ద‌ర్గా సాక్షిగా అబ‌ద్దాలా? డిప్యూటీ సి.ఎం.గారు!

మీడియా కుట్ర అంటూ డిప్యూటీ సి.ఎం. అంజాద్ బాషా ప్ర‌తికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. " నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది.అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది.ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను.మరుసటి రోజు సీఎం గారిని కలిశాను...4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను.ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం," అంటూ చెప్పుకొచ్చిన అంజాద్ బాషా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా అని ప్రశ్నించారు. "కనీసం నా వివరణ కూడా అడగలేదు.ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని  మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాల‌న్నారు. అంతే.. సోష‌ల్ మీడియాలో నిజాముద్దీన్ ద‌ర్గాకు మంత్రి వెళ్లిన ఫొటోలు మార్చి 2 వ తేదీన పోస్ట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఎక్క‌డికీ వెళ్ల‌లేద‌న్నారుగా మంత్రిగారు నిజాముద్దీన్ ద‌ర్గాకు ఎలా వెళ్లారు. ఈ ఫొటోలు ఏమిటి?  దీనిపైన కూడా వివ‌ర‌ణ ఇస్తే బాగుండేది. మార్చి 2వ తేదీ మీరు ఢిల్లీలో వున్న‌ట్లు మీరే చెప్పారు. ద‌ర్గా సాక్షిగా అబ‌ద్దాలాడ‌డం క‌రెక్టేనా? అది వేరు మీరు త‌బ్లీక్ జ‌మాత్ మ‌ర్క‌జ్‌కు వెళ్ల‌క పోవ‌చ్చు... ద‌ర్గాకు వెళ్ళారా?  లేదా? దీనిపై డిఫ్యూటీ సి.ఎం. స‌మాధానం ఏమిటి? భ‌య‌ప‌డ‌డం ఎందుకు. వాస్త‌వాలు చెప్పండి.

రాజభోగం... 20మంది మహిళలతో!

'రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా?' అని సామెత. అలాగే, రాజు తలచుకోవాలని కానీ సపర్యలు చేసే చెలికత్తెలకు కొరత ఉండదు. థాయ్‌ల్యాండ్ రాజు మహా వజ్రలాంగ్ కార్న్ అదే పని చేశాడు. తనతో పాటు 20 మంది మహిళలను వెంటబెట్టుకుని జర్మనీలోని స్టార్ హోటల్ కి వెళ్లాడు. కరోనా క్రైసిస్ టైమ్‌లోనూ రాజ భోగాలను వదులుకోవడానికి ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. అసలు, ఉన్నట్టుండి రాజుగారు థాయ్‌ల్యాండ్ వదలి, జర్మనీ వెళ్లడానికి కారణం కూడా కరోనాయే. ఎక్కడ కరోనా తనకు సోకుతుందేమోననే భయంతో సొంత దేశం వదిలి వెళ్లిపోయాడు. జర్మనీలో ఫోర్ స్టార్ హోటల్ మొత్తాన్నీ ఒక్కడే బుక్ చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే ఈ వార్త బయటకొచ్చింది. అయితే... అందులో 20మంది మహిళలు, కొంతమంది సేవకులతో దిగినట్టు జర్మనీ పత్రికలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అన్నట్టు రాజుగారికి నలుగురు భార్యలు. ప్రస్తుతం వాళ్లు రాజుతో ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటివరకు థాయ్‌ల్యాండ్‌లో 1500లకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మార్చి నెల వేతనంలో 50% వాయిదా...

మార్చి నెల వేతనంలో 50% వాయిదా వేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GO Ms. No. 26 dated 31-03-2020 ను ఆర్థిక శాఖ విడుద‌ల చేసింది. గ్రాస్ శాలరీలో.. 50% వాయిదా వేస్తున్న‌ట్లు జి.వో. విడుద‌ల చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100%,  అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు 60%(IAS,IPS,IFS..etc),  ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా), నాల్గో తరగతి ఉద్యోగులకు 10%. ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ వాయిదా. ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50% గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.  ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు.  తదుపరి ఉత్తర్వులు విడుదల అయ్యే వరకు ఈ GO కొనసాగుతుంద‌ని పేర్కొన్నారు.  కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని.. అందుకే ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సమకూరిన తరువాత మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.

