ముంతాజ్ కు మంగళం!

తిరుపతి సమీపంలో వివాదాస్పద ముంతాజ్ హోటల్ ప్రాజెక్టుకు గత జగన్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.  ముంతాజ్ హోటల్ కు స్థల కేటాయింపుపై సాధు సంతులు సహా , హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.  ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తిరుమల విషయంలో  వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.  అందుకే అప్పట్లో అంటే  అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  జగన్ ను తన ప్రియశిష్యుడిగా పేర్కొన్న శారదాపీఠం అధిపతి స్వరూపానంద సర్వస్వతి కూడా ఒక సమయంలో జగన్ హిందూ ధర్మాన్ని, హైందవ సంప్రదాయాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిని బట్టే సీఎంగా అధికారంలో ఉండగా ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి హయాంలో  హిందువుల మనోభావాలను పనిగట్టుకుని దెబ్బ తీసేవారనడానికి బోలెడు ఉదాహరణకు కనిపిస్తాయి.  ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత    దేవాలయాల మీద జరిగిన దాడులకు, అన్యాక్రాంతమైన దేవుని ఆస్తులకు లేక్కే లేదని చెప్పవచ్చు. ఆఖరికి తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు కొలువులు కట్టబెట్టారు.   ఆగమ శాస్త్రం, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి జగన్ హయాంలో టీటీడీ  ఇష్టారాజ్యంగా తీసుకున్న పలు నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేశాయి.  ఏడుకొందలపై   డ్రోన్లు సంచరించడం మొదలు,   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పించడం వరకూ జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అరాచకాలకు లెక్కే లేదు.  ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ జగన్ హయాంలో  ఆ హిందూ ధర్మ వ్యతిరేక చర్యలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు  వెల్లువెత్తాయి.     తిరుమల లడ్డూ ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో  జగన్ హయాంలో టీటీడీ తీరు ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి.   అంతే కాదు భక్తులకు   సదుపాయాల విషయాన్ని   అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విస్మరించింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు   సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణను నిలిపేసింది.  క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది.   అంతేనా నిత్యం గోవిందనామస్మరణ తప్ప మరో పేరు వినిపించడమే మహాపరాథంగా భక్తులు భావించే తిరుమల కొండపై ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇంతగా తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించిన జగన్.. కొండ కింద కూడా తన హిందూ వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటుకున్నారు.    2016లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి మార్గంలో ఆధ్యాత్మిక‌, సంస్కృతిక‌ కార్యక్రమాలకు వేదికగా దేవలోకం ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. 38 ఎకరాలలో 750 కోట్ల‌ రూపాయలతో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పుడే పాతిక ఎకరాలు కేటాయించారు. ఆ తరువాత 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మూలనపడింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం   కేటాయించిన పాతిక ఎకరాలలో ఓ ఇరవై ఎకరాలను జగన్ ముంతాజ్ హోటల్స్  నామమాత్రపు ధరకు కట్టబెట్టేశారు.   90 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల రూపాయల చొప్పున  లీజుకు జగన్ ఈ స్థలాన్ని అప్పగించేశారు. ఇప్పుడక్కడ పునాదులు లేచాయి.   తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  టీటీడీ కొత్త పాలక మండలి సమావేశం ఈ కేటాయింపును రద్దు చేయాలని తీర్మానించి.. ఆ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముంతాజ్ హోటల్ స్థల కేటాయింపును రద్దు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పర్యాటక శాఖ అధికారికంగా ముంతాజ్ హోటల్ కు జగన్ హయాంలో జరిపిన స్థల కేటాయింపును రద్దు చేసినట్లు ప్రకటించింది.  

కమలం గూటికి గువ్వల బాలరాజు.. సీనియర్ల సమక్షంలో పార్టీ కండువా!

 మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మూడు రోజుల వ్యవధిలోనే కమలం కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు.. బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నంత కాలం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అత్యంత సన్ని హితుడిగా గుర్తింపు పొందారు.  అయితే పార్టీ పరాజయం తరువాత నుంచీ ఆయన పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనీ, అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా పార్టీ అధినాయకత్వం తన ప్రాధాన్యతను తగ్గించేస్తున్నదనీ ఆయన ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా గువ్వల బాలరాజు పార్టీ వ్యవహారాలలో, కార్యక్రమాలలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల కిందట పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం (ఆగస్టు 8) మీడియా సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను స్వార్థపరుడిగా అభివర్ణించారు. అంతే కాకుండా శుక్రవారం నాడే ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను కమలం కండువా కప్పుకోవడం, తన రాజకీయ భవిష్యత్ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే తన అనుచరులతో పలుమార్లు చర్చించి, నియోజకకవర్గ  ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకుని కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు గువ్వల బాలరాజు చెప్పారు. బీజేసీ సీనియర్ నాయకుల సమక్షంలో  శనివారం (ఆగస్టు 9)  కమలం గూటికి చేరనున్నట్లు తెలిపారు. కాగా గువ్వల బాలరాజు చేరికతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీ ఒకింత బలపడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

శ్రావణ శుక్రవారం రోజు చంద్రబాబుతో వరలక్ష్మి భేటీ

చంద్రబాబుపై అభిమానంతో.. ఆయన సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో 108 దేవాలయాలలో సంగీత కచ్చేరీలు చేసిన వరలక్ష్మి శుక్రవారం (ఆగస్టు 8) ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా ఆమె చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం చేస్తానని మొక్కుకున్న సంగతినీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ మొక్కుతీర్చుకున్న విధానాన్ని వివరించారు.  మంగళగిరిలో జన్మించిన వరలక్ష్మి ముంబైలో స్థిరపడినా.. జన్మభూమి పట్ల మమకారాన్ని వదులు కోని వరలక్ష్మి.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమై.. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం అయ్యి తీరాలని భావించారు. స్వతహాగా గాయని అయిన వరలక్ష్మి చంద్రబాబు సీఎం అయితే.. 108 దేవాలయాల్లో సంగీత కచ్చేరీలు చేస్తానని మొక్కుకున్నారు. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఆ మొక్కుతీర్చుకున్నారు.   ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలలో ఆమె సంగీత కచ్చేరీలు చేసి ఆ మొక్కును తీర్చుకున్నారు. అన్నవరం సత్యన్నారాయణ స్వామి దేవాలయంలో తొలి కచ్చేరీ చేసిన ఆమె.. తన 108వ కచ్చేరీని బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చేశారు.  చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆమె తన కచ్చేరీలకు సంబంధించిన వివరాలను రాసుకున్న పుస్తకాన్ని చంద్రబాబుకు చూపారు. దానిని పరిశీలించిన ఆయన ఆ పుస్తకంపై సంతకం చేశారు. తన పట్ల వరలక్ష్మి చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం కోసం, తన కోసం దేవుళ్లను ప్రార్ధించడం వల్లే ప్రజల అభిమానానికి, కార్యకర్తల కష్టానికి దైవ కృప తోడైందని చంద్రబాబు అన్నారు. వరలక్ష్మీ లాంటి అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తానని అన్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష  దైవం కొలువై ఉన్నతిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం వేలాది మంది తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం తరలి వస్తుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శనివారం (ఆగస్టు 9)  శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 8) శ్రీవారిని మొత్తం  70 వేల 480 మంది దర్శించుకున్నారు. వారిలో  28 వేల 923 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది. 

వ్యాపారాల పేరుతో కోట్ల రూపాయలలో మోసాలు...వైసీపీ నేతపై పీడీ యాక్ట్

  వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడడమే కాక ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగింది. దీనితో దాల్ మిల్ సూరి పై కలెక్టర్  ఉత్తర్వులు మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసామని జిల్లా  ఎస్పీ తెలియజేసారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ విజయ కుమార్ తో కలిసి ఈ కేసు వివరాలను ఎస్పీ విలేకర్ల సమావేశంలో తెలియజేసారు.  కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు తెలిపారు. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు.

పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. SCO సదస్సుకు ఆహ్వానం

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు  భారత్‌ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు. అయితే, ఈ సంక్షోభానికి శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. వివాద పరిష్కారానికి హింస మార్గం కాదని భారత్ మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఈ ఏడాది చివర్లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రావాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కోరారు. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు.  ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా చెప్పారు. కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్.. ఆరోపణలు నిరూపించు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆ‌ర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని అని విమర్శించారు. బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్‌ అన్నారు. చిల్లర, బజారు మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతో వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు నాటకాలకు తెరదీశారని మండిపడ్డారు.  ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు.నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడం విచారకరమని అన్నారు.  హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. 

ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బీజేపీ స్టేట్ చీఫ్

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామన్నారు. దీంతో రాంచందర్రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.  మరోవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కమలం గూటికి చేరనున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కేసులు, సిట్‌లు, కమిషన్లు, విచారణలు, దర్యాప్తులు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికితోడు బీజేపీ కూడా అటు బీఆర్ఎస్‌పై.. ఇటు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపైనా రాంచందర్ రావు స్పందించారు. ఈ కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటికి వస్తుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతోనే..రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదని టీ బీజేపీ చీఫ్ ఆరోపించారు.  

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్.. నువ్వెంత నీ బ్రతుకెంత?

  బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.  శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమీషన్లలో వాటా ఇవ్వలేదని జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏడ్చారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై  జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభాకర్ రెడ్డి.. నీవ్వుంతా నీ బతుకెంతా?, వ్యక్తిత్వంలో నాతో సరిపోడు. నీ మాదిరిగా నేను ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదు. బీఆర్ఎస్ 40 దొంగల్లో ప్రభాకర్ కూడా ఓ దొంగ'. అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు. పంచే గుణం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు.  నేను ఎలాంటి వాడినో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు. నేమైనా ప్యాకేజీల లీడర్‌ నా అంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.

