైనింగ్ ఉచ్చు గట్టిగా బిగుసుకుంది.  నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఈ కేసులో ఇప్పటికే    మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ గ గుర్తింపు పొందిన  అనిల్ కుమార్ వంతు వచ్చింది.  క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. క్వార్ట్జ్ గనుల లీజు ముగిసిన తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్టు శ్రీకాంత్ రెడ్డి తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు ముట్టినది  టన్నుకు వెయ్యి రూపాయలు మాత్రమేనని వెల్లడించాడు.  క్వర్ట్జ్ అక్రమ మైనింగ్ లో తాను అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకే పని చేశానని కూడా వెల్లడించాడు. దీంతో ఈ కేసులో  మాజీ మంత్రి అనిల్ పాత్ర నిర్ధారణ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డి  వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి అనిల్‌  కుమార్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక పోలీసులు కూడా త్వరలో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమౌతున్నారు.   అదలా ఉంటే అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో ఈ కేసులో  200 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు దర్యాప్తులో తేలిందని దర్యాప్తు అధికారలు చెబుతున్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్,  అనిల్‌ కుమార్ ల ప్రమేయం నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ మాత్రమే ఉన్నారని భావించినా, శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అనిల్ కుమార్ పాత్ర కూడా తేటతెల్లమైందనీ, త్వరలో కేసు నమోదు చేస్తామనీ, నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు చేయడానికి కూడా వెనుకాడమోమనీ అంటున్నారు.   అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అక్రమార్జనలోనే కాదు.. అనుచిత భాషా ప్రయోగంలో కూడా ఇష్టారీతిగా రెచ్చిపోయారు. వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. గట్టిగా మాట్లాడడమంటే ప్రత్యర్థులపై అనుచిత భాషతో చెలరేగిపోవడం అని తెలిసిందే.  గతంలో అనిల్ కుమార్ యాదవ్   చంద్రబాబుపైనా, లోకేష్, పవన్ కల్యాణ్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొడగొట్టి, మీసం మెలేసి మరీ  సవాళ్లు విసిరారు.  అయితే వైసీపీ పరాజయం తరువాత.. అనిల్ కుమార్ యాదవ్ దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇటీవలే తెరపైకి వచ్చి మాట్లాడటం ప్రారంభించారు. అంతలోనే గతంలో తాను చేసిన అక్రమాలకు చెందిన కేసులో ఇరుక్కున్నారు. త్వరలో కటకటాల వెనక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  

ఐటీ ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోం చేయండి... సైబరాబాద్ పొలీసుల సూచన

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో అతి భారి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్న హైదరాబాద్ వాతావరణ శాఖ.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. కాగా వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు.. ఐటీ కంపెనీలు బుధవారం (జులై 23) వర్క్ ఫ్రం హోం విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు.  భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులకు ఇంటి వద్దనే పని చేసే వీలు కల్పించాలని, ఈ విషయంలో ఐటీ కంపెనీలు సహకారం అందించాలని సైబరాబాద్ పోలీసు శాఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొంది.   ఇక పోతే అటు ఆంధ్రప్రదేశ్ లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (జులై 22) కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, తమిళనాడు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం  (జులై 23) కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.   దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో  బుధవారం  (జులై 23) ఏర్పడినఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయనీ, అలాగే బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ పేర్కొంది.  దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలలో  పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయనీ,  తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం (జులై 23)  ఉదయం శ్రీవారి  దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ నారాయణ గిరి షెడ్ల వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 22)  శ్రీవారిని మొత్తం 79 వేల 467 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 642 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 42 లక్షల రూపాయలు వచ్చింది.   ఇలా ఉండగా శ్రీవాణి భక్తులకు శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయడానికి వీలుగా తిరుమలలో కొత్తగా దర్శనం టికెట్ల కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది.  శ్రీవాణి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను జారీ చేయడానికి  టీటీడీ పాలక మండలి గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు.  తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా ఈ  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు దీనిని మంగళవారం (జులై 22)  లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం (జులై 23) నుంచి ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ  ప్రారంభం అవుతుంది.   

తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షలకు ల్యాబ్.. ప్రారంభించిన బీఆర్ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్‌ ప్రారంభమైంది. భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం, ఇతర ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఇసుమంతైనా రాజీపడే ప్రశక్తే లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరుమలలోనే ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.  ఈ ల్యాబ్ ద్వారా తిరుమలలో   సమర్థవంతంగా పరీక్షించవచ్చు. దీనివల్ల ఆహార ప్రమాణాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఈ ల్యాబ్‌లోని అధునాతన యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ విరాళంగా అందించింది. ల్యాబ్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన బీఆర్ నాయుడు  ఈ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక త్వరలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  

మిథున్‌రెడ్డికి ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి

  ఏపీ మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. జైలులో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్‌, కూలర్‌, పేపర్‌-పెన్ను, టేబుల్‌, ప్రొవిజన్‌ ఉంటే టీవీ అనుమతించాలని కోర్టు పేర్కొంది. పేపర్‌, వాటర్‌ బాటిల్స్‌, ఫుడ్ ఖర్చును మిథున్‌రెడ్డి భరించాలని స్పష్టం చేసింది. బయటి ఆహారం తీసుకువస్తే అండర్‌ టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలులో ఉన్న వైద్య వసతి కల్పించాలని.. అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యం కల్పించాలని సూచించింది. న్యాయవాదులకు వారంలో మూడు సార్లు, కుటుంబ సభ్యులు వారంలో రెండు సార్లు ములాఖత్‌లకు కోర్టు వీలు కల్నించింది.

ఫ్రీజ్‌లో ఉంచిన మటన్ తిని ఒకరి మృతి..ఏడుగురికి సీరియస్

  హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న చికెన్, మటన్ బొటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తిని ఓకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురుయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స  పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కాలనీకి చెందిన ఫ్యామిలీ ఆదివారం బోనాల పండుగ సందర్బంగా మటన్ వంటుకుని తిన్నారు.  మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. దాన్ని ఇవాళ వేడి చేసి తినడంతో ఫుడ్ పాయిజన్ అయి వాంతులు, విరేచానాలు అయ్యాయి. దీంతో మిగిలిన ఏడుగురు చింతలకుంటలోని హిమాలయ ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సిట్‌ అధికారుల లీకులతోనే ఆ కథనాలు ..ధనుంజయ్‌రెడ్డి ఆవేదన

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి ఏసీబీ కోర్టు ఎదుట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన ఫ్యామిలీ గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. కారాగారం పక్కన బిల్డింగ్ టెర్రస్‌ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు.  నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్‌ఫోన్‌ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్‌లో ఓ న్యూస్ చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చని కోరుతున్నాను తెలిపారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా వైఫ్ మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. న్యూస్ పేపర్‌లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.  సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. గత 20 రోజులుగా వార్త  పత్రికల్లో న్యూస్ చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్‌లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని  ఆవేద వెలిబుచ్చారు.  

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం

  ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 మే 19న రాత్రి కాకినాడలో సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరి చేసిన విషయం తెలిసిందే.  అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించగా.. మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యాడు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేసు విచారణ సరిగా జరగలేదని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించగా.. పోలీసులు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   

మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌కు బిగిస్తున్న ఉచ్చు

  వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు  హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ పోలీసులకు తెలిపినట్లు టాక్. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు.  పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు.. క్వార్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లం. శశిధర్‌రెడ్డికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్‌ను చైనా పంపాం.’’ అని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్ వేశామని  హైదరాబాద్‌లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని మణికొండ అల్కాపురి, తుర్కయాంజల్‌లో వెంచర్లు వేశామని శ్రీకాంత్‌ పేర్కొన్నారు. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ పేరిట వెంచర్ - తుర్కయాంజల్‌లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ వేశాం - 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్‌కు మకాం మార్చాని కేసులకు భయపడి హైదరాబాద్‌కు మకాం మార్చాని శ్రీకాంత్‌రెడ్డి పోలీసుల విచారణలో తెలిపారు.     

ఏపీలో జిల్లాల పేర్లు మార్పుపై కేబినెట్ సబ్‌కమిటీ

  ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు మార్పుపై ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, బీసీ జనార్ధన్‌రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై డిమాండ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది.  

త‌ల్లిని తలుచుకోని.. భావోద్వేగానికి గురైన మంచు ల‌క్ష్మీ

  ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్‌ ఫర్‌ చేంజ్‌ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీనటి మంచు లక్ష్మికి స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పూలమాలలు, శాలువలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు.   మంచు లక్ష్మీని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో తరలివచారు. ముందుగా నాయుడుపేటలోని అమరాగార్డెన్‌లో ఉన్న అమ్మగారి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో టీచ్‌ఫర్‌ చేంజ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 320 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు మంచు లక్ష్మి తెలియజేశారు.  అమ్మమ్మ గారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూమును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.  అధునాతన సాంకేతికతతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌ రూమ్‌ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకుని చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సనత్‌కుమార్‌, ఎంఈఓ బాణాల మునిరత్నం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ రఫీ, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.