కరోనాకు మతం రంగు పులమకండి: ముహమ్మద్ రఫీఖ్ 

* ఏపీ జమాఅతె ఇస్లామి హింద్ అధ్యక్షుడి విజ్ఞప్తి  ప్రపంచ దేశాలు కరోనా ఉపద్రవానికి అల్లల్లాడుతున్నా కూడా  భారత ప్రభుత్వం ఏ విధమైన  ముందస్తు చర్యలు చేపట్టకుండా మార్చి 19 వరకు నిమ్మకు నీరెత్తినట్లు గా ఉండి‌ అకస్మాత్తుగా  లాక్ డౌన్ ప్రకటించడం వలన అనేక సమస్యలు తలెత్తాయని ఏ పీ జమాఅతె ఇస్లామి హింద్ అధ్యక్షుడు ముహమ్మద్ రఫీఖ్ పేర్కొన్నారు. "ప్రభుత్వం ఇదే లాక్ డౌన్ ని మార్చి పదో తేదీనుండే అమలు పరచి ఉంటే ఢిల్లీ లో మత పర ప్రార్ధనలు జరిగేవే కావు,ఈ వైరస్ ఇంతిలా వ్యాపించేది కాదు. అలాగే ఢిల్లీ వార్తల పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి , ప్రజలు ప్రత్యేకించి నెటిజన్లు వాస్తవ సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి," అని కూడా ఆయన సూచించారుఇప్పుడు  కేవలం  నిజాముద్దీన్  పేరు  మాత్రమే  ఎందుకు, అని ఆయన ప్రశ్నించారు.  ఇండియాలో  కూడా  కరోనా  వైరస్  వ్యాప్తి  చెందకుండా జాగ్రత్తలు  తీసుకోవటం  మొదలుపెట్టారు , హఠాత్తుగా  లాక్  డౌన్ ప్రకటించటం  జరిగింది . ఈ  లాక్  డౌన్  జరిగినప్పుడు  ఒక  రాష్ట్రం  వారు  వేరే  రాష్ట్రంలో  ఉన్నారు. వీరు  ఇప్పుడు  ఏం చేయాలి ? వీరిని  తమ  తమ  ప్రదేశాలకు  పంపించే  బాధ్యత  ప్రభుత్వంది  కాదా ? ఢిల్లీ  తబ్లిగ్   నిజాముద్దీన్ లో  వందల మంది చిక్కుకుని ఉన్నారు !  లాక్ డౌన్ ప్రకటనకు ముందు జరిగిన కార్యక్రమం అదీను సంవత్సరాలుగా  జరుగుతున్న ఆధ్యాత్మిక  కార్యం , మరి  ఢిల్లీ  ప్రభుత్వం  వారిని  పంపే  ప్రయత్నం  ఏం  చేసిందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ నిజాముద్దీన్  విదేశాల  నుండి  వచ్చిన  వారు  కూడా  ఉన్నారు !   ఇది సంవత్సరాలుగా  జరుగుతున్న కార్యక్రమం,దేశంలో ఇంకా ఎన్నో మతాల ఆధ్యాత్మిక కార్యక్రమాలూ జరిగాయి,  అన్ని  ప్రదేశాలలో  వ్యాపారం  రీత్యా , ఉద్యోగం  రీత్యా , పర్యటన రీత్యా  అనేక  మంది  విదేశాల  నుండి  వచ్చిన వారు  ఉన్నారు. ఇది  పెద్ద  నేరంగా మీడియా ఎందుకు  చూపిస్తుంది ? దేశంలో  ఎన్ని  కరోనా  కేసులు  ఉన్నాయి ? అందరూ  నిజాముద్దీన్  వెళ్లి  వచ్చిన  వాళ్లేనా?  అమెరికా  లాంటి  దేశంలో  కరోనా  తాండవిస్తుంది   నిర్మూలించటానికి  అన్ని  రకాల  ప్రయత్నాలు  జరుగుతున్నాయి . కరోనా  ఇప్పుడు  పూర్తి  ప్రపంచ సమస్య దీనిని  దేశాలు  మతాలకతీతంగా  పోరాటం  చేయవలసిన  సమయం . నిజాముద్దీన్  పేరు  ముందు  పెట్టి  మత  రాజకీయాలు  చేయటం  వలన   దేశం  నుండి  కరోనాను  పారద్రోలగలమా ? మేధావులు  ఆలోచించాలి.  తబ్లీగి  జమాత్  ఒక  ఆధ్యాత్మిక  సంస్థ , మానవులను  సృష్టికర్తతో కలపటానికి  ప్రయత్నిస్తున్న  జమాత్  అటువంటి జమాత్ పై మీద  సోషల్  మీడియాలో  విమర్శలు చేయటం  ఎంత వరకు సబబు ? తబ్లీగి  జమాత్  బాధ్యులు  మొదటి నుండే  ప్రభుత్వాన్ని  కోరుతున్నారు  ఇక్కడ ఉన్న  వారందరిని  సురక్షితంగా  తమ  తమ  ప్రదేశాలకు  పంపమని? హఠాత్తుగా  లాక్  డౌన్  ఎవరి  నిర్ణయం ? కేసులు  ఎవరి  మీద  పెట్టాలి ? ఈ  రకంగా  చూస్తే  ప్రపంచం  మొత్తంలో  ఎంత మందికి  కరోనా  ఉంది ? ఎంత మంది ప్రాణాలు  కోల్పోయారు ఎంత  మంది  మీద  కేసులు పెట్టాలి అని ఆయన ప్రశ్నించారు. కరోనా  విజృంభిస్తున్న  సమయంలో   ఒక  వర్గానికి  చెందిన  నిజాముద్దీన్ వారిపై   సోషల్  మీడియాలో  విషం  చిమ్మటం ఎంతవరకు  సబబు! కఠినమైన కరోనాకు లేని మతవిభజన మనుషులమైన మనకు అవసరమా ప్రతి  భారతీయుడు ఆలోచించాలని ఆయన కోరారు.