ఇది ఒక్క ఉపాధ్యాయుని వేదన కాదు... ఇది లక్షల మంది అధ్యాపకుల ఆవేదన

  టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు మాత్రమే చెప్పారు. నేడు టెక్నాలజీ పేరుతో విద్యార్థులకు విద్య రాకుండా చేయడానికే అనిపిస్తోంది. టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు విని పిల్లలు గొప్పవాళ్లు అయ్యారు. బిల్డింగ్స్ లేని కాలంలో... బోర్డు లేని రోజుల్లో.. మధ్యాహ్న భోజనం లేని రోజుల్లోనూ, బ్యాగ్, బాక్స్, డ్రెస్, షూస్ మరియు టాయిలెట్స్ లేనప్పుడు కూడా టీచర్లు పాఠాలు చెప్పారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. వయోజనులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.  ఒక టీచర్ అయిదు తరగతులకు పాఠాలు చెప్పిన రోజుల్లో పిల్లలు IAS, IPS, IFS, IRS, ISS...మొదలైన దేశంలో యూపీఎస్సీ సర్వీసులకు మరియు రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ ఎంపికయ్యారు. డాక్టర్ల‌గా, ఇంజనీర్లుగా, అడిటర్లగా, లాయర్‌గా పై వసతులు లేనప్పుడు తయారు చేశారు. నేడు సకల సౌకర్యాలు ఉన్నప్పటీకి చదువు కనిపించడం లేదు. నాడు విద్య ఉచితం..నేడు విద్యా ఖరీదు. ఇప్పటి విద్యా దుస్థితి చూస్తే గుండె చలించిపోతుంది. పాఠశాల్లో ఉపాధ్యాయులు పాఠలు చెప్పటం కన్నా ఫోటోలు తీయటం ముఖ్యం ఉపాధ్యాయులు, అధ్యపకులు పాఠశాలు చెప్పటం వదిలిసి Track & Upload లో మునిగిపోయాడు. Online Attendance, Task Tracker, Assessment Reports, PMR, WhatsApp Updates...కాని  పాఠశాల ఏకంగా డాక్యుమెంటేషన్ కేంద్రంగా మారిపోయింది!  ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పటం కన్నా ఫారాలు నింపే పని ఎక్కువయింది.  పుస్తకల్లో ఉన్నా అధ్యయనల కన్నా యాప్ స్క్రీన్షాట్ ఎక్కువైంది  విద్యార్థుల విద్యా అభివృద్ధి కన్నా సెల్ఫీ అప్‌లోడ్‌ ఎక్కువ అయింది. ఇలాంటి పరిస్థితులు ఉంటే… ఎవరూ మాట్లాడటం లేదు కానీ వేలాది ఉపాధ్యాయులు ఊపిరాడక అల్లాడిపోతున్నారు!  పాఠం చెప్పే అవకాశం లేకపోవడం…  విద్యార్థి స్థాయిని బట్టి బోధించే స్వేచ్ఛ లేకపోవడం  చదువు బాగా రావాలన్న టీచర్ ఆశయాన్ని వమ్ము చేయడం ప్రభుత్వ పెద్దలకు ఎంత వరకు శ్రేయస్కరం కాదు  తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆంగ్ల మాధ్యమం లేని రోజుల్లో కూడా  టీచర్లు విద్యార్థికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారు  ఆ విద్యార్థులే కలెక్టర్లు అయ్యారు,  దేశ విదేశాల్లో బహుల జాతి కంపెనీలకు CEOలు అయ్యారు,  సైన్యంలో సైనికులు అయ్యారు.  దేశాన్ని నడిపించే నాయకులు అయ్యారు. సెంటిస్టులు అయ్యారు.   విదేశీ రాయభారులు అయ్యారు. ఈరోజు టీచర్ పరిస్థితి ఏమిటంటే?  విద్యార్థికి విద్యా బుద్దులు చెప్పటం కన్నా  సెల్‌ఫోన్ స్క్రీన్ ముఖ్యమైపోయింది!  పాఠం చెప్పే కంటే... రిపోర్టు అప్‌లోడ్ ముఖ్యమైనంది  విద్యార్థి నలుగురిలో మేధావిగా తయారవ్వాలన్న ఆశయాన్ని మార్గదర్శకాలు మింగేస్తున్నాయి! బోధన విషయంలో ఓనమాలు రాని వారు.. ఇప్పుడు "ఇలా చెప్పాలి, అలా చదివించాలి" అని ఆదేశిస్తున్నారు.  పాఠశాలలో పాటలు కూడా చెప్పని వారు...  టీచర్లకు బోధన విధానం చెబుతున్నారు! ఈ దుస్థతి పరిస్థతి ఆశ్చర్యకరం. సాంకేతికత విజ్ఞానం అనేది ఉపకరణం కావాలి… విద్యపై భారం కాకూడదు!  టీచర్‌కు తన పాఠాన్ని నేర్పే స్వేచ్ఛ, సమయం, గౌరవం ఇవ్వాలి…  అదే అసలైన విద్యా సంస్కరణ! 1 నుండి 10వ తరగతి విద్యార్థికి అవసరమైన నైపుణ్యాలను బోధించే అవకాశం ఇవ్వండి!  చదవడం – రాయడం – ఆలోచించడం – గణిత అవగాహన బలపరిచే స్వేచ్ఛ ఇవ్వండి!  పిల్లల స్థాయి, గ్రామీణ నేపథ్యం, బోధన భాష... అన్నీ పరిగణనలోకి తీసుకుని విధానం రూపొందించండి! ఈ దేశంలో నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, విదేశీ CEOలు, వైమానిక వీరులు... అందరూ పాఠశాలలో టీచర్ చెప్పిన పాఠం వల్లే ఎదిగారు – ఇది ఓ నగ్న సత్యం! ఈరోజు టీచర్‌కు పాఠం చెప్పే సమయం దొరకకపోతే... నేటి బాలలే రేపటి పౌరులు. సరియైన విద్య అందించకపోతే రేపటి పౌరుల దేశ భవిష్యత్తు ఎక్కడుందో ఊహించుకోండి. గురువులను  గౌరవించండి గురు బోధలను స్వీకరించండి… గురువులకు మాట్లాడే అవకాశం కల్పించండి.     గురువుల స్వరం దేశ భవిష్యత్తు అభ్యున్నతికి  విద్యార్థి జీవితాన్ని మార్చే ఓ గొప్ప వాక్యం... పుస్తకంలో కాదు...  గురువు బోధించే జ్ఞానంతో పాటు విజ్ఞానం లభిస్తుంది. గురువు లేని చదువు వృధా.