పచ్చ మీడియా కుట్ర అంటూ మండిపడ్డ అంజాద్ బాషా 

* తప్పుడు వార్త రాసినందుకు క్రిమనల్ కేసు పెడతానంటూ వార్నింగ్  * డెప్యూటీ సి ఎం గా నాపరాతి అడుగు ఢిల్లీ లో నమోదైంది, చెక్ చేసుకోండి: అంజాద్ బాషా  తన పైన, ఈ ప్రభుత్వంపై పచ్చ మీడియా పెద్ద కుట్రకు తెరలేపిందని డెప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయన్నారు. " నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది.అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది.ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను.మరుసటి రోజు సీఎం గారిని కలిశాను...4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను.ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం," అంటూ చెప్పుకొచ్చిన అంజాద్ బాషా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా అని ప్రశ్నించారు. "కనీసం నా వివరణ కూడా అడగలేదు.ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని పచ్చ మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను.. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి...పచ్చ మీడియా రాసిన పిచ్చి రాతలను నమ్మొద్దు," అని విజ్ఞప్తి చేశారు.

మారటోరియం లేదూ...మట్టిగడ్డలూ లేవు!

* స్టేట్ బ్యాంక్ మినహా చేతులెత్తేసిన మిగిలిన బ్యాంకులు  *మూడు నెలల కిస్తీ చెల్లింపుల మినహాయింపు పై ఆర్ బీ ఐ తో పాటు, బ్యాంకుల ఉదేశ్య పూర్వక మౌనం  మారటోరియం లేదు..మట్టి గడ్డలూ లేవు అంటూ... బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు పెదవి విరుస్తున్నారు. .. నాలుగు రోజుల నాడు మన దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఒక మూడు నెలల పాటు నెలసరి కిస్తీల బాధ నుంచి తప్పించుకుందామనుకున్న  మధ్య తరగతి సగటు జీతగాళ్లతో బ్యాంకుల ఇన్ స్టాల్మెంట్ ఆట మొదలైంది. ఏప్రిల్ నెల కిస్తీల తాలూకు మెసేజ్ లతో , ఇప్పటికే మధ్యతరగతి మొబైల్స్ దిగాలు ముఖాలు పెట్టేశాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మినహా, మిగిలిన బ్యాంకులేవీ కూడా అసలు మారటోరియం ఊసే ఎత్తడం లేదు. స్టేట్ బ్యాంకు కూడా హౌసింగ్ లోన్ వరకే మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపు నకు మినహాయింపు ఇస్తోంది.  నిజానికి, కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట. ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం  సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ.  ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును.  అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది.  హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది.  అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది.  ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట. ఇన్ని విషయాల మీద ఇంత చక్కని క్లారిటీ ఇచ్చిన ఆర్ బీ ఐ, ఇప్పుడు బ్యాంకులు మారటోరియం ను అపహాస్యం చేస్తుంటే మాత్రం, చోద్యం చూస్తోంది. మధ్యతరగతి జీవి ని పరిహాసం చేస్తున్నట్లుంది ఆర్ బీ ఐ వైఖరి....

ఢిల్లీ నుంచి వ‌చ్చిన ​603 మంది లెక్క తేడాకొడుతోంది!

​ఢిల్లీ లో జరిగిన మతపరమైన ప్రార్ధనలలో 603 మంది పాల్గొని, నగరానికి  తిరిగి వచ్చారు.  ​వారి ఆరోగ్య స్థితిని తనిఖీ చేసేందుకు పోలీస్,  జీ హెచ్ ఎం సి, రెవిన్యూ వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన   200 బృందాలు జి హెచ్ ఎం సి పరిధిలో తనిఖీ చేస్తున్నాయ‌ని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ​ ​అత్యంత పకడ్బందీగా  చేపట్టిన ఈ తనిఖీ ప్రక్రియను  జోనల్ కమీషనర్లు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నట్లు జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ​జి హెచ్ ఎం సి కమీషనర్ ఆయా జోన్లలో పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  ​ ​ఈ బృందాలు  కోవిద్ -19 లక్షణాలు కనిపించిన వారిని గాంధీ హాస్పిటల్ కు తరలిస్తున్నాయి. ​ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారి  కుటుంబ సభ్యులను కూడా  హోం క్వారెంటైన్ చేస్తున్నాయి .   ​​వృద్దులు, తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారిని, ఇండ్లలో తక్కువ స్థలం వున్న వారిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలిస్తున్నాయి. ​ ​నేడు  463 మంది ఇండ్లను తనిఖీ చేశారు. వారిలో 74 మందికి ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు కనిపించుటతో పరీక్షల నిమిత్తం గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ కు తరలించారు. ​348 మందిని హోం క్వారెంటైన్ చేయగా, మరో 41 మందిని ప్రభుత్వ క్వరెంటైన్ కు తరలించారు.  ​మిగిలిన వారి అడ్రసులు సరిగా లేనందున,వారి ఆచూకీకీ  వాకబు చేస్తున్నారు.

2000 మందికి చేసిన కరోనా టెస్టుల‌న్ని నెగటివ్

హాజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ లో దాదాపుగా 2000 మందికి చేసిన కరోనా టెస్టు లు అన్ని నెగటివ్ (-VE ) అని వచ్చాయి. ఒక్కళ్లకు కూడా కరోనా లేదని స్పెషల్ ఆర్మీ డాక్టర్ల బృందం నిర్ధారించింది. గత వారం రోజులుగా హాజరత్ నిజాముద్దీన్ లో టెంట్ క్యాంప్ వేసి పరీక్షలు నిర్వవ్యాహిస్తున్న ఆర్మీ డాక్టర్ల బృందం. దాదాపు 300 మంది విదేశీయులు, మరియు 1700 మంది స్వదేశీయుల లాలాజలం శాంపిల్స్ ను పరీక్షించిన డాక్టర్ల బృందం అన్ని నెగటివ్ కేస్ లే అని తేల్చి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది.. దేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  వారిని వారి వారి ప్రాంతాలకు పంపే పనిలో నిమగ్నమైన అధికారులు. ఇక మీడియా లో వస్తున్న కథనాలను గొళ్ళెం పడ్డట్లే...

నేను రాజకీయం చేయను... కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు

* హైదరాబాదులో చంద్రబాబు మీడియా సమావేశం * కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయలేకపోతున్నారని విమర్శలు * ఇప్పటికే అనేక లేఖలు రాశానని వెల్లడి దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాను ఈ విషయంపై రాజకీయం చేయబోనని, కానీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం కరోనా విపత్తు నిర్వహణలో విఫలమవుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన రీతిలో కరోనా పరీక్షలు చేయలేకపోవడం వల్ల, వాస్తవాలు మరుగునపడిపోయి ఎక్కడికక్కడ వ్యాపించే పరిస్థితులు వచ్చాయని వివరించారు. దాని పర్యవసానమే పదుల సంఖ్యలో కేసులు ఒక్కసారిగా వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. కరోనా టెస్టు సెంటర్లు తక్కువగా ఉన్నందువల్ల, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒక కరోనా వ్యక్తి బయటికి వెళితే 6 రోజుల్లో 3,600 మందికి వ్యాపింపచేయగలడని హెచ్చరించారు. కరోనాపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి అనేక లేఖలు రాశానని, ఇంకా రాస్తానని చంద్రబాబు చెప్పారు. కరోనా నివారణలో ఈ ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

మర్కజ్ నిజాముద్దీన్ ఘటన వెనుక వాస్తవాలివే.. పరిస్ధితి ఎందుకు చేదాటిపోయిందంటే..