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో 1600 మహిళలు

  నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 1600 పైగా మహిళలు ముత్తైదువులు పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రతం లో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామగ్రిని అలానే చీర,రవిక వస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్ష ప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రభ మాసపత్రిక మూడు రకాల ప్రసాదాలు అందజేయబడ్డాయి.  వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస రావు తెలిపారు. శ్రీశైలంలో చేసే ఏ కార్యక్రమమైనా వేయింతల ఫలితాన్ని ఇస్తుందని పురాణాల్లో చదివానని ఈవో  పేర్కొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. జ్యోతిర్లింగం,శక్తిపీఠం కలిసిన పవిత్రమైన క్షేత్రంలో వ్రతం నిర్వహించుకునేవారు ఎంతో అదృష్టవంతులని తెలిపారు. ఈ వ్రతంలో ఆలయ ఈవో దంపతులు తోపాటు, దేవస్థానం మహిళ అధికారులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజ్ గంజాయి కేసులో కొత్త కోణం

  మెడిసిటీ మెడికల్ కాలేజ్ గంజాయి  కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మూడు ఏళ్ల నుంచి వైద్య  విద్యార్థులు గంజాయి వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వంద మంది జూడాలు గంజాయి వాడినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఏడాది కాలం నుంచి 32 మెడికోలు మంది వరుసగా గంజాయి తీసుకున్నట్లు ఈగల్ అధికారులు తెలిపారు. గంజాయి కోసం క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వచ్చి జూనియర్ డాక్టర్లు  తీసుకుంటున్నరని తెలుస్తోంది. జూనియర్‌లకు గంజాయి అలవాటు చేసి సీనియర్లు తెప్పించుకుంటున్నరు. మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  బీదర్ కు చెందిన జరీనా నుంచి అరాఫత్   గంజాయి కొనుగోలు చేస్తున్నడగా జరీనాని ఈగల్ టీం అరెస్టు చేశారు. ఏడాది కాలంలో కోటిన్నర రూపాయలను జరీనా  గంజాయి అమ్మి సంపాదించిరని తెలుస్తోంది.హైదరాబాదులో జరీనాకు 51 మంది సభ్యుల గల ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 51 మంది డ్రగ్ పెడ్డర్ల నియమించుకొని  జరీనా  గంజాయి దందా చేస్తున్నారు. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల విద్యార్థుల టార్గెట్ గానీ గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారు.మొత్తం 82 మంది గంజాయి వినియోగదారులను గుర్తించగా, వారిలో మెడిసిటీ మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ఇద్దరు అమ్మాయిలు సహా తొమ్మిది మందికి పాజిటివ్ అని తేలింది.  వీరంతా కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నారు. ఈగల్ అధికారులు కళాశాల యాజమాన్యంతో కలిసి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన తొమ్మిది మందిని డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించారు. జరీనా బాను 2010 నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకుంటోందని పోలీసులు తెలిపారు. ఈమెపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. ఈమె బ్యాంకు ఖాతాలో రూ.1.5 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇందులో రూ.26 లక్షలు హైదరాబాద్‌లోని 51 మంది పెడ్లర్ల నుంచి వచ్చాయి. ఈమె మహారాష్ట్ర, కర్ణాటకలోని బీదర్ ప్రాంతాల నుంచి గంజాయి తెస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.  

వావి వరసలు లేకుండా ఫోన్లు ట్యాప్‌ చేశారు : బండి సంజయ్

  హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు.  ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు.  పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో తాను మాట్లాడిన అన్ని కాల్స్ ట్యాప్ చేశారని వివరించారు. టీబీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో తన చుట్టూ నిఘా పెట్టారని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ కేసు విచారణ చేస్తున్న జడ్జి ఫ్యోన్ కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. గతంలో ఖమ్మం ఎంపీ దగ్గర పట్టుబడిన రూ.7 కోట్లు ఏమయ్యాయి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దొరికిన నగదంతా కేసీఆర్‌ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు.  ఈ కేసును ఇంకా ఎంత కాలం సాగదీస్తారు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో బండి సంజయ్ మాట్లాడిన డేటాకు సంబంధించిన వివరాలను ఆయనకు సిట్ అధికారులు ఈ సందర్భంగా అందజేశారు.  