వందేళ్ల చరిత్ర కలిగిన మర్కజ్ నిజాముద్దీన్ ఏటా సమావేశాలు నిర్వహిస్తుంటుంది. చర్చలు, నమాజులు వంటి కార్యక్రమాలు ఇక్కడ సర్వసాధారణం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి హాజరయ్యే వారి కోసం ఏటా సమావేశాల తేదీలను ముందే ఖరారు చేస్తారు. ఈసారీ తేదీలు ముందే ఖరారు అయ్యాయి. కానీ 21న ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పిలుపుతో మధ్యలోనే ఆపేశారు. అప్పటికే వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు సమావేశాల్లో బిజీగా ఉన్నారు.  జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమాత్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మర్కజ్ రాత్రి 9 గంటల వరకూ ఎవరినీ బయటికి పంపలేదు. తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. జనతా కర్ఫ్యూ ముగిసినా, తర్వాత రోజు ఉదయం లాక్ డౌన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి పలువురు విదేశీయులు వెళ్లిపోయారు. కానీ దేశీయంగా ఉన్న వారు మాత్రం పూర్తిగా వెళ్లలేకపోయారు. అప్పటికే కొందరు విదేశీయుల్లో కరోనా లక్షణాలు ఉండటంతో వారు ఇతరులకు అంటించారు.  లాక్ డౌన్ ఉన్నందున అక్కడే ఉండిపోయిన వందలాది మందిని ఖాళీ చేయాలని స్ధానిక అధికార యంత్రాంగం మధ్యలో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ ఉన్నందున స్వస్ధలాలకు వెళ్లేందుకు వీలుగా వీరికి పాస్ లు మంజూరు చేయాలని మర్కజ్ నిర్వాహకులు కోరడంతో అధికారులు 17 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయినా కొందరు వెళ్లలేకపోయారు. 28న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించాగా.. వీరిలో కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరిని క్వారంటైన్ కు పంపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉండగానే మర్కజ్ లో జనం మర్కజ్ లో ఉండటంపై ఫేస్ బుల్ లో పోస్టులు వెలిశాయి. దీంతో కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వాధికారులతో చర్చిస్తున్నట్లు మర్కజ్ సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఆదేశించడంతో మర్కజ్ ఇవాళ మరోసారి వివరణ ఇచ్చింది. విదేశీయులకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రటకన తర్వాత వెంటనే పంపకపోవడమే కొంప ముంచినట్లు తెలుస్తోంది.

అమెరికా, చైనాలకు ఏపీ నుంచి ఆక్వా ఎగుమతులు 

*సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకున్న ఏపీ ఆక్వా రంగం  *69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందన్న అధికారులు.  విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్‌ నుంచి 4 కంటైనర్లతో, అమెరికా, చైనాలకు ఆక్వా ఉత్పత్తులు ప్రారంభమైనట్టు అధికారులు చెప్పారు. ప్రాససింగ్‌ కేంద్రాల్లో వర్కర్స్‌ పాసుల జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లతో మాట్లాడుతున్నామని  ఫిషరీస్‌ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వారినుంచి వచ్చే సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారంకోసం పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలని సీఎం ఆదేశం. కోవిడ్‌ –19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ.. ఆమేరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చూడాలన్న సీఎం. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6గంటల నుంచి 11 గంటలవరకూ, మిగిలిన ప్రాంతాల్లో 6 గంటలనుంచి 1 గంటవరకూ సమయం పాటించాలని ముఖ్యమంత్రో సూచించారు.

ఐఏఎస్ నిర్వాకం ! ఒణుకుతున్న జగన్ టీమ్!!

అద్దంకి పోయిన సింగడు పోనూ పోయాడు, రానూ వచ్చాడని సామెత. ఆయనో ఐ ఏ ఎస్ అధికారి. అలాంటి..ఇలాంటి ఆఫీసర్ కూడా కాదు. సీనియర్ మోస్ట్ ఐ ఏ ఎస్ .... చేస్తోంది అత్యంత కీలకమైన ఉద్యోగం.. చాలా ముఖ్యమైన పోర్ట్ ఫోలియో .. ఎక్కే విమానం..దిగే విమానం ....ఊపిరి సలపలేనంత పని.. ఒకటే ఒత్తిడి... మన దేశం లో లాక్ డౌన్ ప్రకటించకముందు , ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధిగా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లి, పారిశ్రామిక రంగ పెట్టుబడుల నిమిత్తంఅక్కడి అధికార యంత్రాంగాలతో చర్చలు జరిపారు... అంతే కాదు... అక్కడి నుంచి కిందటి వారమే , తిరిగి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. ఆయన ఒక్కరే కాదు... ఆయనతో పాటు ఆయా దేశాల డెలిగేషన్స్ బృందాలు కూడా వచ్చాయి.. ఆయా డెలిగేషన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావటం, సమావేశం కావటం, ఇవన్నీ కూడా చక చకా జరిగిపోయాయి... అయినాకూడా సి ఎం ఓ ఈ విషయాన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ..... ఒక పక్క ప్రపంచం మొత్తం అతలాకుతలమై పోతుంటే, సీరియస్ నెస్ కొరవడిన ఆ అధికారి చేసిన నిర్వాకం వల్ల , ఇప్పుడు సి ఎం క్యాంప్ కార్యాలయం వద్ద సిబ్బంది గడ గడా వణికిపోతున్నారు. ప్రధాన మంత్రి లాక్ డౌన్ ప్రకటించక ముందే, ఆ సీనియర్ మోస్ట్ ఐ ఏ ఏ ఎస్ అమరావతికి తిరిగి వచ్చేసినప్పటికీ, సెల్ఫ్ క్వారంటైన్ పాటించకపోవడం రాజధాని ప్రాంత వాసులందరినీ , ప్రత్యేకించి సి ఎం ఓ నూ  కలవరపెడుతోంది. ఐరోపా దేశాల్లో ..ఒక దేశం ప్రధాని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన విషయాన్ని, మరో దేశ యువరాణి కరోనా తో మరణించిన విషయాన్నీ, జర్మనీ లో అయితే ఏకంగా కరోనా కల్లోలం కారణంగా అక్కడి ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్న విషయాన్నీ ఇంత  కన్వీనియెంట్ గానూ, చాలా తేలిగ్గానూ తీసుకున్న ఆ ఐ ఏ ఎస్ అధికారి విషయం లో చీఫ్ సెక్రెటరీ గానీ, సి ఎం ఓ గానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం చూస్తుంటే, భయమేస్తోందని సెక్రటేరియట్ కారిడార్లు వ్యాఖ్యానిస్తున్నాయి. హతవిధీ.... ఇంతగా సీరియస్ నెస్ కొరవడిన వ్యవస్థలు సాక్షాత్తూ సి ఎం కార్యాలయాల్లోనే పని చేస్తుంటే, ఇక కరోనా నియంత్రణ లో చిత్తశుద్ధి కోసం మాట్లాడుకోవటం లో అర్ధం లేదనేది ఉద్యోగుల భావన!  ఇక్కడో విషయం గమనించాలి.. ఒక పక్క సి ఎం జగన్ మోహన్ రెడ్డి రేయింబగళ్లు, రివ్యూలు చేస్తూ..కరోనా కట్టడికి ఎక్కడికక్కడ మార్గదర్శకాలు, సూచనలు చేస్తుంటే, ఈ ఐ ఏ ఎస్ ఒళ్ళు పై తెలీకుండా, ఏకంగా ఆ రెండు దేశాలు--సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా లకు చెందిన బృందాలను తన కూడా పెట్టుకుని సి ఎం ముందు హాజరు పర్చడమేమిటని ఐ ఏ ఎస్ లే చెవులు కొరుక్కుంటున్నారు. పై పెచ్చు, ఆ ఐ ఏ ఎస్ సెల్ఫ్ క్వారంటైన్ ను కూడా పాటించకుండా జన బాహుళ్యం లోకి వచ్చేయటం కూడా సెక్రెటేరియేట్ వర్గాలను, సి ఎం ఓ సీనియర్లనూ ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం.. కరోనా ను కట్టడి చేయటానికి సహకరించాలంటూ, సి ఎం జగన్ ఏమో రెండు చేతులూ జోడించి ప్రజలకు నమస్కరిస్తుంటే, ఈ ఐ ఏ ఎస్ మాత్రం...తనకేమీ పట్టనట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పిఎం, సిఎం సహాయ నిధులకు గవర్నర్ బిశ్వ భూషణ్ చేయూత