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డికి.. 41ఏ నోటీసులు

  తెలుగు దేశం పార్టీ నేత విశ్వనాథరెడ్డిని ఇటీవల ఫోన్‌లో బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి కడప జిల్లా పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. కడప జిల్లా పులివెందుల మండలం చెందిన విశ్వనాథరెడ్డి..తాజగా పులివెందుల టీడీపీ ఇంఛార్జీ బీటెక్‌ రవి సమక్షంలో టీడీపీలో చేరారు.  ఈ నేపథ్యంలో భాస్కర్‌రెడ్డి, శివశింకర్‌రెడ్డి, లోక్ సభ్యుడు అవినాశ్‌రెడ్డి సమక్షంలో పీఏ రాఘవరెడ్డి, అదే గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి తదితరులు తీవ్రస్ధాయిలో బెదిరించినట్లు ఫోన్‌కాల్ డేటా ఆధారాలను విశ్వనాథ్‌రెడ్డి పులివెందుల పోలీసులకు అందజేశారు. వీరందరిపై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అయితే వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, వివేనందరెడ్డి హైదరాబాద్‌లో ఉండాలని కండిషన్ బెయిల్ ఉన్నాందున పులివెందుల పోలీసులు అక్కడికి వెళ్లి 41 ఏ నోటీసులు అందజేశారు.   వివేక హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని మర్డర్ చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు న్యాయపోరాటం చేయాలని  సునీత ఆవేదన వ్యక్తం చేశారు.  

పులివెందుల జడ్పీటీసీ గెలవాలి..కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం

  వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గెలవాలని సంకల్పంతో అందరూ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన పులివెందులను అభివృద్ధి చేద్దామన్నారు. తెలుగుదేశం హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలకు కాపాడినట్టు గుర్తుచేశారు.  కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. జగన్ కూడా చేయని విధంగా పులివెందులను అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను ఇటు అధికారంలోని కూటమి పార్టీలు, అటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. ఇరు పక్షాలకు చెందిన కీలక నేతలు పులివెందులలో మకాం వేసి హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ టెలికాన్ఫరెన్స్ లో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. 

రాహుల్ కు వంత పాడిన శశిథరూర్.. కమలంతో కటీఫేనా?

ఇటీవలి కాలంలో.. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నుంచి కాంగ్రెస్ కు ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నట్లు కనిపించిన ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆశ్చర్యకరంగా యూటర్న్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ విమర్శలకు వంత పాడారు. రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలూ, వ్యక్తం చేసిన సందేహాలూ చాలా చాలా విలువైనవనీ, వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందేననీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అసలు గత కొంత కాలంగా శిశిథరూర్ కాంగ్రెస్ కు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఆయనను దూరం పెడుతూనే వస్తోంది. మోడీపై ప్రశంసలు గుప్పిస్తూ.. తాను కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న సంకేతాలను పలు సందర్భాలలో శశిథరూర్ ఇచ్చారు. అన్నిటికీ మించి ఆపరేషన్ సిందూర్ కు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు విదేశాలకు వెళ్లిన బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక భూమిక పోషించారు. ఆయన పేరుకే కాంగ్రెస్.. కానీ మనిషి, మనసు మొత్తం బీజేపీయే అని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. శశిథరూర్ తీరు, వ్యవహార శైలీ కూడా కమలం కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా కనిపించింది. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ శశిథరూర్ కు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోవడానికి కారణం.. ఆయన పార్టీ విధానానికి అనుగుణంగా బీజేపీ తీరును ఎండగడుతూ ప్రసింగించాలన్న కాంగెస్ హైకమాండ్ సూచనకు అంగీకరించలేదనీ, తాను పార్టీలకు కాకుండా, భారత్ ప్రయోజనాలకు అనుగుణంగానే మాట్లాడతానని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇందుకే పార్లమెంటులో సిందూర్ పై చర్చలో శశిథరూర్ కు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు. అటువంటి శశిథరూర్ ఇప్పుడు  రాహుల్ కు మద్దతుగా గళమెత్తడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది. బీజేపీతో సయోధ్య కోసం శశిథరూర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా అన్న చర్చకు తెరలేచింది.  2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ప్రజలను, ప్రజా తీర్పును మోసం చేశాయంటే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను శశిథరూర్ బలంగా సమర్ధించారు.  ఈ మేరకు శశి థరూర్  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టు రాజకీయంగా అత్యంత ప్రాథాన్యత సంతరించుకుంది.  రాహుల్ లేవనెత్తిన  ప్రశ్నలు చాలా తీవ్రమైనవని శశిథరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా వీటిని పరిష్క రించి తీరాలని డిమాండ్ చేశారు.  భారత ప్రజాస్వామ్యం చాలా విలువైనదనీ,  దాని విశ్వస నీయతను అసమర్థత, నిర్లక్ష్యం  ద్వారా నాశనం కానివ్వకూడదని ఈసీపై విమర్శలు గుప్పిం చారు.  రాహుల్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆయన ఈసీని డిమాండ్ చేశారు.  