ప్రధాని సంరక్షణకు నిధికి నెల జీతం, సిఎం సహాయ నిధికి రూ.లక్ష ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కరోనా విపత్తు నేపధ్యంలో తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం తన వంతు ప్రయత్నాన్ని చేస్తూ మఖ్యమంత్రి  మొదలు అయా శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికార గణంకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆ దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సైతం స్వయంగా వివరించిన బిశ్వభూషణ్ రాష్ట్ర ఆరోగ్య స్ధితి గతులను మెరుగు పరిచేందుకు తన వంతుగా చిరు విరాళంను అందిస్తున్నానన్నారు.

ఏపీ లో  కొత్తగా 17 కేసులు నమోదు: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలన్న సీఎం ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించే పనిలో ఏ పీ అధికారులు బిజీ అయ్యారు. రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు. జమాత్‌ నిర్వాహకులనుంచి, పోలీసులనుంచి, రైల్వే వారినుంచి..  ఇలా వివిధ రకాలుగా సమాకారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయనీ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చేయాలనీ సి ఎం సూచించారు.  అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని ఆరాతీసిన సీఎం. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని ,షెల్టర్లలో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్‌ చేయాలనీ సో ఎం సూచించారు.  అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీశారు. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు. ప్రతి దుకాణం ముందు ప్రకటించిన∙ధరలతో పట్టికను ప్రదర్శించాలని స్పష్టంచేసిన సీఎం. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని దుకాణాల ముందు పెట్టిస్తామన్న అధికారులు. దీనిపై మానిటరింగ్‌ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.  గిట్టుబాటు ధరలు కల్పించడానికి  తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన సీఎం. తాత్కాలిక పరిష్కారంగా ప్రస్తుతానికి రైతులనుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయమన్న సీఎం. అరటి, టమోటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం . నిల్వచేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం ఆదేశం తక్షణం సంబంధిత అధికారులు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలంటూ గట్టిగా ఆదేశించిన సీఎం లాక్‌డౌన్‌ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామన్న అధికారులు. దీనివల్ల రిటైల్‌ వ్యాపారం పెరుగుతుందన్న అధికారులు. దీనివల్ల రైతులకు కొంతైనా మేలు జరుగుతుందన్న అధికారులు ఆమేరకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు శాశ్వత పరిష్కారాలపైనా దృష్టిపెట్టాలని స్పష్టం చేసిన సీఎం. రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలన్న సీఎం. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్‌కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలన్న సీఎం. ఆమేరకు డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం. ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాటిని పరిశీలించి మంచి విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఢిల్లీ ఇస్త‌మాకు వెళ్లారా? వెంట‌నే మీ స‌మాచారం ఇవ్వండి!

మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ రిజ్వీ విజ్ఞ‌ప్తి. మూడు రోజుల ఇస్త‌మా కోసం ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన వారు, వారిని కలిసిన వ్యక్తుల సమాచారం వెంటనే ఇవ్వాల‌ని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ  డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ రిజ్వీ విజ్ఞ‌ప్తి చేశారు.   ఢిల్లీ మ‌ర్క‌జ్‌లో జ‌రిగిన అంత‌ర్జాతీయ ఇస్త‌మాలో పాల్గొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తిరిగి వచ్చిన వారందరూ తమ సమాచారాన్ని స్వచ్ఛందంగా మీ జిల్లా యంత్రాగానికి తెలపాలని రిజ్వీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తిరిగివచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినందువల్ల మీరు, మీతో పాటు మిమ్మ‌ల్ని క‌లిసిన వ్య‌క్తులు మీ  కుటుంబ సభ్యులు, వారిని కలసిన వ్యక్తులు అందరూ హోమ్ ఐసోలేషన్ లో కి వెళ్లాల‌ని మైనార్టీ సంక్షేమ శాఖా ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన జమాత్ లో పాల్గొన్న వారందరూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి క్వారంటైన్ లో వుండాలని ఆయ‌న సూచించారు.

పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి!మంత్రి విశ్వరూప్

తీవ్రంగా ప్రబలు తున్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులలో ను పారిశుద్ధ్యాన్ని బాగా మెరుగు పరచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి ఇవతల వైపు ఉన్న చింతగుంట చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, మరియు మెట్ల కాలనీలను సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థను, రహదారులను పరిశీలించారు. ముందుగా చింత గుంట చెరువును సందర్శించిన మంత్రి అక్కడి స్థలాన్ని పరిశీలించి 216 హైవే నుండి చింత గుంట చెరువు వరకు సి.సి రోడ్డును వెంటనే వేయవలసిందిగా మునిసిపల్ అధికారులను ఆదేశించారు.  అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించిన మంత్రి కాలనీ లో మురుగు నీరు వేగం గా ప్రవహించేలా డ్రెయిన్లు వెడల్పును విశాలంగా చేయాలని, ఇప్పటికే ఆమోదం పొందిన సి.సి రహదారులు, డ్రెయిన్లు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే చింత గుంట చెరువులో  పది మందిని, హౌసింగ్ బోర్డు కాలనీ లో పది మందిని శానిటేషన్ వర్కర్లను ఏర్పాటు చేసి పారిశుధ్యా న్ని మెరుగు పరచాలని మునిసిపల్ అధికార్లను మంత్రి ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మెట్ల కాలనీని మంత్రి సందర్శించి గతంలో 10 లక్షల రూపాయలతో మంజూరు అయిన డ్రైన్ కు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

సరిహద్దుల్లో చిక్కుకున్నా మంత్రి చొర‌వ‌తో  తండాకు చేరుకున్న కూలీలు!

తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చూపిన చొరవతో వ‌ల‌స కూలీలు త‌మ సొంత గూటికి చేరుకున్నారు. సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండా కు చెందిన 26 మంది కూలిపనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు. లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో చిక్కుకున్నారు.  అక్కడే పని లేక సొంత గూటికి చేరుకోలేక పులిచింతల ప్రాజెక్ట్ అవల చిక్కుకున్నారు. ఎంత బ్రతిమలాడిన నిబంధనలు ఒప్పుకోవు అంటూ సరిహద్దుల్లో వారి రాకను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో మంత్రి జగదీష్ రెడ్డి సెల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ లో నేరుగా మంత్రి జగదీష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి సరిహద్దుల్లో చిక్కుకున్న పాచ్యతండా వాసులను వారి సొంతూరికి చేర్చాలంటూ ఆదేశించారు. ఆదేశించడంతో పాటు పలుమార్లు వాకబు చేస్తూ వారు సొంతూరికి చేరేదాకా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.దీనితో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోదాడ ఆర్ డి ఓ కు వారిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకు రావాలి అంటూ పురమాయించారు. దానితో రంగంలోకి దిగిన ఆర్ డి ఓ పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుని ఆదివారం పొద్దు పోయేంత వరకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి వారి సొంత గ్రామాలకు చేరేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.ఎట్టకేలకు యింటికి చేరుకున్న తండా వాసులు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఫోన్ ఎత్తడం తో పాటు సురక్షితంగా తమను గమ్యానికి చేర్చిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఢిల్లీ వెళ్లినవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి: సీఎం జ‌గ‌న్‌

ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయ‌ని సీఎం అన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జగన్ సూచించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్షించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ముఖ్య‌మంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని వివరించారు.  వీరిలో చాలా మంది ఢిల్లీలో ల్లో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను అధికారులు సేకరించారు. జమాత్‌ నిర్వాహకుల నుంచి, పోలీసుల నుంచి, రైల్వే  నుంచి  ఇలా వివిధ రకాలుగా సమాచారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు సి.ఎం. దృష్టికి తీసుకువెళ్లారు. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని సి.ఎం. ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి వారు ఆరోగ్య వివరాలు అందించాలని, వారు ముందుకు రాకపోతే వారి కుటుంబ సభ్యులకు నష్ట కలుగుతుందని సి.ఎం. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీశారు. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి దుకాణం ముందు  ధరలతో పట్టికను ప్రదర్శించాలని  సీఎం ఆదేశించారు.