సిట్ పై నమ్మకం లేదు.. బండి సంజయ్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పై తమకు ఇసుమంతైనా నమ్మకం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే కేసులో శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ముందు హాజరు కావడానికి ముందు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం (ఆగస్టు 7) బండి సంజయ్ తో కేంద్ర హోంశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత బండి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  కాగా సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు ఆయన ఆయన ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందజేస్తానన్న ఆయన  బీఆర్ఎస్  హయాంలో తన ఫోన్‌నే ఎక్కువగా ట్యాప్ చేశారన్నారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ కేసులో కీలక ఆధారాలు ఉన్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య దోస్తీ కారణంగా  కేసీఆర్ కుటుంబంలో  ఏ ఒక్కరినీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. అందుకే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదనీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

ట్రంప్ కు మోడీ షాక్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు

 ట్రంప్ టారిఫ్ వార్ కు ఇండియా దీటుగా బదులిచ్చింది. ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేయడానికి ప్రతిగా ఇండియా  బోయింగ్ పీ81 విమానాల కొనుగోలు ఒప్పందం నంచి వైదొలగింది.  సముద్ర గస్తీ విమానాలను కొనుగోలుకు సంబంధించి 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసింది. వాస్తవానికి ఈ ఒప్పందం 2021లో  జరిగింది. ఆరు పీ81 జెట్‌ల  కొనుగోలు కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ అప్పట్లో  2.42 బిలియన్ డాలర్లు.  అయితే ఆ తరువాత దీనిని సవరించి   3.6 బిలియ డాలర్లకు  పెంచారు. ఇప్పుడా ఒప్పందం నుంచి భారత్ వైదొలగింది. 

విశాఖ సాగర తీరంలో ఏపీఎల్ సందడి!

ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ భారత్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఏపీఎల్ సమారానికి తెరలేచింది. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4  శుక్రవారం (ఆగస్టు 8) సాయంత్రం  నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడా వేడుకలు క్రీడాభిమానులను అలరించనున్నాయి. యువ క్రికెటర్లకు వేదికగా, ప్రతిభకు నిలయంగా నిలిచిన ఏపీఎల్ ఈసారి మరింత రసవత్తరంగా ఉత్సాహభరితంగా సాగనుంది. ఈ సీజన్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. మొత్తం పాతిక మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో  21 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లే-ఆఫ్‌లు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. హీరో వెంకటేష్ ఈ సీజన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ప్రత్యేక లైవ్ ప్రదర్శనలతో ఈ వేడుకలు  సందడిగా మారనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో విజయవాడ సన్‌ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, భీమవరం బుల్స్ వంటి జట్లు కూడా బరిలో ఉన్నాయి. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రేక్షకులకు ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పించారు. స్టేడియం గేట్ నెంబర్ 15 నుంచి ప్రవేశం ఉంటుంది. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. విజేత జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.20 లక్షలు బహుమతిగా అందనున్నాయి.